tsmagazine
కళ మానవుని సృజనాత్మక నిపుణతకు,
ఊహాశక్తి సామర్ధ్యానికి ప్రతీక. ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక కళలు ప్రాచుర్యంలో ఉన్నా, ఆ ప్రాంత సంస్కృతిలో జనించి, అక్కడి సాహిత్యంతో జవజీవాలను సంతరించుకుని, వేషభాషలలో ఆ జాతి లక్షణాలను స్ఫురింపజేస్తూ, వారి దైనందిన జీవనంలో భాగమై, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక చింతన పెంపొందించే కళ ప్రత్యేకంగా నిలుస్తుంది. తెలం గాణకు సంబంధించి అటువంటి అపురూపమైన ప్రదర్శనా కళ-యక్షగానం.

తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలోకి ఎటువంటి అరువు లక్షణాలు లేని స్వతంత్ర ప్రక్రియ యక్షగానం, యిది సంగీత, సాహిత్య, నృత్య, అభినయాలతోకూడిన సమాహార కళారూపం. సంస్కృత దశరూపకాలలో ‘వీధి’ అనే ప్రక్రియ ఉన్నది. అయితే యక్షగానం సంస్కృత మర్యాదలతోకూడిన మార్గ పద్ధతిలో కాక దేశీ రచనా పద్ధతులను పుణికిపుచ్చుకున్నది. అంతేకాక దేశీ కవితాశాఖలన్నింటిలోనూ గుణంలో, పరిమాణంలో, ప్రయోజనంలో, విశిష్టతలో అగ్రగణ్యమైన ప్రదర్శనా రూపం యక్షగానం. ప్రజల ధార్మిక జీవనానికి ఉపకరిస్తూనే వారి ఆటవిడుపుకి, కాలక్షేపానికి ప్రధానమైన మాధ్యమం యీ కళ. పల్లెపనులు చేసుకునే బడుగుజీవులు అద్భుతంగా పదాలను ఆలపిస్తూ, గజ్జెకట్టి అభినయించడం తెలంగాణ పల్లెల్లో యనభైయవ దశకం వరకు సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. యక్షగానాన్ని తెలంగాణలో భాగవతులు లేదా బాగోతులు అని కూడా వ్యవహరిస్తారు.

తెలంగాణ నేల అనేక సాహిత్య ప్రక్రియలకు పుట్టినిల్లు. దక్కను పీఠభూమిలో విస్తరించి ఉండడంవల్ల ప్రాదేశికంగా విభిన్న భాషల, సంస్కృతుల ప్రభావం, ఆదానప్రదానాల మేళ వింపు ఎక్కువగా జరిగింది. ప్రసిద్ధ శైవక్షేత్రాలకి పూర్వకాలంలో భక్తులు కాలినడకన దుర్గమ అటవీ ప్రాంతాలను, పర్వతాలనూ దాటి చేరుకునేవారు. ఇందులో తెలుగువారు మాత్రమేకాక కన్నడ, మరాఠా భక్తులు ఎక్కువగా ఉండేవారు. అటవీ ప్రాంతాన నివసించే జక్కులు లేదా చెంచులు అనేవారు, యీ యాత్రికులకు బడలిక తెలియకుండా భక్తిని పెంపొందించే విధంగా, కాలక్షేపంకోసమూ గానం చేసేవారు. ఈ జక్కులు ప్రధానంగా దేశదిమ్మరులు. జాతరలు, ఉత్సవాల సందర్భాలలో గ్రామాలలోకి ప్రవేశించి వారి కళను ప్రదర్శించేవారు. ఈ జక్కుల గానమే కాలక్రమంలో యక్షగానంగా పరిణమించింది. మొదట్లో యక్షగానాత్మక కళారూపంగానే ఆవిర్భవించింది, జక్కులు వివిధ దేశీఛందస్సులలోని పదాలను గానం చేసేవారు. ఇక, రెండవదశలో యీ ప్రక్రియ సంవాదరూపం తీసుకున్న ది. ఒక్కరు కాక యిద్దరు, ముగ్గురు బృందంగా చేరి సంవాదరూపంలో, ఏదైనా యితివృత్తాన్ని ఎన్నుకొని తమ గానకౌశలాన్ని ప్రదర్శించేవారు. మూడవ దశలో, యక్షగానం నేడు మనం చూస్తున్న వీధి రూపకంగా పరిణామం చెందింది.
tsmagazine

యక్షగానం/యక్షులు అనే పదాల గురించి భారతీయ సాహిత్యంలో జైమినీయ బ్రాహ్మణము మొదలుకొని అనేక ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ సారస్వతంలో యక్షులను నీతిప్రవక్తకులుగా, రక్షక శక్తులుగా తీర్చిదిద్దారు. కాళిదాసు మేఘసందేశంలా ‘యక్షాఃసితామణి’ అంటూ యక్షులను నృత్యగీతియందు ప్రీతి ఎక్కువ అంటాడు.

