యాదాద్రివాస! లక్ష్మీ నృసింహ!!

By: శ్రీ మద్దూరి రామమూర్తి

ఉ. శ్రీ వదనాబ్జ హేళి ! సఫలీకృత భక్త మనోరథాళి ! ని
త్యావిత లోకపాళి ! ఖల దానవ భంజన కేళి ! సత్కృపా
పావన శీలి ! నిత్య సురపాలి ! నతాశ్రిత పాపకీలి ! ఓ
దైవతమౌళి ! యాదగిరి ! దైవమ ! శ్రీ నరసింహ ! ప్రోవుమా !

సీ. శ్రీదమై సౌఖ్య ప్రసాదమై వెలుగొందు
నమృతైక శాల యాదాద్రి పురము
పీఠాధిపతుల వాక్ప్రేరిత సూక్తుల
కాలవాలమ్ము యాదాద్రి పురము
వేద వేదాంగాల సాదరమ్మున నేర్పు
ఆధ్యాత్మ శాల యాదాద్రి పురము
వైష్ణవ ఘనమత వార్ధి గర్భమ్మున
ధర్మ మంజూష యాదాద్రి పురము

తే.గీ. పుష్కరిణి పుణ్య జలములు ముక్తి నొసగ
నామ సంకీర్తనమ్ములు నాట్యమాడ
నారసింహుడు సత్క ృపన్‌ జ్ఞాన మొసగ
అలరు వైకుంఠ పురము యాదాద్రి పురము

సీ. లక్ష్మీ పరిష్వంగ రారాజిత శుభాంగ !
కమనీయ పాద గంగా తరంగ !
నయనాయిత వికాస నలిన వైరి పతంగ
అమల గంధాది లిప్తాఖిలాంగ !
వర నఖాళి సుయుక్త బహుళ రాక్షస భంగ !
ఆశ్రిత రక్షారతాంత రంగ !
రంగదుత్తుంగ తరంగ సంగాసంగ !
పూత చరితానంద ముక్తసంగ !

తే.గీ. సత్కృపాపాంగా ! ! గరుడ భాస్వత్తురంగ !
ప్రాంజలించెద మది నీకు భక్తి పొంగ
భక్త హృదయాబ్జభృంగ ! పాపౌఘ భంగ !
పృథ్వి యాదాద్రి వాస ! లక్ష్మీ నృసింహ !

శా. ఏ నీదివ్య పదాబ్జ సీధు రసమున్‌ హృష్టాత్ములై గ్రోలి దే
వానీకమ్ము ప్రభుత్వమున్‌ నెరపి దివ్యానందమున్‌ బొందిరో
శ్రీనా ! యట్టి భవత్పదాబ్జముల నే ధ్యానింతు యాదాద్రి వా
సా ! నీ భక్తుడ చేరరమ్ము నరసింహా ! జ్ఞాన మందించగన్‌

ఉ. కన్నులలోని తైక్ష్ణమది కంజహితున్‌ దలపింప జేయు నా
కన్నుల లోని చంద్రికలు కల్వల రాయని సౌరు దించు నా
కన్నుల సత్కృపారసము గాంచిన లక్ష్మి వరించె నిన్ను శ్రీ
మన్నరసింహ ! ప్రీతి గనుమా! ఘన యాదగిరీశ ! పాహిమాం.

సీ. అబ్జజా హృదయేశ ! యాదగిరి నివాస !
స్నిగ్ధ చాంద్రీహాస ! చిద్విలాస !
రవితేజ ! కంఠ శీర్షాయిత మృగరాజ !
శ్రిత కల్పభూజ ! ధాత్రీ మనోజ !
ప్రకట గర్జన లోల ! భక్తాళి పరిపాల !
కుజన శలభకీల ! క్రూర కాల !
ప్రహ్లాద భయదూర ! వర కౌస్తుభాహార !
సర్వాఘ పరిహార ! జ్ఞాన కార !

తే.గీ. దుష్ట హర రంహ ! నరసింహ ! దురితదూర !
పతిత పావన మాధవా ! వజ్రదేహ !
కనక కశిపుని జీల్చిన ఘన నిభాంగ !
రమ్య కరుణాంతరంగ ! నిన్‌ ప్రాంజలింతు,

శా. నీ నామామృత ధారలన్‌ దనిసినన్‌ నిత్యమ్ము సౌఖ్యమ్మహో
తానే జేరునటంచు పల్కుదురు పెద్దల్‌ దాననే జేసి నే
ధ్యానింతున్‌ కరుణా పయోనిధి యశో ధన్యాత్మ ! యాదాద్రి వా
సా ! నిన్‌ భక్తి నుతించు చుంటి నరసింహా ! బిడ్డడన్‌ గాంచుమా !

సీ. గణనీయ భవదీయ కమనీయమౌ దివ్య
పాద ద్వయంబేను భక్తినెంతు,
తులలేని మృషలేని వెలలేని భవదీయ
నామాక్షరమ్ము డెందమున నెంతు,
మురిపించు మరపించు కరుణించు నీదివ్య
మహతో మహీయమౌ మహిమ నెంతు,
ఘనమైన పొనుపైన అనువైన మంగళ
కరములౌ నీ వర కరము లెంతు

తే.గీ. అఖిల జగములనేలు నిన్నాత్మ నెంతు,
వినుత యాదాద్రివాస ! ధీజన వికాస !
దుష్టహరరంహ ! నరసింహ ! శిష్టపాల !
గొనుమ సద్భక్తి నిడెడు వందన శతమ్ము

సీ. ఋత్విజుల్‌ గళమెత్తి ఋగ్యజుస్సామాది
వేదగానంబు గావించుచుండ,
హయ్యంగవీన నవ్యాహుతి ధూమమ్ము
తాపత్రయమ్ముల రూపుమాప,
అభినవాలంకృతమౌ విరిహారముల్‌
సోయగమ్ము లొసగి సొంపునింప
నరసింహ యను దివ్య నామాక్షరమ్ములు
భవ్యాలయమ్మున పరిఢవిల్ల

తే.గీ. మంగళమ్మగు గీతముల్‌ మరల మరల
మించ వాయిద్య ఘోషలు మిన్నుముట్ట
యాదగిరి నారసింహ దివ్యాలయమ్ము
వెలుగులీనెను ప్రారంభ వేళలందు