|

సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడ్డి

artపాకాల తిరుమల్‌రెడ్డి అంటే ఆయనెవరో ఎవరికీ తెలియదు. పి.టి.రెడ్డి అంటే చిత్రకళా ప్రపంచంలో ఆయన తెలియనివారు బహుశా ఉండరు. ‘‘నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కుదారుణ ఖండలశస్త్రతుల్యము’’ అన్న పద్యం బహుశా ఈయనను చూసి చెప్పిందేమో అనిపించేది. ఆధునిక చిత్రకారుడుగా, శిల్పిగా పదునైన ఆలోచనకు ఆయన పట్టుకొమ్మ. ఆ ఆలోచనకు ఆకృతులు ఇవ్వడంలో ఆయన దిట్ట. అట్టి ఆకృతులలో కళాత్మకత ప్రదర్శించడంలో ఆయనది ప్రథమ తాంబూలం. కళాత్మక వ్యక్తీకరణలో నిత్యనూతన ధోరణులను ఆయన కన్నుమూసేదాకా అనుసరించడం ఆయన ప్రత్యేకత.

పి.టి.రెడ్డి కరీంనగర్‌ జిల్లాలోని అన్నారంలో 1915 జనవరి 4వ తేదీన పుట్టారు. ఆయన తల్లిదండ్రులు`రమణమ్మ` రామిరెడ్డిగార్లు. వాస్తవానికి ఆయన హాలికుడు. అయినా ఆయన కన్నుమూసేదాకా`కలకాలం నిలిచే కళాకృతులను తీర్చిదిద్దారు.

సుమారు ఏడు దశాబ్దాలక్రితం అమృతాషేర్‌గిల్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లతో సరిసమానంగా ప్రథమశ్రేణి చిత్రకారుడుగా గుర్తింపుపొందిన పి.టి.రెడ్డి ఈనాటికీ భారతీయ చిత్రకళారంగంలో ప్రథమశ్రేణి చిత్రకారుడుగానే మన్ననలు పొందుతున్నాడు.

తనలో చిగురించిన చిత్ర`శిల్పకళలో తన జీవిత సర్వస్వం ధారపోసిన నిత్యకృషీవలుడాయన. దేశంలో వివిధరంగాలలో అనేక నూతన పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో ఎన్నెన్నో వినూత్న ధోరణులు తలెత్తుతున్న నేపథ్యంలో వాటినుంచి, ఆయన జీవించివున్న చివరి రోజులదాకా ఎప్పటికప్పుడు వాటిలోని మంచి చెడులను, తారతమ్య వివక్షతతో వీక్షించి, తెలుగు జీవితానికి అన్వయించే రీతిలో రంగుల మేలు కలయికతో, రమణీయతను, సృజనాత్మకత ను సరిసమానంగా మేళవించి పురోగమించిన మేటి చిత్రకారుడు ` పి.టి.రెడ్డి.
సుమారు ఐదున్నర దశాబ్దాల కళాజీవితపు వెలుగునీడలలో తనను ప్రభావితంచేసిన అనేక సమకాలీన సంఘటనలకు తన చిత్రాలతో ప్రాణంపోసిన పి.టి.రెడ్డి అన్ని తరగతుల ప్రేక్షకుల కళాభిజ్ఞతకు అందుబాటులో ఉండేవిధంగా చిత్రాలను, శిల్పాలను సృజించారు.

ఆయన కన్నుమూయడానికి కొంచెం ముందు రూపొందించిన నైరూప్య శిల్పాలు సైతం ఏదో తెలియని అందాన్ని తమలో నింపుకుని చూపరులకు ఆనందానుభూతిని కలుగజేస్తాయి. వీరిచేతిలో ఆకృతిపొందిన వేలాది కళాఖండాలలో పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యక్తిత్వ వైవిధ్యాన్ని రంగుల రేఖా విన్యాసంలోకి అనువదించిన పద్ధతి కొందరికి ప్రశంసనీయంగా కన్పించవచ్చు. స్వాతంత్య్ర సమర సేనానితుకుడుగా, తాత్వికుడుగా, శాంతిధూతగా, అభ్యుదయ పథగామిగా, దార్శనికుడుగా, ప్రజా నాయకుడుగా ` చిత్రాలలో ఆయన బహుముఖ వ్యక్తిత్వం గోచరిస్తుందంటే దాని వెనుక పి.టి.రెడ్డి పనితనం, భావవ్యక్తీకరణ మెచ్చుకోదగింది. అలాగే ఇందిరాగాంధీ వ్యక్తిత్వంపై కూడా ఆయన ఎన్నో చిత్రాలు వేశారు. కొందరికేమో పి.టి.రెడ్డి వేసిన కృష్ణతత్వం చిత్రాలు అపురూపమైనవిగా తోచవచ్చు. వాటిలో నిబిడీకృతమైన నీలిమరంగుల సంగీతంగా వారికి స్ఫురించవచ్చు లేదా మూర్తి కల్పనలో ఆపాదించిన భావనకు కొందరు పొంగిపోవచ్చు.