తెలుగు సాహిత్యంలో వరంగల్‌ వాస్తవ్యుడైన వీరశైవకవి పాల్కురికి సోమన పన్నెండవ శతాబ్దిలోనే ‘పండితారాధ్య చరిత్ర’ అనే తన ద్విపద కావ్యంలో ‘ఆదట గంధర్వ యక్ష విద్యాధరులై పాడెడునాడెడువాడు’ అంటూ రేఖానుమాత్రంగా ప్రస్తావించాడు. అటుపై శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో ‘కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు, గాంధర్వమున యక్షగాన సరణి’ అంటూ మొదటిసారి యక్షగానం అనే సంపూర్ణ పదాన్ని వాడాడు. అతని సమకాలికుడైన వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిó రామంలో -‘కామల్లీ మహాలక్ష్మీ కైటభారి.. వల్లపు వాడుచు వచ్చు జక్కుల పురంధ్రి’ అంటూ వారి అభినయాన్ని వర్ణించాడు.

యక్షగానం యావత్తు తెలుగు ప్రాంతంలోనూ, అటు ఒరిస్సా తీరం వరకు, యిటు కన్నడ ప్రాంతం, తమిళనాడు-తంజావూరు, మధుర, సేలం, చెంగల్పట్టు దాకా వ్యాపించింది. కన్నడలో బయలాట, యక్షగానం పేరుతో తెలుగు యక్షగానాలతో సమాంతరంగా అభివృద్ధి చెందింది. నేటికీ ఆ ప్రాంతంలో సాహిత్యపరంగా, ప్రదర్శనాపరంగా ఉజ్వలంగా కొనసాగుతుంది. అభినయ స్వరూపాన్ని బట్టి యక్షగానాన్ని భామాకలాపం, కొరవంజి నృత్యం, కూచిపూడి నృత్యంగా వివిధ ప్రాంతాలలో అభివర్ణిస్తుండగా-హరికథ, బుర్రకథ, జంగం కథ, మరాఠిలోని ‘అభంగ్‌’ ప్రక్రియలతో యక్షగానానికి సారూప్యత కనబడుతుంది. అయితే, విభిన్న భాషా సారస్వతాలలో ఎంత విస్తృతి

ఉన్నప్పటికీ లిఖిత వాజ్ఞ్మయంలో లభిస్తున్న తొలి యక్షగానం తెలుగులోనిదే-అది కూడా తెలంగాణ ప్రాంతంలోనిదే. కందుకూరి రుద్రకవి రాసిన ‘సుగ్రీవ విజయం’ తొలి యక్షగానం. అందువల్ల యక్షగానానికి పుట్టినిల్లు తెలంగాణమే అనడంలో వివాదం లేదు. పదహారవ శతాబ్దికి చెందిన రుద్రకవి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి చెందినవాడు. సుగ్రీవ విజయం ‘కరుణభాసురమైన’ యక్షగానంగా ప్రసిద్ధి చెందింది. కాగా, పధ్నాలు గవ శతాబ్దిలోనే సర్వజ్ఞ పద్మనాయకుడు ‘సారంగధర’ అనే యక్షగానాన్ని రాసి నట్లు ఆచార్య బిరుదురాజు రామ రాజు కొన్ని పంక్తులను ఉదహరించారు. తెలంగాణలో క్రీ.శ. 1780నాటికే శేషాచలకవి రాసిన ‘ధర్మపురి రామాయణం’, రాపాక శ్రీరామకవి రాసిన ‘ఆధ్యాత్మ రామాయణం’ అనే యక్షగానాలు బహు ప్రఖ్యాతం. దాదాపు అదేకాలంలో వీరశైవ కథాంశాలతో కానూరి వీరభద్రకవి – ‘బసవ మహిమామృత విలాసము’, చెల్వురు సన్యాసి కవి-‘బసవ కల్యాణము’ వంటి యక్షగానాలు ప్రదర్శింపబడినట్లు తెలుస్తుంది. మాలదాసరుల ప్రదర్శనలలో వైష్ణవ యితివృత్తాలు, బుడగ జంగాల ప్రదర్శనలలో శైవ యితివృత్తాలు విరివిగా ప్రదర్శింపబడేవి.

