భళా భద్రకాళి బండ్
By: జి. లక్ష్మణ్, హన్మకొండ
ఓరుగల్లు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఓరుగల్లు ముఖ చిత్రంపై మరో అద్బుత దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. రోజురోజుకూ పట్టణాలు కాంక్రీట్ కీకారణ్యంగా మారుతున్న నేపథ్యంలో, ఓరుగల్లు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే… వినూత్న అనుభూతిని కలిగించే భద్రకాళి బయో డైవర్సిటీ కల్చరల్ పార్కును సర్వాంగ సుందరంగా అధికారులు తీర్చిదిద్దారు. దీంతోపాటు భద్రకాళి చెరువును కూడా సుందరంగా ముస్తాబు చేశారు. హైదరాబాద్ టాంక్ బండ్‌కి ధీటుగా భద్రకాళి బండ్‌ను మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిర్మించారు. అడుగడుగునా ప్రత్యేకతలు నిలుపుకున్న ఈ పార్క్ పై ప్రత్యేక కథనం.
హృదయ్ పథకం కింద ఎంపికైన ఏకైక నగరం ఓరుగల్లు
2015 సంవత్సరంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమృత్‌సర్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దేశంలోని 12 నగరాలను జాతీయ సంప్రదాయ అభివృద్ధి మరియు బలోపేత యోజన (హృదయ్)ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క వరంగల్ జిల్లానే ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్లు, కాకతీయ ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పది కోట్లు.. మొత్తంగా ముప్పై కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్ట్‌కి కేటాయించారు.
ఘనంగా ప్రారంభోత్సవం
గత ఏడాది ఏప్రిల్ 12న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు భద్రకాళి బండ్‌ను ప్రారంభించినప్పటికీ, కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడం, కొవిడ్-19 తీవ్రత వల్ల సందర్శకులను అధికారులు అనుమతించలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా అజాదికా అమృత్ ఉత్సవాలలో భాగంగా ఈ పార్క్‌ను సెప్టెంబర్ 26వ తేదీన, ఆదివారం నాడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కమీషనర్ ప్రావీణ్యలు, ఇతర ప్రజాప్రతినిధులు భద్రకాళిబండ్ను సందర్శించి, నగర ప్రజలు పర్యాటకులను లాంఛనంగా అనుమతించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..మరెన్నో అనుభూతులు.
చారిత్రిక భద్రకాళి అమ్మవారి ఆలయం.. ప్రతిరోజూ పట్టణానికి దాహార్తిని తీర్చే భద్రకాళి చెరువు.. నేడు భద్రకాళి బండ్… ఓరుగల్లు పట్టణానికి మరింత వన్నెను తీసుకొచ్చాయి. భద్రకాళి బండ్‌ను మొత్తం మూడు విభాగాలు, ఏడు జోన్లుగా వర్గీకరించారు. మొదటి విభాగంలో రిలాక్సేషన్, ఓపెన్ జిమ్, ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్, ఫౌంటెన్స్, సిట్టింగ్ స్పేసెస్.. రెండో విభాగంలో రబ్బరైజ్డ్ వాకింగ్ ట్రాక్… మూడో విభాగంలో టాయ్ ట్రెయిన్ ఏర్పాటు చేశారు. టాయ్ ట్రైన్ పనులు త్వరలోనే ప్రారంభమౌతాయని అధికారులు తెలిపారు. ఆరు ప్రధాన ద్వారాలు, ఆరు ఆర్కేడ్ ఫిల్లర్లు, నాలుగు చిల్డ్రన్ పార్కులు, రెండు ఓపెన్ జిమ్‌లు, రెండు లాన్లు, మూడు సిట్టింగ్ స్పేస్ వంటివి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. బండ్‌ను దూరం నుంచి చూస్తే అర్దచంద్రాకారంలో గోచరిస్తుంది. స్వాగత తోరణాలు విశాలంగా ఉండి ఔరా..అనిపిస్తాయి. కాకతీయుల రాతి శిల్పాల స్ఫూర్తితో మూడు వరుసలలో, ప్రతి వరుసలో 11 నగరా రకానికి చెందిన రాతి స్థంబాలు ఠీవిగా నిలిపారు. బండ్‌కి ఇరువైపులా విద్యుత్ లైట్ల వెలుగులో ఓరుగల్లు ధగధగా మెరిసిపోతోంది. భద్రకాళి చెరువును ఆనుకుని మొదటి దశలో ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ పార్కును అభివృద్ధిని చేశారు. రెండోదశలో 2.9కి.మీ. దూరం అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. ఇందుకోసం 65కోట్ల రూపాయలు కేటాయించారు. ముంబై లోని ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కిషోర్ డి. ప్రధాన్ ఆధ్వర్యంలో కుడా, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఈ పార్కును తీర్చి దిద్దారు.
