అపురూప అనువాద రచన అబలా జీవితం

By: డాక్టర్‌ వి.వి. రామారావు

అనువాదం.. యితర సాహితీ ప్రక్రియల వలెనే, ఓ సృజన కళ. తెలుగు సాహిత్య చరిత్ర మొదలయిందే అనువాదంతో.. కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతం, మన తొలి తెలుగు అనువాద రచన. నన్నయ్యతో శ్రీకారం చుట్టుకొన్న అనువాదం, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా పరిణమించింది. అనువాదాల వల్ల ఇతర ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో  పరిచయం ఏర్పడుతుంది.

అనువాదకులకు ఉభయ భాషల పట్ల పట్టుంటేనే గాని మంచి రచన వెలువడదు. మూల రచనలోని మౌలిక భావాలు తాత్విక చింతన, జాతీయాలు, పద సంపద, ధ్వనిపట్ల సాధికారత వున్నపుడే, అనువాద రచన ఆదరించ బడుతుంది. శబ్దానికి శబ్దం అనువాదమైతే, శబ్దార్థాలను మించిన భావనను ప్రతిబింబిస్తూ రాస్తే అదే అనుసృజనవుతుంది. పి.వి అను వాదాలను పరిశీలిస్తే ఆయన లోతైన అనుసృజన కర్త అని విదితమవుతుంది. అందుకు నిదర్శనం – వారు మరాఠి లోంచి అనువదించిన ‘అబలాజీవితం!’

విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి ‘సహస్రఫణ్‌’ శీర్షికతో అనువదించి, హిందీ ప్రాంతాల వారి, ప్రశంసలందు కొన్న పి.వి., సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆధునిక మరాఠి వాఙ్మయ నిర్మాత హరినారాయణ ఆప్టే విరచిత ‘పణ్‌ లక్ష్యాత్‌ కోణ్‌ ఘేతో’ నవలను అబలా జీవితం శీర్షికతో అనుసృజించి ‘సకలభాషానువాద ప్రవీణ’గా కీర్తినందుకొన్నాడు.

ఆధునిక మరాఠి సాహిత్యంలో హరినారాయణ్‌ ఆప్టే (1864`1919) గారిది సమున్నత స్థానం. ఆయన రాజారామ్‌ మోహన్‌రాయ్‌ వలె సంఘ సంస్కర్త, పత్రికా సంపాదకుడు. నవల, కథ, కథానిక మొదలగు పలు ప్రక్రియలలో రచన చేసిన విశిష్ట సాహితీవేత్త. అంతవరకు అభూతకల్పనలు, పౌరాణికాంశాలతో రచన చేసే విధానానికి స్వస్తి చెప్పి, సామాజిక సమస్యలను యితివృత్తంగా తీసుకొని నవలలు రాసిన తొలి రచయిత. ‘కర్మణూక్‌’ (మనోరంజన్‌) పత్రికను స్థాపించి, 28 సంవత్సరాల పాటు నిర్వహించి, దాని ద్వారానే తన పద్దెనిమిది నవలలు ప్రచురించారు. ఆయన జర్మన్‌, ఫ్రెంచి, తదితర భాషలలో ప్రావీణ్యం సంపాదించి, ఆ సాహిత్యాలలోని విలువలను మరాఠిలో పరిచయం చేశాడు. సామాజిక తత్త్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణశీలిగా అభ్యుదయ కాంక్షిగా ఆప్టే ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

1890లో ‘కర్మణూక్‌’ వార పత్రికను స్థాపించి, ప్రారంభ సంచికలోనే ‘పణ్‌ లక్ష్యాత్‌ కోణ్‌ ఘేతో’ నవలను ధారావాహికగా ప్రచురించారు. ఈ నవలను పి.వి. తనకు తానుగా పూనుకొని అనువదించలేదు. 1964లో ఆప్టే శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి కోరిక మేరకు, పి.వి. కేవలం నెలరోజులలో అనువదించారు.

మరాఠిలో ‘పణ్‌ లక్ష్యాత్‌ కోణ్‌ ఘేతో’ అనగా ‘‘కానీ, ఎవరు పట్టించుకుంటారు’’ అని అర్థం. ఈ శీర్షికతో నవలను అనువదిస్తే నిజంగానే ఎవరూ పట్టించుకోరు. పి.వి. విజ్ఞతతో ‘అబలా జీవితం’ అని పేరు పెట్టి యితివృత్తానికి న్యాయం చేశారు.

