|

ఖండాంతరాలకు సాంస్కృతిక సౌరభాలు

tsmagazine
తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ నాలుగేళ్లలో మనభాష, సాహిత్యం, సంస్కృతికి మునుపెన్నడూ లేనివిధంగా ఆదరణ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం భాషా, సాహిత్యాలను వివిధ రూపాలలో ప్రోత్సహిస్తోంది.

ప్రపంచంలోని తెలుగువారంతా గర్వించే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన తీరు భాషాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 42 దేశాలు, 16 రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రతినిధులతో నభూతో న భవిష్యతి అనే విధంగా నిర్వహించిన ఈ మహాసభలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోతాయి.

తెలంగాణ సాహిత్య, కళా, సాంస్కృతిక వారసత్వ సంపద అతి ప్రాచీనమైనదని, మహోన్నతమైనదని ప్రపంచానికి చాటిచెప్పే ఎన్నో బహత్తర కార్యక్రమాలకు రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శ్రీకారంచుట్టి అమలుపరుస్తోంది. తెలంగాణ సాంస్కృతిక సౌరభాలను ఖండాంతరాలకు వ్యాపింపచేయడంలో సఫలీకృత మవుతున్నది. తెలంగాణకే ప్రత్యేకమైన పేరిణి నృత్యాన్ని 256 మంది కళాకారులతో లలితకళా తోరణంలో మహా నృత్యంగా ఏర్పాటుచేసి ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. 11వ శతాబ్దంలో ప్రారంభమైన ఆనాటి పేరిణి మధ్యలో కనుమరుగై మళ్ళీ డా. నటరాజ రామకృష్ణ కృషితో పునరుజ్జీవం పొందింది. దానికి మరింత జవసత్వాలు కల్పించే విధంగా అన్ని జిల్లాలలోనూ పరివ్యాప్తి చేస్తున్నది. ముఖ్యంగా రేపటి తరాలకు తెలిసే విధంగా విద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు.

తెలంగాణ కళారాధన పేరుతో జానపద, గిరిజన గ్రామీణ కళారూపాలు ప్రదర్శించే కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించింది. భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చొరవతో కవిసమ్మేళనాలు నిర్వహించి, వాటిని పుస్తక రూపంలో తీసుకురావడం కవిత్వానికి శాశ్వతత్వాన్ని అందించింది. ఈ శాఖ ఆధ్వర్యంలో తొలిపొద్దు, తంగేడువనం, మట్టిముద్ర, కొత్తసాలు, తెలంగాణకు హరితహారంపై ఆకుపచ్చని పొద్దుపొడుపు, తెలంగాణ తేజో మూర్తులు, మొదలైన గ్రంథాలను ప్రచురించారు. మహబూబ్‌ నగర్‌ నుంచి వెలువడిన మరొక కవితా సంకలనం బంగారు తెలంగాణ పాలమూరు కవితా తరంగిని. బాషా, సాంస్కృతిక శాఖ మహబూబ్‌నగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 50 మంది కవులతో నిర్వహించిన కవిసమ్మేళనంలోని కవితలతో ఈ పుస్తకం వెలువరించారు.
tsmagazine
నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ద్వారా ధియేటర్‌ ఫెస్టివల్‌ భారత్‌ రంగ్‌, ఆదివాసుల కళారూపాలతోకూడిన అధిరంగ్‌ మహోత్సవం వంటి జాతీయ, అంతర్జాతీయ కళారూపాలను ఏర్పాటుచేసి నాటక కళా ప్రియులకు భాషా, సాంస్కృతిక శాఖ మరింత చేరువయింది.సినీవారం పేరిట ప్రతి శనివారం యువదర్శకులు, రచయితలు, నటులకోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు రూపొందించిన డాక్యుమెంటరీలు, ఫీచర్‌ ఫిల్మిమ్‌లు ఉచిత ప్రదర్శనకు రవీంద్రభారతి వేదికవుతోంది. ‘సండే సినిమా’ పేరుతో ప్రతి ఆదివారం సాయంత్రం ప్రపంచ సినిమాల ప్రదర్శనలతోపాటు ఔత్సాహిక సినీ కళాకారులకోసం ఫెంటాస్టిక్‌ ఫైవ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నారు. కళాకారులలోని సజనాత్మకతను వెలికితీయడం కోసం పైడి జయరాజ్‌ థియేటర్‌లో ఈ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తున్నట్టు, ఇప్పటివరకూ ఇరాన్‌, జర్మనీ సినీ ఉత్సవాలను నిర్వహించినట్టు భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

వీటికి తోడుగా రాష్ట్రప్రభుత్వం ఈ శాఖ ద్వారా వేలాది మంది కళాకారులకు పింఛన్లు అందిస్తోంది. తెలంగాణ వైతాళికుల తైలవర్ణ చిత్ర ప్రదర్శన, కాళోజీ, దాశరథి , తదితర ప్రముఖుల జయంతులు, వర్ధంతులు అధికారికంగా నిర్వహిస్తు న్నారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాష్ట్రావతరణ దినోత్సవాలలో వివిధ రంగాలలో విశేషకృషి చేసిన వారికి ప్రభుత్వం అవార్డులు కూడా అందజేస్తోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా భాషాభిమాని, కవి, మన సంస్కృతీ సంప్రదాయాలను ఆరాధించే వారు కావడంతో, ఆయన సూచనలు, సలహాలతో భాషా, సాంస్కృ తిక శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

వద్దిరాజు జనార్దన రావు