rrrrrr”అంతా గొప్ప చిత్రకారుడంటే పొంగిపోవడం తప్ప, నిజంగానే ఇంతవరకు అఖిలభారత స్థాయిలో మీ చిత్రమేదైనా పోటీకి నిలిచి గొప్ప చిత్రమనిపించుకుందా నాన్న” అన్న కూతురు, వర్థమాన చిత్రకారిణి కరుణ మాటను సవాల్‌గా తీసుకుని, నాలుగు రోజుల్లో నలుగురు మెచ్చే చిత్రం గీసి పోటీకి పంపి కేంద్ర లలిత కళా అకాడమీ అవార్డును సాధించిన సుప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి శ్రీహరి భోలేకర్‌.

2004లో కేంద్ర లలిత కళా అకాడమీ అవార్డుకోసం చిత్రకారిణి కరుణ ఒక చిత్రం వేస్తూ, షష్ఠి పూర్తయిపోయిన తండ్రిని రెచ్చగొట్టి ఆయనచేత ఒక అపురూప చిత్రం వేయించి పంపించింది. కరుణ చిత్రాన్ని పోటీకి తిరస్కరించగా, శ్రీహరి భోలేకర్‌ చిత్రానికి అనుమతి దొరికింది, అవార్డు లభించింది. ఆయనెంతటి చిత్రకారుడో చిత్రకళా ప్రపంచానికి స్పష్టమైంది.

భారతీయ స్పృహతో సర్రియలిజం చిత్రాల రూపకల్పన నుంచి ప్రతీకాత్మకంగా సాంఘిక అంశాలతో చిత్రాలు వేయడం దాకా ఆయన ప్రయాణం సాగింది. ప్రధాన స్రవంతి చిత్ర కళారంగంనుంచి భోలేకర్‌ స్వచ్ఛంధంగా తప్పుకున్నాడు. బేగంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రధాన చిత్రకారుడుగా చేరే విషయంలో రెండో ఆలోచనకు తావివ్వలేదు. అయితే ఆయనలో చిత్రకళపట్ల నిబద్ధత, సృజనపట్ల అనురక్తిమాత్రం చెక్కుచెదరలేదు. దానికి ఆయన గురువు-పల్సికర్‌ ప్రభావమే కారణం. ఆయన ఆలోచనాధారకు అనుగుణంగా కుంచె పోకడవల్ల కేవలం ఆయన వేసే చిత్రాలు, ఆయన ముద్రగల చిత్రాలు వేయగలిగాడు.

ఇవ్వాళ్టికీ ఆయన కలం కదలికలో లయ, రేఖాకృతిలో సొగసు ఉంది. కానీ ఆ రూపాలకు తీరుతెన్నులేదు, పోలికలేదు, సందర్భంలేదు, సన్నివేశం లేదు.

తెలిసీ తెలియని, చూసీచూడని ఆ రూపాలు ఆయన వ్యక్తికరణలు, సృజనాత్మకమైనవి, శ్రమతో కూడినవి. ఎప్పటికప్పుడు అవి తాజావి. కానీ సాధారణ ప్రేక్షకులు ఆ రూపాలేమిటో అర్థం చేసుకోలేదు. కానీ వాటిని చూసి ముచ్చటపడతారు.

ఇటీవలి చిత్రాలు చతురస్రంలాగా, దీర్ఘచతురస్రంలాగా, వలయాలుగా, కళకు నిలయాలుగా-ఏ తెలిసీ తెలియని రూపం గీసినా, అది శ్రీహరి భోలేకర్‌ సృష్టేతప్ప మరొకరికి సాధ్యం కానిది.

నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ సమీపంలోని బొల్లక్‌పల్లిలో నాగమ్మ-భాగన్న దంపతులకు 1941లో జన్మించిన శ్రీహరి భోలేకర్‌ వివేకవర్థిని ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత వివేకవర్థిని సాయం కళాశాలలో బి.ఏ. డిగ్రీ పొందాడు.

rr11నిజానికి మెట్రిక్‌ కాగానే ప్రముఖ చిత్రకారులైన డోంగ్రే, అంబదాస్‌ ముహూర్కర్‌ల ప్రభావానికి లోనై చిత్రాలు వేయడం ప్రారంభించాడు. పాఠశాల స్థాయిలో ఆయన వేసిన చిత్రాలకు పలు బహుమతులు కూడా వచ్చాయి. అమ్మానాన్నలు చిత్రకళా జీవితం వద్దన్నారు. ఎల్‌.ఎల్‌.బి. చేయమన్నారు. కానీ ఇల్లు వదలి బొంబాయి వెళ్ళి సర్‌ జె.జె. స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో నాలుగేండ్లపాటు డిప్లొమా చదివి పూర్తి చేశాడు. ఢిల్లీ వెళ్ళి ప్రముఖ చిత్రకారుడు కుమారిల్‌స్వామివద్ద యేడాదిపాటు కుడ్య చిత్రకళలో విశేషానుభవం పొందినాడు.

కొంతకాలం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగం చేశాడు. పిదప బేగంపేటలోని ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ శిక్షణా కేంద్రంలో చీఫ్‌ ఆర్టిస్ట్‌గా చేరి ముప్పైఏడు సంవత్సరాలపాటు పనిచేశాడు.

rr22జె.జె. స్కూల్‌లో తన గురువు ఎస్‌.బి. పల్సికర్‌ చాలా గొప్పవాడు. విద్యార్థులకు చిత్రకళలో అభిరుచిని కలిగించడంతోపాటుగా వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేశాడు. విజ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, సృజన నూరిపోశాడు శ్రీహరి భోలేకర్‌.

