ఎల్బ్రస్‌ మంచు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, రాష్ట్రంలోని యువజనులు పర్వతారోహణ వైపు ఎక్కువగా మక్కువ చూపు తున్నట్టుగా వుంది. ఇంతకు ముందు మాలావత్‌ పూర్ణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతా రోహకురాలు. ఈమె అతి పిన్న వయస్సు లోనే ఎవరెస్ట్‌ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 14 సంవత్సరాల పిన్న వయసులో సాహసాన్ని చేసి ప్రసిద్ధి చెందారు. అలాగే అంగోత్‌ తుకారాం పవార్‌, గుంతల తిరుపతి రెడ్డి, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ మొదలైన వారిని ప్రముఖంగా పేర్కొనవచ్చు.

ఇపుడు, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 24 ఏళ్ల అనితారెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సాధారణంగా పర్వతారోహకులు చలికాలంలో సాహసం చేయరు. కానీ అనితారెడ్డి శీతాకాలంలో పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 4,200 మీటర్ల ఎత్తులో పది మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సత్తా చాటారు. దట్టమైన మంచుతో కప్పబడి ఉండే రష్యాలోని 18,510 అడుగుల ఎల్బ్రస్‌ పర్వతాన్ని అనితారెడ్డి అధిరోహించారు. అపూర్వ మైన ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు కావడం విశేషం. డిసెంబర్‌ 4న ప్రతికూల వాతావరణం మధ్య, మైనస్‌ 40 డిగ్రీల చలిలో పర్వతారోహణను ప్రారంభించి, డిసెంబర్‌ 7న అనితారెడ్డి శిఖరంపైకి చేరుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, ఎర్రబెల్లి గ్రామం అనితారెడ్డి స్వస్థలం. పడమటి మధుసూధన్‌రెడ్డి, చంద్రకళ అనితారెడ్డి తల్లిదండ్రులు. తండ్రి జీవనోపాధి వ్యవసాయం, తల్లి అంగన్‌వాడీ టీచర్‌. వీళ్ళు అనితారెడ్డిని ఎంబీఎ వరకు చదివించారు. 2014 నుంచి భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో చేరి, పర్వతారోహణపై శిక్షణ తీసుకుంటున్నారు.

సిక్కిం రాష్ట్రంలోని 4,800 మీటర్ల ఎతైన రీనాక్‌ పర్వతాన్ని 2015లో అధిరోహించారు. 2019లో అదే రాష్ట్రంలోని 6,400 మీటర్ల ఎత్తైన బిసిరాయ్‌ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లడక్‌లోని 6,000 మీటర్ల ఎతైన ఖడే పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఇలా వరుస అధిరోహణల క్రమంలో, రష్యాలో 5,600 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్బ్రస్‌ మంచు పర్వతాన్ని అధిరోహించేందుకు ఆమె గత నెల 28న రష్యా చేరుకున్నారు. ఒక సహాయకుడితో కలిసి ఎల్బ్రస్‌ పర్వత శిఖరంపైకి చేరుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్న అనితారెడ్డి ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాలను అధిరోహించడమే తన లక్ష్యమని చెప్పారు.