ఇంకా కొందరికేమో కామసూత్రాల ఆధారంగా, తాంత్రిక ప్రాతిపదికపై ఆయన గీసిన చిత్రాలను పొగడవచ్చు.

ప్రత్యేక తెలంగాణ పోరాటం సుదీర్ఘంగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన గీసిన చిత్రాలు ప్రశంసనీయమైనవి.

నిత్య జీవితంలో తారసపడే అనేక సంఘటనల ఆధారంగా వేసిన చిత్రాలను, గ్రామీణ జీవితానికి అద్దంపట్టే చిత్రాలను చూసి ‘‘భేష్‌’’ అనవచ్చు. ఏమైనా ఇవి పి.టి.రెడ్డి చిత్రాలు ఆధునిక చిత్రకళా సౌధానికి సామాన్య ప్రేక్షకుడు చేరుకోవడానికి వీలుగా వేసిన సోపాన పంక్తిగా అభివర్ణించవచ్చు.

పి.టి.రెడ్డి ప్రతిభకు గీటురాయిగా అనేక పదవులు కూడా నిర్వహించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ అధ్యక్షుడుగా, ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన చిత్రకారుడుగా ఆయన చేసిన సేవలు చెప్పుకోదగినవి. ఇంతటి సృజనాత్మకశక్తిని పుణికిపుచ్చుకున్న పి.టి.రెడ్డి 1996 అక్టోబర్‌ 21వ తేదీన కన్నుమూశారు.

చివరి రోజులదాకా ఆయన అమితమైన ఉద్రేకశీలం కలవాడే. దేశంలో ఎక్కడ ఏ ధోరణి తలెత్తినా పి.టి.రెడ్డి నిశిత వీక్షణం నుంచి అది తప్పించుకోలేకపోయింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పి.టి. రెడ్డి ఆర్ట్స్‌ మ్యూజియం ‘‘సుధర్శ’’ ఇనిస్టిట్యూట్‌ను చూపవచ్చు.

artingతన చిత్రకళా జీవితంలో రూపులు దిద్దిన చిత్రాలు ప్రకృతి దృశ్యాలు, నిశ్చలన చిత్రాలు, రేఖా చిత్రాలు, తాత్కాలిక చిత్రాలు, రాజకీయ చిత్రాలు, సంప్రదాయ చిత్రాలు, నైరూప్య చిత్రాలు, కామసూత్రాల ఆధారంగా వేసిన చిత్రాలు, డ్రాయింగ్‌లు మొత్తం ఏడువందల యాభై తమ దివంగత కుమారుడు విజయకుమార్‌ స్మృత్యర్థం ఏర్పాటుచేసిన ట్రస్టుకు అప్పగించాలనే ఆలోచనలతో ఆయన కృషి చేశారు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో పి.టి.రెడ్డి ఆర్ట్స్‌ మ్యూజియం కొనసాగాలని ప్రతిపాదించారు. ఆ మ్యూజియంలో ఒకేసారి ఏడువందల చిత్రాలను ప్రదర్శించే అవకాశం ఉండేది. దానికి అను బంధంగా నగరానికి వచ్చే చిత్రకారులు బసచేయడానికి వీలు గా పది పడకలు ఏర్పాటు చేయాలని ఆయన కృషి చేశారు.

చిత్రకళ, శిల్పకళపై ఐదువందల గ్రంథాలు, జాతీయ`అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనల విశేషమైన క్యాటలాగులతో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కూడా ఆయన సంకల్పించారు.

కాని అర్థాంతరంగా పి.టి.రెడ్డి కన్నుమూయడంతో ఆ పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి.

పి.టి.రెడ్డి ధర్మపత్ని శ్రీమతి యశోదారెడ్డి నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కొంతకాలం ప్రయత్నించారు. వాత్సాయన, అనంగరంగ, హరిహరభట్‌, కోకన్‌, ఎర్రనల తులనాత్మక అధ్యయనంచేసి, కామసూత్రాలపై పి.టి.రెడ్డి రూపొందించిన వంద వర్ణచిత్రాలు, డ్రాయింగ్‌ల గ్రంథాన్ని వెలుగులోకి తేవాలనుకున్నారు. అట్లాగే తాంత్రిక కళపై పి.టి.రెడ్డి చిత్రించిన అరవై వర్ణచిత్రాలు, అరవై డ్రాయింగ్‌ల గ్రంథం మరొకటి వేయాలని కూడా ఆమె తలచారు. కాని ఆమె ఆరోగ్యం ఏ మాత్రం సహకరించక పని ముందుకుసాగలేదు.

