తెలుగున వెలుగులు నింపే పుస్తకాలు

By: కూర చిదంబరం

కాకతీయుల కాలం నుండి సాహిత్య పరంగా ఓరుగల్లు ప్రాంతానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. కులాన్ని లెక్కచేయని పాల్కురికి సోమన, రాజుల్ని ధిక్కరించిన బమ్మెర పోతన, నిన్నమొన్నటి వరకు, మన మధ్య ఉండి. రాజ్యాధికారాన్ని సవాలు చేసిన కాళోజీ (కాళోజీ నారాయణ రావు 1914`2022) దాశరథి సోదరులు, అనుముల కృష్ణమూర్తి, అమ్మంగి వేణుగోపాల్‌ అంపశయ్య నవీన్‌, రామాచంద్రమౌళి ` ఎందరో సాహిత్యమౌక్తికాలతో తెలంగాణ తల్లి కంఠసీమనలంకరించారు.

తెలంగాణలో కవులే లేరని పరిహసించిన వారికి దీటైన జవాబుగా 1934లోనే సురవరం ప్రతాపరెడ్డి 350 మంది కవుల వివరాలు సేకరించి చూపారు. అందులో పావువంతు కవులు ఈ ప్రాంతం వారేనట!

వేటూరి రాములు విద్యార్థికి చిన్ననాటి నుండే కవిత్వంపై ఆసక్తి, అభిరుచి ఉంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేశారు. తొలినాట కథలు కూడా రాసినా, కవిగానే స్థిరపడ్డారు. 14 కవితా, వ్యాస సంపుటాలను వెలువరించారు.

దక్కన్‌ దస్తూరి: విద్యార్థి కవిత్వంతో పాటు అడపాదడపా వచన రచనలు చేస్తారు. అనేక మంది రచయితలతో తనకున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని, తనదైన లో చూపుతో వివిధ పత్రికలకు, ఆఫ్‌ ఇండియా రేడియోకు వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలను పుస్తక రూపంగా ఇప్పుడు మనకందించారు. ఇందులో 22 వ్యాసాలున్నాయి. కాళోజీ సోదరులు, కాళోజీ రామేశ్వర రావు, కాళోజీ నారాయణ రావు, పొట్లపల్లి రామారావు అనుముల కృష్ణ మూర్తి, కోవెల సుప్రసన్నాచార్య, జయశంకర్‌ సార్‌ (వేరు తెలంగాణా పోరాట వీరుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు స్ఫూర్తి ప్రదాత) సామల సదాశివ, అంపశయ్య నవీన్‌, డా॥ అమ్మంగి వేణుగోపాల్‌, వేణు సంకోజు ప్రభృతుల గురించిన వ్యాసాలివి.

ఆ, యా, కవులతో తనకున్న పరిచయాలు, వారి ప్రత్యేకతలు, తెలుగు సాహిత్యంలో వారికున్న సుస్థిర స్థానం లాంటి వివరాలు ఎక్కడా ఉత్కర్షలకు పోకుండా సంక్షిప్తంగా వివరించారు. ఉర్దూ సాహితీ ప్రపంచంలో ‘దక్కన్‌ కవి’గా కాళోజీ రామేశ్వర రావును పేర్కొనటం, యోగిలాంటి కాళోజీ నారాయణ రావును విశ్వమానవుడనటం అనుముల కృష్ణమూర్తిని రసబ్రహ్మగా అభివర్ణించటం ఉద్యమం, త్యాగం, విజయంగా, జయశంకర్‌ సార్‌ని నుతించటం ఏది రాయగూడదో తెలిసిన కవిగా సామల సదాశివని వివరించడటం, ప్రపంచ పోకడే అంపశయ్య అంటూ నవీన్‌ ‘చైతన్య స్రవంతి’ని ప్రస్తుతించటం, ఉర్దూ, తెలుగు సాహిత్య వారధిగా డా॥ అమ్మంగి గురించి వ్రాయటం విద్యార్థి ప్రత్యేకత! ఆయనే వ్రాయగలిగిన దస్తూరి!

