బిస్కెట్ల తయారీలో మహిళా గ్రూపు

By: శ్రీ యం. అబ్దుల్‌ కలీం

వ్యవసాయ రంగంలో రైతులకు, గ్రామీణ ప్రజలకు నూతన సాంకేతికతను పరిచయం చేసి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు నెలకొల్పబడిరది వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ‘ఆత్మ’. ఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే శిక్షణ, ప్రేరణ, కార్య నిర్వాహణ చాలా ముఖ్యం. ఈ మూడు అంశాలే తమ విజయానికి కారణమని చెబుతున్నారు, మానకొండూర్‌ కి చెందిన స్వశక్తి మహిళా సంఘ సభ్యులు.

మానకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన ఆరుగురు స్వశక్తి మహిళా సంఘ సభ్యులను ‘ఆత్మ’ వారు నిర్వహించిన విజ్ఞాన యాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంకు తీసుకువెళ్లారు. ఈ యాత్రలో భాగంగా వీరు చిరు ధాన్యాల బిస్కెట్‌ పరిశ్రమను సందర్శించారు. ఈ పరిశ్రమ సందర్శన వారిలో స్వశక్తి ఆర్థిక స్వాతంత్య్రం పట్ల ప్రేరణను కలిగించింది. కొత్త ఆలోచనలను ప్రేరేపించింది. ఆ చిరు ధాన్యాల పరిశ్రమ సందర్శన అనంతరం పొందిన అవగాహన, ‘ఆత్మ’ సంస్థ వారి శిక్షణ తోడ్పాటుతో మానకొండూర్‌ లోని స్వశక్తి మహిళా సంఘ సభ్యులు అబేదా బేగం, రజిత, వసంత, లత, పర్వీన్‌ సుల్తానా వీరందరూ కలిసి ఒక జాయింట్‌ లయబిలిటి గ్రూపును స్థాపించారు. మహిళా సంఘాల నుండి రూ.1,50,000 రుణం పొంది మానకొండూర్‌లో విజయశ్రీ జాయింట్‌ లయబిలిటి గ్రూపు పేరుతో చిన్న కుటీర పరిశ్రమను నెలకొల్పారు. ఆ ఆర్థిక తోడ్పాటుతో వారు తమ కేంద్రానికి కావాల్సిన ఓవెన్‌, మిల్లర్‌, వేవింగ్‌ అటోమిక్సి మిషన్లను సమకూర్చుకున్నారు. ఈ కేంద్రంలో వారు రాగులు, సజ్జలు, కొర్రలను ముడి సరుకులుగా వాడి వాటితో లడ్డూలు, బిస్కెట్లు, కేకులను తయారు చేస్తున్నారు. మంచి పోషక విలువలు ఉన్న కారణంగా ప్రజలు వీటి పై మంచి ఆసక్తిని చూపిస్తున్నారు.

బిస్కెట్లను, లడ్డూలను, చిరు ధాన్యాలకు సంబంధించిన పదార్థాలను స్టాల్స్‌లో కూడా పెట్టి అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్‌ (250గ్రా.) రూ.70 రూపాయాలకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు కరీంనగర్‌, అదిలాబాద్‌, హుజురాబాద్‌, జమ్మికుంటలలో స్టాల్స్‌లో పెట్టి అమ్మారు.

ఆర్డర్‌ ప్రకారం చేయడం, బేకరీలలో ఇవ్వడం, ఏదైనా మీటింగ్స్‌లో, రకరకాల కార్యక్రమాలకు సరఫరా చేస్తున్నారు. ఇలా నెలకు రూ. 25,000-30,000 ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇందులో 5,000 రూపాయలు లోన్‌ కీ, పరిశ్రమ కేంద్రం కిరాయి రూ. 3,000 మొత్తం రూ. 8,000 పోగా వారికి నికర ఆదాయం రూ. 17,000-22,000 వరకు వస్తోంది, వచ్చిన ఆదాయాన్ని గ్రూపులోని ఐదుగురు మహిళలు సమానంగా రూ. 5,000-8,000 వరకు ఒక్కొక్కరు పంచుకుంటారు. ఇంకా ప్రోత్సహిస్తే మరిన్ని కార్యక్రమాలకు లేదా, స్కూల్స్‌కి, ఏ ఊరికైనా కేటరింగ్‌ చేయగలుగుతాము అని వారు తెలియజేస్తున్నారు.