కుతుబ్‌షాహీల కాలంలో తీరాంధ్ర ప్రాంతం కూడా గోల్కొండ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ ప్రాంత పర్యటనలో యక్షగాన ప్రదర్శనకు ముగ్ధుడై తానీషా ప్రభువు ‘కూచిపూడి’ అగ్రహారాన్ని యక్షగాన కళాకారులకు కానుకగా యిచ్చాడు. ఆపై కూచిపూడి యక్షగానాలు శాస్త్రీయ నృత్య సంప్రదాయంతో కొనసాగుతున్నాయి. తానీషా మంత్రులైన అక్కన్న, మాదన్నలకు ఒక భాగవత మేళం ఉండేదనీ, గోల్కొండ కోటలో సైతం యక్షగాన ప్రదర్శనలు విరివిగా నిర్వహించేవారనీ ‘మధురమంగా పుంశ్చలీ విలాసం’ అనే యక్షగానం ద్వారా తెలుస్తుంది.

తెలంగాణ యక్షగానాన్ని మిగతా ప్రాంత యక్షగానాలతో పోల్చి చూస్తే వస్తువురీత్యా, ఛందస్సురీత్యా, ఆహార్యం, అభినయాలరీత్యా వైవిధ్యం కనిపిస్తుంది. మన యక్షగానాలు కేవలం నైతిక, ధార్మిక చింతన పెంపొందించడమేకాక, 19, 20 శతాబ్దులలో నెలకొన్న మత, రాజకీయ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని సంస్కృత, సంప్రదాయాలను నిలబెట్టాయి. వస్తువు-అంటే ఇతివృత్తం ఎంపికలో మన యక్షగానం కొత్త పుంతలు తొక్కింది. ప్రధానంగా వాటిని పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు, కాల్పనికలు అని విభజించవచ్చు. సందర్భానుసారం, ప్రేక్షకాదరణను అనుసరించి కళాబృందాలు యితివృత్తాన్ని ఎంపిక చేస్తాయి. పౌరాణిక యక్షగానాలలో భాగవత సంబంధమైన-రుక్మిణీ కల్యాణం, కళింగమర్ధనం, శ్రీకృష్ణతులాభారం, చెంచులక్ష్మీ పరిణయంవంటివి, రామాయణ సంబంధమైన శ్రీరామాంజనేయ యుద్ధం, మండోదరి పరిణయం, మైరావణ చరిత్ర వంటివి; భారత సంబంధమైన-భీమసేన విలాసం, బభృవాహన చరిత్రము, గయోపాఖ్యానం వంటివి ప్రఖ్యాతం. అట్లాగే, మహాపురుషుల జీవితాలను ఎంచుకొని-శ్రీ బ్రహ్మంగారి చరిత్ర, సతీ తులసి గజగౌరీవ్రతము, ఆరె మరాఠీల చరిత్రవంటి యక్షగానాలు రచించబడ్డాయి. కల్పిత కథలలో-అల్లీరాణి చరిత్రము, రంభరంపాల చరిత్ర, జయంత జయపాలము, కనకతార వంటివి పేరెన్నికగన్నవి. సాంఘిక యితివృత్తంతో వచ్చిన క్రోధాపురి రైతు విజయం అరుదైన యక్షగానం. ఇందులోని వస్తువు మాత్రమేకాక భారతమాత ప్రార్థనవంటి అంశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.
tsmagazine

ఛందోవైవిధ్యం తెలంగాణ యక్షగానాలలో మరో ప్రత్యేక అంశం. ఈ ప్రాంత రచయితలు దేశీవాజ్ఞ్మయంలోని గేయఫణితులను విరివిగా ప్రయోగించారు. అష్టవిధ రగడలు, ఏలలు, సువ్వాలులు, తుమ్మెదపదాలు, ధవళములు, శోభనములు, ద్విపదలు-తదనంతర కాలంలో సీసపద్యాలు, ఆటవెలది, కందపద్యాలు, కందార్థాలు, సీసార్థాలు, గీతార్థాలు చోటుచేసుకు న్నాయి. అర్థగాంభీర్యానికి, శబ్దమాధుర్యానికి బహు స్వల్పంగానైనా వృత్తపద్యాలు వాడడం కనిపిస్తుంది. తోడిరాగం, కల్యాణి, ఆఠాన, భైరవి, శివరంజని, శంకరాభరణం, అసావేరి వంటి రాగాలు; ఏక, ఆది, ఆట, రూపక, జంపె, జుల్వ, త్రిపుట వంటి తాళాలు; చల్తీ, మంద్రవంటి గతులు-తెలంగాణ యక్షగానాలలో ఎక్కువగా కనిపిస్తాయి. విశేషమేమంటే-మార్గ, దేశీ ఛందస్సులనే కాకుండా మన యక్షగానాలు గజల్‌, డోరా, తొహరా వంటి పార్శి ఛందస్సులను కూడా కలుపుకున్నది. ”తెలంగాణ సంస్కృతి-గంగా జమున తహజీబ్‌ అనే నానుడికి యిది ప్రత్యక్ష ఉదాహరణ.

