మరో వినూత్న పథకం ‘గ్రామ జ్యోతి’

మరో-వినూత్న-పథకం-‘గ్రామ-జ్యోతి’రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధిలో గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని రూపొందించారు.

క్యాంపు కార్యాలయంలో జులై 26న గ్రామీణాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం రూపొందించిన ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమాన్ని 25,000 కోట్ల రూపాయలతో అమలుపరుస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామం అవసరాలను తీర్చడం ప్రభుత్వ ధ్యేయమని, తమ తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టాలో పంచాయతీల ఆధ్వర్యంలో ప్రణాళికలను సిద్ధం చేస్తే, వాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమం క్రింద జనాభా ప్రాతిపదికగా ఒక్కో పంచాయతీ పరిధిలో 2 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు వ్యయపరుస్తారు.

‘గ్రామ జ్యోతి’ కార్యక్రమం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కె.టి.రామారావు నేతృత్వంలో మంత్రి మండలి ఉప సంఘాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌, రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, నీటి పారుదల శాఖా మంత్రి టి. హరీష్‌రావు, అటవీశాఖా మంత్రి జోగు రామన్న సభ్యులుగా ఉంటారు.