మహేశ్వరంలో విప్రొ

టీఎస్‌ ఐపాస్‌ వంటి సరళతర పారిశ్రామిక అనుమతుల విధానం వల్ల ఎందరో పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని ఈ`సిటీలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో 30 ఎకరాలలో విప్రో నిర్మించిన సబ్బులు, హాండ్‌వాష్‌ వంటి ఇంటిని క్లీన్‌ చేసే ఇతర ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకోవాలన్నారు. కరోనా సమయంలో ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ఉదారంగా విరాళాలు ఇచ్చారన్నారు.

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 2.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించబడ్డాయన్నారు. వీటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. విప్రో పరిశ్రమ స్థాపన ద్వారా 900 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఈ పరిశ్రమలో కాలుష్య నివారణకు జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారని మంత్రి తెలిపారు. ఇదే కాకుండా ఎల్‌ఇడి పరిశ్రమతో పాటు, ప్రయివేటు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ విప్రో అధినేత అజీమ్‌ప్రేమ్‌జీని కోరారు. 

స్థానిక శాసనసభ్యురాలు, మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, విప్రో పరిశ్రమ ద్వారా మహేశ్వరం ఎంతో అభివృద్ధి చెందిందని, దీని రూపురేఖలే మారిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు.  విప్రో అధినేత అజీమ్‌ప్రేమ్‌జీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు పారిశ్రామికవేత్తలకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామని తెలిపారు. తమ పరిశ్రమల్లో మహిళలకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ పారిశ్రామికవేత్తలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, విప్రో సీఈఓ వినీత్‌ అగర్వాల్‌, టీఎస్‌ఐఐసీ ఎం.డి. వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.