యాదగిరి నరసింహుని సేవలో విరబూసిన బుచ్చిదాసు సంకీర్తనలు

By: శ్రీ మంత్రి శ్రీనివాస్‌

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో ప్రముఖమైనది, ఎన్నదగినది యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం. పంచ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో నరసింహ స్వామి కరుణాభరితుడై, ప్రసన్న హృదయుడై, యోగానందుడై, చక్ర, శ్రీ లక్ష్మీ నారసింహ రూపుడై ఉన్నాడు.

కృతయుగంలో అహోబిలం (అహోబలం) క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఉగ్రరూపంలో దర్శనమిచ్చాడు. శాంతమూర్తిగా దర్శనం కోరుకున్న ప్రహ్లాదుడితో తాను కోరిన రూపాన్ని భవిష్యత్తులో యాదగిరిలో చూడగలవు అని హామీ ఇచ్చాడు. నరసింహస్వామి ఆవిర్భావానికి ఇదొక కారణం. మరొక కారణం విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగుడి కొడుకు యాదర్షి, నరసింహ స్వామిని దర్శించాలని కోరుకోవడం. యాదర్షి ఘోర తపస్సు చేసి నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకొన్నాడు. తనను తాను కొండగా మార్చుకొని తనపైనే నివాసం చేయమని కోరుకున్నాడు. యాదర్షి కోరిక మేరకు శ్రీ లక్ష్మీ నృసింహుడు ఈ కొండపై వెలసినట్టు ఈ క్షేత్ర మహాత్మ్యం తెలుపుతోంది.

ఈ క్షేత్రం అనేక మహిమలకు, నెలవుగా, సత్పురుషులకు నివాసస్థానంగా ప్రసిద్ధి పొందింది. ఇంతటి మహిమగల యాదగిరి నరసింహుని చల్లని నీడలో ఈగ బుచ్చిదాసు సంకీర్తన కమలమై వికసించింది.

ఈగ బుచ్చిదాసును గూర్చిన వివరాలు ప్రపంచ తెలుగు మహాసభలు -2017 సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి వారు ప్రచురించిన ‘‘యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు’’ (సంకీర్తనలు-శతకము-బతుకమ్మ పాట) అన్న గ్రంథం తెలియజేస్తోంది. (ఈ గ్రంథం తెలంగాణా సాహిత్య అకాడమి వారి సౌజన్యంతో డా.పి. భాస్కరయోగి పరిష్కర్తగా తీసుకొచ్చారు.) ఈ గ్రంథంలోనే ‘‘శ్రీ యాదగిరి నరహరి శతకము’’ ఇమిడ్చబడింది. దీనితో పాటు బుచ్చిదాసు రాసిన ‘‘శ్రీ యాదగిరి లక్ష్మీనారసింహ శతకము’’, ‘‘శ్రీ యాదగిరి శివభజన కీర్తనలు’’ అన్న గ్రంథాలు, ఈ గ్రంథాల్లోని పీఠికలు, సంకీర్తనలు, పద్యాలు ఈగ బుచ్చిదాసును గురించిన ఆధారాలను తెలుపుతున్నాయి.

శ్రీ యాదగిరి లక్ష్మీ నారసింహ శతకానికి ఈగ బుచ్చిదాసు శిష్యమణి, యోగిని సాధు బుచ్చిమాంబ రాసిన పీఠిక ‘‘నా గురుదేవుడు’’. ఈ పీఠిక యాదగిరి క్షేత్రంలో బుచ్చిదాసు కఠోర యోగ సాధనకు, రోజువారి జీవితానికి సంబంధించిన వివరాలను తెలుపుతున్నది. ఇవే కాకుండా ‘యాదగిరి క్షేత్ర సంకీర్తన కవి ఈగ బుచ్చిదాసు’ అన్న గ్రంథానికి బుచ్చిదాసు మఠం పీఠాధిపతి శ్రీ శంకరానందగిరిస్వామీజీ, డా.పి. భాస్కర యోగి రాసిన ముందుమాటలు బుచ్చిదాసు జీవన విశేషాలను తెలియజేస్తున్నాయి. బుచ్చిదాసు తన జీవితానికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడం మూలాన ఆయనకు సంబంధించిన వివరాలు కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి.

