|

మానవ నిర్మిత ‘అద్భుతం’గా యాదాద్రి

మానవ నిర్మిత 'అద్భుతం'గా యాదాద్రియాదగిరి గుట్ట దేవాలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులు, శిల్పులు, నిర్మాణ నిపుణులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కోరారు. ప్రధాన ఆలయం, శివాలయం, గుట్టపైన వచ్చే నిర్మాణాలు, చుట్టూ ఇతర గుట్టల అభివృద్ధి కోసం తయారు చేసిన లే అవుట్లను క్యాంపు కార్యాలయంలో అక్టోబర్‌ 14న పరిశీలించి, ఆమోదించారు.

ఈ డిజైన్ల ప్రకారం దసరా నుంచి పనులు ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం తీసుకోవల్సిన చర్యలను వివరించారు. యాదగిరి గుట్ట అభివృద్ధి సంస్థ పూర్తి బాధ్యత తీసుకొని పనులను పర్యవేక్షించాలని, ప్రధాన గుట్టయిన యాదాద్రితో పాటు ఇతర గుట్టలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సిఎం ఆదేశించారు. యాదగిరి గుట్ట అభివృద్ధి సంస్థ (వైటిడిఎ) వైస్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రావు నేతృత్వంలో పనులు జరగాలన్నారు. వైటిడిఎ పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఆమోదించిన డిజైన్లు, లే అవుట్ల ప్రకారం..

గుట్టపైన గర్భగుడి యథావిధిగా ఉంటుంది. గుట్టపైకి పోవడానికి, కిందికి రావడానికి వేర్వేరు దారులుంటాయి. ప్రస్తుతమున్న దారిని గుట్టపైకి పోవడానికి, కొత్తగా నిర్మించే దారిని కిందికి రావడానికి ఉపయోగిస్తారు. గుట్టపైన 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్‌ ఉంటుంది. అక్కడే భక్తులను దింపి, కిందికి పోయే భక్తులను ఎక్కించుకుని బస్సులు కదులుతాయి. విఐపిలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు నిర్మిస్తారు. దీని విస్తీర్ణం 2.3 ఎకరాలుంటుంది. శివాలయానికి కూడా మాడవీధులు నిర్మిస్తారు. ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణానికి అభిముఖంగా 108 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠిస్తారు. గుట్టపైన అన్నదానం కాంప్లెక్స్‌ నిర్మాణం ఉంటుంది. బ్రహ్మూెత్సవం జరిగేందుకు కూడా తూర్పు భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. అర్చకులు సేద తీరేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలం గుట్టపైనే ఉంటుంది. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్సుగా మారుస్తారు. దైవ సంబంధ వస్తువుల విక్రయం కోసం గుట్టపైనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉంటుంది. గుట్టపైన ఉన్న ప్రస్తుత భవనాలన్నీ తొలగిస్తారు. కొత్త లే అవుట్ల ప్రకారమే నిర్మాణాలుంటాయి. నీటి గుండం యధావిధిగా ఉంటుంది. దాని విస్తీర్ణం పెంచుతారు.

ప్రధాన గుట్ట పక్కన ఉన్న ఇతర గుట్టల అభివృద్ధి

ప్రధాన గుట్ట పక్కన ఉన్న ఇతర గుట్టల అభివృద్ధిప్రధాన గుట్టకు తూర్పు భాగాన వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు గుట్టలను కలిపి యాదగిరి గుట్ట టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేస్తారు. టెంపుల్‌ సిటీలో విశాలమైన రహదారులు, ఉద్యానవనాలు, కాటేజీలు, సత్రాలు, పార్కింగ్‌ ప్లేస్‌, కళ్యాణ మంటపం నిర్మిస్తారు. గుట్ట పరిసరాల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు పెంచుతారు. భక్తి గీతాలు, శ్లోకాలు నిరంతరం వినిపించే సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రధాన గుట్టకు ఉత్తర భాగంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను తిరుపతి పద్మావతి అతిథి గృహం మాదిరిగా విఐపి గెస్ట్‌ హౌజ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. కొత్త లే అవుట్‌కు అనుగుణంగా కరెంటు లైన్లు, డ్రైనేజి, వాటర్‌ పైప్స్‌ వేస్తారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, గవర్నర్‌ నరసింహన్‌, చిన జీయర్‌ స్వామి కలిసి ఈ ఏడాది మే 30న గుట్టను సందర్శించారు. అప్పుడే అభివృద్ధి పనుల కోసం పూజ చేశారు. ఇప్పుడు లే అవుట్లు కూడా సిద్ధం అయినందున పనులను ప్రారంభించాలని, వచ్చే దసరా నాటికి ఓ రూపం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రెండు బడ్జెట్లలో కలిపి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని కేటాయింపులు చేస్తామని సిఎం చెప్పారు. పాత భవనాలు, కాటేజీలు కూల్చి వేసే సందర్భంలో ఇదివరకు కాటేజిలు నిర్మించిన దాతల పేరుతోనే కొత్త డిజైన్ల ప్రకారం సత్రాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కిషన్‌ రావుతో పాటు నిర్మాణ నిపుణులు రాజు, పి.జగన్‌ మోహన్‌, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనందసాయి, స్థపతి సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశానుసారం యాదాద్రి అభివృద్ధి పనులకు విజయదశమి రోజున భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, యాదగిరిగుట్ట దేవస్థాన అభివృద్ధి సంస్థ (వైటిడిఏ) సభ్యులు, భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ళ శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్థిక, దేవాదాయశాఖల ముఖ్యకార్యదర్శి శివశంకర్‌, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్థపతులు సుందరరాజన్‌, రఘునాథ్‌ మహాపాత్ర, దేవాలయ ఈ.ఓ. గీతారెడ్డిలు పాల్గొన్నారు.

ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు. అభివృద్ధి పనులన్నీ త్వరితగతిన ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేస్తామని ఆనందసాయి, సుందరరాజన్‌లు అన్నారు. త్రిదండి చిన జీయర్‌స్వామి అనుమతించిన నూతన డిజైన్‌ ప్రకారం నిర్మాణం పనులకు మార్కింగ్‌ చేపట్టారు. విమాన గోపురం ఎత్తు పెంచడం, కాలినడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్స్‌, బ్రహ్మూెత్సవాలు జరిగే ప్రదేశం, ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణ డిజైన్‌లు క్షేత్రస్థాయిలో అమలుచేయనున్నారు. విశాలమైన రోడ్లతో పాటు గుట్టపైకి వచ్చి తిరిగి వెళ్ళడానికి వేరువేరుగా రోడ్ల నిర్మాణాలు చేపడతున్నారు.