వారి పోట్లాటతో నాకు మరాఠీ బాగా వచ్చింది

  • కొప్పరపు కవుల కళాపీఠం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ సందర్భంగా పి.వి. ప్రసంగం 

ఈ నిర్వాహకులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక షరతు పెట్టాను. ఈ పుస్తకాన్ని గురించి, కవుల గురించి క్షుణ్ణంగా మాట్లాడడానికి మీరందరూ తయారై వస్తే నేను వస్తాను, లేకపోతే లేదు. ఎందుకు అంటే, నేను చెప్పడానికి అంతగా అర్హుణ్ణికాదు. కానీ అభిరుచి మాత్రం బాగా ఉన్నవాణ్ణి కనుక బహుశా అందుకనే పిలిచారేమోనని నేననుకుంటాను. 

అనేక పద్దతులు ఉన్నాయి. చదవడం కానీ, శ్రోతలను గానీ బాగా ఆకట్టుకునేలా కొంతమంది సంగీతం ద్వారా చదివి వినిపిస్తే బాగనిపిస్తుంది. కొంతమంది కాస్తా శబ్దాలంకారాల ద్వారా ఆకట్టుకుంటారు. కొంతమంది అర్థాలంకారం ద్వారా ఆకట్టుకుంటారు. కొంతమంది అతిశయోక్తుల ద్వారా ఆకట్టుకుంటారు. అనేక పద్దతులు ఉన్నాయిందులో. కానీ, ఈ ఉపన్యాసాల్లో విన్నటువంటి విశేషాలన్నీ చాలా అరుదైనవని నేననుకుంటాను. 

అసలు కొప్పరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజ్‌లో కూడా మాట్లాడేవారా.. అన్నంత ఆశువు, అన్నంత వేగం. వాళ్ళ మాటల్లో కేవలం మాట్లాడాలనుకున్నా గానీ కవిత్వమే వచ్చేది. ఇంగ్లీష్‌లో పోప్‌ అని ఒక కవి ఉండేవాడు. వాడికి ఏ విద్య అంటే… చిన్నప్పటి నుంచి అలవాటు ఏదైనాగానీ కవిత్వంలోనే మాట్లాడుడు. తల్లిని ఏమైనా అడిగినా, తండ్రితో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా… ఇలా అందరూ వాణ్ణి చూసి బాధపడేవాళ్ళు. ఎందుకు పనికొస్తాడు వీడు, నోరు తెరిస్తెనే కవిత్వం తప్ప ఇంకొకటి రాదే అని చెప్పి. తండ్రికి చెప్పారు. ఇదేమిటి మీ పిల్లవాడు పూర్తిగా పనికిరానివాడైపోతాడు అని. తండ్రి ఒకరోజు పట్టుకొని బాగా కొట్టాడు. అంటే నీవీ కవిత్వం ఎందుకు రాస్తున్నవు, కవిత్వంలో ఎందుకు మాట్లాడుతావు.. అంటే ఎంత కొట్టినా గానీ చివరకు ఏమన్నాడంటే ‘ఫాదర్‌.. ఫాదర్‌.. పిటీ టేక్‌ నోమోర్‌ వర్సెస్‌ షల్‌ ఐ మేక్‌’ అన్నాడు. ఇట్లా ఉంటుంది.

మహామహులు. అందులో సాహిత్యమెంత ఉంది. కవిత్వమెంతవుంది. ఇవన్నీ విడమర్చి చెప్పేంత సమర్థత నాకు లేదు. ఎక్కడ ఏది ఉంటే దాన్ని వీలైనంత వరకు గ్రహించేవాణ్ణి, నాకు తలకు మించి ఉంటే సరే ఇంకెవరితోనైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాణ్ణి, అంతేకానీ నేను స్వయంగా మూల్యాంకనం చేయడం నావల్ల కాదు. లక్ష పద్యాలు పోయినాయం టున్నారు. అసలు సాహిత్యం పుట్టిందే మౌఖికం. పుస్తకాలలో కానీ, తాళపత్ర గ్రంథాలలో కానీ, అదేదీ ఏం పత్రాలండి… పత్రాల్లో గానీ దేనితో పుట్టలేదు. అంతకన్నా వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి.

