|

4జీ- జీవిత వేగాన్ని మారుస్తుంది

నాణ్యత, బ్రాడ్‌బ్యాండ్‌ విప్లవం ఓ క్రొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. ప్రభుత్వం, గ్రామాలలో బ్రాడ్‌ బ్యాండ్‌ ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి 4 జీ ఉపయోగపడుతుంది. 4 జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశమంతట ఈ 4 జీ సేవలు విస్తృత వాడకానికి రంగం సిద్ధం అవుతోంది. వీటిని నిర్వహించే రిలయన్స్‌ జియో ఇన్ఫోకాం (ముఖేష్‌ అంబానీ సంస్థ) వీటిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ”ట్రైల్‌రన్‌” జరుపుతోంది. హైదరాబాదులో అక్టోబర్‌ 7 నుండి జరిగిన మెట్రో పాలిస్‌ (ప్రపంచ నగరాల మేయర్ల సదస్సు) ప్రతినిధులు ఈ 4 జీ సేవల ద్వారా వైఫై తిలకించారు.. తెలంగాణాలోని వరంగల్‌ నగరం మొట్టమొదటి డిజిటల్‌ నగరంగా రూపుదిద్దుకోవటానికి ముస్తాబవుతోంది.

ప్రస్తుతం ఉన్న 3 జీ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ కంటే పదింతలు ఎక్కువగా ఈ 4 జీ వేగం వుంటుంది. లాంగ్‌ టర్మ్‌ ఈవాల్యుయేషన్‌ అని వ్యవహరించే ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం అమెరికా తరువాత భారతదేశంలోనే వినియోగానికి సిద్ధమవుతోంది. ఈ టెక్నాలజీ ద్వార టెలివిజన్‌ చానల్స్‌ను హై డెఫినిషన్‌ టెలివిజన్‌ (హెచ్‌.డి.టి.వి.) నాణ్యతతో కూడిన చిత్రాలను చూసే అవకాశం వుంది. 16 హెచ్‌.డి. చానల్స్‌, 100 కి పైగా టీ.వి. చానల్స్‌తో 400 కి పైగా చిత్రాలతో ఓ క్రొత్త అను భూతిని ఈ 4 జీ అందిస్తుంది. కావాలనుకుంటే ఏ ఛానల్‌ నైన వారం రోజుల పాటు రికార్డు చేసుకుని, మొబైల్లో భద్రపరుచుకోవచ్చు. మొబైల్‌ ఫోన్స్‌ అధికంగా వున్న దేశాలలో చైనా అగ్రస్థానంలో వుంది. భారత్‌ రెండు, అమెరికా మూడవ స్థానంలో వున్నాయి. మన దేశంలో 120 కోట్ల జనాభాకు, 96 కోట్లకు పైగా మొబైల్‌ ఫోన్స్‌ ఉన్నాయి. అయితే అమెరికా, చైనాలతో పోల్చుకుంటే మన దేశంలోస్మార్ట్‌ ఫోన్స్‌ వాడకం తక్కువగానే వుంది. 4 జీ టెక్నాలజీ వస్తుండడంతో, దేశంలోని యువతరం క్రమంగా స్మార్ట్‌ ఫోన్స్‌ వైపు ఎక్కువ మక్కువ చూపెడుతున్నారు.

4 జీ ఉపయోగాలు:

