మహిళా సమాఖ్య టర్నోవర్‌ కోటి దాటింది!

By: సీతారాం, నారాయణపేట

కరోనా కష్ట  సమయంలో ఆరోగ్యం కాపాడుకోడానికి  మాస్క్‌ ధరించటం తప్పనిసరి అయిన పరిస్థితిలో నారాయణపేట మహిళా సమాఖ్య ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. ఈ సమాఖ్య ద్వారా నాణ్యమైన  మాస్క్‌ లు తయారు చేయించి తమ జిల్లా ప్రజలకు ఉచితంగా సరఫరా చేయడమే  కాకుండా  దేశ వ్యాప్తంగా సరఫరా చేసి తగిన ఉపాధి పొందేెందుకు జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి వారికి స్ఫూర్తినిచ్చారు. 

పట్టణాల్లో అయితే అంతర్జాతీయ సంస్థలు తయారు చేసిన మాస్క్‌లు, పిపి కిట్లు ఉపయోగించారు. కాని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మాస్క్‌లు ఎలా ఉంటాయో తెలియవు. అయినా ప్రతి ఒక్కరు తప్పని సరిగా వాడాల్సిన దుస్థితి. 

నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి అమోఘమైన సమయ స్ఫూర్తితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలోని  మహిళా సమాఖ్య ద్వారా మహిళలకు మాస్క్‌లు తయారు చేయడంలో శిక్షణ ఇప్పించారు. మహిళా సంఘాల ద్వారా 10 లక్షల 20 వేల మాస్క్‌లను తయారు చేయించారు. జిల్లాలోని 11 మండలాలకు ఉచితంగా మాస్క్‌లను అందించడమే కాకుండా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘‘ఆరోణ్య బ్రాండ్‌’’ అని పేరు పెట్టి వివిధ రకాలైన మాస్క్‌లు పోచంపల్లి, కాటన్‌, ఆయుర్వేద మాస్క్‌లు, ఎంబ్రయిడరి మరియు దివ్యాంగులకు, మూగవారికి ట్రాన్స్‌పరెంట్‌ (పారదర్శకమైన) మాస్క్‌లు కలిపి 10 రకాల మాస్క్‌లను తయారు చేసి  దేశ విదేశాలకు సరఫరా చేశారు. నారాయణపేట జిల్లాకు మంచి పేరును సంపాదించి పెట్టడమే కాకుండా మహిళలకు జీవనోపాధి, మంచి ఆర్థిక లాభాలను సమకూర్చడం జరిగింది. 

జిల్లాలోని దాదాపు 3000  మంది  మహిళా టైలర్లకు  ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. మాస్క్‌ల తయారితో ప్రారంభించి ప్రస్తుతం నారాయణపేట చీరలు, వెదురు బొంగుతో ఉపకరణాలు, బంగారు ఆభరణాల డిజైన్లు, అంజీర పిగ్జాం, తేనీటి  పొడి వంటి ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఒక చిన్న  పరిశ్రమగా రూపుదిద్దుకున్నది. ఆయుర్వేద జీవన్‌ ధారా ద్రావణంను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి విక్రయించడం జరుగుచున్నది. ఇప్పటి వరకు కోటి పది లక్షల రూపాయల టర్నోవర్‌ సాధించి అందులో దాదాపు 35 లక్షల ఆదాయాన్ని సముపార్జించడం అభినందనీయం. సంపాదించిన డబ్బులతో జిల్లాలో ఉన్న మహిళా సంఘాలకు సమావేశానికై  మహిళలకు ఇంకా ఇతరత్రా ట్రెనింగ్‌ కొరకు, మహిళలకు ఉపాధి అవకాశాలకై   సింగారం గేటు దగ్గర ఒక  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (నైపుణ్య శిక్షణ కేంద్రం)ను నిర్మించడం జరిగింది.  ఇక్కడ వస్తువులు తయారు చేసి మార్కెటింగ్‌ చేయడమే కాకుండా ఇంకా కొత్త కొత్త వ్యాపారాలు చేసుకునేందుకు నైపుణ్య శిక్షణలు కొనసాగుతున్నాయి. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతుల ఒడిసి పట్టి నారాయణపేట జిల్లా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా నారాయణపేట జిల్లాకు చిరస్మరణీయమైన పేరును సంపాదించి పెట్టారు జిల్లా కలెక్టర్‌ డి. హరిచందన.