|

యాదికున్నకాడికి..

yadikunnakadikeయాదికున్నకాడికి..

మేము పట్నమొచ్చినం. పట్నం సూసెతంద్కు మేము రాలేదు. సుట్టాలింటికి రాలేదు. కొత్త సైన్మ జూసెతందుకు రాలేదు. సదువుకునె తందుకొచ్చినం. మేము పట్నం రాలేదు. సత్తెన్నతోని వొచ్చినం. గాయిన ఎవ్వరోగాదు. ప్రమోద్‌ గాని అన్న. అంతకు ముందు ఒకటి రెండు సార్లు మా పెద్దోల్లు యెంబడి పట్నమొచ్చినం. గాని పట్నంల ఏదీ యాడుందో మాకెర్క లేదు. తలా ఒక సందూక్‌ దెచ్చుకున్నం. గవ్విట్ల మా బట్టలున్నయి. ఇగ దాంతోని సక్కగ మేము చిక్కడ్‌పల్లిల ఉన్న ప్రమోద్‌ అక్క ఇంటికి బోయినం. మాటలల్ల గామె పేరు అమ్రబాయి అని నాకెర్కైంది.

చాయ్‌ దాగినంక సత్తెన్న మమ్ములను మషిరాబాద్‌కు దోల్కబోయిండు. గాడ కొత్తగ బడ్డ ఒక కాలేజీ ఉన్నది. పెండ్లి అయినంక అత్తగారింటికొచ్చిన కొత్త కోడలు లెక్క బెదురు సూపులు సూస్కంట సత్తెన్న యెంబడి కాలేజీలకు బోయినం. గాయిన తమ్ములను కాలేజిల షరీక్‌ చేసిండు.

”మషిరబాదల నా దోస్తున్నడు. గాన్కి శానిండ్లున్నయి. మీరుండెతంద్కు ఒక కమ్ర కిరాయికి ఇయ్యుమని గాన్ని అడ్గుత. ఒగాల్ల కమ్ర కిరాయికి దొర్కెనా అంటే పొద్దుమీకి మీ సందూక్లను గా దాంట్ల ఉంచుండ్రి. దొర్కకుంటె కిరాయికి కమ్ర దొర్కెదాంక అమ్రబాయి ఇంట్ల ఉండుండ్రి” అని కాలేజీల కెల్లి ఇవుతల కొస్తుంటె సత్తెన్న అన్నడు.

ముగ్గురం గల్సి సత్తెన్న దోస్తు తాన్కి బోయినం. మా అదృస్టం బాగుండి ముప్పై రూపాలకు పెద్ద కమ్ర దొర్కింది. పౌరన్‌ సత్తెన్న మా గురించి యాబై కిలల బియ్యం బస్త, పప్పు, ఉప్పు, ఒక్క మాటల చెప్పాలంటె వొంట జేసెందుకు ఏ మేం గావాల్నో గయన్ని గొన్నడు. గవే గాకుంట రొండు బత్తీల స్టౌలు; సీపిరికట్ట, తాలం; గ్యాసు నూనె దెచ్చుకునే తందుకు ఒక క్యాను; నీల్లకు ఒక బకీటు గొన్నడు గవన్నిటిని ఒక పోరనితోని మా కిరాయి కమ్రల బెట్టిపిచ్చిండు.

”నేనిగ ఊరికిబోత. మీరేం బుగులుబడకండ్రి. ఫికర్‌ బడకుండ్రి మంచిగ సదువుకోండ్రి” అని చెప్పి సత్తెన్న సికిందరాబాద్‌ రేల్‌ టేషన్కు బోయిండు.

ఈత రానోన్ని చెర్ల నూకి ఈత నేర్చుకో అన్న తీర్గ సత్తెన్న మమ్ముల మషిరబాదల ఇడ్సిబెట్టి ఊర్కి బోయిండు. గాల్లను గీల్లను అర్సుకుంట నడ్సుకుంటునే మేము అమ్రబాయక్క ఇంటికి బోయినం. పోతమంటె, తినిపోండ్రి – రా అని గామె అన్నది. మేము తిన్నంక ప్రమోద్‌గాని బావ ఆటో మాట్లాడి దీస్కొని వొచ్చిండు. మేము మా సందూక్లతోని ఆటో ఎక్కి మా కిరాయి కమ్రకు బోయినం.

గిది గియ్యాల్టి ముచ్చట గాదు. నలప్పై అయిదేండ్ల కింది ముచ్చట. మాది 69 తెలంగాన బ్యాచ్‌. 69 అంటే సదువులిడ్సి పెట్టి ‘ప్రత్యేక తెలంగాన ఉద్యమంల దూకుడు; బస్సుల మీద రాల్లు ఏసుడు, పోలీసోల్లతోని దెబ్బలు తినుడే గాకుండ నల్గొండ జేల్ల రొండు వారాలు ఉండుడు యాది కొస్తది.