 • విద్య: 4జీ వేగంతో ఒక టీచర్‌ కొన్ని వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా క్లిష్టమైన విషయాలను విశదీకరించవచ్చు.
 • టెలిమెడిసిన్‌: ప్రముఖ నగరాలలో వుండే నిపుణులైన డాక్టర్లు మారుమూల ప్రాంతాలలోని ప్రజల ఆరోగ్యపరిస్థితిని సమీక్షించే వీలుంది. వర్చ్యువల్‌ ఆపరేషన్‌ థియేటర్‌, నిజమవుతుంది. ఉదాహరణకు ఒక హృద్రోగికి ఎంతో దూరంలో ఉన్న డాక్టరు, 4 జీ ద్వారా అత్యవసర సేవలను అందిస్తారు.
 • గ్రామాల అనుసంధానం: గ్రామాలకు, పట్టణాలకు గల దూరం 4 జీ తో దగ్గరవుతుంది. ఏ సమాచారం కావాలన్నా, క్షణాలలో గ్రామాల్లోని రైతులకు లభ్యం అవుతుంది. ఏ విత్తనం వాడాలి. ఏ పంట పండించాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, అదిక దిగుబడి ఎలా సాధించాలి అనే విషయాలపై వ్యవసాయ శాస్త్రజ్ఞులు సలహాలు ఎప్పటికప్పుడు రైతులకు అందజేస్తారు.
 • ఇ-గవర్నెన్స్‌: చిన్న పత్రానికి కూడా ప్రభుత్వం, ప్రైవేటు శాఖల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే ప్రయాస ఇక ఉండదు. ఏ పత్రం కావాల్సినా చిటికలో 4 జీ ద్వారా లభ్యం అవుతుంది.
 • వీడియో గేమ్స్‌: యువతరం ఇష్టపడే వీడియోగేమ్స్‌ ఎంచక్కా మీ మొబైల్‌ లోనే అతివేగంతో మిమ్మల్ని అనంద పరుస్తాయి. ఇంటర్నెట్‌ వేగంగా వుంటే వర్చ్యువల్‌ వరల్డ్‌ సర్వీస్‌ ద్వారా ప్రపంచంలో ఎవరితోనైనా గేమ్స్‌లో తలపడటానికి వీలుంది.
 • న్యూస్‌: ప్రపంచంలో ఎక్కడి వార్తలనైన క్షణాలలో మీ మొబైల్‌ స్క్రీన్‌ పై రావడానికి 4 జీ దోహదపడుతుంది. 4 జీ ద్వారా మీకు కూడ సిటిజెన్‌ జర్నలిస్ట్‌గా వార్తా చిత్రాలను చానల్స్‌కు, హెచ్‌.డి. క్వాలిటీలో పంపించే సదుపాయం వుంది.
 • బిజినెస్‌ సమావేశాలు: వ్యాపార నిమిత్తం సమావేశాలకు దూరప్రాంతాలు వెళ్ళనవసరం లేదు. 4 జీ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం వుంది. ఎక్కడి నుంచైనా వ్యాపార లావాదేవీలు నిర్వహించే అవకాశం ఈ టెక్నాలజీ కలిపిస్తోంది.
 • రిమోట్‌ కంప్యూటర్స్‌: మీరు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేలోపు, మీ రిమోట్‌ కంప్యూటర్‌ను, 4 జీ మొబైల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకొని, ఇంట్లో పనులు టీమ్‌ వ్యూయర్‌ ద్వారా చేసుకోవచ్చు.
 • ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌: వీడియో, ఆడియో చక్కటి నాణ్యతతో 4 జీ అందిస్తుంది. లైవ్‌ స్ట్రీమింగ్‌ వీడియో ఎటువంటి అడ్డంకులు లేకుండా చిత్రాలను చూసే అవకాశం వుంది.
 • మీడియా స్టోరేజి: పెద్ద సైజు మీడియా ఫైల్స్‌, గ్రాఫిక్స్‌, వీడియో ఎడిటింగ్‌ 4జీ ద్వారా సులభంగా చేసుకునే వీలుంది. భద్రపరుచుకోవటానికి ఎక్కువ ప్రదేశాన్ని కూడా అందిస్తుంది.
 • నావిగేషన్‌: వాహనాలు నడిపేవారికి, కమ్యూనికేషన్‌ రంగంలోని వారికి 4 జీ అత్యున్నత సేవలు, వేగం అందిస్తుంది. వర్చ్యువల్‌ డ్రైవింగ్‌ అనుభూతి ఒక్కడ చూడవచ్చు.

ఈ 4 జీ టవర్ల నిర్మాణం, తెలంగాణాలో ప్రభుత్వ అనుమతితో అనేక చోట్ల అత్యంత వేగంగా సాగుతోంది. అయితే అక్కడక్కడ అవగాహనా లోపం వల్ల టవర్ల నిర్మాణాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు. ఈ టవర్ల వల్ల రేడియేషన్‌ ఇబ్బందులు ఉండవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. నిబంధనలకు అనుగుణంగా టవర్ల నిర్మాణం ఉందని, నాన్‌ ఐనైజింగ్‌ రేడియేషన్‌ తరగతికి చెందిన ఈ టవర్లు ఎటువంటి హాని కలిగించవని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్‌ తేల్చి చెప్పింది. అత్యున్నత న్యాయస్థానంతోపాటు, అనేక హైకోర్టులు ఈ టవర్ల ద్వారా ప్రమాదం వుందని రుజువు కాలేదని తీర్పునిచ్చాయి. ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ కూడ టవర్స్‌ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగవని, ఆరోగ్యం దెబ్బ తినదని పదేపదే చెపుతున్నారు.

అందరికీ అందుబాటులో రానున్న ఈ ఫైబర్‌ ఆప్టికల్‌ డైరెక్ట్‌ టు హోం 4 జీ ద్వారా మన జీవిత వేగం, ఊహించని రీతిలో సాగిపోతుంది. తెలంగాణా ఆర్థికాభివృద్ధికి, ఈ బ్రాడ్‌ బ్యాండ్‌ విప్లవం దోహదపడుతుంది.