art2పి.టి.రెడ్డి చిత్రించిన ‘‘నాన్‌ ఆబ్జెక్టివ్‌ చిత్రాలు`వాటి పూర్వాపరాలు’’ విలువరించే మరొక గ్రంథం ప్రచురించాలనే దృష్టికూడా యశోదారెడ్డికి ఉండేది. ఇవేవీ ఒక రూపం ధరించకుండానే యశోదారెడ్డి తనువు చాలించారు. అయితే ఆయన బతికున్నకాలంలోనే కళాజీవితాన్ని, కళాఖండాల ప్రతులను పొందుపరిచిన బృహత్‌గ్రంథం వచ్చింది. అప్పుడు సుమారు ఐదున్నర లక్షల రూపాయల వ్యయంతో బహు సుందరంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా దాన్ని ప్రచురించారు. నూనుగుమీసాల నూత్న యవ్వనంతోనే తల్లిదండ్రులను, బంధుమిత్రులను కాదని, వారి అభీష్టాలకు వ్యతిరేకంగా, తనకు ప్రాణప్రదమైన కుంచెను పట్టుకుని కళారంగంలో ఉద్యమించాడు పి.టి.రెడ్డి. రాజాబహద్దూర్‌ వెంకట్రామ్‌రెడ్డి, పింగలి వెంకట్రామారెడ్డి ప్రభృతుల చేయూతతో తాను వరించిన కళారంగంలో అనల్పమైన కృషి చేశారు. 1935-42 మధ్యకాలంలో ముంబైలోని జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిప్లొమా చదివి ప్రథమశ్రేణిలో సర్వప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం అక్కడ కుడ్య చిత్రకళ అధ్యయనం చేశాడు. ఓం ప్రథమంగా 1942లో ‘‘వ్యష్టి’’ చిత్రకళా ప్రదర్శన నిర్వహించి, ఎందరెందరో కళాకారులకు మార్గదర్శకుడ య్యాడు పి.టి.రెడ్డి. ఆ తర్వాత ముంబై కేంద్రంతో దేశంలో ఉప్పెనలా వచ్చిన అభ్యుదయ కళోద్యమం పి.టి.రెడ్డి నేతృత్వంలోనే కొనసాగింది.

అనంతరం దేశంలోనే తొలుదొలుత ఆయన వేసిన వర్ణచిత్రాలు, తెలుపూ నలుపు చిత్రాలు, డ్రాయింగ్‌లతో ఒక పోర్ట్‌పోలియో ప్రచురించారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన పి.టి.రెడ్డి అనేక పరిస్థితుల కారణంగా 1945 నుంచి దాదాపు పది సంవత్స రాలకాలం తన ప్రధానవృత్తిని కట్టిపెట్టి లాహోర్‌లో ఒక చలనచిత్రానికి కళాదర్శకత్వం వహించడం, ఇత్యాది కార్యాలలో గడిపారు.

artingతర్వాత తిరిగి కళారంగంలో పాదంమోపి, తన ప్రతిభా వ్యుత్పత్తులను ఇనుమడిరపచేసుకున్నారు. దేశవిదేశాలలో నిర్వహించే ఎన్నెన్నో చిత్ర, శిల్పకళా ప్రదర్శనలలో, పోటీలలో పాల్గొని ప్రశంసలు పొందారు. అనేక బహుమతులు గెలుచుకున్నారు. వీరు తీర్చిదిద్దిన చిత్రాలెన్నో ఇవాళ ఎన్నో మ్యూజియాల్లో అలంకరించి ఉన్నాయి. ఎందరెందరో దేశీయు లు, విదేశీయులు వీరి చిత్రాలను సేకరించారు.

‘‘కళాకారుడు నిలబడడానికే సతతం ప్రయత్నించుకాని డబ్బును సంపాదించడానికి నా విద్యను సాధనంగా ఎప్పుడూ చేసుకోలేదు’’అనేవారు పి.టి.రెడ్డి. ఆమాటకొస్తే`‘‘బతకడానికి తిన్నానుతప్ప, కేవలం తినడానికే తాను జీవించలేద’’ని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవారు.

ఈ సిద్ధాంతం తాను యువకుడిగా ఉన్నప్పటినుంచీ ఆచరణలో పెట్టాననీ, ఇది తన ఒక్కడికే కాకుండా ప్రతి యువకుడికి, ముఖ్యంగా యువ కళాకారులకు ఆచరణ యోగ్య మైందని కూడా పి.టి.రెడ్డి చెప్పేవారు.