పొద్దుగాల్లే లేసి మొకం గడుక్కున్నంక ఇరాని హోటల్కు బోయి చాయ్‌ దాగినం. అటెంకల గ్యాస్‌ నూనె; పుల్లల డబ్బి; ఒక పెయ్యి సబ్బు; బట్ట సబ్బులు గొన్నం. గని మాకు వొండుకో బుద్దిగాలేదు. కాలేజీకి బోయే ముంగట హోటల్ల బన్‌ మస్క దిన్నం. చాయ్‌ తాగి కాలేజికి బోయినం. నేను బక్కగా పొడుగ్గుంట. ప్రమోద్‌ పొట్టి గుండుకు గుండుగున్న ఏన్గు తీర్గుంటడు. కాలేజీల పట్నం పోరగాల్లు మమ్ముల జూసి లారెల్‌ అండ్‌ హార్డీ అని అనుబట్టిండ్రు. కొందరు మా మొకం ముంగటే నవ్వబట్టిండ్రు. లారెల్‌ అంటే గారెల్‌; బూరెల్‌ అసుంటి యోమో అని అనుకున్న. మేము తెలుగు మీడియంల సద్వెబట్కె అంగ్రేజిల మాకు మాట్లాడరాకుండె. గాదినం కాలేజీల పాటాలేం జెప్పలేదు. మేము కాలేజికెల్లి మా ఇల్లు అనేటి కమ్రకు బోతుంటే తొవ్వపొంటి బోతున్న ఒక సక్కని పోరిని జూసి ‘మేరి సప్నోంకి రాణి కబ్‌ ఆయేగీ తూ’ అన్కుంట మా కాలేజి పోరగాడు పాటందుకుండు.

”గట్టి చెప్పు దొర్కినంక వొస్త తియ్యి” అని గామె అన్నది.

సక్కగ మా కిరాయి అర్రకు బోయినం. బత్తిల స్టౌ ముట్టిచ్చినం. ప్రమోద్‌గాడు బువ్వ వొండితె నేను వొంకాయ కూర జేసిన. బజార్కు బోయి పెరుగు దెచ్చుకొన్నం. చెరొక పల్లె దీస్కున్నం. గవ్విట్ల బువ్వ బెట్టుకున్నం. వొంకాయ కూరేసుకున్న. బుక్క నోట్లె బెట్టుకుంటె బువ్వ పల్కైందని ఎర్కైంది.

”ఏం రా! బువ్వ పల్కైంది” అని నేను అంటే

”నువ్వు జేసిన కూరల ఉప్పు ఎక్వైంది” అని గాడన్నడు. అట్టట్టుకు మాటు ఉంటది గదా! ఆల్ల నడిగి ఈల్ల నడిగి బువ్వవొండుడు నేర్సుకున్నం. గాని కూరవొండుడె వొస్త లేదు. ఇంటికెల్లి దెచ్చిన తొక్కు; పల్లి పొడితోని కొన్ని దినాలు బువ్వదిన్నం.

గా దినం అయితారం. అయితారం దినాన గూడ అదే బువ్వా అనుకోని నడ్సుకుంట నారాయణ గూడలున్న తాజ్‌మహల్‌ హోటల్కు బోయినం. ఇంతకు ముందు ఒక అయితారం దినాన ఎప్పటి లెక్కనే వొంట జేస్కున్నం. గని గా దినం బువ్వనే గాకుంట కూర గూడ తినరాకుంటైంది. ఇగ కుక్కల కేస్తే గవ్వి గూడ ముక్క జూసి బోయినం. మర్లేం వొండుకోవాలని ఉపాసమున్నం. గని పొద్దుమీకి పానమంత చిత్తుజాత్తయింది. హోటల్ల ఒక మూలకు గూసున్నం. మా ముంగట ఇద్దరు గూసోని నాస్త చేస్తుండ్రు. రొండు బిర్యానీలకు ఆర్డరిచ్చినం. జెర సేపైనంక ముంగట గూసున్న ఇద్దరిట్ల ఒకడు ఛాయ్‌ గూడ దాగినంక సర్వర్‌ బిల్లు దెచ్చిండు. గా దాన్ని ఒక సాసర్ల ఉంచి గాని ముంగట బెట్టిండు. ఇగ దాంతోని గాడు కొసలకెల్లి నూరు రూపాల నోటు దీసి సాసర్ల ఉంచిండు. సర్వర్‌ గా నోటునే గాకుంట బిల్లును గూడ దీస్కోని బోయిండు. బిల్లు గట్టినంక బచాయించిన రూపాలు చిల్లరు పైసలను గాడు సాసర్ల ఉంచిండు. ఐదు రూపాలు దప్పిడ్సి కడ్మ రూపాలను నాస్త జేసినోడు దీస్కుండు. దీస్కోని హోటల్ల కెల్లి బోబట్టిండు. గాడు ఐదు రూపాలు దీస్కునుడు యాది మర్సిండనుకున్నా. సర్వర్‌ రాంగానే –

”గాయినను బిల్వు. గాయిన సాసర్ల ఐదు రూపాలు యాది మర్సిండు” అని అంటే సర్వర్‌ నవ్విండు. మా ముంగట గూసోని నాస్త జేస్తున్నోడు కిస కిస నగిండు.

”మీరేం ఫికర్‌ జెయ్యకుండ్రి. నేను బోయి గా సార్‌ కిచ్చొస్త” అన్కుంట గా ఐదు రూపాలను దీస్కోని సర్వర్‌ కీసల బెట్టుకుండు.

మేము బిర్యని దిన్నం. నీల్లు, నిమ్మపచ్చలున్న రెండు కఠోరలను దెచ్చి సర్వర్‌ మా ముంగట బెట్టిండు. మా ఊర్లె బిర్యాని దిన్నంక ఛాయ్‌ దాగుతరు. పట్నంల బిర్యాని దిన్నంక నిమ్మరసం దాగుతరేమో అని అనుకున్నం. అనుకోని ఊకోకుంట కటోర నీలల్ల నిమ్మపచ్చలు బిండినం. అటెంకల కటోరల ఉన్న నీల్లను దాగినం. మమ్ములను జూసి హోటల్ల ఉన్నోలు కడ్పు బల్గె తీర్గ ఒకటే నవ్వుడు. గాల్లు ఎందుకు నవ్వుతున్నరో మాకు సమజ్‌ గాలేదు. పట్నంల ఉన్నా మేము ఊరొల్లమే. ఏమెర్కలేని ఎడ్డోల్లమే.