బుచ్చిదాసు తనకు కలిగిన అనారోగ్యాన్ని నయం చేసుకునే నిమిత్తం యాదగిరికి వచ్చాడు. శ్రీ లక్ష్మీనరసింహ దీక్ష తీసుకొని రోజు గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. భక్తితో నిష్ఠగా నరసింహ స్వామిని ఆరాధించాడు. ఈయన భక్తి, ఆరాధన, దీక్ష ఫలించి నరసింహస్వామి దయవల్ల ఆయనకు కలిగిన అనారోగ్యం దూరం కావడంతో నరసింహుని మహత్తు కనుగొన్న బుచ్చిదాసు యాదగిరి క్షేత్రంలోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. కబీరు పంథాను కొనసాగిస్తూ అప్పటికే అక్కడ నివాసం చేస్తున్న ఉత్పల చెన్నదాసు వద్ద శిష్యుడిగా చేరి గురూపదేశం స్వీకరించాడు.

తన గురువు సాన్నిధ్యంలో ఆత్మ విద్యలన్నింటిని నేర్చుకున్నాడు. ధ్యాన విద్యలో ప్రావీణ్యత సాధించాడు. తొంభై ఆరు తత్వాలను, దశవిధ నాదాలను, జ్యోతి దర్శన విద్య అయిన కుండలీనిని ఔపోసనపట్టాడు. నిరంతర భక్తిచేత, సాధన చేత నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. నరసింహస్వామి స్వప్నాదేశంతో సంకీర్తనలు వ్రాశాడు. తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచాలనే ఉద్దేశ్యంతో ఒక ఖాన్గి బడిని ఏర్పాటు చేసి పిల్లలకు బోధనలు చేశాడు.

బుచ్చిదాసు చేస్తున్న కృషిని గమనించిన యాదగిరి వాస్తవ్యులు రాంరెడ్డి తమ బిడ్డలైన బుచ్చమ్మ, దశరథులను బుచ్చిదాసు వద్ద చదువుకోవడానికి పంపారు. బుచ్చమ్మ దశరథులిద్దరూ చక్కగా ఐదవ తరగతి వరకు చదువుకున్నారు. బుచ్చమ్మ ఆధ్యాత్మిక విద్యకు దగ్గరై, బుచ్చిదాసు వద్దే యోగ విద్య నేర్చుకొని అనంతరం సాధు బుచ్చిమాంబగా ప్రసిద్ధి పొందింది. బుచ్చిదాసు నిత్యం నరసింహ స్వామి సేవలో, నరసింహ స్వామి ధ్యానంలో తన జీవితాన్ని గడిపి తరించాడు.

బుచ్చిదాసు నరసింహ స్వామి స్వప్నాదేశంతో రాసిన సంకీర్తనలను ఎదులాబాదుకు చెందిన పోలోజి నారాయణ ఆర్థిక సహాయంతో 1962లో ముద్రించడం జరిగింది. వీటి సంఖ్య 127. బుచ్చిదాసు హరిహరాభేధాన్ని పాటిస్తూ ‘‘శ్రీ యాదగిరిశివ భజన కీర్తనలు’’ రాశాడు.వీటి సంఖ్య 62. వీటితో పాటు ‘‘శ్రీ యాదగిరి లక్ష్మీ నారసింహ శతకము’’, ‘‘శ్రీ యాదగిరి నరహరి శతకము’’ వంటి శతకాలను, ‘‘శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బతుకమ్మ పాట’’ను రాసి యాదగిరీశుని పాదపద్మాలకు అంకింతం చేశాడు. ఈ బతుకమ్మ పాటను బండ సోమారంనకు చెందిన భక్తుడు కృష్ణదాసు కోరికమేరకు బుచ్చిదాసు రచించినట్లు తెలుస్తుంది. ఈ బతుకమ్మ పాట 1968లో ముద్రించబడిరది.

బుచ్చిదాసు బాల్యం, విద్యాభ్యాసం

బుచ్చిదాసు వరంగల్‌ ప్రాంతానికి చెందినవాడు. ఈయన 1907వ సంవత్సరంలో జన్మించారు. వారి తల్లిదండ్రుల పేర్లు తెలిసిరాలేదు. ఆయన పద్మశాలి కులానికి చెందినవాడని తన శతక పద్యాల్లో చెప్పుకోవడం వల్ల తెలుస్తోంది.

