వచన ప్రబంధంగా పోతన చరిత్ర

శ్రీ మహావిష్ణువే వ్యాసుని రూపంలో అవతరించి సంస్కృతంలో భాగవత పురాణం సహా 18 పురాణాలు, ఉపపురాణాలు సృష్టిస్తే వ్యాసుడే పోతనగా జన్మించి తెలుగులో మహాభాగవతాన్ని రచించాడు. పోతన చరిత్రను ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు పద్యకావ్యంగా రచిస్తే అదే పోతన చరిత్రను చక్కని వచన ప్రబంధంగా మలచి రచయిత్రి గొడవర్తి సంధ్య అందించారు.

మన సాహిత్య చరిత్రలో కవుల చరిత్రలన్నీ కల్పనలే. వారి వ్యక్తిగతమైన వివరాలు తెలిసింది చాలా తక్కువ. అందునా తెలుగు కవులు తమ గురించి రాసుకున్న సంఘటనలు చాలా అరుదు. వారి సమీప రాజుల, చక్రవర్తుల కాలాన్ని బట్టి ఆయాకవుల కాలాలు, జీవితాలు నిర్ణయించాల్సిన పరిస్థితి. నిన్నటితరంలో పోతన పద్యాలు రానివారు ఉండరు కానీ తెలంగాణలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అపారమైన దైవభక్తి కలిగిన నిరాడంబరుడైన మహాకవి పోతన జీవితాన్ని గురించి చాలా మందికి తెలియనే తెలియదు. కృష్ణుని కథ భాగవతాన్ని శ్రీరామ భక్తుడైన పోతన శ్రీ రామునికి అంకితమిచ్చాడనీ నరాంకితం చేయలేదని మాత్రం అందరెరిగిందే. వానమామలై వారు ఎంతో పరిశోధించి, పరిశీలించి పోతన జీవితాన్ని ఒక గొప్ప పద్య ప్రబంధంగా అందించారు. ఆధునిక పంచ మహాప్రబంధాలలో ఈ పోతన చరిత్రకు సముచిత స్థానం ఉంది.

పోతన చరిత్రను రచయిత్రి సరళసుందరశైలిలో చదివించే రీతిలో వచన ప్రబంధరూపంగా అందించడం గొప్ప విశేషం. మూలం చెడకుండా, అనవసరవ్యాఖ్యానాలు లేకుండా, పద్యాలలో ఉన్నదాన్నిఉన్నట్టు బిగువుచెడని చదివించే సరళ సుందర శైలిలో రాయడంలో సంధ్య కృతకృత్యులయ్యారు. భాగవతంలో 12 స్కంధాలు – పోతన చరిత్రలోనూ 12 ఆశ్వాసాలే. నిరాడంబరుడు, భక్తకవి అయిన పోతనలాగే వరదాచార్యులవారి జీవితమూసాగింది.

పోతన చారిత్రక కావ్యంగానే కాకుండా భాగవతాన్నంతా కాచి వడబోసి కరతలామలకంగా అందించిన అద్భుతరచన ఇది. శ్రీనాథుడు పోతన బావా, బావమరుదులు కావడం, ఇంద్రాది దేవతలు సింగభూపాలాది రూపాల్లోరావడం, పోతనకు ఒంటిమిట్టలో రామదర్శనం కావడం వంటి వెన్నో ఘటనలు చారిత్రకంగా పొసగకున్నా కావ్యగతంగా జనాంతికమైన కల్పనల రీతిలో సుందరంగా వరదన్న పద్యాల్లో చోటుచేసుకున్నాయి. మాతృ భాషాభిమానాన్ని, సాంప్రదాయిక సనాతన సంస్కృతీ విభవాన్ని చాటే వాక్యాలు కొల్లలుగా కనిపిస్తాయి.

మచ్చుకు.. ‘పుత్రులను నెత్తిమీద పెట్టుకుని అన్న వస్త్రాలు ఇచ్చి పోషించే మాతృభూమి కంటే, నవమాసాలు మోసి కని పెంచి పాలిచ్చే తల్లి కంటే, బాల్యంలోనే కాదు జీవించినంత కాలం తన స్వచ్ఛమైన పాలతో మనని పోషించే గోమాతకంటే కూడా మాతృభాష గొప్పది.’ ఈ మాతృభాషాభిమానం వరదన్నది కూడా.

కేసన్న తన భార్య లక్కమాంబ మాటను శిరోధార్యంగా భావించే వాడని చెప్పడానికి ‘గంగను శిరస్సున దాల్చిన శివుడి’తో పోల్చడం ఎంతో హృద్యంగా ఉంది. అలాగే యజ్ఞ వాటిక లోని ఆరణి, పాత్రను వరాలు అడిగినట్లుగా చిదానంద స్వామి లక్కమాంబ గర్భంలోనే బ్రహ్మ తేజోమయ మూర్తి యైనపాపడు కదలాడుతున్నట్టు గ్రహించడం భావి మహోదయుని జననానికి సంకేతం.

‘మురికి నీళ్లతో కలిసిన పాలకంటే స్వచ్ఛమైన గంగాజలం మంచిది. పట్టు పీతాంబరాలు ధరించిన వేశ్యకన్నా మాసిన బట్టలు ధరించిన కులస్త్రీ అందరిలో గౌరవింప బడుతుంది’.. వంటి ఆలోచనీయమైన, అందమైన వాక్యాలీ పుస్తకం నిండా పరచుకొన్నాయి. పోతన శ్రీనాథులను లక్ష్మీ సరస్వతులతో, శ్రీకృష్ణ, కుచేలులతో వివిధ సందర్భాలలో పోల్చడం సముచితంగా ఉంది.

అర్థకామాల కోసమే శారదాంబను సేవించే శ్రీనాథుని శక్తికి ఎదురు నిలిచి ధర్మమోక్షాల కోసమే ఆ చక్రధరుని సేవించే పోతనభక్తి తత్పరత గెలపొందిందనడం, నీ కవితామృతం త్రాగడం ద్వారా నా జన్మ ధన్యమైందని శ్రీనాథుడనడం వారి వారి గౌరవాలను ఇనుమడిరప జేసింది. తెలుగుల పుణ్యపేటి పోతన్న పై వరదన్న పద్యాలను ఇలా కథాకథన రీతిలో ప్రక్రియాంతరీకణగా నవలీకరించిన శ్రీమతి గొడవర్తి సంధ్య ఈతరానికి పోతనజీవితంపై ఒక మంచి అవగాహన కల్పించారు.

పోతన చరిత్ర
(శ్రీ మాన్‌ వానమామలై వరదాచార్యుల పద్యకావ్యానికి వచనాకృతి)
రచన: గొడవర్తి సంధ్య.
వెల: రూ. 150/-
ప్రతులకు: సాధన నరసింహాచార్య, 203, మారుతీ టవర్స్‌, కూకట్‌ పల్లి, హైదరాబాద్‌ 72