చెరువు నీళ్ళాడింది

-By వనపట్ల సుబ్బయ్య 

కట్టమైసమ్మ బోనంలా
నిండు పున్నమిలా
మట్టితల్లి పొట్టనిండుగ నీళ్లు
ఆకాశం నక్షత్రాలను పూసినట్లు
నేల నీళ్లను అలికింది
ప్రకృతి జల తీర్థం చెరువు !

చెరువు నీళ్ళాడింది
హృదయం ఆకాశమై ఉప్పొంగింది
మొక్కార్తి గుండె నిండా తడి
పసుపు కుంకుమలతో పూల హారతులు
ఊరు పాదాల చల్లని స్పర్శ
అశ్విక దళాల పరుగు ప్రవాహంలా
తూములను పల్గచీల్చుకొని మత్తడి
ఆనందాల పూలతేరు చెరువు !

పసురాలు పయిలు ఇదిరిస్తున్నయి
మడికట్లు వరినాట్ల ముచ్చట్లు
గూటం మీద వలలు పాలపిట్ట నవ్వులు
మురికి మబ్బుల్ని దులిపే
చాకిరేవు బండల మెరుపులు
సైన్యానికీ బ్రిగేడియర్‌ లా నీరటన్న
చేతిలో నీటిని మలిపే పార
కాపుదనాల కల్లాల కోపులు
చేతి వృత్తుల
బతుకు భరోసా జలచక్రం చెరువు !
మూలనున్న మురుకోలబరుగుల ముస్తాబు
చేతుల నిండా గాలాలు సంచినిండా చాపలు
ఎదురెక్కుతున్న కొడిపె,జెళ్ల,కంచె పిల్లలు
ప్రపంచకప్‌ గెలిచినంత సంబురం
కాసండి నిండా గంటుకలు
కమ్మని కవుసుతో కడుపునింపె కన్నతల్లి చెరువు !
పీర్లకు పాలగుండం
బొజ్జగణపయ్యల నిమజ్జనం
బతుకమ్మల పూల సంబురం

ఈరనాగమ్మ,ఎల్లమ్మ దేవతల గంగజాతర
జేబునిండా చెనిగలు దసరా జంభి
నిండుపండుగల జలగంధం చెరువు !
నీటిఅద్దంపై కొంగలకోలాహలం
బుడుబుంగల మునుగుల తానాలు
పిట్టలు కొంగలు జీవరాసుల బారులు
రాతిసరికెల నీరికట్టెలు
తాబేలుపిల్లల తొంగిచూపులు
కడుపు నిండా కేరింతలు
గతం వలసగీతం చెరువు
నేడు నిండు జలగీతం చెరువు

ఏ తోవల చూసినా గలగల జలధర్వులు
కాళ్లతో పాదులు తీస్తే
మనిషెత్తు చిమ్మే చెలిమెలు
ప్రవహించే పాటలా
కోలాటం కమ్మిన అలల తొలుకులు
దూపైతే చెంబెడు నీళ్లను ముంచిచ్చె
అమ్మచెయ్యి చెరువు

గింజను పంటనుచేసే శక్తి
మట్టిని మాణిక్యం చేసే మహత్తు
వాగులు కుంటలుకాలువల అద్భుతఅల్లికతో
గద్వాలచేనేతలా జలచీర చెరువు
ఒక్కేడు చెరువునిండితే మూడేళ్ళ పంట దమ్ము
పోషమ్మతల్లి చిరునవ్వు చెరువు
గంగమ్మతల్లి జల ఒడ్యానం చెరువు

చెరువు
ఊరుకు బువ్వగిన్నె
చెరువు
ఊరుకు అమ్మ పాలరొమ్ము
చెరువు
ఊరుకు నాన్న గుండె నది