పెయింటర్‌గా వృత్తి జీవితం ప్రారంభించి ప్రింట్‌ మేకింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి భోలేకర్‌ ఎదిగాడు. దాదాపు ముప్ఫై సంవత్సరాలుగా డ్రాయింగ్స్‌లోనే కాలం వెళ్ళబుచ్చుతున్నాడు.

హైదరాబాద్‌లో 1963 నుంచి ఇప్పటిదాకా ఏడెనిమిది పర్యాయాలు వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. మద్రాసు, బెంగుళూరు, ఢిల్లీలలోనూ ఒక్కొక్క వ్యష్టి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించాడు. ఇక సమష్టి చిత్రకళా ప్రదర్శనలకైతే లెక్కేలేదు. అంతర్జాతీయ స్థాయిలో నాల్గవ, ఆరవ ఇంటర్నేషనల్‌ బైయినియల్‌ ఆఫ్‌ డోరో, అలిజో, పోర్చుగల్‌, 2007, 2012లో, ఇంటర్నేషనల్‌ ట్రెయినర్‌ ఆఫ్‌ ఆర్ట్‌, మాఫిడోనియా-2006, దిలోవ బయనితల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ కాంటెంపరరీ ఆర్ట్‌, భారతభవన్‌ ఇంటర్నేషనల్‌ బైయినియల్‌ ఆఫ్‌ ప్రింట్‌ ఆర్ట్‌, భోపాల్‌, 2001, 2004, 2009, ఏడవ ఇంటర్నేషనల్‌ ఆర్ట్‌ ట్రైయినియల్‌, సుట్కీ, మడానిక్‌, పోలెండ్‌-2004, కాంటెంపరరీ ఇండియన్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ కున్‌స్టేషన్‌, ఫుతడా, జర్మనీ-2001లలో తను రూపొందించిన కళార్షిణాలతో తన ఉనికిని చాటాడు.

rtr2004లో ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర లలిత కళా అకాడమీ అవార్డును” ”తెలిసీ-తెలియని” రూపాలను పొందిన శ్రీహరి భోలేకర్‌కు 2005-2007లో కేంద్ర సాంస్కృతికశాఖ సీనియర్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. 2003లో భారతీయ పరిణత చిత్రకారుడికిచ్చే పురస్కారం పొందారు. 2000లో అఖిలభారత ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ మిలీనియం అవార్డు లభించింది. అంతేకాదు 1981, 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశిష్ట చిత్రకారుడిగా సత్కరించింది. 1998లో హైదరాబాద్‌లోని మహారాష్ట్ర మండల్‌ కూడా విశిష్ట చిత్రకారుడుగా సన్మానించింది. ఇరవయ్యవ శతాబ్ది చిత్రకారుల ప్రచురణ (పారిస్‌) నిమిత్తమై 1991లో వీరిని సంప్రదించింది. మొత్తంమీద అఖిలభారతస్థాయి అవార్డులు పదహారు వీరికి రాగా, వాటిలో రెండు స్వర్ణ పతకాలు, రెండు రజిత పతకాలు. మరో పదమూడుదాకా ఇతర అవార్డులలో నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ అవార్డులు కావడం విశేషం.

ghgఏ చిత్రమైనా ఇలా ఉండాలని ప్రణాళిక లేకుండా ప్రారంభించి, గీస్తూ గీస్తూ దాన్ని ఇక చాలు అని పూర్తి చేయడమే భోలేకర్‌ పద్ధతి. సర్వసాధారణంగా ఒక్కో చిత్రం పూర్తి చేయడానికి సగటున మూడు నాలుగు రోజులు తీసుకునే భోలేకర్‌కు వేసే అన్ని చిత్రాలు ఆనందం కలిగించేవే. వస్తువు స్పృహ లేకుండా తెలిసీ తెలియని, చూసీచూడని ఆకృతులకు రూపులు దిద్దినా, ఎక్కడా బొమ్మను పోలిన బొమ్మ మరొకటి లేకపోవడం గమనార్హమైంది.

చిత్రాన్నైనా ఎప్పటికప్పుడు ఆలోచనాధార, మనోధర్మం మేరకే వేసే భోలేకర్‌ అన్ని చిత్రాలు తన సంతృప్తి కోసమే వేస్తున్నానంటాడు. వీరి చిత్రాలను కాంటెంపరరీ ఎన్‌గ్రేవింగ్‌ మ్యూజియం, పోర్చుగల్‌ మ్యూజియం ఆఫ్‌ ఎన్‌గ్రేవింణ్‌-కోస్టెల్లోడీ, ఇటలీ, పాంట్స్‌వి స్టేట్‌ మ్యూజియం ఆఫ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌, మజ్‌డానెక్స్‌ పోలెండ్‌, ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ కాంటెంపరరీ మినియేచర్‌ ప్రింట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లోవ, యూయస్‌ఏ, హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం, కాంటెంపరరీ మ్యూజియం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ, తుఫాన్‌, ఉప్పెన మ్యూజియం అవనిగడ్డ, ఆంధ్రప్రదేశ్‌ చిత్రకారుల మండలి, తరతరాల తెలుగు సంస్కృతి మ్యూజియం సేకరించాయి. ఇవేకాకుండా బెంగుళూరు ఆలైన్స్‌ ఫ్రాంకైంస్‌, రాజ్‌భవన్‌ (అహ్మదాబాద్‌), కునిక్‌ చెమెలో ఆర్ట్‌ సెంటర్‌ (న్యూఢిల్లీ), లలిత కళా అకాడమీ (న్యూఢిల్లీ), ఇంకా ఎందరో మిత్రులు, చిత్రకళాభిమానులు వారి చిత్రాలను సేకరించారు.

 టి. ఉడయవర్లు

Other Updates