బసవేశ్వర జయంతి వేడుకలు

basaveshwaraకుల, మత భేదాలు లేని సమాజ స్థాపనకే అవిరళ కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు. లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మ బసవేశ్వరుడు. మహాత్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతి వేదికగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మే 9న ప్రభుత్వం బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వక్తలు ప్రసంగించారు. మహాత్మ బసవేశ్వర ప్రవచనాలు అందరికీ ఆదర్శనీయమైనవని, బసవేశ్వరుని సూక్తులకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన సాగుతున్నదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ సామాజిక సమభావన, అంటరానితనం, లింగ, కుల, వివక్షతలను రూపుమాపడంలో బసవేశ్వరుడు చేసిన కృషి చాలాగొప్పదని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ మాట్లాడుతూ మహానీయుడు బసవేశ్వరుడి ప్రవచనాలను ఆచరిస్తూ సమసమాజ నిర్మాణం కోసం అందరం కృషిచేద్దామని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ మాట్లాడుతు మానవ హృదయంలో దేవుణ్ని దర్శించాలని, మనిషిని మనిషిగా చూడాలని బసవేశ్వరుడు పన్నెండో శతాబ్దంలోనే తెలియజెప్పి ఆచరించి చూపాడని అన్నారు.

అదేరోజు ఢిల్లీ తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలోజరిగిన బసవేశ్వరుని 883వ జయంతి వేడుకలల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎ.పి. జితేెందర్‌ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌, ఉద్యోగులు పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సమసమాజ స్థాపనకు పాటు పడిన వారిని స్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని ఎంపి జితేెందర్‌ రెడ్డి తెలిపారు. ప్రముఖుల జయంతి, వర్థంతి కార్యక్రమాలతో వారు చేసిన సేవల్ని ఈ తరానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మనుషులందరూ ఒక్కటే, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మ బసవేశ్వరుని ఉపదేశాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని ఎంపి జితేెెందర్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపి బూర నర్సయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. ఆ కాలంలో ప్రధానమంత్రి హోదాను త్యజించి, ప్రజల వైపు నిలిచి, వారి అభివద్ధికై పాటుపడిన మహనీయుడు బసవేశ్వరుడని అన్నారు. నేటి తరం రాజకీయ నేతలందరూ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉందని తెలిపారు.

మహాత్మ బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే, మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్‌ అన్నారు. సమాజంలో పరివర్తన తేవడానికి ఆయన ఎన్నో రచనలు చేశారని, సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఎంతగానో బసవేశ్వరుడు కషి చేశారని, అలాంటి గొప్ప మహనీయుడి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.