ప్రాథమిక దశలో గ్రాంధిక భాషను వాడినప్పటికీ రానురాను తెలంగాణ యక్షగానాలలో వ్యావహారిక, మాండలిక భాషాపదాలు విరివిగా ప్రయోగించబడ్డాయి. పద్యాలు, దరువులలోకన్నా వచనాలలోనే మాండలిక భాషాపదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. యిందుకు ప్రధాన కారణం యీ యక్షగాన రచయితలు గొప్ప చదువులు చదివినకారు కాదు, బహుజనకులాలనుండే వీరి ప్రాతినిధ్యం ఎక్కువ. దినమంతా కష్టపడితేగానీ కడుపునిండనివారు-తమ సాహిత్య పిపాసని, కళాతృష్ణని తీర్చుకోవడానికి యక్షగానాలను రచించి ప్రదర్శించేవారు.

సంప్రదాయ సాహిత్యంలో పండితవర్గం ప్రజల భాషకు దూరంగా మార్గ పోకడలతో రచనలు చేస్తే, తెలంగాణ యక్షగానాలు జనవ్యవహారాది జీవద్భాషను ఎంచుకొని-జాతీయాలు, పలుకుబళ్ళు, సామెతలను ఉపయోగిస్తూ దేశీ నుడికారానికి శ్రీకారం చుట్టాయి. వ్యావహారిక భాషలోని మాండలిక పదాల మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే యక్షగానాన్ని మించిన సాహిత్య ప్రక్రియ లేదు. ఉదాహరణకు-కండ్లల్ల దిరుగుతున్నది, కలుక్కు మనుట, నీవెంత పత్తిగింజవే, గుండె వల్లినట్లు, పొట్టుపొట్టు కొట్టిపో యిండు, ఏలెడంత లేదు వంటి పలుకుబళ్ళు విరివిగా కానవస్తాయి. ఇక, ప్రజలు దైనందిన వ్యవహారాలలో వాడే సామెతలు అడుగడుగునా దర్శనమిస్తాయి. ఉదాహరణకు-మెడకు వడ్డ పాము కరువక మానదు. గతిలేని సంసారమన్నా చెయ్యొచ్చుగానీ సుతిలేని సంసారం చేయరాదు, కథకు కాళ్ళులేవు ముంతకు చెవులు లేవు, తల్లిలేని శిశువు దయ్యాల పాలువంటివి కోకొల్లలు. అదేవిధంగా, వచనాలలోని మాండలిక పదాలు-పురాణేతిహాసాలు మనకు అత్యంత సమీపంలోనే జరిగినవేమో నన్న భావనను కలిగిస్తాయి. ఉదాహరణకు-ముత్తెమంత, బుగులువట్టు, తోలుకపోయిండ్రు, నిమ్మలంగా, లెంకుతున్నరువంటి పదాలు అనేకం దర్శనమిస్తాయి. మరో విశేషమేమంటే-పాత్రధారులు, గ్రంథంలోని యితివృత్తము చెడకుండా, అప్పటికప్పుడు స్థానిక వ్యవహారంలోని పదాలను ప్రయోగించి ప్రేక్షకులను అబ్బురపరుస్తారు.