ఓరుగల్లు చేవ్రాలు: విద్యార్థి 2021 మధ్యకాలంలో పాఠకులకందించిన మరో మహత్తర కావ్యం. కథలు చాలా అరుదుగా వ్రాసిన ‘కాళోజీ కథలు’ పై సమ వీక్షణం (కాళోజీ కథా మంజూష), కాళోజీ సోదరులకు ఆప్తుడైన బండారి అంకయ్య ‘అక్షర తార’ అనే వచన కవితల ఖండ కావ్యానికు వ్రాసిన ముందుమాట, పాండితీ ప్రకర్ష మెండుగా కలిగిన డా॥ వజ్జల రంగాచార్య ‘సీతాఫలం’ వచన కవిత కిచ్చిన ముందుమాట (కవితామృతం), వడ్లకొండ దయాకర్‌ అనుభవాలనుండి పుట్టిన అనుభూతి కవిత్వం (బంతి బువ్వ) కాలం కొలవలేని నియోగి రచించిన ‘అక్షర నక్షత్రాలు’కు వ్రాసిన ముందుమాట, ఉదయశ్రీ, మాదారపు వాణిశ్రీ కవితా సంపుటిలకు వ్రాసిన ముందుమాటలున్నాయి. గత 6 సంవత్సరా లుగా నిర్వహించబడుతున్నది కవితా వార్షిక, 2009 సంవత్సరంలో వీరు నిర్వహించిన ‘కవితా వార్షిక ` 2009లోని కవితల సమా హారానికి ముందు మాటలు పొందుపరిచారు. సంకలనంలోని చివరి రెండు అధ్యాయాలులో ఒకటి ‘స్త్రీల రక్షణ ఒక సామాజిక బాధ్యత’, మరొకటి తను పుట్టిన గ్రామం ‘గవిచర్లను 70 ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకుంటూ (మా ఊరొక ఋషి వాటిక) వ్రాసిన వ్యాసాలు ఇచ్చారు.

‘ముందుమాట’ (లేదా పీఠిక) అనేది ఒక పుస్తకానికి సింహద్వారం వంటిది. రంగుల రంగవల్లులమర్చిన ‘ముంగిలి’ వంటిది. అవి ఆ ఇంటి స్థితిగతుల్ని ఇంటి లోపలి సభ్యతా సంస్కారాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి రచయిత తన గ్రంథానికి ముందు మాట ఒక లబ్ధ ప్రతిష్టుడితోనేె ఒక ఒక సాహితీ మణిదీపం లాంటి ప్రముఖుడితోనో వ్రాయించుకోవాలని తహతహలాడుతారు. విద్యార్థి, ప్రతి ముందు మాటలోనూ రచయిత సంపూర్ణత్వాన్ని లైటువేసి చూపుతాయి. రచయిత కంటే ఎక్కువ తెలిసిన వారు ‘ముందు మాట’ వ్రాయగలరు అని విద్యార్థి నిరూపించుకున్నారు.

సరళత, సమగ్రత, సంక్షిప్తతో ‘దక్కన్‌ దస్తూరి’, బలమైన చేవ్రాలును బలమైన ఆలోచనల ద్వారా వ్యక్త పరిచిన ‘ఓరుగల్లు చేవ్రాలు’ సాహిత్యాసక్తులైన ప్రతి తెలుగు పౌరుడు చదవవలసిన చదివి భద్రపరచుకోదగ్గ రచనలు. రచయితకు అభినందనలు. వీరి రచనా శీలతకు, పరిపూర్ణతకు అభివాదములు.

‘దక్కన్‌ దస్తూరి (సాహిత్య వ్యాసాలు) ఓరుగల్లు చేవ్రాలు (పీఠికలు)
రచన : వి.ఆర్‌. విద్యార్థి&nbsp
వెల : రూ. 200/, రూ. 100/
ప్రతులకు : వేటూరి రత్నమాంబ, కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లి, వరంగల్లు. ఫోన్‌ : 9000283672
సుప్రసిద్ధ పుస్తక విక్రేతలు