‘‘ఆక్వాకల్చర్‌’’లో అద్భుత అవకాశాలు!

By: పిట్టల రవీందర్‌

ప్రపంచ వ్యాపితంగా సముద్ర జలవనరుల నుండి ఉత్పత్తి అవుతున్న చేపల పరిమాణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉపరితల జలవనరుల చేపల పెంపకంమీద రోజురోజుకూ ఒత్తిడి పెరిగిపోతున్నది. చేపల ఉత్పత్తి విషయంలో ప్రపంచ స్థాయిలో మూడవస్థానంలో నిలుస్తున్న భారతదేశంలో కూడా సముద్ర జలవనరులనుండి చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతూ, ఆ మేరకు ఉపరితలజలవనరుల్లో చేపల ఉత్పత్తిపైన మరింతగా ఆధారపడవలసివస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపరితల జలవనరుల విస్తీర్ణంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్న  తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి సంబంధించిన భవిష్యత్తుపైన ఆసక్తి అంతకంతకూ పెరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల నీటి ప్రాజెక్టులు, వాటికి అనుబంధంగా ఉనికిలోకి వచ్చిన జలాశయాలు, ఇతర సాగునీటి వనరులు మత్స్యరంగం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉనికి కాలంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ మత్స్యపారిశ్రామిక రంగం, రాష్ట్రంలో ఇటీవలికాలంలో అనూహ్యంగా పెరిగిన జలవనరుల సౌలభ్యం నేపథ్యంలో అన్నివర్గాల ప్రజల్లోనూ ఒక ఆసిక్తికరమైన ప్రధాన అంశంగా పరిణామం చెందింది.

ప్రపంచవ్యాపితంగా నానాటికీ పెరుగుతున్న జనాభా సంఖ్య, వారికి అవసరమైన ఆహారపదార్థాల కల్పన, వర్తమాన కాలానికి అనుగుణంగా మారుతున్న జీవనసరళి, ఆహారవు అలవాట్లు, శరవేగంతో అందుబాటులోకి వస్తున్న ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం తదితర కారణాల రీత్యా సాంప్రదాయ ‘ఫిషరీస్‌’ రంగానికి సమాంతరంగా ఆధునిక పద్ధతులను అందిపుచ్చుకున్న ‘ఆక్వాకల్చర్‌’ రంగం చేపల ఉత్పత్తికి సంబంధించిన అన్నిరకాల ప్రక్రియల్లోనూ అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నది. చేపల ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించినంతవరకూ ఇటీవలి కాలం వరకూ కేవలం మెరైన్‌ఫిషరీస్‌  (సముద్ర జలవనరుల్లో చేపల పెంపకం) ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ (ఉపరితల జలవనరుల్లో చేపలను పెంచడం) అనే రెండు రకాల చేపలపెంపకాలు మాత్రమే మనుగడలో ఉండేవి. ఈ రెండు పద్ధతుల్లోనూ  ఆయా జలవనరుల్లో చేపలు సహజసిద్ధంగా పెరిగితే మత్స్యకారులు (జాలర్లు) తమతమ సాంప్రదాయ విధానాలను అనుసరించి పట్టుకుని వినియోగదారులకు వివిధ రూపాలలో అందుబాటులోకి తీసుకువచ్చేవారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చేపల ఆహారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సరికొత్త పద్ధతులను అనుసరిస్తూ, కృత్రిమ ఆహారాన్ని అందించి, అన్నిరకాల నీటివనరులను చేపల పెంపకానికి అనుకూలంగా మార్చుకుని ‘ఆక్వాకల్చర్‌’ అనే ఆధునిక విధానాన్ని ప్రవేశపెట్టారు. పర్యావరణంలోని అన్నిరకాలైన కాలమానపరిస్థితులను తట్టుకునే శక్తిని, వెసులుబాటును కలిగిఉన్న ‘అక్వాకల్చర్‌’ విధానంలో చేపలు పెంచేవిధానాలు అనేకరకాలుగా విస్తరించుకుని ఇవాళ ప్రపంచ వ్యాపితంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం చేపల పరిమాణంలో సగానికి (53 శాతం)పైగా ఆక్రమించుకున్నది. అందువల్ల అత్యధిక లాభాలను ఆర్జించిపెడుతున్న ‘ఆక్వాకల్చర్‌’ విధానం దినదినప్రవర్థమానమై విరాజిల్లుతూ నీటివనరులనుండి భూమిమీదకు కూడా శరవేగంగా విస్తరించుకుంటున్నది.