శ్రీ యాదగిరి లక్ష్మీ నారసింహ శతకములో ఒకచోట….‘‘బాల ప్రాయమును దాటి యవ్వన ప్రాయంబులో కొంతనూ /చాలగా కర్మములు జేసితి స్వామి శ్రీ నారసింహ’’…‘‘కొంటె సోపతుల బడియూ యెల్లపుడు కటి చలనము విడువకా/ యుంటినీ యీలాగునా ధరణీశ యుర్విలో నారసింహా’’…. ‘‘తల్లిదండ్రులకు యెపుడు అనుదినము తరుగుచును మ్రొక్కలేకా /చెల్లుగానట్టి మాటా లాడియూ చెడితి శ్రీ నారసింహా’’…. అంటూ తన బాల్యం, యవ్వన జీవితానికి సంబంధించిన విశేషాలను నరసింహ స్వామికి పద్యాల రూపంలో ఆత్మ నివేదనంగా సమర్పిస్తాడు. ఈ వివరాలు బుచ్చిదాసు బాల్యంలో చేసిన బిరుసు పనులను మనముందు ఉంచుతున్నాయి.

‘‘పెద్దచిన్ననె భావమూ నాలోన కొద్దిగా యోచించకా / హద్దు దప్పిన చేష్టలు చేసితీ ఆది శ్రీ నారసింహ’’ అంటూ చేసిన నివేదన చూస్తే బుచ్చిదాసు తన బాల్య, కుమారవస్థలో పెద్దలను లెక్కచేయక మర్యాదకు దూరంగా అహంకార ప్రవర్తనను కలిగి ఉన్నట్టు అర్థమవుతుంది.

సీ. గొప్పగా చదువులు కోరి చద్వితిగాని అర్థంబు దెలియక వ్యర్థునైతి/ బుద్ధితో గురువుల బోధ జెందితిగాని నడువడి మంచిగా నడవనైతి/ హంస జపంబు నే నాత్మలో సలుపక చిత్త చంచలమున చెడి తిరి
గితి /….’’ అంటూ బుచ్చిదాసు యాదగిరీశునికి చేసుకున్న నివేదనాన్ని చూస్తే బుచ్చిదాసు తాను గురువుల వద శ్రద్ధతో గొప్ప చదువులు నేర్చుకున్నాడని, కాని చిత్త చాంచల్యంలో పడి మంచి నడవడికకు దూరమయ్యాడని తెలుస్తోంది.

గృహస్థాశ్రమం

బుచ్చిదాసుకు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. బుచ్చిదాసు తన ‘‘భార్యమీద ప్రేమతో తన తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించానని’’ తన శతక పద్యాల్లో తెలియ జేసుకుంటాడు. తానూ తన సంసారాన్ని నడపడానికి చితులాకి (అల్లరి చిల్లరి) పనులు చేసినట్టు చెప్పుకుంటాడు.

‘‘సీ.కన్నతల్లికిని యాకటి కన్నమిడనైతి కొన్న భార్యకు వెన్న కుడువ బెడితి / జనకుని సేవయు క్షణమైన సేయకా జారకాంతల సేవసలిపియుంటి / దొంగమాటల జెప్పి దొరను నేనన తిర్గి యందరి డబ్బెల్ల నాక్రమిస్తీ….’’ ఈ పద్యం ఈయనకు భార్య ఉన్నదని తెలుపుతుంది. కనుక పుర్వాశ్రమంలో గృహస్తుడని తెలుస్తుంది.

‘‘యేమి సేతూ యేమి సేతూ యేమిసేతూ – యేమిసేతూరా శివుడా’’ అన్న శ్రీ యాదగిరి శివభజన కీర్తనలో ‘‘ఇల్లు సంసారంబు నాదని – తెర్లు అయితీరా యెపుడు – కల్ల /జోల్లా బడియు పాపా కర్మునైతీరా’’ అంటూ తనకు ఇల్లు సంసారం ఉండేదని ప్రమాణాన్ని అందిస్తాడు బుచ్చిదాసు. తానూ నశ్వరమైన ఇహలోక బంధాలు, సంసార జీవనంలో ఇరుక్కుపోయి, చెడు సోపతుల వెంట తిరిగి పాపినయ్యాను అంటూ చెప్పుకున్న మాటలు ఇందుకు సాక్ష్యాలు.