ఘన, ఝట, సామవేదం ఇవన్నీ కూడా ఆనాడు ఎవరు రాసుకున్నారు. రాసుకోవాలంటే సాధ్యమెలా అవుతుంది. మీ లిపి అసలు ఆ  అప్స్‌ అండ్‌ డౌన్స్‌ అన్నింటినీ అందులో లిపిబద్ధం చేస్తుందా? అది సాధ్య పడదు. అందుకని ఏదైనా మౌఖికంగా వచ్చింది. ఆ మౌఖికంగా వచ్చిందాన్ని రాయడానికి తర్వాత లిపులొ చ్చింది. ఆ పాత లిపులు మీకు తెలియనిదేముంది. అవి చూస్తే అవేవీ పాముపిల్లలాగుంటవి. అంతేగానీ ఏ అక్షరం ఈనాడు ఉన్నటువంటి అక్షరం దానికి ఆ రూపమెలా వచ్చింది. పాత శాసనాలు చూస్తే అవి మనకు సదువరావు. ఇందులో ఏమిటంటే ఒకే ఒక లిపి నాలుగైదు భాషల్లో అలాగే కనపడుతుంది. మీరు శ్రీలంక వెళ్ళండి, అక్కడ నేను ఎందుకో ఒకసారి వెళ్ళి చూస్తుంటే ఒక నాలుగైదు అక్షరాలు తెలుగులో ఉన్నట్టే ఉన్నాయి. ఇది ఇదేనా అని అడిగితే అవున న్నాడు. తాయి భాషలో దాదాపు ఇలాగే ఉంటాయి. అంటేమిటి లిపిలో కూడా ఒక లిమిటుందన్నమాట. 

లిపిని నువ్వు కల్పించి రాయడానికి కూడా కొన్ని పరిధులున్నాయి. ఆ పరిధుల మధ్య రాస్తేనే ఈ లిపులు అవుతాయి కానీ కల్పనకు అతీతమైనటు వంటి లిపి ఏమీ ఉండదు. అనేది దానివల్ల తెలు స్తుంది. ఎందుకు మానవునికి ఒక లాజిక్కుంది. కల్పనలో కూడా ఒక లాజిక్కుంది. రాయడంలో కూడా ఒక లాజిక్కుంది. గుండ్రటక్షరమా.. పొడు గక్షరమా.. పొట్టి అక్షరమా.. ఇవ్వన్నీ టడీలో కూడా కొన్ని చూశానేను. టడీ లిపికి నాగరి లిపికి, తెలిగింటికి కొంత పోలిక ఉంది. కొన్ని కొన్ని అక్షరాల్లో పోలిక ఉంది. 

నేనెపుడో మద్రాసుకు తీర్థయాత్రలు చేయపోయి నపుడు అక్కడ కనిపించే సైన్‌బోర్డులన్నిటిని చదివితే నాకర్థమైందేంటంటే, ఈ రెండు లిపులు, ఈ రెండు లిపుల్లో కూడా ఏదో ఒక విధమైనటువంటి సామ్యం ఎన్నడో రెండువేల సంవత్సరాల క్రితమో ఎప్పుడొ చ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు. అందుకని ఈ సాహిత్యమిలాగే సాగుతూ ఉంటుంది. పాతయి మరచి పోతూ ఉంటారు. 60 సంవత్సరాల క్రితం పోయిన ఈ కళ ఇవ్వాళ మళ్ళీ వచ్చిందని మనం అనుకుంటున్నా మంటే ఇది కాలచక్రం. ఇది మళ్ళీ పైకొచ్చేటువంటి సమయం వచ్చింది. ఇది మరి కిందికి పోతుందేమో.. రేపు ఇంకొకటి వస్తుందేమో.. మనకు తెలియదు. కాబట్టి ఇది నిరవధికంగా నడుస్తుండేటువంటి కార్యక్రమమిది. 

