తెలంగాణ ప్రాచీన మహా నగరాలు – అలంపురం

By: డా॥ సంగనభట్ల నర్సయ్య

ఈ ప్రాచీన తెలంగాణ మహానగరం తుంగభద్ర పడమటి తీరాన నది ఒడ్డున గల నగరం. పశ్చిమ చాళక్యులలోని ఒక శాఖ రాజవంశం రాజధానిగా చేసికొని పాలించిన మహోన్నత సుందర నగరం. ఈ సౌందర్యానికి ప్రధాన కారణం ఇక్కడి నవబ్రహ్మాలయాలు కృష్ణ, తుంగ భద్రల నడిమి సీమగా దీనికి ‘నడిగడ్డ సీమ’ అని కూడా పేరుంది.

ఈ ప్రాచీన తెలంగాణ మహానగరం తుంగభద్ర పడమటి తీరాన నది ఒడ్డున గల నగరం. పశ్చిమ చాళక్యులలోని ఒక శాఖ రాజవంశం రాజధానిగా చేసికొని పాలించిన మహోన్నత సుందర నగరం. ఈ సౌందర్యానికి ప్రధాన కారణం ఇక్కడి నవబ్రహ్మాలయాలు కృష్ణ, తుంగ భద్రల నడిమి సీమగా దీనికి ‘నడిగడ్డ సీమ’ అని కూడా పేరుంది.

కర్ణాటకలో వాతాపి రాజధానిగా చేసుకొని పాలించిన చాళుక్య రాజవంశం సుమారు 400 సంవత్సరాలు తెలుగు కన్నడ సీమలలోని వివిధ ప్రాంతాలలో విస్తతరించి రాజ్యాలేలింది. దానిలో ఒక శాఖకు అలంపురం రాజధాని. అలంపురం రాజధానిగా పాలమూరు, కందనవోలు ప్రాంతాలు వీరి ఏలుబడిలోనికి వచ్చినవి. ఇదేనడిగడ్డ సీమ రాజ్యం అన్నారు. ఒకనాడిది రాయచూరు జిల్లాలో ఉండేది. నేడది పాలమూరు జిలాకు చెందిన పట్టణం. ఇది శ్రీశైల పడమటి  ద్వారం అని  పేరు  వడిసింది. పశ్చిమ చాళుక్యులు అయినహోళు, పట్టడకల్లు, బాదామి (వాతాపి యాత్రాస్థలం) రాజధాని నగరాలలో పర్వతసానువుల్లో సుశోభితంగా ఆలయాలు నిర్మించిన తిలుత వీరిని బాదామి చాళుక్యులని, తరువాత కళ్యాణి చాళుక్యులని అన్నారు. ఈ రాజవంశాలు, ఇదే కాలాన ఇక్కడ  నవబ్రహ్మాలయాలు నిర్మించారు. 

పశ్చిమ చాళుక్యుల సామంతులు ఆంధ్ర చోళులు అలంపురము రాజధానిగా ఏలినారు. ఈ నగరం చుట్టూ విశాలమైన కోట ఉంది. ప్రతిభువనమల్ల, త్రైలోక్యమల్ల, భువనైకమల్ల ప్రభువులు, ఆరవ విక్రమాదిత్యుడు వీరితో ఈ నగరానికి సంబంధం ఉంది. వీరి సామంతుల శాసనాలు లభిస్తున్నాయి. వీరిలో మహాస్థానాధిపతి ధరణీంద్ర రాశి పండితుడు, సోమేశ్వర రాజ భట్టారకుడు వంటివారున్నారు. వీరు బ్రాహ్మణులుగ కనపడుతున్నారు. సాహిత్య చరిత్రనుబట్టి క్రీ.శ. 16వ శ.లో ఆంధ్రానర్ఘ రాఘువము రాసిన బిజ్జల తిమ్మ భూపాలుడు కూడా ఈ నగరమునేలినాడు. 

