మన వారసత్వ సంపదకు జగతి ఆరతి
By: మాశర్మ

‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో…’ అని మన డాక్టర్ సి నారాయణరెడ్డి అన్నట్లు,రామప్ప ఆలయ రమణీయతను చూడడానికి కోట్ల కన్నులు చాలవు. ఆ సౌందర్యాన్ని చూసి మ్రోగని గుండెలు ఉండవు. తెలుగునేలపై గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా, రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు మారుమోగుతోంది.మన తెలంగాణ భూమిపై ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువై ఉన్న రామప్ప ఆలయం నేడు తాజ్ మహల్, ఎర్రకోట వంటి విశిష్ట విఖ్యాత కట్టడాల సరసన సగర్వంగా చేరింది. చైనాలోని ఫుజౌలో జరిగిన యునెస్కో సమావేశంలో రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ జాన్ విజ్ వెల్లడిరచారు. ప్రపంచ వ్యాప్తంగా 21దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.వారిలో 17దేశాలవారు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా 255 కట్టడాలు పోటీలో నిలబడగా, మన దేశం నుంచి ఈ గుర్తింపు ఘనతను సాధించిన మహానిర్మాణం మన రామప్ప ఆలయం. హోదా ఇచ్చిన యునెస్కో సైతం ఆ అద్భుత శిల్ప కళాప్రతిభకు ఆశ్చర్యచకితమవుతోంది.

భారత ప్రధాని నరేంద్రమోదీ మొదలు ప్రపంచ దేశాధినేతల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హోదా దక్కడం సముచితం, సమున్నతం, సంతోషభరితమని జగతి పులకిత గాత్రయై జేజేలు పలుకుతోంది.ఇది కాకతీయ కళాప్రాభవానికి, తెలంగాణ వారసత్వ మహత్వానికి దక్కిన ఘన గౌరవం. ఈ విభవానికి పునాదులై నిలచినవారు ప్రధానంగా ఇద్దరు మహనీయులు.మహాశిల్పి రామప్ప, కాకతీయ రేచర్ల రుద్రుడు (రేచర్ల రుద్రసేనాని). ముందుగా ఆ మహనీయులకు శిరసు వంచి ప్రణతులు సమర్పిద్దాం. రామప్పకు ప్రపంచ హోదా లభించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. యునెస్కో ప్రతినిధుల బృందం 2019లో ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు పలు సూచనలు చేసింది. యునెస్కో హోదా దక్కితీరాలన్న మహాసంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాల్సిన పనులన్నింటినీ శరవేగంగా నడిపించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళల్లోనే ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో ప్రతిపాదనలు పంపి ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయం చుట్టూ బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసింది.సమీపంలో ఉన్న ఆలయాలన్నింటినీ రామప్ప పరిధిలోకి తెచ్చింది. ప్రత్యేక డెవలప్ మెంట్ అధారిటీ, కమిటీలను నియమించింది.

రామప్పను ఆధ్యాత్మిక, సాంస్కృతిక,పర్యాటక,శిల్ప, సర్వ కళావేదికగా మలచేందుకు కావాల్సిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆడిటోరియం, స్వాగత తోరణాలు నిర్మాణమయ్యాయి. ఆలయం పక్కన ఉండే చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటుకు నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక, శిల్ప కళా అధ్యయనం కోసం కళాశాల కూడా త్వరలో ఏర్పాటు కానుంది. వందల ఏళ్ళనాటి అద్భుత కట్టడాలను కాపాడడమే కాక, మరిన్ని అభివృద్ధి చర్యలను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.రామప్ప గుడికి ప్రపంచ గుర్తింపు రావాలని ఎప్పుడో ఐదు దశాబ్దాల క్రితమే మన పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు కలలు కన్నారు.నేడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాలంలో, పాలనలో, పర్యవేక్షణలో ఆ అద్భుతమైన కల సాకరమైంది. మహా సంకల్పానికి సిద్ధి, ప్రసిద్ధి లభించాయి. యునెస్కో గుర్తింపుతో రామప్ప ప్రాభవం, తెలంగాణ వారసత్వ వికాసం, పర్యాటక ప్రగతి పరువులెత్తనున్నాయి. వారసత్వ హోదా లభించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రపంచ పర్యాటక పటంలో రామప్ప రెపరెపలు ఆరంభం కానున్నాయి. యునెస్కోతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు గణనీయంగా పెరుగుతాయి. సర్వ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రామప్ప గుడి దర్శనానికి తరలి వస్తారు. దీనితో రామప్ప ఆలయంతో పాటు తెలంగాణలోని మిగిలిన అపురూప ఆలయాలకు, కట్టడాలకు, ప్రదేశాలకు సందర్శకుల తాకిడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. దీని వల్ల తెలంగాణ ప్రాభవం పెరగడమే కాక, తత్ సంబంధిత రంగాలకు ఆదాయం గణనీయంగా పెరుగనుంది. ఇప్పటికే జలకళతో తెలంగాణ భూమి బంగారాన్ని దాటిపోయింది. పర్యాటక ప్రగతితో ఆకాశమే హద్దుగా అభివృద్ధి ఊపందుకుంటుంది.