ధర్మ పరివర్తనం :

సీ. పగటి వేళల మోహ భ్రాంతిచే పడతుల వీక్షించి మిగుల నే వెర్రినైతి /చక్కని బొమ్మని చొక్కి పొదచాటుకు నిక్కి చూచియు నోట పెక్కునగితి / రొక్కంబు బోతేమి దక్కెను స్త్రీయని చెక్కిల్ల భ్రమపడీ సిగ్గువిడిచి/…’’ అన్న పద్యం చదివితే సామాన్యుడెవ్వడైనా అసామాన్యుడుగా తయారవ్వాలంటే ప్రాపంచికమనే అగ్నిలోపడి తప్తమవ్వాల్సిందే అని తెలుస్తుంది.

సీ. నావంటి టక్కరి నరుడెవ్వడైనను లేడని భువిలోన నేడు దోచే /ముందు నా వయసులో ముర్ఖుండనై పనుల్‌ చేసిన వన్నియు చెప్పరాదు…’’ ఈ పద్యంలో తనను తాను టక్కరివాడినని, మూర్ఖ చిత్తంలో పడి కాని పనులు చేశాడని తెలుస్తుంది. పరుల మంచిచెడులను ఎన్నడూ అడగలేదని, మంచిని కోరుకోలేదని అర్థమవుతుంది. జ్ఞానిగా ఇతరులకు నీతులు జెప్పాడు కాని తాను పాటించలేదని తెలుస్తుంది.

ఆఖరకు తన తప్పులు తనకు తెలిసివచ్చాయని పశ్చాత్తాపాగ్నిలో పడి కొత్త జన్మను ఎత్తాడని స్పష్టంగా తెలుస్తుంది.

ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఏదో ఒక విషాద సంఘటన జరిగినట్టు తెలుపుతూ …

సీ. దండిగ్రహము వచ్చి గుండెనుబట్టినయంత చేధించితివి దాన్ని శీఘ్రముగను / నారసింహాయనీ నా మదిందలచిన మాట్లాడిపోతివి మనసుదీర / రక్షకా యనినంత పక్షి వాహన మెక్కి వచ్చి నిల్పితివి నా వాంఛదీర / నిదుర రాకుండగ నీవె యౌషధ మిచ్చి యదరకుమని నన్ను యంటివయ్య

గీ. భయము జెందకు మంటివీ పలువిధముల / చలన ముంచుకొని జెప్పి చాలాసార్లు

కలలో నీతీరు జేస్తివి కరుణ తోడ / యాదగిరివాస నరహరి సాధుపోష అన్న పద్యం ఇందుకు సాక్షంగా నిలుస్తుంది. ఈగ బుచ్చిదాసు జీవనంలో ఏదో తెలియని గండం వచ్చినట్టు, ఆ సందర్భంగా ఆయన యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకొన్నట్టు తెలుస్తుంది. యాదగిరికి చేరుకొని అత్యంత భక్తితో నరసింహస్వామిని సేవించి తద్వారా ఆపద నుండి భయటపడ్డట్టు అవగతమవుతుంది.

బుచ్చిదాసు భక్తికి మెచ్చిన నరసింహస్వామి భయం వీడి ధైర్యంగా ఉండమని, ఇతర ఆలోచనలు మాని నిష్టగా ఆరాధించమని బుచ్చిదాసుకు కలలో ప్రబోధం చేసినట్టు ఈ పద్యం తెలియజేస్తుంది.

సాధు జీవితం :

నరసింహ స్వామిని తన భక్తితో ప్రసన్నం చేసుకొన్న ఈగబుచ్చిదాసు పరిశ్రమను చూసినట్లయితే…

సీ. యిరువది యెకవెయ్యి యారువందల శ్వాస జపము జేసితి తన జయము గలుగు / కొనముక్కుపై దృష్టి కొమరెప్ప నిలిపిన చలన ముడిగి మది స్థిరముయగును / షట్చక్రముల దాను జవతోది దాటితే సహస్రారమున జీవి సంతసించు / ముందుగా భ్రూమధ్య మందు నిల్పితె గాని దుర్గుణం బెల్లను దూరమగను……’’ ఈ పద్యాన్ని బట్టి ఈగ బుచ్చిదాసు సుగుణవంతుడై సాధనలో ఆరితేరిన రీతి మనకు కనబడుతుంది. ఈగ బుచ్చిదాసు కఠోరమైన సాధన చేసి సిద్ధిని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడని తానూ తన గురువు వలే సద్గురువుగా తన శిష్యులకు ప్రబోధం చేసినట్టు మనకు తెలుస్తుంది.