దక్షిణ కాశిగా పేరుగాంచిన అలంపురంలో బాదామీ చాళుక్యులు నిర్మించిన నాగర ప్రాసాద రీతిలోని ఆలయాలు 9 ఉన్నాయి. వీటిని నవబ్రహ్మాలయాలు అంటారు. ఇవి ఏకకాల నిర్మాణాలు కావు. క్రీశ. 609లో అధికారం చేపట్టిన రెండో పులకేశి ఈ రాజవంశంలోని ప్రసిద్ధ శూరుడైన ప్రభువు. ఇతని తరువాత మొదటి విక్రమాదిత్యుడు క్రీశ. 654`687, వినయాదిత్యుడు క్రీశ. 687`696, విజయాదిత్యుడు క్రీశ. 696-733, రెండో విక్రమాదిత్యుడు క్రీశ. 733-745 తరువాత రెండో కీర్తివర్మ క్రీశ. 756-755 చాళుక్య రాజ్యంలోని వరుస పాలకులు. ఈ అలంపురం బాదామీ నుండి పాలించే వీరి ఏలుబడిలోనే ఉండేది. వీరిలో విజయాదిత్యుడు ఐదు సంవత్సరాల పాటు 713-718. ఇక్కడ ఆలయాల నిర్మాణాలు గావించినట్టు శాసనాలు అలంపూర్‌లో, తదితర సమీప ప్రాంతాలలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. బాల బ్రహ్మేంశ్వరాలయంలో ఇతని శాసనం చాలా విలువైన సమాచారం ఇస్తోంది. ఇది 72 పంక్తుల సంస్కృత శాసనం. విక్రమాదిత్య, వినయాదిత్య, విజయాదిత్యుల (తాత, తండ్రి,తాను) వివరాలు యుద్దాలు, పరాక్రమాలు, విజయాదిత్యుని గుణగణాలు విస్తారంగా తెలుపబడ్డాయి. ఇతడు అలంపూర్‌లో గరుడ బ్రహ్మ విశ్వ బ్రహ్మాలయాలు కూడా కట్టించాడు.

ఈ నగరానికి ఈ పేరు రావడానికి చెప్పే సంగతుల్లో హలంపురము ఒక పేరు. ఒకానొక చాళుక్య  రాజు దీనికి  హలంపురమని పేరుపెట్టి తనకు రాజధాని నగరంగా చేసుకొన్నాడన్నది మరొక సంగతి. ఈ నగరానికి పక్కన 3కి.మీ. దూరంలో ఉండవెల్లి అనే గ్రామం ఉంది. హేమలాంబ ఇక్కడి స్థానిక దేవం ఈ హేమలాపురమే అలంపురమైందని మరిఒక గాధ.

ఈ నగరానికి దగ్గరలో తక్కశిల (తక్షశిల) అనే గ్రామం ఉంది. ఇది బౌద్ధులు తక్షశిల నుండి ఆ నగరం శిథిలంలో అయ్యాక వచ్చి, ఇక్కడే బసచేసి ఆ గ్రామనామం దీనికి ఉంచారని స్థానిక గాథ.

గురజాల బ్రాహ్మీ శాససంలో క్రీ.శ. 3వ శతాబ్దంలో హలంపురమని, కాలచుర్య రాజుల శాసనాల్లో అలంపురమని, రాష్ట్రకూట శాసనాల్లో అళంపురమని, కళ్యాణీ చాళుక్యుల శాసనాల్లో బ్రహ్మపురమని (నవ బ్రహ్మాలయాల నిర్మాణం కారణంగా) విజయనగర శాసనాల్లో హేమలాపురమని ఇంకా అనేకంగా పేర్లున్నాయి. ఎల్లమ్మ దేవత (జోగులాంబ) వెలసిన కారణంగా ఎల్లమ్మ పురమని దీనికి సంస్కృతీకరణమే హేమలాపురంమని స్థానిక పండితులు అభిప్రాయపడ్డారు. షా అలీ  కారణంగా అలీపురం అలంపురమైందనే ఒక వాదన ఉన్నా అది సత్యదూరం. 16వ శతాబ్దం  వాడైన ఇతని పేరిట 2వేల సంవత్సరాల  నాటి గ్రామం పేరుండటం అసమంజసం. దీనికి విద్యాపురి అని కూడా పేరుంది. అది  విద్యలకు కేంద్రమైంది. ఈనాటి పురాతత్త్వ శాఖ వారి ప్రదర్శనశాల నిలిపిన ఒక రాతి  మందిరం నాడు విద్యాపీఠంగా ఉండేది.

