|

మెట్ల బావిలో పూల పండగ

ప్రకృతిని,  పూలను దేవతగా  పూజించే సంస్కృతి మన తెలంగాణ ప్రజలకే సొంతం. అందుకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము. అయితే ఈసారి నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి వినూత్నంగా ఆలోచించారు. జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నారాయణపేటలోని భారం బావి వద్ద అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బతుకమ్మ సంబురాలను  ఘనంగా నిర్వహించారు. 

రాజుల కాలం నాటి పురాతన మెట్ల బావులకు  తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పం, పురాతన మెట్ల  బావులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాకుండా జీవకోటికి జీవనాధారంగా ఉన్న నీటి సంపదను కాపాడుకొని భూగర్బ జలాలను సంరక్షించుకునేందుకు దోహదపడతాయని గుర్తించారు జిల్లా కలెక్టర్‌ హరిచందన.  

అందుకే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లు ఈసారి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు నారాయణపేట పట్టణంలో గల పురాతనమైన భారం బావిని ఎంచుకోవడం జరిగింది. ఈ మెట్ల భారం బావి దాదాపు 100 అడుగుల లోతు ఉంటుంది. కానీ  కొన్ని సంవత్సరాల  క్రితం వరకు రాష్ట్రంలో సరియైన వర్షాలు లేక బావి దాదాపు ఎండిపోయి నిరాదరణకు గురి కావడంతో, చెత్త చెదారంతో బావి నిండిపొయి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణకై తీసుకున్న చొరవ, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీయడం, వర్షాలు సమృద్ధిగా పడటం, పక్కనే ఉన్న చెరువులు నిండి ఉండటంతో ఎండిపోయిన భారం బావిలో ఉన్న చెత్త తొలగింఛి  పేరుకు పోయిన మట్టిని తొలగించే సరికే ఒక్క సారిగా నీరు ఊరడంతో  బావిలో శుభ్రమైన నీళ్ళు సగానికి వచ్చాయి.  బావి మొత్తం శుభ్రం చేయించి విద్యుత్‌ కాంతులు, దీపాలతో, మంచి సౌండ్‌ సిస్టమ్‌తో బతుకమ్మ సంబరాలకు ముస్తాబు చేయించారు. పనికి రాకుండా ప్రమాదకరంగా మారిన పురాతన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక భారం బావి వద్ద బతుకమ్మ పండుగ కోలాహలంతో ప్రజల సంతోషాలకు అవధుల్లేకుండా పోయింది. బావిలో ఉన్న రాణులు బట్టలు మార్చే గదుల వద్ద ఏర్పాటు చేసిన సంప్రదాయ మైన భరత నాట్యం చూపరులను మంత్రముగ్ధులను చేసింది.  

ప్రజలు సొంతంగా తీరొక్క పువ్వులతో వాడ వాడల నుండి బతకమ్మలను చేసి తీసుకువచ్చి అక్కడే ఆటలు, పాటలతో ప్రతి రోజు పండుగే అన్నట్లు సంబరాలు చేసుకున్నారు. 

రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రదేశాన్ని చారిత్రిక ప్రదేశంగా కొనసాగించేందుకు కృషి చేయడం జరుగుతుందని, అదే విధంగా జిల్లాలో ఇలాంటి పురాతన  మెట్ల బావులు 45 ఉన్నట్లు గుర్తించడం జరిగిందని వాటన్నింటిని సంరక్షించి జిల్లాలో  భూగర్భ జలాలు పెంచుకునేందుకు దోహద పడేవిధంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ హరిచందన తెలిపారు.