|

పరబ్రహ్మ! పరమేశ్వర!! గీతకర్త

asలక్షణమైన సంస్కృతి విలువలను పరిరక్షించడానికి మన భారతదేశంలో జన్మించిన మహానుభావులలో కవులు, కళాకారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించి, పరోపకారం, త్యాగం వంటి ఆదర్శ లక్షణాలతో మానవత్వపు విలువలకు కొత్త ఊపిరి పోశారు. అలాంటివారిలో ‘తెలంగాణా మునీశ్వరుడు’ అనదగిన ప్రసిద్ధ కళానుశీలి, అపూర్వ ప్రతిభాశాలి ‘చందాలకేశవదాసు’. నిర్మోహత్వంతో, సేవాపరాయణతతో, కళావైదుష్యంతో, తాత్త్విక చింతనతో తెలుగువారిని మేలుకొలిపి, సత్య పరిశోధనా కరదీపికలను చేతికందించిన మహనీయమూర్తి ఆయన.

పాపమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు 1876 జూన్‌ 20న ఖమ్మం జిల్లా జక్కేపల్లి గ్రామంలో కేశవదాసు జన్మించారు. తండ్రి దగ్గరే చదువులో తొలి పాఠాలు నేర్చుకున్నారు. కాని చాలా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి పెద్దన్న వెంకట్రామయ్య దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు. కొంతకాలం తరువాత కేశవదాసు తిరువూరులోని ‘కాబోలు రామయ్య’ గారి కూతురు చిట్టెమ్మను వివాహం చేసుకున్నారు. జక్కేపల్లి వదిలేసి ఖమ్మంలో కాపురం పెట్టారు. అక్కడే ఆ దంపతులకు కృష్ణమూర్తి, సీతారామయ్య అనే కుమారులు, ఆండాళు అనే కూతురు జన్మించారు.

కేశవదాసు తండ్రి నుండి వైద్యవృత్తిని స్వీకరించి ప్రజలకు ఉచిత వైద్యసేవను ప్రారంభించారు. ఆ వృత్తిలో ఉంటూనే కవిగా, గాయకునిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అంతేగాక హరికథా గానం ప్రారంభించి హరిదాసుగా ప్రసిద్ధికెక్కారు. వారి హరికథా గానాన్ని విన్న సుప్రసిద్ధ రచయిత శ్రీపాద కృష్ణమూర్తిగారు పరమానందంతో ‘‘అభినవ సూత’’ బిరుదుతో దాసుగారిని సత్కరించారు.

నల్లగొండ జిల్లా కోదాడ మండలంలోని తమ్మర గ్రామానికి వెళ్ళిన కేశవదాసుకు అక్కడి ప్రధానార్చకులైన నరహరి నరసింహాచార్య గారితో పరిచయం కుదిరాక కేశవశతకం, స్తోత్రాలు, హెచ్చరికలు, మంగళహారతులు, సంకీర్తనలు మొదలైన సాహిత్య ప్రక్రియలను విరివిగా చేపట్టారు. అంతేకాదు, అక్కడే 1907లో ‘భాగవత సప్తాహ యజ్ఞం’ ప్రారంభించారు. ప్రతి సప్తాహంలోనూ వారం రోజుల పాటు పేదవారికి అన్నదానం, వస్త్రదానం వగైరా నిర్వహించేవారు. ధనవంతులు, జమిందారులు అందించే ఆర్థిక సహకారం సరిపోక, తాను కళారంగం ద్వారా సంపాదించిన సొమ్మునంతటిని, బంగారు వస్తువులను అందుకు వినియోగించే వారు. తమ్మర శ్రీసీతారామాలయం జీర్ణోద్ధరణ కోసం తన భార్య దగ్గరున్న విలువైన వస్తువులను కూడా తెగనమ్మి వినియోగించగలిగిన మహోదాత్త హృదయులైన కేశవ దాసును ఇప్పటికీ ‘‘తమ్మర రామదాసు’’ అని సంభావించడం అక్కడివారి హృదయ సంస్కారా నికి నిలువెత్తు నిదర్శనం.

