‘సశక్తి ఔర్‌ సమర్ద్‌’ మహిళామణులు

దేశాన్ని ‘సశక్తి ఔర్‌ సమర్ద్‌ ‘గా మార్చటంలో మహిళల పాత్ర కూడా కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో వుంచుకొని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ లో దేశవ్యాప్తంగా 75 మంది మహిళలను సత్కరించి గౌరవించింది కేంద్రం. వివిధ రంగాలలో విశేష విజయాలను అందుకున్న మహిళల స్త్రీ శక్తికి గుర్తింపుగా 75 మంది మహిళలకు అవార్డులను ఇస్తున్నట్టు నీతి ఆయోగ్‌ తెలిపింది. ఇందులో మన రాష్ట్రానికి చెందిన స్పూర్తిదాయక మహిళలు నలుగురికి నీతి ఆయోగ్‌ ‘ఉమెన్‌ ట్రాన్సఫార్మింగ్‌ ఇండియా ‘అయిదవ ఎడిషన్‌ అవార్డులు దక్కాయి.

తెలంగాణలోని చేతివృత్తుల వారితో కలిసి పనిచేయడానికి విజయ స్విత ‘చిత్రిక’ పేరుతో సంస్థను ప్రారంభించారు. చేతివృత్తుల మహిళలు ఆదాయ స్థాయిలను పెంచుకోవడానికి, మార్కెట్‌ కార్యకలాపాలను నిర్వహించడానికి చిత్రిక ఎందరికో సహకారం అందజేస్తుంది. డిజైన్‌ వైవిధ్యాన్ని ఉపయోగించటంలో చిత్రిక అగ్రగామి.

హైదరాబాద్‌కు చెందిన అను ఆచార్య ‘మ్యాప్‌ మై జీనోమ్‌’ సంస్థను స్థాపించారు. ఇది మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌ కంపెనీ. ప్రజలకు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగేలా వ్యాధి లక్షణాలు, ఔషధ ప్రతిస్పందనలు, వారసత్వ పరిస్థితులు సహా, జన్యు నివేదిక, ఆరోగ్య చరిత్ర వివరాలు అందిస్తుంది.

అట్టడుగు స్థాయిలోని గ్రామీణ మహిళా వ్యవసాయదారులకు జీవనోపాధిని సృష్టించేందుకు రూప మాగంటి ‘గ్రీన్‌ తత్వ’ పేరుతో సామాజిక సంస్థను స్థాపించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా రైతుల పొలాలకు జియోట్యాగింగ్‌ చేయటం, నేల ఆరోగ్యంపై గ్రీన్‌ తత్వ సహాయం చేస్తుంది.

మహిళలు ఉద్యోగాల్లో చేరటానికి, కెరీర్‌లో ఎదగటానికి తనూజ అబ్బూరి ట్రాన్స్‌ఫర్మేషన్‌ స్కిల్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను స్థాపించారు. ఇప్పటి వరకు నాలుగు వేల మంది మహిళలకు మార్గదర్శనం చేశారు. 2025 నాటికి లక్ష మంది జీవితాలను ప్రభావితం చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.