అబలా జీవితం, యితివృత్తం, 19వ శతాబ్దం ఉత్తరార్థ కాలం నాటిది. కథా కేంద్రం, మహారాష్ట్ర లోని పూనె, ముంబాయి నగరాలు, వాటి పరిసర పల్లె ప్రాంతాలు. నిరక్షరాస్యత మూఢ నమ్మకాలు, సాంఘిక దురాచారాలతో, జాతి యావత్తు చీకటిలో వున్న కాలమది. అందున, భారతీయ సగటు స్త్రీ ముళ్ళ వంటి ఆంక్షలు భరిస్తూ, పురుషాధిక్య సమాజ పంజరంలో బందీ అయ్యింది. అలాంటి దయనీయ స్థితిలో గల స్త్రీల, స్వేచ్ఛ కోసం, ఆప్టే రాసిన నవల యిది.

‘అబలా జీవితం’ ఒక వాస్తవ గాధే! హరినారాయణ ఆప్టే, తన మిత్రునికి తెలిసిన యమున యొక్క విషాద వృత్తాంతాన్ని నవలగా చిత్రించారు. యమునే తన ఆత్మకథను రాసి, ఆమె అన్నయ్య గణపతి రావుకు అందించి కన్ను మూస్తుంది. గణపతి రావు అందించిన కథనే ఆప్టే, ఆమె స్వీయగాథను నవలగా రూపొందించారని ముందు మాటలో స్వయంగా తెలిపారు.

పి.వి. తెలుగు అనువాదాన్ని, సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, వారి పక్షాన ఠాగూర్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ హైదరాబాద్‌ వారు 1964లో ప్రచురించారు. దాదాపు 700 పైచిలుకు పేజీలతో వున్న యీ నవల, పి.వి. మరాఠి భాషా ప్రావీణ్యానికి, తెలుగు అనువాద నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.

నవల, ప్రధానంగా ‘న స్త్రీ స్వాతంత్య్ర మర్హసి’ అన్న శ్లోక పాదాన్ని ధ్వనిస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని అబలకు అడుగడుగున ఎదురయ్యే అవరోధాలను చూపిం చింది. స్త్రీ విద్య, బాల్యవివాహాలు, వితంతువుల దుస్థితి మొదలైన అంశాలను స్పృశిస్తూ కథ సాగుతుంది. అయితే, నవల చదువుతుంటే , సంఘ సంస్కరణలకు సంబంధించిన కథయనే ఆలోచనే స్ఫురించదు.

సాధారణంగా సామాజక సమస్యలు, సాంఘిక దురాచారాలను యితి వృత్తంగా తీసుకొని రాసే కథలను, తీవ్ర భావోద్వేగాలు, అధిక్షేపం వ్యంగ్యాదులతో రచించడం చూస్తుంటాము. అబలా జీవితం లో ఎలాంటి ఉద్వేగాలు, ఉద్రేకాలకు తావీయకుండా కథను నడిపించారు. ఉత్తమపురుషలో సాగిన యీ రచన మానవ జీవనసం వేదనలను సంతోష సంరంభాలను సహజంగా ఆవిష్కరించింది.

కథాపరంగా యమున మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె తండ్రి బ్రిటిష్‌ వారి కొలువులో చిరుద్యోగి. అయనది కరడు గట్టిన వ్యక్తిత్వం. ఆయన దృష్టిలో ఆడపిల్లలు ఎలా చెబితే అలా మసలుకోవలసిన మరబొమ్మలు! ఆయన నిరంకుశ ఛత్రం నీడన, కఠిన ‘క్రమశిక్షణ’లో యమున బాల్యం గడిచింది. తల్లి మాత్రం మూర్తీభవించిన సహనశీలి. ఆమెలోని సాత్వికత, శాంతం, ధీరత్వమే యమునకు స్ఫూర్తినందించాయి. యమున అన్నయ్య గణపతిరావు విద్యా వినయ సంపన్నుడు. చెల్లెల్ని ప్రాణ సమానంగా చూసుకొనేవాడు. తల్లి అకాలమరణం, తదుపరి తండ్రి రెండో పెళ్లి చేసు కోవడం, తన ఈడు అమ్మాయే తనకు సవతితల్లిగా వచ్చి, అజమాయిషీ చెలాయించడంతో యమున జీవితం పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టవు తుంది. అదృష్టవశాత్తు బొంబాయికి చెందిన ఉన్నతాదర్శాలు గల విద్యావేత్త రఘుపతిరావుతో పెళ్లి జరుగుతుంది. యమున బొంబాయికి వెళ్ళాక కొత్త సాంసారిక జీవితం మొదలవుతుంది. భర్త ప్రోత్సాహంతో చదవడం, వ్రాయడం నేర్చుకొని అనతి కాలంలోనే సభ్య సమాజంలో వేదికలపై ప్రసంగించే స్థాయికి వస్తుంది. భర్త స్నేహితుల భార్యలు, యమున అభ్యున్నతికి ఎంతో పాటుపడతారు.