మైలవరం రాజావారి బాలభారతి నాటక సమాజంలో కేశవదాసు ‘ప్రాంప్టరు’ గా ప్రవేశించారు. అక్కడే ‘‘స్వరనిధి, స్వరమూర్తి’’ బిరుదాంకితులైన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు బాపట్ల లక్ష్మీకాంతయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆయనను తన సంగీత గురువుగా గౌరవించిన కేశవదాసు ఎన్నో చక్కని కీర్తనలను రచించారు. ఆ ఇద్దరూ కలిసి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో సంగీత, ధార్మిక కార్యక్రమాలను ప్రవేశపెట్టి ధర్మ ప్రచారానికి ఎంతగానో దోహదం చేశారు. అలాంటి సందర్భంలోనే ‘‘పరబ్రహ్మ పరమేశ్వర’’ గీతం ఉద్భవించింది.

బాపట్ల లక్ష్మీకాంతయ్యగారికి జబ్బు చేసినపుడు కేశవదాసుతో కలిసి యాదగిరి గుట్టకు వెళ్ళి, నరసింహస్వామిని దర్శించుకుని, స్వామిని పద్యాలతో, పాటలతో స్తుతించి, ప్రార్థించాడు. గురువుగారి అనారోగ్యబాధకు స్పందించిన కేశవదాసు ‘‘పరబ్రహ్మ సచ్చిదా నంద’’ అనే కీర్తనను గురునామాంకిత ముద్రతో రచించారు. అది విన్న బాపట్ల వారికి ఒక ఆలోచన స్ఫురించింది.వెంటనే తన ఆలోచనను కేశవదాసుకు చెప్పారు. వెంటనే కేశవదాసు పరమానందంతో త్రిమూర్త్యాత్మికమైన ‘‘పర బ్రహ్మ పరమేశ్వర’’ పాటను రచించగా, అప్పటి కప్పుడే బాపట్లవారు దాన్ని కల్యాణిరాగంలో, రూపకతాళంలో స్వరపరిచారు. దీన్ని నాటక ప్రదర్శనకు ముందు ప్రార్థనగా పాడిద్దామని లక్ష్మీకాంతయ్యగారు సంకల్పించి నాటక సంస్థల వారికి తెలియజేశారు. ఎన్నో నాటక సంస్థల వారికి గురుస్థానంలో ఉన్న లక్ష్మీకాంతయ్యగారి సంకల్పాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ అమలు చేశారు. ఇప్పటికీ ఎన్నో నాటక సంస్థలు, పరిషత్తులు, విశేషించి సురభి నాటక సంఘాల వారు ఈ గీతాన్ని మధురంగా ఆలపించడం ఎంతో ఆనంద దాయకం. మరో విశేషం ఏమిటంటే. ఈ గీతం పల్లవిని మాత్రమే స్వీకరించి 1937లో తీసిన ‘భక్తధ్రువ’ అనే హిందీ సినిమా టైటిల్స్‌ నేపథ్యంలో వినిపించారు. ఈ సినిమాకు పండిట్‌ శాంతిలాల్‌ దర్శకుడు N శంకర్‌ వ్యాస్‌ సంగీతకర్త.

బాలభారతి సమాజంలో కేశవదాసు పనిచేస్తున్నప్పుడే ‘కనక్తార’,‘బలిబంధనం’ అనే రెండు పద్య నాటకాలను రచించారు. వాటిలో ‘కనక్తార’ నాటకం విపరీతమైన జనాదరణ పొందింది. 1911లో రచింపబడిన ‘కనక్తార’ నాటకం సుమారు రెండు వేలకు పైగా ప్రదర్శనలు పొంది దాసుగారిని ప్రముఖ నాటక రచయితల జాబితాలోకి చేర్చింది. ‘కనక్తార’ నాటకం, శ్రీకృష్ణతులాభారం పాటలు కళాభిమానుల మనస్సులను దోచుకుని విజయపతాకాన్ని ఎగరవేస్తూ కేశవదాసుగారి కీర్తి ప్రతిష్ఠలను కలకత్తాదాకా వ్యాపింప జేశాయి. మద్రాసు, బొంబాయి నగరాల్లో యశస్సౌరభాల్ని గుబాళింపజేశాయి.