కాకతీయుల అనంతరం తెలంగాణ ప్రాంతం బహుమనీలు, కుతుబ్‌ షాహీలు, నిజాం పాదుషాల ఏలుబడిలోకి వచ్చింది. వారి పరిపాలనలో భాషా సాంస్కృతిక రంగాలలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు తీయదనం, సంస్కృత భాషా గాంభీర్యంతోపాటు నాటి అధికార భాషలైన పార్శీ, ఉర్దూల్లోని అనేక పదాలు యక్షగానాలలో ప్రవేశించి కొత్త అందాలను సంతరించుకున్నాయి. తహసీల్దార్‌, రస్తాఛోడో, మషూర్‌ వంటి పదాలు యధాతథంగా వినియోగించబడ్డాయి. మరికొన్ని పదాలు తెలుగుతో కలిసిపోయి గమ్మత్తైన పదజాలంగా రూపాంతరం చెందాయి-ఏక్‌మాట, రమ్మని బోల్కే ఆవో, మీకీ జోహార్‌, తెల్ల కాగజ్‌లావో వంటివి కొన్ని ఉదాహరణలు. మిగతా ప్రాంతాలలోని యక్షగానాలు ప్రత్యేకంగా కొన్ని వర్గాలకో, వంశపారంపర్యంగా కొన్ని కళాబృందాలకో పరిమితం కాగా, తెలంగాణ యక్షగానం జనబాహుళ్యంలోకి చొచ్చుకొనిపోయి సామాన్యుడిలోకెల్లా సామాన్యుడి నాలుకపై నాట్యమాడుతున్నదంటే యిటువంటి భాషా ప్రయోగాలు దేశీగేయరీతులు ప్రధాన కారణాలు.

తెలంగాణ యక్షగానాన్ని చర్చించినప్పుడు చెర్విరాల భాగయ్యకవిని తప్పక స్మరించుకోవాలి. వారు నూటికిపైగా రచనలు చేస్తే, అందులో 34 యక్షగానాలున్నాయి. తను స్వయంగా రాయడమేకాక, ఔత్సాహిక రచయితల యక్షగానాలను ఎన్నో పరిష్కరించి నగిషీలు అద్దారు. వీరి సారంగధర, మార్కండేయ విలాసము, కనకతార చరిత్రము, అల్లీరాణి చరిత్ర బహు ప్రఖ్యాతం కాగా, సుగ్రీవ విజయం అనే వీరి యక్షగానం లక్షకుపైగా ప్రతులు అమ్ముడైనట్లు చెబుతారు. అందుకే చెర్విరాల భాగయ్య కవికి-‘తెలంగాణ యక్షగాన పితామహుడు’ అనే కీర్తి దక్కింది. భాగయ్యగారి శిష్యుడు-మహ్మద్‌ అబ్దుల్లా-హనుమద్రామ సంగ్రామం, కుశలవ చరిత్రమువంటి యక్షగానాలు రచించడం సాహితీవేత్తలకు, కళాకారులకు ఉండే మత సహిష్ణతను తెలుపుతుంది. స్త్రీలు కూడా యక్షగాన రచనలలో భాగస్వాములే అనడానికి శివకురవంజి అనే రచన చేసిన రూప్‌ఖాన్‌పేట రత్నమ్మని పేర్కొనవచ్చు.
tsmagazine

ఈవిధంగా 19, 20 శతాబ్దాలలో తెలంగాణా సమాజాన్ని పల్లె, పట్నం భేదంలేకుండా యక్షగానాలు శాసించాయి. ముఖ్యంగా 1930నుంచి 1980 వరకు-అంటే ఒక అర్ధశతాబ్దికాలం తెలంగాణ యక్షగానానికి స్వర్ణయుగం. యక్షగాన రచయితలతో, ఊరూరా ఏర్పడ్డ కళాబృందాలతో తెలంగాణ నేల పునీతమైంది. ధర్మబోధన, ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం కాకుండా ఆయా కాలపు దేశీయ ఆచారాలు, వ్యవహారాలు, సాంఘిక, మత, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను యీ యక్షగానాలు కళ్ళకు కట్టాయి. విద్వాంసుల కీర్తి కండూతి, స్త్రీ వ్యామోహం, పామరస్త్రీల అమాయకత్వం, సుంకరుల దౌర్జన్యం చివరికి సవతుల కయ్యాలను సైతం యివి చిత్రించాయి.

గ్రామీణుల ఉత్సాహం, సామాజిక స్పృహ, సోదరభావం యీ ప్రక్రియ ఊపందుకోవడానికి దోహదపడగా-వారిలోని గ్రహణశక్తిని, ధారణశక్తిని యక్షగానాలు పెంపొందించాయి. కొందరు విమర్శకులు వ్యాఖ్యానించినట్లు-నైజాం ప్రాంతంలో హైందవ సంస్కృతి పునరుజ్జీ వనంలో యక్షగానాల పాత్ర విస్మరించలేనిది.

డా|| మొరంగపల్లి శ్రీకాంత్‌కుమార్‌

Other Updates