కోకాకోలా రెండో యూనిట్
వెయ్యి కోట్ల పెట్టుబడి – 300 మందికి ఉపాధి

అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ కోకాకోలా తన రెండవ యూనిట్‌ను సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రభుత్వం కేటాయించిన 48.53 ఎకరాలలో నెలకొల్పనున్నది. దీనికి రూ. 1000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నారు. తొలివిడతలో రూ. 600 కోట్లను వచ్చే రెండు సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడిరచారు. ఈ మేరకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (హెచ్‌సీసీబీ)తో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎంఓయులను కుదుర్చుకున్నది. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాల నిర్మాణం తదితర అంశాలపై ఎంఓయు కుదుర్చుకుంది. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో ఈ ఒప్పందాలపై హెచ్‌సీసీబీ ఛైర్మన్, సీయిఓ నీరజ్‌గార్గ్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌లు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో హెచ్‌సీసీబీ రెండవ యూనిట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో 300 వందల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వీరిలో 50 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉంటారని పేర్కొన్నారు. హెచ్‌సీసీబీ సంస్థ తెలంగాణలో పండుతున్న నాణ్యమైన మామిడి, బత్తాయి పండ్లతో జ్యూస్ తయారుచేయాలని, తద్వారా పండ్లు పండిరచే రైతులకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. కోకాకోలా ఫ్యాక్టరీలో నీటిని వందశాతం రీ సైక్లింగ్ చేసి వాడుతున్నారని, ఆ టెక్నాలజీని ఇతర పరిశ్రమలకు కూడా నేర్పడానికి కంపెనీ ఒప్పుకోవడం అభినందించదగిందని ఆయన అన్నారు.
హెచ్‌సీసీబీ ఛైర్మన్, సీఈఓ నీరజ్‌గార్గ్ మాట్లాడుతూ, తమ రెండవ యూనిట్ 2023లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పారిశ్రామిక పాలసీ తెలంగాణలో ఎంతో బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో హెచ్‌సీసీబీ బాట్లింగ్ ఇన్‌వెస్ట్‌మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబలో రోడ్రిగ్యుజ్, టీఎస్‌ఐఐసీ ఎం.డి. నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.