బాలభారతి సమాజంలో కేశవదాసు పనిచేస్తున్నప్పుడే ‘కనక్తార’,‘బలిబంధనం’ అనే రెండు పద్య నాటకాలను రచించారు. వాటిలో ‘కనక్తార’ నాటకం విపరీతమైన జనాదరణ పొందింది. 1911లో రచింపబడిన ‘కనక్తార’ నాటకం సుమారు రెండు వేలకు పైగా ప్రదర్శనలు పొంది దాసుగారిని ప్రముఖ నాటక రచయితల జాబితాలోకి చేర్చింది.

ఈ నాటకం ఉమ్మడి రాష్ట్రంలోనే కాక బెంగుళూరు, పూనా, రంగూన్‌ మొదలైన ఇతర నగరాల్లో కూడ ప్రశస్తమైన పేరుతెచ్చింది. దీన్ని జగ్గయ్యపేటలో ప్రదర్శిస్తున్నప్పుడు క్రూరసేన పాత్రధారి రాలేకపోతే కేశవదాసే ఆ పాత్రను ధరించి నాటకాన్ని రక్తికట్టించారు. కుదరవల్లి నాటక సమాజం వారు ఈ నాటకాన్ని ప్రదర్శించి నప్పుడు పద్మశ్రీ డా॥అక్కినేని నాగేశ్వరరావు గారు తార పాత్రను ధరించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మరో సందర్భంలో పుట్టపర్తి సత్యసాయిబాబావారు తన చిన్నతనంలో ఈ కనక్తార నాటకంలోని ‘తార’ వేషంవేసి తల్లియైన ఈశ్వరాంబను మురిపింపజేశారు.

‘కనక్తార’ నాటకానికున్న ప్రశస్తిని గమనించి సరస్వతీ టాకీసు వారు 1937లో ఈ నాటక ఇతివృత్తాన్ని సినిమాగా తీశారు. ఈ సినిమా ద్వారా సముద్రాల రాఘవాచార్యులు గారు మాటల రచయితగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు హెచ్‌.వి.బాబు దర్శకుడు. దీన్నే 1956లో గోకుల్‌ ప్రొడక్షన్స్‌ వారు రజనీకాంత్‌ దర్శకత్వంలో తీసినప్పుడు ఘంటసాల స్వరకర్తగా పనిచేసి కమ్మని బాణీలు వినిపించారు. అయితే కేశవదాసుగారి‘కనక్తార’ నాటకంలోంచి మూడు పాటలు, రెండు పద్యాలను ఈ రెండు సినిమాల్లోనూ ఉపయోగించుకున్నారు.

1922 నుండి నిరాఘాటంగా సాగి పోతున్న ముత్తరాజు సుబ్బారావుగారి ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలోని 22 పాటలను కేశవదాసే రాశారు. ఈ పాటలను కురుకూరి సుబ్బారావు 1929లో పుస్తకంగా అచ్చు వేశారు. ఆ పాటలలో ‘‘బలే మంచి చౌక బేరము’’ అనే పాట ఎంతో ప్రసిద్ధి పొందింది. దీనితో పాటు ‘మునివరా ఇటుల్‌’, ‘కొట్టు కొట్టండి’ పాటలు కూడా ప్రజల మెప్పు పొందాయి. అందుకే 1935, 1955, 1966 సం॥లలో వరసగా తీసిన మూడు ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలలోనూ ఈ పాటలు చోటు సంపాదించడం, విశేషించి ‘బలే మంచి చౌకబేరము’ పాటను ఘంటసాల పాడడం చెప్పుకోదగిన ప్రత్యేక విశేషాంశాలు.

‘‘బలే మంచి చౌకబేరము’’ పాట పల్లవి సులభగ్రాహ్యంగా ఉండి సమాజంలోకి బాగా చొచ్చుకుపోయింది. దీనికి వ్యాపార, ప్రచార ప్రకటనలలో ఎన్నో ప్యారడీలు కూడా వచ్చాయి. ఇప్పటికీ పత్రికారంగంలో ప్రధాన శీర్షికలకు ఈ పల్లవి ఉపయోగపడుతూనే ఉంది, దాని సార్వజనీనతను నిరూపించుకుంటూనే ఉంది.

