భువనగిరి ఖిల్లా

bhuvanagari-killaశ్రీ నాగబాల సురేష్‌ కుమార్‌

బుద్ధుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ, మేటి రాచకొండ, కొలను పాక తీర్థం కారపాదం, వర్ధమానమును తెలిపిన బోద, యాదగిరి నర్సన్న మొక్కులు, జానపాడు సైదన్న సూక్తులు వడి వడి కలబడి కుడిఎడమలబడి గడీల పొగరును దించిన గలములు, వాడిగ వడిసెల విసిరిన కరములు, వడివడి పరుగులు పెట్టిన జులములు, నందికొండ నీటితో నిండ, ఊరు ఊరులు పైరులు పండ, కరువుల బరువులు జరుగును దూరం, నలగొండ జిల్లా వరితరి మాగాణం ఈ పదాల పదనిసలు చాలు చాలు నల్గొండ చరిత్ర వైభోగం గురించి తెలుసుకోవడానికి.

నల్గొండ జిల్లా నిండా ఎంతో చరిత్ర దాగి ఉంది. అలాంటి జిల్లాలో భువనగిరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. భువనగిరి ఖిల్లా నల్గొండ జిల్లా గుండెలమీద తలెత్తుకున్న ఆత్మగౌరవ కోట. హైదరాబాద్‌ – వరంగల్‌ వెళ్ళే మార్గమధ్యలో ఒక గ్రానైట్‌ కొండపై అద్భుత రాతి నిర్మాణం రాజదర్పంలా కనిపిస్తుంది అదే భువనగిరి ఖిల్లా. అనేక రాజవంశీయుల పాలన ఈ కోట కేంద్రంగా కొనసాగింది. శత్రుదుర్భేద్యంగా ప్రసిద్ధిగాంచిన కోట ఈ భువనగిరి కోట. కేవలం ఏకశిలపై నిర్మించిన ఈ రాజకౌశలం చూపరులను అబ్బురపరుస్తుంది. ఈ అంశమే దేశంలోనే ప్రత్యేకమైన ఖిల్లాగా నిలవడంలో దోహదపడింది. ఇక్ష్వాకుల నుండి కుతుబ్‌ షాహీలవరకు ఇక్కడ అందరూ పాలన కొనసాగించినవారే. ప్రస్తుతం ఈ కోట బాధ్యతను పురావస్తు శాఖ పర్యాటక శాఖవారు నిర్వహిస్తున్నారు. 148 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట ఎంతో ఘనమైన చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుని ఉంది. అంతేగాక అత్యంత విలువైన శిల్పసంపదకు కూడా నిలయం, కానీ అవన్నీ ఇక్కడి మట్టిలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట 580 అడుగుల ఎత్తులో కలదు. సముద్ర మట్టానికి 502 అడుగుల ఎత్తులో గల ఈ కోటను ఎక్కడానికి సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులకు సుమారు ఒక్క గంట 20 ని||లు పడుతుంది.

బహమనీసుల్తానులు నిర్మించిన కోటను చూడగానే ఆనాటి రాజుల రాజదర్పం, వారి చారిత్రక వైభవంతోపాటు వారి కళాపోషణ మనకు కళ్లకు కట్టినట్టుగా కనిపించడమేగాక మనందర్నీ అబ్బుర పరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజులు, రాజ్యాలు పోయాయి. రాజుల పాలన రాజరిక వ్యవస్థ నశించి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన ఈ కాలంలో కూడా ఆనాటి రాచరిన వ్యవస్థకు చిహ్నాలుగా ఆనాటి కళావైభవాలను చాటిచెప్పే సంస్కృతి  చిహ్నంగా ఈ భువనగిరి కోట నిలుస్తుంది. అనేక మతాలకు, విభిన్న సాంప్రదాయాలకు, విభిన్న సంస్కృతులకు నిలయంగా చరిత్రపు నిలుపుటద్దంగా భువనగిరి కోట దుర్గం నిలుస్తుంది.

ఈ కోట కోడిగుడ్డు ఆకారంలో ఉండడం దీని ప్రత్యేకత. శత్రువుల రాకను పసిగట్టడానికిగాను ఈ ఏకశిలా నిర్మాణాన్ని చేపట్టారు ఆనాటి రాజులు. అంతేగాక ఎంతోమంది రాజుల పాలనలో నిర్మాణాన్ని చవిచూసిన ఈ కోట చుట్టూరా ప్రహరీగోడ చెక్కు చెదరలేదు. పూర్వం ఒక హిందూరాజు రాయగిరి పరిసర ప్రాంతాలలో ఒక దుర్గం నిర్మాంచాలన్న సంకల్పంతో సంచరిస్తుండగా భువనయ్య, గిన్నమ్మలు అనే గొర్లను కాస్తున్న దంపతులు తారసపడ్డారట, ఫలితంగా ఇరువురి పరిచయంతో రాజు తన మనసులోని మాటను తెలియజేశాడు ఆ దంపతులకు. చెట్ల తీగలతో నిండిన భువనగిరి కోటను ఆ దంపతులు రాజుకు చూపించారు. దీంతో దంపతులను రాజు మెచ్చుకుని వారి పేరుమీదుగా భువనగిరిగా నామకరణం చేశాడని ఇక్కడి ప్రజల కథనం.

