కూల్‌రూఫ్‌తో కూల్.. కూల్
ప్రభుత్వం ఎలాంటి పాలసీలు ప్రవేశపెట్టినా, ప్రజల సంక్షేమమే అందులో దాగి ఉంటుందని, తాము ప్రవేశపెడుతున్న కూల్‌రూఫ్ పాలసీ కూడా ప్రజలకు ఉపయోగపడే పాలసీ అని, భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, దేశంలోనే మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆయన రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ప్రధాన కార్యాలయంలో కూల్‌రూఫ్ పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూల్‌రూఫ్ పాలసీ వల్ల ఇంట్లో వాతావరణం చల్లగా మారుతుందని, అలాగే విద్యుత్ వాడకం కూడా తగ్గుతుందని అన్నారు. కూల్‌రూఫ్‌కు ఖర్చు చేసిన డబ్బులు విద్యుత్ బిల్లులు తక్కువ కావడం వల్ల ఆదా అవుతాయని తెలిపారు. ఇంటిలో చల్లదనం ఉండడంతో వేడివల్ల ఉత్పన్నమయ్యే అనారోగ్యం కలగదని, దానివల్ల కూడా ఆరోగ్యాలు బాగుంటాయని, వైద్యానికయ్యే ఖర్చు ఉండదని పేర్కొన్నారు. ఇలా పలు విధాలుగా ఉపయోగపడే ఈ పాలసీని ప్రజలు బాగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఏ పాలసీ అయినా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతం అవుతుందని అన్నారు. వేసవికాలం ప్రారంభంలో ఇది ప్రారంభిస్తే అవసరం ఉన్న సందర్భంలోనే ప్రజల నుంచి సరైన స్పందన వస్తుందని ఇప్పుడు ఇది ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయంలో దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ పాలసీ కింద 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించి అన్ని భవనాలకు తప్పనిసరిగా కూల్‌రూఫ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. అలా చేస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. ఈ విషయంలో బిల్డర్లు కూడా సహకరించాలని ఆయన కోరారు. దీని అమలుకు కొన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రవేశపెట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. తాము కూడా ప్రభుత్వ భవనాలకు, డబుల్ బెడ్‌రూం ఇండ్లకు కూడా కూల్‌రూఫ్ ఏర్పాటు చేస్తామన్నారు.
నేను ఆచరించే మీకు చెబుతున్నాను..
ఈ కూల్ రూఫ్ పాలసీ పాటించమని మీకు చెప్పే ముందు నేను ఆచరించానన్నారు. మా ఇంటిలో మా ఆవిడకు చెప్పి ఇంటి పై కూల్‌రూఫ్ పెయింట్ వేయించానని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరు తప్పకుండా కూల్‌రూఫ్ వేయించుకోవాలన్నారు. ఇప్పుడు నిర్మించబోయే భవనాలకే కాకుండా, పాత భవనాలకు కూడా కూల్‌రూఫ్ వేయించకోవాలని కోరారు. కాలనీ అసోసియేషన్లు, అపార్టుమెంటు అసోసియేషన్లను కలిసి వారు వేసుకునేలా మున్సిపల్ అధికారులు ప్రయత్నించాలన్నారు.
దేశానికే దిక్సూచి కావాలి మన హైదరాబాద్
మన రాజధాని నగరం హైదరాబాద్ దేశానికే దిక్సూచి కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటికే అన్ని విషయాలలో మనం ముందున్నామన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో 2022లో మిగతా బెంగుళూరు, బాంబే, పూనే తదితర నగరాల కంటే మనం ముందంజలో ఉన్నామన్నారు. అంతటి కరోనా విపత్తులో కూడా ఆఫీస్‌స్పేస్‌కు డిమాండ్ తగ్గలేదన్నారు. ఇప్పుడు మన నగరాన్ని మనం కూల్‌గా మార్చుకుని, దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఉద్యోగాల కల్పనలో కూడా మన నగరమే మేటి అన్నారు. నగర భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న వనరులు మరెక్కడా లేవన్నారు. టి.ఎస్. బి-పాస్‌తో పర్మిషన్లు త్వరగా వస్తున్నాయన్నారు. లంచాల బాధలు లేవన్నారు. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తో ముందుకు పోతున్నామన్నారు. 2028 నాటికి హైదరాబాద్ దాని చుట్టపక్కల కలిపి 200 చదరపు కిలోమీటర్లు, తెలంగాణ అంతటా 100 చదరపు కిలోమీటర్లు పరిధిలో ఈ కూల్‌రూఫ్ పాలసీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
నగరంలో ఎక్కువగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని, దానితో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఇదే కాకుండా కూల్‌రూఫ్ పాలసీ అమలు కోసం కొందరు ప్రోఫెషనల్స్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. వారు భవనాల యజమానులు, అసోసియేషన్ల వద్దకు వెళ్ళి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు.
అత్యంత వేగంగా పట్టణీకరణ
తెలంగాణలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్నదని మంత్రి తెలిపారు. ప్రపంచ మంతటా గత ఐదువేల సంవత్సరాలలో జరిగిన పట్టణీకరణ, రాబోయే 50 సంవత్స రాలలో జరుగుతుందని వేధావులు అంచనా వేసినట్లు తెలిపారు. పట్టణీకరణలో మన రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. మన రాష్ట్రంలో 47శాతం పట్టణీకరణ జరిగిందని పేర్కొన్నారు. పట్టణీకరణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భవన వ్యర్థాలతో ఇబ్బందులు కలుగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ఈ పాలసీని అర్థం చేసుకుని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు ఐఐఐటి ప్రొఫెసర్ విశాల్ గార్గ్, ఎన్‌ఆర్‌డీసీ ప్రతినిధి నీతూ జైన్‌లు కూల్‌రూఫ్ పాలసీకి సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ప్ర్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రెడ్కొ ఛైర్మన్ సతీష్‌రెడ్డి, సీడీఎంఏ ఎస్.సత్యనారాయణ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.