మిగతా పార్కులకు భిన్నంగా…
అన్ని సాధారణ పార్కుల్లా కాకుండా… నూతన విధానంలో పార్కును ఆధునిక దేవాలయంగా అభివృద్ధి చేశారు. రబ్బరైజ్డ్ సింథటిక్ ట్రాక్ ఇక్కడ ప్రత్యేకత. వాకర్స్ షూస్ లేకుండా నడవడం వల్ల అరికాళ్లలో కలిగే ఒత్తిడి మెదడుకు చేరి మానసిక, ఆరోగ్య ప్రయోజనానికి ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. రోజువారీ ఉదయపు నడకకు భిన్నంగా ప్రత్యేక థీమ్‌లతో పార్కుల్లో సరికొత్త వసతులు ఇక్కడ ఉన్నాయి. తక్కువ దూరం నడిస్తేనే….ఎక్కువగా వాకింగ్ చేసిన అనుభూతి కలిగిస్తుంది.
ఉదయాన్నే చెరువును చూస్తూ ఆహ్లాద వాతావరణంలో వ్యాయామం, నడక, జాగింగ్ చేసేలా వసతులు ఉన్నాయి.. పర్యాటకులు కూర్చుని సేద తీరేల ఆకర్షణీయమైన రాతి కుర్చీలు ఏర్పాటు చేశారు.. నిరంతరం పర్యవేక్షణ ఉండేలా సీసీ కెమెరాల నిఘా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. పెద్దలకు ముప్పై రూపాయలు, పిల్లలకు ఇరవై రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. సమీప ప్రాంతాల వాసులేకాక దూర ప్రాంతాల ప్రజలు ఈ పార్కును చూసేందుకు వస్తున్నారు.
అణువణువునా ఆధ్యాత్మిక అనుభూతి భద్రకాళి బండ్ మధ్యలో నుంచి చూస్తే అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఎడమ వైపునకు తిరిగితే పద్మాక్షి దేవాలయం, సిద్దేశ్వర దేవాలయం, జైన దేవాలయం దర్శనమిస్తాయి. బండ్ నుంచి ఈ దేవాలయాలకు కాలి నడకన చేరవచ్చు. భద్రకాళి చెరువును సిట్టింగ్ స్పేస్ నుంచి చూస్తే, ఓరుగల్లు పట్టణం, ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. భద్రకాళి బండ్‌కు అన్ని హంగులతో.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. వరంగల్‌ను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. గత మూడేళ్ళుగా అధికారులు రాత్రింబవళ్లు పని చేసి బండ్‌ను నిర్మించారు. భద్రకాళి బండ్‌కు అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ఒకదాని వెంబడి మరొక ప్రాజెక్టును ప్రారంభిస్తాం. టాయ్ ట్రైన్, బ్యాటరీ వెహికిల్స్ త్వరలోనే వస్తాయి. - మర్రి యాదవ రెడ్డి, కుడా ఛైర్మన్