యమున జీవితం సరిగ్గా శిఖరాగ్రం చేరబోతున్నదనగా, ఆమె భర్త రఘునాథరావు మరణిస్తాడు. దాంతో ఆమెతో పాటు ఆమె అదర్శాలు అగాథంలో పడిపోతాయి.

నవల ప్రారంభంలోనే… ‘‘నేనొక అద్వితీయ వ్యక్తిని కాను, నా చరిత్రనే మరో పది మంది స్త్రీల చరిత్రగా భావించవచ్చు. ఏవో కొన్ని సంఘటనల వ్యత్యాసం మిన హాయించి, మా స్త్రీ జాతి చరిత్రంతా ఒకే ఫక్కీన నడుస్తుందంటె అతిశయోక్తి కాదనుకొంటాను’’ – అని యమున వివరిస్తుంది (అబలా జీవితం – పుట 26) స్త్రీ జాగృతం కావాలన్న అభిప్రాయం, యమున మాటలలో ద్యోతకమవుతుంది.

భర్త మరణించడంతో యమున తిరిగి అత్త వారింటికి చేరుకుంటుంది. బొంబాయిలో ఆమె భర్త సాహచర్యంలో సంస్కారం ఉన్మీ లించబడినది. స్నేహితురాళ్ళైన యశోద, లక్ష్మీబాయిల వలన వ్యక్తిత్వం వికసిం చింది. కాని అత్తవారింట్లో మూర్ఖమైన హేయమైన ఆంక్షల వల్ల యమున మళ్ళీ దురాచారాల పంజరంలో బందీ అవు తుంది. ఆమె ప్రతిఘటనలు, రోదనలు లెక్కచేయ కుండానే శంకరం మామ, ఆమెకు శిరోముండనం చేయి స్తాడు. స్త్రీ ప్రగతి కోసం ఉద్యమిద్దామనుకొన్న యమున, షాక్‌లోకి వెళ్ళి, మానసిక రోగిగా మారుతుంది. చెల్లెలి దుస్థితికి కుమిలిన గణపతి ఆమెను పూర్వస్థితికి తీసుకు వస్తాడు. అప్పుడే తన ఆత్మకథను రాసి చివరి ఘట్టంలో అన్నయ్య చేతిలో పెట్టి కన్ను మూస్తుంది యమున.

అబలాజీవితం ఆద్యంతం యమున స్వగతంలో సాగుతుంది. ఇందులోని వ్యక్తుల భావోద్వేగాలు, అనుభూతులు ఈర్ష్యా ద్వేషాలు, ప్రేమానురాగాలు మొదలైన మానసిక స్థితులు అతి సహజంగా చిత్రింపబడినాయి.

మూల రచనలోని కథనానికి, అచ్చతెనుగు జీవన సౌందర్యాన్ని జోడిరచి, అనువాద ప్రజ్ఞతో నవీన కథన శిల్పంలో, పి.వి. ఎంతో హృద్యంగా కథను ఆవిష్కరించారు. కథా కాలం నాటి పల్లీయ వాతావరణాన్ని, పట్టణ సంస్కృతిని మానవ సమాజం తీరు తెన్నులను, నిశితంగా చిత్రించారు. ముఖ్యంగా పల్లెలో గడిపిన బాల్యం తాలూకు స్మృతులతో పాఠకులు మమేకమవుతారు. బిళ్ళంగోడు ఆటలు, బొమ్మల పెళ్ళిళ్ళు, మొగుడు పెళ్ళాల ఆటలే నాటి కాలంలోని పిల్లల క్రీడా, వినోదాలు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పిల్లలైతే మొక్కజొన్న కర్రల బెండుతో చిన్న బండ్లు తయారు చేసుకోవడం, కాలువలలో కాగితం పడవలు వేసి గంతులు వేయడం వంటి అంశాలను పి.వి. చిత్రించారు.

