magaప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఆగస్టు 22వ తేదీని ‘ప్రపంచ జానపద దినోత్సవం’ గా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ”జానపద దినోత్సవాన్ని” కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా గత 2 సంవ త్సరాలు విస్తృత స్థాయిలో 10 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరపాలని నిర్ణయించి, ఈ ఉత్సవాలకు ”జానపద జాతర” అనే పేరు పెట్టింది. ఈ ఉత్సవాలను భాషా, సాంస్కృతిక శాఖ గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అంటే, అప్పటి ఉమ్మడి 10 జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించింది. ఆ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ”జానపద జాతర – 2017”ను తొలిసారిగా నూతనంగా ఏర్పడిన 21 జిల్లాలతో కలుపుకొని మొత్తం 31 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది. నిజామాబాద్‌, జోగుళాంబ జిల్లాల్లో ప్రారంభ వేడుకలు నిర్వహించి, రాష్ట్రంలోని 31 జిల్లాలలో విజయవంతంగా ఈ ఉత్సవాలను కొనసాగించింది.

రవీంద్రభారతిలో ”జానపద జాతర 2017” ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, హైదరాబాద్‌ ఈ నాలుగు జిల్లాల నుంచి దాదాపుగా 800 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళాప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, వడ్డేపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘాలు, వృత్తి కళాకారుల సంఘాలు, ఇతర కళాకారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో అతిథులు జ్యోతి ప్రకాశనం చేయగా, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల స్వాగత గీతంతో కార్యక్రమాన్ని ఆరంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి మాట్లాడుతూ.. ఎంతో మంది మహానుభావులు ఈ రవీంద్ర భారతిలో ప్రదర్శనలు చేశారు, ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా గొప్ప విషయం అని అన్నారు. మీరందరూ కూడా సంతోషపడాల్సిన సందర్భం అని, ఒకానొక సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ కళాకారులను గుర్తు చేస్తూ, వారికి ఏదో ఒకటి చేయాలని అన్నారని, కంట తడి పెట్టారని చెప్పారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే చాలా సమస్యలుంటాయి. అలాంటి వాటిని అన్నిటిని భరిస్తూ కళాకారులకోసం ”జానపద జాతర” అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించారు మామిడి హరికృష్ణ. ఈ జానపద జాతర మాత్రమే కాదు, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సంక్రాంతి సంబు బరాలు, ఉగాది ఉత్సవాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, బోనాలు, పంద్రా ఆగస్టు, బతుకమ్మ, కళారాధన వంటి ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మంది కళా కారులకు అవకాశాలను ఇచ్చారు, ఇస్తున్నారని హరికృష్ణని అభినందించారు. సాంస్కృతిక శాఖామాత్యులు అజ్మీరా చందులాల్‌, ప్రభుత్వ కార్యదర్శి బి. వెంకటేశం మార్గ నిర్దేశంలో కళాకారులకి ఐ.డి. కార్డులను ఇస్తామన్నం అవి అంద చేస్తున్నాం, ఇంకా బస్‌ పాస్‌, హెల్త్‌ కార్డులను కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ డా. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ… ఒకప్పుడు జానపద కళారూపాల ప్రదర్శనలు మిడిమిడిగా ఉండేవి. ఇప్పుడు రవీంద్రభారతి జానపద కళారూపాలతో కళకళలాడుతుంది అని, తను బాల్యంలో జానపద కళాకారుల వల్లనే ఎంతో జ్ఞానాన్ని పొందానని, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి బాల్యంలోని నా జానపద పునాదులే కారణమని, శారద కథ, ఒగ్గు కథ ఇవి ఉద్యమ క్రమంలో తోడ్పడ్డాయని అన్నారు. ప్రతీ కల గొప్పది, ”నాగేటి సాల్లల్ల నా తెలంగాణ” అని నేను రాశానంటే దానికి కారణం పల్లెల్లో ఉండే జానపద కళలే అన్నారు. బతుకమ్మ పండుగ రాష్ట్రంలోనే కాదు, దేశం దాటి వెళ్లింది చైతన్యం తీసుకొ చ్చింది, తెలంగాణ అంటేనే జానపద సంస్కృతి అని అన్నారు.

సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… ”జానపద జాతర” నేపథ్యం తెలుపుతూ, కళాకారులందరిది వంద తరాల వారసత్వమని, వారు నడిచే మ్యూజియమని, తెలంగాణలో ప్రస్తుతం అన్ని రకాల కళారూపాలకు అద్భుతమైన గుర్తింపు, ప్రోత్సాహం ప్రభుత్వ పరంగా లభిస్తుందని, ఇక ముందు కూడా ఈ జానపద కళలు వర్ధిల్లుతాయి, విరాజిల్లుతాయి అనీ, తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఎప్పటికీ మీకు ప్రోత్సాహముంటుందని అన్నారు.

విశిష్టమైన తెలంగాణ జానపద కళారూపాల ప్రదర్శనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ”జానపద జాతర”లో తెలం గాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు, బంజారా నృత్యం, బతుకమ్మ ఆటలు, కోలాటం (పురుషులు, మహి ళలు) ప్రదర్శన, డప్పులు, ఒగ్గు కథ, తోలు బొమ్మలాట, గుస్సాడి, చిరుతల భజన, బైండ్ల కథలు, శారద కథలు, పోతురాజుల ప్రదర్శన, దింసా, చిందు యక్షగానం, అడుగుల భజన కళారూపాల ప్రదర్శనలు అతిథులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తంగా రవీంద్రభారతి ప్రాంగణం, లోపలి రంగస్థల వేదిక అంతటా జానపద కళలు, కళాకారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకర్షించాయి.

Other Updates