హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలన్నింటికీ పరిశ్రమలు స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి స్వర్గధామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళి, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జీవ ఔషధ రంగంలో అతి పెద్ద వాటాదారుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, రాబోయే రోజుల్లో సూదులు, సిరంజీలు, ఐవీ ఫ్లూయిడ్స్, గ్లౌజ్‌లు తదితర వైద్య పరికరాల ఉత్పత్తికి కేరాఫ్‌గా నిలుస్తుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కులో ఏడు కంపెనీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకేరోజు ఏడు కంపెనీలను ప్రారంభించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ కంపెనీలు రూ. 265 కోట్ల పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఈ కంపెనీల్లో 1300 మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఇవికాక ఈ పార్కులో ఇప్పటికే దాదాపు 50 కంపెనీలు రూ. 1,424 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి, అభివృద్ధి, పరిశోధన యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ పరిశ్రమల్లో ఏడు వేల మందికి ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

హైదరాబద్‌లో లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2030 నాటికి రూ. లక్ష కోట్లకు పెంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ బృహత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిని పెట్టిందని మంత్రి అన్నారు. ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందించేందుకు గాను సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. నాణ్యమైన వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సాధనాలు, ఔషధాలను తక్కువ ధరలకు ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఆయా విభాగాల్లో పరిశోధన, ఆవిష్కరణ, తయారీని ప్రోత్సహిస్తున్నదని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే ముచ్ఛర్లలో 19వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శామీర్‌పేటలో జినోమ్‌వ్యాలీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్ డివైజెస్ పార్కులో తయారీని ప్రోత్సహించేందుకు టీ`వర్క్స్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 35 శాతం వాటా హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నదన్నారు. ఇక ఇప్పుడు మెడ్‌టెక్ పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించామని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మెడ్‌టెక్ డివైజెస్ పార్కును ప్రపంచానికి గ్లోబల్ ఫ్యాక్టరీగా మాత్రమే కాకుండా, గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌గా మారుస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారన్నారు. మెడ్ట్రాకిన్ కంపెనీ అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జర్మనీ ప్రధాన కార్యాలయంగా ఉన్న ప్రముఖ వైద్య పరికరాల సంస్థ బీబరౌన్ రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మెడ్‌టెక్ పార్కులో యూనిట్లు ఏర్పాటు ప్రక్రియలో కంపెనీలు తమ వాల్యూ చైన్‌ను పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి, శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండి నరసింహ్మారెడ్డిలతో పాటు వివిధ కంపెనీల యాజమాన్యాలు, అధికారులు పాల్గొన్నారు.