ఈ కార్యక్రమాన్ని మనము ఒక పరిమిత కాలంలో ఎంతవరకు అవగాహన చేసుకుంటాము, దాన్ని ఇతరులకు ఒప్పచెప్పడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తాం ఇది ముఖ్యమైన విషయం. ఆ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక అపూర్వమైనటువంటి కృషి అని చెప్పక తప్పదు. వారిని నేను అభినందిస్తున్నాను. కవులను గురించి మేము వినడం మాత్రం జరిగింది. అప్పు డప్పుడు. ఆనాడు ఎక్కువ సాహిత్యంతో తెలుగుతో సంబం ధం లేని వాళ్ళం. నాలాంటి వాళ్ళు ఉర్దూతో మొదలు పెట్టినారు కానీ సాహిత్యమంతా ఎక్కడ చూసినా గానీ చెప్పేమాట ఒకటే ఉంటుంది. చెప్పే మాట వేరుగా 

ఉంటుంది. అది మాత్రం గమనించాము. బోలీ బదల్తీ హైబాత్‌నై బదల్తీ ఇప్పుడు మీరన్నారే ఆ కవులకు, ఈ కవులకు దెబ్బలాటలు జరిగాయని, ఈ దెబ్బలాటలు వారు బాగా వృద్ధయినటువంటి భాషలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా సారేజహాంసె అచ్చా రాసేరే ఆయన ఇక్బాల్‌. వారు పంజాబీ వాళ్ళు ఒట్టి నోటితోటే  ఆగరు సుమా.. కొన్ని కొన్ని చోట్లల్లో ఆయ నొక గ్రూపు, ఈయనొక గ్రూపు పెద్ద పెద్ద బడితెలు పట్టుకోని కర్రలు పుచ్చుకోని అప్పుడప్పుడు టెంకాయలు పగిలినట్లు తలలు కూడా పగుల కొట్టుకున్నారు. ఎందుకు అంతా సాహిత్యమే మరి ఏ సాహిత్యమో తెలియక వీళ్ళు ఆగమయ్యారేమో.. ఇది నాటకమో ఏమో.. ఇదికూడా జరిగింది. 

మరాఠీలో మేము చదువుకున్న నాడు మొదట పూనాలో మా అదృష్టమా అని ఒకరిద్దరు మహా పండితులకు పోట్లాటొచ్చింది. ఈయన ఒక పేపర్‌ పెట్టాడు. ఆయన ఒక పేపర్‌ పెట్టాడు. మేము మొన్న చెప్పాము వాళ్ళకు వీళ్ళిద్దరు రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు దెబ్బలాడుకున్నారు. వాళ్ళకేమి లాభించిందో.. లాభించలేదో నాకు తెలియదు గానీ నాకు మాత్రం లాభించింది. నాకు బాగా వచ్చేసింది మరాఠీ. దీనిద్వారా వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ ద్వారా ఎవరు ఎవరిని ఏమన్నారో అనేది మనం అర్థం చేసుకున్నపుడు మనకు అవగాహన బాగా వస్తుంది. కాబట్టి అనేక ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. దీన్ని ఇంకా బాగా శోధించి ఇవికాక ఇంకేమైన చేయడానికి వీలైతే అది బాగుంటుంది. ఇవ్వాళే నిన్న అనుకుంట ఈ పాతవన్నీ కూడా సేకరించడమనేది చాలా కష్టమైపోతుంది. దొరకడం లేదు. ఈ ప్రాంతంలో ఆంధ్రమహాసభ ఉంది. కాంగ్రెస్‌ బ్యాన్‌ చేసిన ప్పుడు ఆంధ్రమహాసభలు జరిగినయి. అయిదారు చోట్ల, ఏడెనమిది చోట్ల జరిగినయి. అంతకు ముందు కూడా ఆంధ్ర మహాసభ ఉండేది. కానీ ఏ సభలో ఏం జరిగిందో ఎవడికి తెలియదు. 