ఈ నగరంలో జోగుళాంబ దేవి తోటలో జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలంనాటి నాణెములు లభించాయి. పూతవేసిన మట్టి పాత్రలు, ఇటుకలు, గాజులు లభించాయి. అతి ప్రాచీనమైన ఈ నగరానికి దగ్గరలోని రాయచూరు జిల్లాలోని ‘మాస్కి’లో అశోకుని శాసనం లభించింది. పై తక్షశిలా నగరాన్ని పరిగణిస్తే మౌర్యుల కాలం నుండే ఈ ప్రాతం చారిత్రక ప్రసిద్ధిగలదనవచ్చు. అలంపురం కదంబుల మూల స్థానమని గడియారం రామకృష్ణశర్మ అభిప్రాయం. వీరు వనవాసి (బనవాసి) రాజధానిగా అలంపురం ఏలారని, వీరిని ఓడిరచిన పశ్చిమ (బాదామీ) చాళుక్యులకు ఈ అలంపురం తరువాత ముఖ్య పట్టణమైందని ఒక అభిప్రాయం. ఈ బాదామీ చాళుక్యుల కాలంలోనే నవబ్రహ్మాలయాల నిర్మాణం క్రీ.శ. 6,7 శతాబ్దులలో జరిగింది. దీనికి సాక్ష్యం బాదామీ చాళుక్యల విజయాదిత్యుని స్వర్గ బ్రహ్మాలయ శాసనాన్ని పేర్కొనవచ్చు. వీరి తరువాత రాష్ట్ర కూటుల ఏలుబడిలోనికి వచ్చింది. రాష్ట్ర కూట ధారావర్షుని ప్రథమ రాజ్య కాల శాసనం మహాద్వార కుడ్యంపై లభించడమే ఇందుకు ప్రబల సాక్ష్యం. కళ్యాణి చాళుక్యుల ఏలుబడిలో ఈ అలంపుర నగరం బాగా శోభించింది. వారికిది ఉపరాజధాని నగరం. వీరి శాసనాలు ఇక్కడ అనేకంగా అభించాయి.

కళ్యాణి చాళుక్య చక్రవర్తులైన త్రైలోక్య మల్ల, భువనైకమల్ల త్రిభువన మల్ల భక్తవర్తుల కాలంలో వారి దండనాదుల శాసనాలు ఇక్కడ లభిస్తున్నాయి.  అలంపురం పక్కన గల పాపనాశని క్షేత్రంలో విద్యాశాఖ ఒకటి (విద్యాలయం) ఏర్పాటు చేసి దానికి భూ దానం చేసిన 11వ శతాబ్దం నాటి త్రైలోక్య మల్ల చక్రవర్తి శాసనం మంటప స్తంభంపై ఉంది. పశ్చిమ చాళుక్యులకు విద్యాలయాల పై గల శ్రద్ధను వ్యంజించే శాసనమిది. నరసింహ, సూర్య నారాయణాలయాలు, తుంగభద్ర ఘట్టాలు (తీరాల నిర్మాణాలు) వీరి కాలంలోనివే. సూర్యనారాయణాలయంలో కాలచూరి బిజ్జలుని కుమారుడు భుజమల్లుని శాసనం ఉంది. వీరి తరువాత ఈ ప్రాంతాన్ని కాకతీయులు ఏలినారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలపు వీరబలిజల (వర్తకుల) శాసనం ఉంది. జోగులాంబ పక్కనగల వీరభద్రాలయం కాకతీయుల కాలపు నిర్మాణం. తరువాత ఈ నగరంలో ముసునూరు నాయకుల నేతృత్వంలోని అరివీటి దేవరాజు ఈ అలంపురాన్ని గెలిచి, హిందూ దేవాలయాలను నిలిపినాడు. బహుశ ఈ యుద్ధంలోనే షా అలీ అనే ముస్లీం సర్దార్‌ ఓడి చంపివేయబడ్డాడు. ఇతని సమాధి మహాద్వారం వద్ద ముస్లింల చేత పూజలందుకుంటుంది. ఇతడు అలంపురాన్ని స్వల్పకాలం ఏలి ఉండవచ్చు. విజయనగరం ప్రభువుల శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు జయించి అలంపురానికి వచ్చి బాల బ్రహ్మేశ్వరునకు, నారసింహునికి పూజలు చేసి శాసనాలు వేయించినాడు. అతని ప్రతినిధిగా మండలేశ్వరుడు బసవరాజు ఆయనకు ప్రతినిధిగా ఈ అలంపురాన్ని ఏలినాడు.

