ఆయిల్ పామ్‌కు ఉజ్వల భవిత
By: సందీప్ రెడ్డి కొత్తపల్లి

సాగునీటి నుండి పంటల సాగు వరకు, రైతుబంధు సమితుల నుండి రైతు వేదికల ఏర్పాటు వరకు, రైతు ఉత్పత్తి సంఘాల నుండి ఫుడ్ పార్కుల ఏర్పాటు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ రంగం పూర్తి ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రైతు రాజు కావాలన్నది గత ప్రభుత్వాల మాదిరిగా నినాదాలకు పరిమితం కాదు తెలంగాణ ప్రభుత్వ విధానం అని, రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండిరచాలని, పంట మార్పిడికి రైతులను ప్రోత్సహిస్తోంది. సాంప్రదాయ పంటల సాగు నుండి రైతులు బయటకు రావాలని నిరంతరం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల అధ్యయనానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌ను ప్రవేశపెట్టింది.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలు, మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పప్పు దినుసులు, నూనె గింజలు, పత్తి సాగు వైపు దృష్టి సారించాలని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యతను ఇస్తుంది. దేశ ప్రజల అవసరాలకు గాను ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె అవసరం. కానీ దేశంలో ఏడు మిలియన్ టన్నుల నూనె ఉత్పత్తి అయ్యేంత నూనె గింజలను మాత్రమే సాగు చేస్తున్నాం. దేశ అవసరాల కోసం యేటా 70వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు మీద దృష్టి పెట్టింది. దేశ అవసరాలకు సరిపడా పామాయిల్ కావాలంటే ఆయిల్ పామ్ సాగు 80 లక్షల ఎకరాలలో చేపట్టాల్సి ఉంది.. కానీ దేశంలో 8లక్షల ఎకరాలే సాగవుతోంది. తెలంగాణ అవసరాలకు దాదాపు 3.66లక్షల టన్నుల పామాయిల్ అవసరం. ప్రస్తుతం 38 వేల టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
ఆయిల్ పామ్ సాగును పెంచే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సర్వే నిర్వహించగా రాష్ట్రంలోని 25 జిల్లాలలోని నేలలు, వాతావరణం ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌పామ్ సాగు మీద దృష్టి సారించి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పెంపుకు అనుమతించింది.
మొదట రాష్ట్రంలోని నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్ధిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్లగొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ, ఉద్యానశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించే క్రమంలో ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతాంగానికి ఉపాధిహామీ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసర మైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది. రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ వద్ద పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే ఖర్చులు భరించి ఆయిల్ పామ్ క్షేత్రాల పర్యటనకు తీసుకువెళ్తుంది.
సాగునీటి కల్పన, వ్యవసాయానికి ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమా వంటి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణలో సాగు అనూహ్యంగా పెరిగిపోయింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి కోటి పై చిలుకు ఎకరాలలో 3కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావడం గమనార్హం. ఈ యాసంగిలో ఏకంగా 92లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి తెలంగాణ అందించింది. సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో నూనెగింజల పంటల డిమాండ్ గమనించి ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడం జరుగుతోంది. దేశంలో 39.90 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. అయితే దేశంలో వ్యవసాయ రంగం నుండి వస్తున్న ఉత్పత్తులలో సమతుల్యత లేదు. వస్తున్న పంటలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? మన పంటలను ఎగుమతి చేస్తున్నామా? ఏఏ పంటలు సాగవుతున్నాయి? అన్న విషయంలో రైతాంగానికి స్పష్టత ఉండాలి అన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. దిగుబడి అవుతున్న పంటలు అవసరాలకు మించి ఉండడంతో భవిష్యత్‌లో రైతులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దేశంలోని వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు అందించాల్సిన అవసరం ఉండడమే కాకుండా.. దేశంలో వ్యవసాయరంగం బలోపేతం చేయడం ద్వారానే అత్యధిక శాతం జనాభాకు ఉపాధి కల్పించగలిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ రంగానికి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

ఆయిల్ పామ్ సాగు – ముఖ్యాంశాలు

– ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు.
– దేశంలో ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నాయి. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయడం మేలు.
– భారతదేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి. కానీ దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. ప్రతీ యేడాది 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతీ ఏడాది 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
– తెలంగాణలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. కాబట్టి ఆయిల్ పామ్ కు నిరంతర నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవు.
– ప్రస్తుతం రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతున్నది.
– నాలుగేళ్ల పాటు ఆయిల్ పామ్ మొక్కల మధ్యన అరుతడి పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాలుగో ఏడాది నుంచి ఆయిల్ పామ్ పంట వస్తుంది. 30 ఏళ్ల వరకు దిగుబడి ఉంటుంది
– ఆయిల్ పామ్ తోట చుట్టూ టిష్యూ కల్చర్ టేకు, శ్రీగంధం సాగు చేయవచ్చు.
– అన్ని నూనె గింజల్లోకెల్లా ఆయిల్ పామ్ దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎకరానికి 15 నుండి 20 టన్నుల గెలలు వస్తాయి.
– ఎకరానికి రైతుకు ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది.
– మొదటి నాలుగేళ్లు ఒక్కో ఎకరానికి రూ.60 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వ సబ్సిడీగా ఉంటుంది.
– ఈ పంటకు కోతులు, అడవి పందుల, రాళ్లవాన, గాలివాన బెడద ఉండదు.
– ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు విధిగా మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానం చట్టంలోనే పొందు పరిచారు.
– ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలల దర టన్నుకు రూ. 19,100 ఉంది. ఇది ప్రతీ ఏటా పెరుగుతుందే తప్ప తగ్గదు.
– రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌తో పాటు 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ స్వంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టబోతున్నాయి. ప్రతీ కంపెనీకి సాగు చేసే ప్రాంతాలను జోన్లుగా విభజించి, వారికి అప్పగించడం జరిగింది.
– నీటి వసతి, ఆయిల్ పామ్ సాగుకి అనువైన నేలలు కలిగి ఉన్న రైతులను ఉద్యాన శాఖ సహకారంతో కంపెనీలు ఎంపిక చేసుకోవాలి.
– రైతులకు మేలైన ఆయిల్ పామ్ మొక్కలను సరఫరా చేసే బాధ్యత కంపెనీలదే.