గతంలో కేవలం సముద్రజలాలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదుల్లాంటి నీటివనరుల్లో మాత్రమే చేపలను పెంచేందుకు పరిమితమైన అవకాశాలుండేవి. కానీ నూతనంగా అందుబాటులోకి వచ్చిన  ‘ఆక్వాకల్చర్‌’ విధానం వల్ల భూమి ఉపరితలంమీద సైతం ఆధునిక పద్ధతులను అనుసరించి చేపలను వాణిజ్యపరంగా పెంచేందుకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నమైన రీతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్జానాన్ని వినియోగించి తక్కువ నీటి పరిమాణంలో ఎక్కువ సాంద్రతలో చేపలను పెంచేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా మత్స్యపారిశ్రామిక రంగం  శాఖోపశాఖలుగా విస్తరించుకున్నది. ఎక్కువనీరు అందు బాటులో ఉండే సముద్రజలాలు, రిజర్వాయర్లులాంటి లోతైన నీటివనరులల్లో ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా ‘కేజ్‌ కల్చర్‌’ విధానం అందుబాటులోకి వచ్చింది. కేవలం 25 ఘనపు మీటర్ల పరిమాణంలోనే సుమారు మూడు నుండి ఐదు టన్నుల చేపలను పెంచేందుకు వెసులుబాటు కలుగుతున్నది.

భూమి ఉపరితలం మీద సైతం మనకు అందుబాటులో ఉన్న ఉపరితల లేదా భూగర్భ జలవనరులను చేపల పెంపకానికి అనువుగా మార్చుకుని, అందులో వేగవంతమైన పద్ధతుల్లో చేపలను పెంచుకునేందుకు అనేక విధానాలు అమలులోకి వచ్చాయి. ఇందులో ‘రీ`సర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టం’ (రాస్‌), ‘బయోఫ్లాక్‌ ఫిష్‌ ఫార్మింగ్‌ టెక్నాలజీ’ (బి.ఎఫ్‌.టీ), ‘ఇన్‌పాండ్‌ రేస్‌వే సిస్టం’ (ఐ.పి.ఆర్‌.ఎస్‌.)లాంటి అత్యాధునిక విధానాలు ప్రపంచవ్యాపితంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సాంప్రదాయ చేపల పెంపకానికి పూర్తిగా భిన్నమైన రీతిలో తక్కువ స్థలంలో, ఎక్కువ పరిమాణంలో, తక్కువ కాలపరిమితిలో, ఎక్కువ మోతాదులో వాణిజ్యపరంగా కృత్రిమంగా ఆరోగ్యవంతమైన చేపలను పెంచుకునేందుకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ‘ఆక్వాకల్చర్‌’ రంగం ప్రపంచవ్యాపితంగా ఒక బహుళజాతి సంస్థలకు లాభసాటి వ్యాపారంగా పరిణతి చెందింది. కేవలం ఆధునిక పద్ధతులను ఉపయోగించి, కృత్రిమ ఆహారాన్ని అందిస్తూ, ఉపరితల జలవనరుల్లో మాత్రమే చేపలను పెంచుకునే సరికొత్త ‘ఆక్వాకల్చర్‌’ విధానం,  సాంకేతిక పరిజ్జానాన్ని వినియోగించుకుని           అనతికాలంలోనే శాఖోప శాఖలుగా విస్తురించుకున్నది. తరతరాలుగా సాంప్రదాయంగా కొనసాగుతున్న మెరైన్‌, ఇన్‌ల్యాండ్‌ చేపల పెంపకాన్ని అధిగమించి, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వాణిజ్య, వ్యాపార విలువలను జోడించుకుని, ఒక సరికొత్త ఆహార ఉత్పత్తి రంగంగా అభివృద్ధి చెందింది. సముద్రతీర ప్రాంతాలు, ఉపరితల జలవనరులకు సమీప ప్రాంతాలలో మాత్రమే విరివిగా లభ్యమయ్యే చేపల ఆహారం ఖండాంతరాలకు ఎగుమతి చేసుకునే నిలువ ఆహారంగా మారిపోయింది. ఇందుకోసం ఫిష్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. నీటివనరుల నుండి బయటకు తీసుకువచ్చిన చేపలను శుభ్రం చేసి, ముక్కలుగా మార్చుకుని, అత్యాధునిక పద్ధతుల్లో ఆకర్షణీయమైన డబ్బాలు, అట్టపెట్టెల్లో ప్యాకింగ్‌ చేసి, ఈ ఆహారాన్ని ఎక్కువకాలం నిలువ ఉంచుకునేందుకు వీలుగా మార్చుకుని, సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశాలను మెరుగుపరిచారు. ఫలితంగా భూగోళంలో ఏ ప్రదేశంలో పెంచిన చేపల ఆహారాన్నైనా ఏ ప్రాంత ప్రజలకైనా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ అనేక రకాలైన అనుబంధ రంగాలు ఉనికిలోకి వచ్చాయి. చేప విత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌), చేపల ఆరోగ్యరక్షణకు అవసరమైన మందుల తయారీ (మెడిసిన్స్‌), ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, రవాణా, ఎగుమతులులాంటి అనేకరకాలైన సరికొత్త అవసరాలు ఆవిష్కారమయ్యాయి. ఫలితంగా కేవలం ఒక సాంప్రదాయవృత్తిలాగా కొనసాగిన ‘ఫిషరీస్‌’ రంగం, అంతర్జాతీయ ప్రమాణాలకు ఎదిగిన ‘ఆక్వాకల్చర్‌’ రంగంగా ఎదిగి ‘పరిశ్రమ’ స్థాయికి రూపాంతరం చెందింది. ఈ క్రమంలో ‘ఆక్వాకల్చర్‌’ రంగం ఒక ఉపాధికల్పనా వనరుగా మారింది. వ్యవసాయరంగంపై నానాటికి పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించగలిగే ప్రత్యామ్నాయంగా ఎదిగింది.

జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో అత్యంత వేగవంతంగా మార్పుచెందుతున్న ఈ పరిస్థితులను తెలంగాణ కాలమానపరిస్థితులకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళికతో సిద్ధపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో అందుబాటులోకి వచ్చిన సాగునీటిసౌలభ్యం ఫలితంగా సర్వతోముఖాభివృద్ధి దిశలో ఉరకలువేస్తున్న వ్యవసాయరంగం మీద నానాటికీ పెరుగుతున్న ఒత్తిడి నుండి ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు ‘ఆక్వాకల్చర్‌’ రంగాన్ని ఒక ప్రత్యామ్నా యంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. తెలంగాణలో వరిపంటను సాగుచేయడానికి అనువుగా ఉన్న పంటపొలాలలో వరికి బదులుగా ‘ఆక్వాకల్చర్‌’ విధానంలో చేపలను, రొయ్యలను  పెంచేందుకు మెరుగైన అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక ఎకరం విస్తీర్ణంలో యేడాదికాలంలో పండించే వరిపంటకు ప్రత్యామ్నాయంగా చేపలను, రొయ్యలను సాగుచేయడం ద్వారా కనీసం మూడిరతల అదనపు ఆదాయాన్ని రైతులకు సమకూర్చేందుకు ‘అక్వాకల్చర్‌’ విధానంలో అవకాశాలున్నాయని  ‘ఐక్యరాజ్యసమితి’కి అనుబంధంగా పనిచేస్తున్న ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ` ఎఫ్‌.ఏ.ఓ) ప్రపంచవ్యాపితంగా నిర్వహించిన అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. అందువల్ల ‘ఆక్వాకల్చర్‌’ రంగంలో అందుబాటులో ఉన్న అపరిమితమైన అవకాశాలను అందిపుచ్చుకుని తెలంగాణ రైతాంగాన్ని ఆ దిశలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూతనివ్వాల్సిన కర్తవ్యం ఇక్కడి పౌరసమాజంపై ఉన్నది!