1931లో మొదటిసారిగా తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ తీస్తున్న హెచ్‌.ఎం.రెడ్డిగారికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. హిరణ్యకశిపుడు లీలావతిచేత ప్రహ్లాదునికి విషం ఇప్పించే సన్నివేశం ఒకటి కల్పించి, అందులో రసోద్దీపకమైన పాట ఒకటి ఉంటే బాగుంటుందనిపించింది. దాన్ని రాయించుకోవడానికి మాటలు, పాటలు రాసిన ధర్మవరము రామకృష్ణమాచార్యులు గారు జీవించిలేరు కనుక నాటకరంగ ప్రముఖునితో రాయించాలనుకున్నారు. అప్పటికే రచయితగా పేరు మారుమ్రోగుతున్న చందాల కేశవదాసుగారిని హెచ్‌.ఎం.రెడ్డిగారు పిలిపించుకుని తన ఆలోచన చెప్పారు.

వెంటనే దాసుగారు ‘‘పరితాపభారంబు భరియింప తరమా?’’ అనే పాట రాసి ఇచ్చారు. దీన్ని ఆ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి మధురంగా ఆలపించారు. అదేవిధంగా ‘‘తనయా! ఇటులన్‌’’ అనే పాటను కూడా ఆమె పాడారు. ‘‘భీకరంబగు నా ప్రతాపంబునకు’’ అనే పాటను మునిపల్లె సుబ్బయ్య ఆలపించారు. ఈ మూడు పాటలూ హెచ్‌.ఎం.రెడ్డిగారు కేశవదాసుగారితో రాయించుకున్నవే. అందుకే ఈ పాటలు ధర్మవరంవారి నాటకంలో లేవు.

1935లో కలకత్తాలోని అరోరా ఫిలిం కార్పోరేషన్‌వారు దాసరి కోటిరత్నం సహకారంతో తీసిన ‘‘సతీ అనసూయ’’ సినిమాకు కథ, మాటలు, పాటలు, పద్యాలు మొదలైన సినిమా రచన అంతా కేశవదాసుగారే చేశారు. దీని తరువాత వచ్చిన ‘అనసూయ’ సినిమాలకు, కొన్ని ఇతర పౌరాణిక చిత్రాలకు కేశవదాసు గారి కథాంశమే గొప్ప స్ఫూర్తినిచ్చింది.

ఘనచరిత్ర కలిగిన తెలుగు నాటక రంగస్థలం ఇప్పటికీ ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అని ఆలపిస్తూ రసాత్మక ప్రదర్శనలకు తెరలేపుతూ ఉన్నదంటే, అందుకు ఆ సంగీత సాహిత్యాల ‘‘సజీవ సుధామాధుర్యమే’’ కారణమవుతుందని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి గాదు.

కేశవదాసుగారు అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ నట, దర్శక, గాయక, కథక, అవధాన, సంఘసేవక, సప్తాహ నిర్వాహక పాత్రలను నిర్వహిస్తూ 1948 తరువాత ఖమ్మం నుండి, సూర్యాపేటకు దగ్గరగా ఉన్న నాయకన్‌ గూడెం చేరారు. పిల్లలు ఎక్కడివారక్కడ స్థిరపడ్డారు. దాసుగారు, యువకళాకారునిగా అప్పటికే ప్రసిద్ధి పొందిన శ్రీగంధం నర్సయ్యతో ఆండాళుకు వివాహం జరిపించి నారు. ఆ నవ దంపతులు మునగాలలో స్థిరపడ్డారు. ఎవరూ తోడులేని ఒంటరి జీవితాన్ని తపస్సులాగా గడిపి కేశవదాసుగారు 1956 మే 14న తనువు చాలించినారు.

ఇప్పటికీ వారి సమాధి నాయకన్‌ గూడెంలో ఎవరి ఆదరణకూ నోచుకోక శిథిలమవుతూ ఉంది. ఎవరైనా మహాను భావులు ఉదారంగా ముందుకు వచ్చి ఆ సమాధిని పుణ్యస్థలంగా తీర్చిదిద్దగలిగితే అక్కడ ప్రతి సంవత్సరం సంగీత, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాలని నాలాంటి అభిమానులు భావిస్తున్నారు. అపూర్వ ప్రతిభాశాలి చందాల కేశవదాసుగారికి నివాళులర్పించుకోవడం మన తెలుగు వారి విధ్యుక్తధర్మం.