నిన్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, ప్రతిసభలో జరిగినటువంటి తీర్మానాల్ని కూడా నేను సేకరించి తీసుకొచ్చాను, చాలా కష్టపడ్డాను, అందరి దగ్గరకి వెళ్ళాను, దీన్ని ఏం చేయాల్నో నాకు తెలియడం లేదన్నాడు. ఇక ఇంతకన్న దురదృష్టం ఏముంటుంది. అప్పుడే అన్నా, నాకిచ్చేయండి, స్వామి రామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ తరపున నేను దీనికి సీడీ అదీ చేయి స్తానని చెప్పాను. అయితే ఈ సౌకర్యాలు ఇప్పుడు కొత్తగా మనకొచ్చాయి. సౌకర్యాలు లేని నాడు లేవు. అయితే ఈ సౌకర్యాలు వచ్చిన తరువాత క్యాలికులేటర్‌ లేకపోతె మూడెందులెన్ని అంటే చెప్పలేడు. అది ఆ క్యాలికులేటర్‌ నొక్కడంలో ఏమన్నా పొరపాటైతే పొరపాటొస్తుంది. అందులో ప్లస్‌ ఉంది మైనస్‌ ఉంది. మరి ఇవన్నీ ఏం లేనినాడే అవధానం. ఇప్పుడు అవధానమంటే వాడు మళ్ళీ ఓ క్యాలికులేటర్‌ నొక్కడమో, లేకపోతే కంప్యూటర్‌ ముంగట కూచోని చేసుకోవడమో అంటే అదే వస్తుంది. ఎందుకు అంటారు. మన పిల్లలు, ఎందుకిదంత వైయుఆర్‌ ట్యాక్సింగ్‌ యువర్‌ మెమొరీ, ఊరికే ఒక బటన్‌ నొక్కితే వచ్చేస్తుందే.. అవిలేన్నాడు ఆ జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, అవధానం చేశారనుకోండి అని ఇదొక వాదమొస్తుంది. 

ఏదైనప్పటికీ ఇది మనది. దీన్ని రక్షించడం, దీన్ని సురక్షితంగా ఉంచడం, ఇందులో ఉన్నటువంటి సారమేమైనా మనకర్థమైతే మనం ఇతరులకు అర్థమైతే ఇతరులకు అందించడం ఇది మనపని. ప్రతి తరం వారికి ఇదొక కర్తవ్యంగా ఉండాలే. సెన్స్‌ఆఫ్‌ హిస్టరీ లేనటు వంటి వాళ్ళు హిస్టరీని చూసేలా లేరు. అందుకని ఆ సెన్స్‌ ఆఫ్‌ హిస్టరీ అనేది ఎంత ఇంపార్టెంట్‌ ఉండనీకాక, ఎంత పొరపాట్లతో కూడుకొని ఉన్నప్పటికీ ఇది మా హిస్టరీ అనే ఒక అవగాహన ఉండడం, దాన్ని సేకరించి ఒకచోట పెట్టడం ఈ ఆర్కల్స్‌ అన్నీ కూడా మనం చేస్తున్నాం. ఆర్కైల్స్‌లో చాలాచాలా టెక్నికల్‌ విషయాలు ఉన్నాయి. 

మాదగ్గర కొన్ని 1949, 50, 48 ఆ కాలంలో స్వామి రామానందతీర్థ మొదలైన వారంతా రాసిన వ్యాసాలున్నాయి. అవి ముట్టుకుంటే ముక్కలు ముక్కలు అయ్యేట్టు ఉన్నాయి. అవి అతి కష్టం మీద తీసుకెళ్ళి పెట్టాము. వాటిని సరిగా ప్రాసెస్‌ చేయించి వాటిని మళ్ళీ ఒక సీడీ ఫాంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. అనేక సంస్థలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. విశ్వ విద్యాలయాలు చేస్తున్నాయి. సాహితీ సంస్థలు చేస్తున్నాయి. ప్రైవేట్‌ వాళ్ళు కూడా తమకొరకని చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ సౌకర్యాలన్నీ ఉన్నపుడు మనం అన్నీ ఎన్నిలక్షలున్నాయనే సమస్య కాదు. అందులనుంచి ఏమైనా ఒక రిప్రజెంటేటివ్‌ కలక్షన్‌ అనేది ఒకటి వస్తే బాగుంటుంది. అన్నీ రావాలంటే బహుశా రాలేక పోవచ్చు. దొరక్కకూడా పోవచ్చు. మీకు. అందుకని మీరు చెయ్యండి అని మాత్రం మీతో మనవి చేస్తున్నాను. ఇలాం టివే ఎక్కడ ఏమున్నప్పటికీ ఇవన్నీకూడా మనదగ్గర తయ్యారు గుండాలె. మన మన రాష్ట్రానికి కానీ, లేక భాషకు కానీ, సాహి త్యానికి కానీ ఇవన్నీ ఉపలబ్దం ఉండాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఓపిక మెచ్చుకోదగింది. దాదాపు ఒక సంవత్సరమైనా నాకు ఎక్కడ వీలుంటుంది. ఏమిటీ అనుకున్నాను. సరే మీరు నాకు నన్ను రప్పించి నాకు ప్రసాదించినటువంటి పరిజ్ఞానానికి మీ అందరికీ నమస్సులు.