|

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

కళను-గౌరవిస్తేనే-సమాజం-సుభిక్షంగా-ఉంటుందిaకళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులకు గౌరవం లభిస్తుందో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయన్నారు. తెలంగాణ సమాజానికి కళాకారులను గౌరవించుకునే గొప్ప సంస్కృతి ఉంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. జూన్‌ 21న హైదరాబాద్‌ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించిన ‘బస్తీ’ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చే విధంగా సినీపరిశ్రమను అభివృద్ధిపరుస్తామని, నగరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అన్ని హంగులు కల్పిస్తామని చెప్పారు. సినీ ప్రముఖులతో త్వరలో సమావేశం నిర్వహించి సినీరంగం అభివృద్ధికి రూపొందించాల్సిన ప్రణాళిక విషయంలో సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు. అలాగే పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కుంటామన్నారు. దేశంలోనే అత్యధిక చిత్రాలు హైదరాబాద్‌లో నిర్మాణమవుతున్నట్లు ప్రముఖ హిందీ హీరో అమితాబ్‌బచ్చన్‌ తనకు చెప్పాడన్నారు.

ఇక్కడ పరిశ్రమను విస్తరించేందుకు తీసుకునే చర్యల్లోభాగంగా ఫిలింనగర్‌-2 నిర్మిస్తామని, ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడే నటన, ఇతర రంగాలలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ దేశంలోనే చిత్రపరిశ్రమకు కేంద్రం కావాలని ఆకాంక్షించారు. అలాగే సినీ కార్మికుల సంక్షేమానికి కూడా పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. సినిమా షూటింగ్‌లో పనిచేసే లైట్‌మెన్‌ దగ్గర నుంచి అందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

పేద కార్మికులకు రూపాయికి గజం చొప్పున ఇంటిజాగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ‘బస్తీ’ సినిమా ఆడియోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.