కాకతీయ మహారాణి అయిన రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుని చరిత్ర ఈ కోటతో కూడా ముడిపడి ఉందని చారిత్రక కథనం. పశ్చిమ చాళుక్యరాజైన 6వ త్రిపుర విక్రమాదిత్యుడు 12వ శతాబ్ధంలో ఈ కోట నిర్మాణానికి నాంది పలికాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందువలనే త్రిభువనగిరిగా ఏర్పడిందని చరిత్ర విశ్వాసం. తదనంతరం నవాబుల పాలనలో భువనగిరిగా పరిణామం చెందింది. ఈ భువనగిరి కోట కళ్యాణచాళుక్యుల పరిపాలనలో వారి సామంతుల ఆధీనంలో ఎక్కువ కాలం ఉంది.

శత్రుదుర్భేద్యంగా పటిష్టంగా నిర్మించబడ్డ ఈ కోట తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, బహుమణీ వంశీయులు, కుతుబ్‌ షాహీలు, అసబ్‌జాహీవంశీయులు పాలించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. 1687వ సం||లో ఔరంగజేబు సైనికులకు చిరుపరిచయం వున్న అబ్దుల్‌ అసన్‌ తానీషా పట్టుపడటంతో గోల్కొండ ఔరంగజేబు వశమైంది. ఇదే కాలంలో ఈ భువనగిరి కోట అసఫ్‌జాహీ పాలనలోకి వచ్చింది.

తదనంతర కాలంలో వరుసగా నాజర్‌ జంగ్‌, సలాబత్‌ జంగ్‌, నిజామ్‌ అలీ ఖాన్‌, సిఖందర్‌ జా, ఆప్జల్‌ అబ్దుల్లా, మహబూబ్‌ అలీఖాన్‌ల పాలనలోకి వెళ్ళాయి. ఆ తరువాత కాలంలో ఈ దుర్గం స్వతంత్య్ర భారతదేశంలో కలిసింది. రాజుల కాలంలో ఈ దుర్గం శోభాయమానంగా వెలిగొందింది. అయితే ఓరుగల్లు కోటతో సరితూగే దుర్గం మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. రాజప్రసాదం భువనగిరి ఏకశిల అగ్రభాగాన నిర్మితమైన ఒక అద్భుత నిర్మాణం. కాకపోతే నేడు అది శిథిలావస్థలో ఉంది. నాటి రాజుల కళానైపుణ్యం శిల్పుల పనితీరుకు నిదర్శనంగా నిలిచిన భవనం శిథిలావస్థకు చేరుకోవడం కొంత మనందరికీ మనోవేదనను మిగులుస్తుంది. కోట పై ప్రాంతంలో రాజభవనం, సభా మందిరం నివాస గృహాల గోడలపై కమానుల ఆకారాలతో చిన్న చిన్న గూడ్లు వున్నాయి. వాటిపై శిల్పులు పుష్పగుచ్చాలను రాతిపై చెక్కి వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. భవనంపైకి ఎక్కడానికి రెండు వైపుల నుండి ప్రవేశ ద్వారాలున్నాయి. రాజభవనానికి రక్షణగా నాలుగువైపులా ఫిరంగులున్నాయి. భువనగిరి కోట పై ప్రాంతం నుండి చుట్టూ గమనిస్తే భువనగిరి పట్టణ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. దుర్గం చేరుకునేందుకు ఉత్తర, పశ్చిమ దిశల నుండి దారులున్నాయి. దీనికి ఇరువైపులా పెద్ద పెద్ద రాళ్ళతో బలిష్టమైన గోడలు చుట్టూ నిర్మించారు. ఈ రాతి గోడ కొండ కింది భాగం నుండి గోడ వెంట పైకి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసి వున్నాయి. గోడపై 6 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుగల శిలలు వున్నాయి. సింహ ద్వారం చేరుకోవడానికి అడుగు భాగం నుండి 300 అడుగుల శిల నిర్మిత సోపానాలు అధిగమించాల్సి వుంటుంది.

సింహ ద్వారం నుండి పైకి వెళుతుంటే అక్కడక్కడ సైనికుల ఆయుధ బాండాగారాలు, ప్రయోగశాలలు, అశ్వశాలలు, గజ శాలలు శిథిలమైన నల్లరాతి శిల్పాలు కనిపిస్తాయి. కొండపై వున్న ఏడు కోనేర్లు సప్త సరస్సులుగా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. శత్రువుల భారీ నుండి రక్షించుకునేందుకు భూ అంతర్భాగం నుండి సొరంగ మార్గాన్ని ఆనాటి రాజులు నిర్మించుకున్నారు. ఒకటి ఓరుగల్లు కోటకి, మరొకటి గోల్కొండ కోటకి కలదని స్థానికుల కథనం. గత వైభవాలకు తార్కాణంగా సాక్షీభూతాలుగా ఇప్పటికీ మనకి ఎన్నో కోటలు కానవస్తాయి. అలాంటి కోటల్లో ఈ భువనగిరి కోట కూడా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వారసత్వ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.