నవలలో పి.వి. జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన తాత్విక చింత నను తెలియజేస్తాయి. యమున స్వగతంలో ‘‘ఆశ నిరాశలతో ఈ ప్రపంచ మెలా నిబిడీకృతమై ఉందో అడుగడుగునా తేట తెల్లమవుతుంది. ఒక్కోప్పుడు అన్నీ కలిసి వచ్చి అనుకొన్నట్లే జరుగుతుంది. అందుకు సంతోషిస్తాం. వెంటనే ఏవో విఘ్నాలు రావడం… దాంతో మొదట కలిసి వచ్చిందంతా ఛిన్నాభిన్నమై పోవడం జరుగుతుంది. అసలు మానవ జీవితమంటేనే ఆశ నిరాశల గుంజులాట’’ (అబలాజీవితం-పుట-269) అని వెల్లడిరప జేశారు.

నవలలో జరిగిన సంఘటనలను బట్టి కథ స్వాతంత్య్రోద్యమ కాలంలో, యించుమించు 1890 దశకం నాటిదిగా భావించవచ్చు. అప్పటికే దేశంలోని ప్రధాన నగరాలు రైల్వేలతో అనుసంధానమయ్యాయి. నగరాలలో జట్కా, గుర్రపు బగ్గీలే ప్రధాన ‘రవాణా వాహనాలు.’ నగరాలు విద్యుచ్ఛక్తితో మెరిసినా, పల్లెలు మాత్రం దివిటీ వెలుగుల్లోనే మిణుకు మిణుకుమంటూ వుండేవి.

అబలాజీవితంలో మనల్ని ఆకట్టుకొనేది, పి.వి., భాష. పలుకుబళ్ళు.. లోకోక్తులు… తెలంగాణాకే పరిమితమైన ఎన్నో పదబంధాలు, భావ చిత్రాలు సందర్భోచితంగా ప్రయోగించారు. ‘మాసర’ (sample) అనే పదం ఏనాడో మరుగుపడిరది. నేడు, షాంపిల్‌ అనే ఆంగ్ల పదాన్నే వాడుతున్నాం. ‘గుంజుకు పోయిండు’ అనే క్రియా పదం నేటికినీ తెలంగాణలో ‘లాక్కెళ్లాడు’ అను దానికి వాడుతుంటారు. గలీజు (అపరిశ్రుభం), ఠావులు (తెల్ల కాగితాల కట్ట), ‘మంకు’ మనిషి (మొండి మనిషి).. యిలాంటి పదాలు కోకొల్లలు… తెలంగాణకే పరిమితమైన ‘ఉప్పుడు పిండి’ వంటకం గురించి ఒక చోట (పుట267) ప్రస్తావించి తన ‘రుచు ల’ను, అభిరుచులనూ కూడా నెమరు వేసుకొన్నాడు పి.వి.

పి.వి. కొన్ని లోకోక్తులను ఎంతో చతురతతో వాడారు. ‘ముందే ముక్కిడి అందునా పడిశం’(పుట 282) బట్ట కాల్చి వేయడం (పుట 283) మోదుగకు మూడే ఆకులు (పుట 345) ‘నమ్మిన బఱ్ఱె పోతు దూడను కనుట (పుట 457) ‘కొడుకును కన్నది కాని వాడి కర్మను కన్నదా?’’ (పుట 637) ఒక్క మెతుకుతో అన్నమంతా పరీక్షించవచ్చు (పుట 530) ‘కన్ను మనదే వేలు మనదే’ (పుట 558) ‘రోజూ చచ్చే వాడికి ఎవడు ఏడుస్తాడు (పులు 339) పొట్టలో కాకులు కూస్తున్నాయి. (పుట 17) – ఇలాంటి జాతీయాలను ప్రయోగించి, పి.వి. కథను తెలుగు సమాజానికి సన్నిహితం చేశారు.

అనుభవసారంతో నిండిన సుభాషితాలను కూడా పివి. అకడక్కడా ఉటం కించారు. ‘మితిమీరిన సంతోషం మహాదుఃఖాన్నిస్తుంది (పుట.59) ప్రేమలో శాశ్వతత్వమే ఎక్కువ (పుట 237) పరాధీనమైన బ్రతుకు పుస్తకాధీన విద్య నిరర్ధకం (పుట.341) మొదలగునవి, కేవలం ఉదాహృతాలు.