కాకతీయుల, పూర్వ ప్రభువుల పాలన, సంస్కృతి, సంప్రదాయం ప్రేరణలుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపడుతున్న ప్రతి కార్యం జగజ్జేగీయమానంగా సాగుతోంది. ప్రతి సంకల్పం అక్షరాలా నెరవేరుతోంది. ఆ గెలుపుబాటలో రామప్పగుడికి దక్కిన ప్రపంచ ఖ్యాతి ఒక నిదర్శనం. ఎన్నడో 1213లో, ఎనిమిది వందల సంవత్సరాల క్రితం, కాకతీయ రేచర్ల రుద్రుడు కట్టించిన మహానిర్మాణంలోని అద్భుతాలకు మూలపురుషుడు మహాశిల్పి రామప్ప. అది రామలింగేశ్వర (రుద్రేశ్వర) దేవాలయం అయినప్పటికీ, రామప్ప గుడిగా, ఆ శిల్పి పేరుతోనే ఘనత వహించడం అబ్బురం కలిగించే విశేషం.

ఈ కోవెల ఆణువణువూ సొగసు సోయగాలకు నెలవు. ఆ నిర్మాణ చాతుర్యం (ఇంజినీరింగ్ ప్రతిభ) మయసభా మహాశిల్పి మయుని కూడా మరులు కొల్పుతుంది. అత్యంత కీలకమైన ద్వారబంధాలు, స్థంభాలు, పైకప్పు, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు అత్యంత కఠినమైన నల్లశానపు రాయుని (బ్లాక్ డోలరైట్ ) వాడారు. ఆలయ నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయిని వినియోగించుకున్నారు. దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం) ఏర్పాటుచేసి, దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ఇదే విలక్షణం. పైకప్పుపై రాతిచూరు ఏర్పాటుచేయడం వల్ల వాననీళ్లు దూరంగా ఎగసి పడతాయి. నాట్యగణపతి, సాయుధులైన యోధులు, భటులు, భైరవుడు, మల్లయుద్ధ దృశ్యాలు, నృత్యభామలు, వాయిద్యకారులు, వేణుగోపాలుడు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయంలోని భారీ రాతి స్థంభాలు, మదనిక – నాగనిక శిల్పాలు అద్దంలాంటి అందంతో మెరిసిపోతుంటాయి. ఇలాంటివి ఎన్నో అడుగడుగునా శిల్ప చిత్ర కళాశోభతో కళకళలాడుతూ ఉంటాయి.

నంది కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించారు. గర్భాలయంలోకి ప్రవేశించే ముందు గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహం విశిష్ట కళానిపుణతకు దర్పణం. ఆ విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. భారీ గండ శిలలు, శిల్పాలు, నగిషీలు ఉపయోగించడం వల్ల బరువు పడకుండా, నీటిపై తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. ప్రపంచ నిర్మాణాలలో ఈ తరహా నిర్మాణ రచన ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా చెయ్యలేదు. ఎన్నో దండయాత్రలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు, దురాగతాలను తట్టుకొని నిలబడిన రామప్ప గుడి మన ఇంజనీరింగ్ అద్భుతానికి మెచ్చుతునక. జాయపసేనాని రచించిన సంస్కృత నాట్యశాస్త్రం ‘నృత్త రత్నావళి’లో చూపించిన త్రిభంగీ నాట్య భంగిమలన్నీ రామప్ప గుడిలో దర్శనమవుతాయి. నటరాజ రామకృష్ణ రూపకల్పన చేసిన ‘పేరిణి శివతాండవం’ నృత్య రీతి కూడా రామప్ప శిల్పకళ నుంచే స్వీకరించారని తెలుస్తోంది. తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అచంచలమైన కృషికి, అకుంఠితమైన దీక్షా దక్షతలకు లభించిన గొప్ప గుర్తింపుగా, రామప్పగుడికి దక్కిన యునెస్కో విఖ్యాతిని ఎల్లరూ గుర్తించి, అభినందిస్తున్నారు. మహా ఆధ్యాత్మిక,కళా నిర్మాణంగా అవతరించిన యాదాద్రి గుడికి కూడా భావికాలంలో యునెస్కో గుర్తింపు వస్తుందని విశ్వసిద్దాం. ఆ సుకీర్తిని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.

రామప్పను చూసిరండి: ప్రధాని మోదీ

అద్భుతం! రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించినందుకుఅందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ట్విట్టర్‌లో ఓ సందేశమిస్తూ, ఘనకీర్తిగల కాకతీయుల అద్భుత నిర్మాణ కౌశలానికి రామప్ప ఆలయం గొప్ప ప్రతీక. ప్రజలారా..ఈ అద్భుత ఆలయానికి వెళ్ళండి. ఆలయ ఠీవిని ప్రత్యక్షంగా తిలకించి ఆ అనుభూతిని సొంతం చేసుకోండని పిలుపు నిచ్చారు.
తెలంగాణ వారసత్వానికి గుర్తింపు

13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉన్నదని, ఇది తెలంగాణ వారసత్వానికి దక్కిన గుర్తింపు అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రెర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సి.ఎం అభినందనలు

ములుగుజిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సి.ఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు కె.సి.ఆర్ అభినందనలు తెలిపారు.

