ప్రగతి పథంలో మహిళా స్వయం సహాయక సంఘాలు
By: బి. రాజమౌళి

ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించవు, భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహిళలు జనాభాలో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది. ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం, వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ విస్తరిస్తోంది. ఈ వాస్తవాలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నది. అందులో భాగంగానే మహిళలను సంఘటిత శక్తిగా తయారుచేయడమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘం ఏర్పాటు:
తెలంగాణ రాష్ట్రంలోని మహిళల్లో దాగి వున్న శక్తిని సమాజానికి ఉపయోగపడటానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మళ్ళించడం సంఘాల ఏర్పాటులో ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో మహిళలకు సమాజ సమస్యలపై అవగాహన పెంచడం, వాటి పరిష్కారంలో మహిళా సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 4,39,534 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఈ సంఘాల లో 47,73,745 మంది సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాలుగా ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. గ్రామాలలో మహిళా స్వయం సహాయక సంఘాల పై సెర్ప్ నిత్య పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
గ్రామీణ, మండల, జిల్లా సమాఖ్యలు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 3,60,311 స్వయం సహాయక సంఘాలు ఉండగా, తెలంగాణ ఏర్పడిన అనంతరం గత ఏడేళ్లలో 79,223 స్వయం సహాయక సంఘాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,39,534 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల వల్ల అనేక మంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్రంలో 32 జిల్లా సమాఖ్యలు ఏర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రంలో 552 మండల సమాఖ్యలు, 17,864 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి.
కమ్యూనిటీ వారీగా సంఘాల వివరాలు:

రాష్ట్రంలో నున్న స్వయం సహాయక సంఘాల లో47,73,745 మంది సభ్యులలో 10,26,187 మంది షెడ్యూల్డ్ కులాలకు, 6,59,411 మంది షెడ్యూలు తెగల కుటుంబాలకు, 1,55,061 మంది మైనారిటీ కులాలకు, 25,90,636 మంది వెనుకబడిన తరగతుల కుటుంబాలకు, 3,41,265 మంది అగ్రకులాలకు, 1,185 మంది ఇతర కులాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు, గ్రామ సమాఖ్యలకు గ్రేడింగ్:
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్యల పనితీరును బట్టి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) గ్రేడ్లను ఇస్తున్నది. రాష్ట్రంలో నున్న స్వయం సహాయక సంఘాలలో 3,49,591 సంఘాలు(80.87 శాతం) ఏ గ్రేడ్ లో, 24,782 సంఘాలు(5.04 శాతం) బి గ్రేడ్ లో, 32,689 (7.56 శాతం) సంఘాల సీ గ్రేడ్ లో, 28,231 సంఘాల(6.53 శాతం) డి గ్రేడ్‌లో ఉన్నాయి.
గ్రామ సమాఖ్య సంఘాలలో 7,532 (42.31 శాతం) సంఘాలు ఏ గ్రేడులో, 6509 సంఘాల (36.56 శాతం) బి గ్రేడ్‌లో, 2857 (16.05 శాతం) సి గ్రేడ్‌లో, 672(3.77శాతం) డి గ్రేడ్‌లో, 232 (1.3 శాతం) ఇ గ్రేడ్‌లో ఉన్నాయి.
నిధుల మంజూరు:

మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో 200 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 81.61 కోట్ల రూపాయలను సెర్ప్ ద్వారా కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌గా రాష్ట్ర ప్రభుత్వం మండల సమాఖ్యలకు మంజూరు చేసింది
గ్రామీణ అభివృద్ధిలో మహిళల స్వయం సంఘాల పాత్ర:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి ఈ సంఘాల ద్వారా మహిళలలో పొదుపు చేయాలి అనే చైతన్యం గణనీయంగా పెరిగింది. వీరందరూ పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు పొందుతున్నారు. క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. 2020-21 వ సంవత్సరంలో రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా ఉంది.
మహిళా స్వయం సహాయక సంఘాలు సమస్యలపై అవగాహన పెంచుకుని వాటి పరిష్కారంలో భాగస్వాములు అవుతున్నారు.
గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేక మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.
మహిళలు వారికున్న నైపుణ్యంతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి డ్వాక్రా మేళాలు నిర్వహించ బడుతున్నాయి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసే విక్రయ స్టాల్స్ లో తెలంగాణకు సంబంధించిన అనేక మంది మహిళలు పాల్గొని వారు తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. దేశంలోనే కాకుండ బంగ్లాదేశ్ సహా అనేక దేశాలలో ప్రదర్శనకు హాజరయ్యారు. స్థానికంగా ఉత్పత్తుల ద్వారా వాటిని నిత్యం ప్రజలు ఉపయోగించే వస్తువులను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చి వారిని తయారీ రంగం వైపు తీసుకెళ్తున్నారు. ఆధునిక సాంకేతికత పై గ్రామీణ ప్రజలకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన సేవలను అందిస్తున్నారు.
గత ఏడేళ్ల కాలంలో బ్యాంకు లింకేజీ
రాష్ట్రంలో సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో (2014-15 నుండి 2020-21 వరకు) 44,098.82 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించబడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ గణనీయంగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,96,447 స్వయం సహాయక సంఘాలకు 3,739 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించగా, 2020-21 సంవత్సరం లో 2 లక్షల 71 వేల 978 మహిళా స్వయం సహాయక సంఘాలకు 10,448 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడింది.
తెలంగాణ రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు, సెర్ప్ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు కల్పించబడిన బ్యాంకు లింకేజీ వివరాలు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా 3,80,162 మహిళా స్వయం సహాయక సంఘాలకు 12,069.58 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించాలనే లక్ష్యంగా నిర్ణయించబడగా, 31.07.2021 వరకు 51,674 మహిళా స్వయం సహాయక సంఘాలకు 2031.61 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించబడిరది. మిగతా లక్ష్యాన్ని 2,022 మార్చి నెలాఖరులోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయబడుతున్నది.