ఈ అలంపురాన్ని శాసనాల గ్రామంగా పిలువవచ్చు. తీర్థమూ క్షేత్రమూ ఐన ఈ నగరానికి సంబంధించి, సంస్కృత, తెలుగు కన్నడాల్లో ప్రశంసించే సాహిత్యం కూడా చాలా వచ్చింది. తెలంగాణాలో గొప్ప శిల్ప కళాశోభిత ప్రాచీన చారిత్రక నగరమిది.

ఇక్కడ 7 నుండి 17వ శతాబ్దం వరకు పదుల కొద్ది శాసనాలు లభించాయి. నరసింహాలయ జీర్ణోద్ధరణ చేసిన త్రిభువన మల్లుని శాసనం, శ్రీకృష్ణదేవరాయల క్రీ.శ. 1521లో వేయించిన నరసింహాలయ శాసనం, మహాతల వరబ్రహ్మ నాయకుని కూతురు చాకమ్మ వేయించిన శాసనం మొదలగు మిగిలిన శాసనాలు ముందే ప్రస్తావించబడినవి.

వాతాపీ చాళుక్య చక్రవర్తి విజయాదిత్య సత్యశ్రయ పృథ్వీ వల్లభుని శాసనం క్రీ.శ. 63, బాల బ్రహ్మేశ్వరాలయ శాసనం, క్రీ.శ. 1060 నాటి త్రైలోక్య మల్లదేవుని ప్రగ్గడ దానపయ్య శాసనం, బాల బ్రహ్మేశ్వరాల సంబంధంగా 25శాసనాలు, అరవ విక్రమాదిత్యుని రాణి మలయవతీ దేవిశాసనం (1103) (దీనిలో ఈమె అభినవ సరస్వతిగా పేర్కొనబడిరది.) ఇలా అనేక శాసనాలు ఇక్కడ లభిస్తున్నాయి.

అలంపూర్‌లో చారిత్రక నగర చిహ్నంగా కోట ఉంది. కోటలో ఆంజనేయ స్వామి ఆలయం, బసవేశ్వరాలయం ఉన్నాయి.

బాలకుమార,  అర్క, వీర, విశ్వ, పద్మ అనే  ఓషధులతో వైద్యనాథుడైన ఈశ్వరుని పేరిట ఇక్కడ నవ బ్రహ్మాలయాలు  వెలిశాయి.  గరుడ, స్వర్గ, తారక బ్రహ్మల పేరిట మరి  మూడు గుళ్ళు కూడా ఏర్పడ్డాయి. ప్రస్తుత ప్రధానాలయంలో చిన్న గుడిలో కామాక్షి విగ్రహం ఉంది. ఖడ్గ, డమరు, రక్త పాత్ర, త్రిశూలాలు, ధరించిన ఈ అమ్మవెలిసి ఉంది. మహా  మండలేశ్వరుడైన హెమ్మాడి  దేవరాయల ప్రధాని అయిత రాజు, ఈ ఆలయ నిర్మాతగా శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాలు 7,8 శతాబ్దాల నిర్మాణాలు. ద్వారపాలక ప్రతిమ పై భాగంలోగల మరొక శాససం వినయాదిత్య చక్రవర్తి భార్య మహాదేవి పుణ్యం కోసం లోకాదిత్య ఎళా అరసు స్వర్గ బ్రహ్మాలయం నిర్మించినట్టు చెబుతోంది.

దక్షిణ కాశిగా…

ఇది తొలినాళ్ల నుండే సుప్రసిద్ధ శైవ క్షేత్రం. శ్రీ శైలానికి పశ్చిమ ద్వారమని దీనికి ప్రసిద్ధి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబమాతకు గల ఆలయం చాలా ప్రసిద్ధం. బాల బ్రహ్మేశ్వరాలయం చాలా ప్రసిద్ధం. దీని రాజగోపుర ద్వారం చివరి మెట్టు నొరసికొని తుంగభద్రానది పారుతోంది. తొలుత ఓషధులతో నిర్మితం. ఈ లింగానికి ఎన్ని బిందెల నీటితో అభిషేకం చేసినా ఒక నీటి బిందువైనా ఆలయం వెలుపలికి రాదట. రససిద్ధ విఘేశ్వరుడు, గురిగింజమాధవుడు (రాక్షసుని విగ్రహం), ఇవి కాక సూర్యనారాయణాలయం, మహిషాసుర మర్దిని, నరసింహాలయం, వీరభద్రస్వామి ఆలయం ఇవి ఇక్కడి విశేష ఆధ్యాత్మిక కేంద్రాలు.