బుచ్చిదాసు ఆత్మకవి. తానూ ఎప్పుడు అనుకుంటే అప్పుడు భక్తి పరవశంలో కీర్తనలు రాసేవాడు. తానూ ధ్యానానికి వెళ్ళే సమయంలో తాత్విక సంకీర్తనలు వ్రాసేవాడు. జీవన్ముక్తికి మార్గాన్ని ఉపదేశించేవారు. తనకు అస్వస్థత ఏర్పడినప్పుడు, ఇతరులకు బాధలు కలిగినప్పుడు బాధను భరించలేక ‘‘బాధా నివారణ కీర్తనలు’’ రాసి స్వామికి సమర్పించేవాడు. ఈ విషయాలు బుచ్చిమాంబ మాటల వల్ల తెలుస్తున్నాయి.

యోగవిద్యలో ప్రవీణుడైన బుచ్చిదాసు తనకు యోగ మార్గంలో కలిగిన / సమాధిలో కలిగిన అనుభవాలను తన శిష్యురాలు అయిన సాధు బుచ్చిమాంబకు చెప్పే వారు. సమాధి స్థితికి ఎలా వెళ్ళాలో మార్గోపదేశం చేసేవారు. అలా ఇరవై సంవత్సరాలు దేవస్థానం వారు ఇచ్చిన ఆశ్రమంలో ఉంటూ ఎందరికో సందేహ నివృత్తి చేసేవారు. అలా ఆయన అనుయాయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది. కబీరుదాసు ప్రవేశపెట్టిన దాస సంప్రదాయంలో మునకలేసిన భక్త రామదాసు, వేవూరు హనుమద్దాసు, మల్కిదాసు, రాకమచర్ల వెంకటదాసు, మన్నెంకొండహనుమద్దాసు వంటివారి ప్రభావం, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్వాలు, వేమన మున్నగు శతక కవుల పద్యాలలోని తాత్వికత, సూఫీ, పండరీ భాగవతుల ప్రభావం ఈగ బుచ్చిదాసుపై ఉన్నదని చెప్పవచ్చు.

భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం అనే అగ్నిలో తపించిన ఈగ బుచ్చిదాసు తన జీవన పర్యంతం శ్రీ లక్ష్మీ నరసింహుని సేవలో తరించి లోకకళ్యాణం కోసం పరితపించాడు. దాదాపు ఇరవై సంవత్సరాలు యాదగిరి కొండపై దేవస్థానం వారు ఆయనకు ప్రీతితో ఇచ్చిన ఆశ్రమంలోనే ఉన్నారు. ఎంతో భక్తితో నరసింహస్వామికి సేవ (కైంకర్యం) చేసిన ఈగ బుచ్చిదాసు హేవలంబి నామ సంవత్సరం జేష్ట బహుళ సప్తమి, జూన్‌19, 1957, బుధవారం నాడు ఉదయం పదకొండు గంటలకు శ్రీ లక్ష్మీ నారసింహునిలో ఐక్యమైనాడు. సాధు బుచ్చిమాంబ తన గురువు సమాధిని కొండకు కిందిభాగంలో నిర్మించింది. అనంతరం నలభై రోజులపాటు మండలారాధనను జరిపించింది.

కబీరు పరంపరలో, తెలంగాణ భజన సంప్రదాయంలో ఇంతటి ఘన సాహిత్యాన్ని అందించిన ఈగ బుచ్చిదాసు ప్రాతఃస్మరణీయుడు. తెలంగాణా వాగ్గేయకార సంప్రదాయాన్ని లోకవ్యాప్తం చేయడంలో తనవంతు సేవచేసి యాదగిరీశుని మహిమను అందరి ఇళ్ళలోకి చేర్చాడు. ఈయన సాహిత్యం ప్రతి పౌరుడిని చేరవలసిన ఆవశ్యకత ఉన్నది.