నవలలో హరినారాయణ ఆప్టే అభ్యదయ దృక్పథాన్ని హేతు దృష్టిని పి.వి. సరళమైన శైలిలో సూటిగా వ్యక్తం చేశారు. ‘మడి’ అను ఆచారం, పరిశుభ్రతకు సంబంధం లేకుండా పోయిన అంశాన్ని ఎంతో తార్కికంగా వివరించారు. ఈ వివరణలో కాస్త వ్యంగ్యం కూడా ధ్వనించింది. ‘‘పాపం పట్టుగుడ్డకు సంవత్సరాల తరబడి నీళ్ళతడి అంటదు. ఇంక ఆ గుడ్డలో ఎంత పరిశుభ్రత ఉంటుందో ఊహించుకుంటే చాలు.. పట్టుగుడ్డలు విలువైనందున ఎప్పటికప్పుడు ఉతి కితే చెడిపోతాయాయెను. ఒకసారి చెడిపోయాయంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి? అందుకని మన మడి బట్టలు పశువుల రోమాల నుంచి తయారైన వైనా సరే.. పురుగుల పుట్టలో నుంచి వచ్చిన దారంతో తయారు చేసినవైనా సరే.. వాటికి అరవై సంవత్సరాల జలస్పర్శ లభించకున్నా మరేం ఫరవా లేదు… కానీ నూలు వస్త్రాలు ఎంత శుభ్రమైనా, పరాయి వాళ్ళ వేళ్ళు పడితే మడి మాయమైపోతుంది.

రుషి మూలం, నది మూలంతో పాటు మడి మూలాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు’. (అబలా జీవితము పుట.568) అని యమున ఆలోచన ధారలో భాగంగా వర్ణించాడు.

యమున పాత్రోన్మీలనాన్ని ఎంతో ఉదాత్తంగా చేశారు. చిన్నతనంలో నిరక్షర కుక్షిగా వున్న ఆమె పెళ్లయ్యాక, మరాఠి, ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించి, సజ్జన సాంగత్యంతో, సమున్నత వ్యక్తిత్వంతో ఎదుగుతుంది. ఆమె జీవితంలో ఒక్కో మెట్టును అధిరోహిస్తున్నప్పటికీ ఆమెలో విషాదం గుండెలో గూడు కట్టుకొని వుంటుంది. దురదృష్టం ఆమెను నీడలా వెంటాడుతుంటె, పాఠకులకు ఆమె పట్ల సానుభూతి కలుగుతుంది. నవలంతా చదివాక ‘‘అయ్యో యమున జీవితం యిలా ముగిసి వుండాల్సింది కాదు’’ అనే భావన, బాధ పాఠకులకు ఏర్పడుతుంది.

పి.వి రచనలన్నింటిలో ‘అబలా జీవితము’ శిఖరం, వంటిది. ‘సహస్ర ఫణ్‌’, విశ్వనాథ వారి చట్రంలో రాశారు. ‘ఇన్‌ సైడర్‌’ పి.వి. లోపలి మనిషిని అస్పష్టం గానే చూపింది. ‘అయోధ్య’పై రాసిన గ్రంథం, తనపై మోపిన నేరానికి వివరించిన లీగల్‌ డాక్యుమెంట్‌. ‘అబలా జీవితం’లో మాత్రం పి.వి. విశ్వరూపం కనిపిస్తుంది. విశ్వ విద్యాలయాలలో పరిశోధనకు ఎన్నుకునేంత విషయమున్నది.

‘అబలా జీవితము’ నవల ప్రతి, ఎక్కడా అందుబాటులో లేదు. పి.వి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురించడంతో యీ నవల వెలుగులోకి వచ్చింది. 2015లో ప్రొ॥ సంతోష్‌ భూమ్‌కర్‌ దీబ్‌ but who cares టైటిల్‌తో కేంద్ర సాహిత్య అకాడమి అభ్యర్థన మేరకు ఆంగ్లంలో అనువదించాడు. వారితో సంభాషించినపుడు మరాఠి మూలంలోని అంశాలు వివరించడం వలన, ఈ వ్యాసం వ్రాయడం సాధ్యమైంది. ఒక విధంగా యిది విహంగ వీక్షణే కాని సమగ్ర విశ్లేషణ కాదు! తెలుగు అనువాద సాహిత్యంలో విశిష్ట స్థానం కలిగి వున్న యీ నవల, పునర్ముద్రణ జరిగితే, పి.వి. అసమగ్ర అసంకలిత సాహిత్యానికి సమగ్రత ఏర్పడుతుంది.

(మార్చి 8వ తేది – హరినారాయణ ఆప్టే జయంతి)