త్రిపురాసుర సంహారి ఉగ్రశివుడు, గంగావతరణాశిల్పం, శివతాంండవ శిల్పం, శివుడు పార్వతిని ప్రార్థించే శిల్పం అనేక మిథున శిల్పాలు ఎంతో మనోహరంగా ఈ ఆలయాల్లో చెక్కబడ్డాయి. ఇక్కడి ఆలయాల్లో శుకనాసం ఒక ప్రత్యేక నిర్మాణం. శుకనాసం అంటే చిలుక ముక్కు. చిలుక ముక్కువలె గర్భాలయపు పై కప్పు నుండి ప్రధాన మంటప పై భాగాన పొడుచుకొని వచ్చిన ఒక గవాక్ష నిర్మాణం ఇది. గర్భ గుడిలోనికి స్వచ్ఛ వాయువులు పంపే ఏర్పాటు గలది ఈ నిర్మాణం. విశ్వ బ్రహ్మాలయానికి బయటి గోడలకు అద్భుతంగా శిల్పాలనేకం ఉన్నాయి.

ఈ దేవాలయాల్లో బాల బ్రహ్మాలయం నిత్యపూజలతో అలరారుతుంది. ఇక్కడి జోగులాంబ దేవత ఈ ప్రాంతాలలో  ప్రసిద్ధురాలైన దేవతామూర్తి. ముఖలింగేశ్వరుడు. సహస్రలింగేశ్వరుడు, మహిషాసురమర్దని, నరసింహుని  విగ్రహాలు ఇక్కడ శిల్ప శోభితాలు ఈ గోపురాలలో ఉత్కళ గోపుర శైలి కూడా దర్శనమిస్తుంది.

బాదామీ చాళుక్య ప్రభువుల ప్రేరణతో వివిధ కాలాల్లో నిర్మించబడిన ఇక్కడి ఆలయాలు, శిల్పం మనల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. అంతా ఎర్ర రాతి నిర్మాణం. నవబ్రహ్మాలయాలు తొమ్మిదింటితోబాటు మహా ద్వారం మరొక విశేష నిర్మాణం. ఇది  క్రీ.శ. 8వ  శతాబ్దంలో రాష్ట్ర కూట ధారవర్ష ధ్రువ మహారాజు సేనాని బలవర్మ కట్టించి, శాసనం వేయించినాడు. మూడు స్తరాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పాలున్నాయి. శేషఫణ విష్ణుమూర్తి, అంధకార సుహారి, శివమూర్తి, చతుర్ముఖ బ్రహ్మం శిల్పాలు కనువిందుగా ఉన్నాయి. నవబ్రహ్మాలయాలతో బాటు అతి ప్రాచీన మాతృదేవతారాధనా విశేషంగా పూజలందుకొనే జోగుళా(లా)oబాలయం  ఇక్కడ విశేషమైంది.

లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపా మహాబలాం

ప్రేతాసన సమాయుక్తాం జోగుళాంబాం నమామ్యహం 

అని  పురాణ ప్రశస్తి కలదీ దేవతా మూర్తి ఇది.

అతి ప్రాచీనమైన ఈ నగరం మాతృదేవతారాధనా కాలం నుండే ప్రసిద్ధమనాలి. తుంగభద్ర తీరస్థమైన జోగులాంబ గుడితోనే ఈ గ్రామ విశిష్టత ప్రారంభమై అనల్ప శిల్పకళాశోభతో పశ్చిమ చాళుక్య రాజన్యుల రాజసంతో వివిధ రాజవంశాల ఏలుబడిలో ఈ అలంపురం ఉజ్జ్వల వైభవం సంతరించుకొన్నదనవచ్చు. ఇది తెలంగాణకే గర్వకారణమైన 14వందల సం॥ల ప్రాచీన మహానగరం.