|

జీవితమంతా ప్రజా సేవలోనే..!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సిద్ధిపేట పర్యటన ఉత్సాహంగా, రసవత్తరంగా కొనసాగింది.. పర్యటన ఆద్యంతం మరోసారి పాత కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చారు.. సుదీర్ఘ కాలం తరువాత సీఎం కేసీఆర్‌ తన స్పీచ్‌లో ప్రతిపక్ష పార్టీలపై ఘాటైన విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే తన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, వాటి అమలు తీరు, ప్రజలకు వాటి ద్వారా అందుతున్న ప్రయోజనాలను క్షుణ్ణంగా వివరించారు. ఆద్యంతం ఛలోక్తులతో, సిద్ధిపేటతో తనకున్న అనుబంధాన్ని, పరిచయాలను గుర్తు చేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు.

సిద్ధిపేటలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు.. తాగు, సాగు నీరు, కరెంట్‌, ఎరువుల కోసం ఎంత గోస పడ్డామో వివరించారు. సాగునీళ్లకు, తాగు నీళ్లకు చివరికి మనిషి సచ్చిపోతే కూడా నీళ్లు దొరకని రోజులు చూసినమన్నారు. కరెంట్‌ కోసం ఒక్క సిద్దిపేటనే కాదు తెలంగాణ అంతా గోస పడ్డదన్నారు. ప్రజలకు అవసరమైన బేసిక్‌ అవసరాలు తీరకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని, గత పాలకులు వాటినే పూర్తిగా విస్మరించారని విమర్శించారు. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలనలో పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అక్కడి నుంచే తెలంగాణ పునర్నిర్మానం ప్రారంభించినమన్నారు. అందుకే దాని పేరు మిషన్‌ కాకతీయ అని పేరు పెట్టినమన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదట కరెంట్‌ బాగు చేసుకున్నామని, తరువాత వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి గ్రామగ్రామాన వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఊరూరా నర్సరీలు ఏర్పాటు చెసుకున్నామన్నారు. ఈ రోజు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని, ఈ యాసంగిలో  3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తాను బతికున్నంత వరకు ఇలాగే ప్రజలకు సేవ చేస్తానని, ఎవరేమన్నా పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత తెలంగాణ ఫలితం సాధించి, ప్రగతి బాట పట్టి ముందుకు సాగుతున్న రాష్ట్రమన్నారు.. ఇలా సాగుతున్న తెలంగాణకు ప్రోత్సాహాన్ని ఇస్తే మరింత అభివృద్ధి తథ్యమని సీఎం పేర్కొన్నారు.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ ద్వారా సిద్ధిపేటకు వచ్చిన సీఎం.. మొదట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రారంభించారు. అక్కడ పలువురు ప్రజాప్రతినిథులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎంకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం న్యూ కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించగా, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ రిబ్బన్‌ కత్తిరించారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రజాప్రతినిథులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

మండుటెండల్లో అలుగులు దూకే అద్భుత దృశ్యాన్ని చూసి ఆనంద బాష్పాలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. దీని కోసమే పోరాడి తెలంగాణ సాధించు కున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్ధిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలోనే పుట్టి పెరిగానని.. తాను పుట్టిపెరిగిన సిద్ధిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సిద్ధిపేట జిల్లా ప్రజలకు సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిరదన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నిండాయని, ఇలాంటి అభివృద్ధినే తెలంగాణ కోరుకుందని చెప్పారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్‌, మే నెలల్లోనూ పొంగిపొర్లాయన్నారు. వీటి కోసమే తెలంగాణ సాధించుకున్నామని.. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

దేశానికి ధాన్యాగారంగా..

తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారిందని, రాష్ట్రంలో ఈ ఏడాది 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిరదన్నారు. దేశంలో ఇంతవరకు అగ్రభాగాన ఉన్న పంజాబ్‌ రాష్ట్రాన్ని అధిగమించినట్లు చెప్పారు. గతంలో రాష్ట్రంలో గోదాముల సమస్య ఉండేదని.. గతంలో 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదాముల సామర్ధ్యాన్ని 25 లక్షల టన్నులకు పెంచినట్లు వెల్లడిరచారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం భూములు 2.75 కోట్ల ఎకరాలు కాగా వీటిలో రైతుల వద్ద కోటిన్నర ఎకరాల వరకు భూములు ఉన్నట్లు తెలిపారు. ప్రతి 5 వేల ఎకరాలను క్లస్టర్‌గా విభజించి ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. ప్రపంచంలో ప్రస్తుతం అద్భుతమైన కలుపు మందులు ఉన్నట్లు తెలిపిన సీఎం ఒక్కసారి కలుపు మందు పిచికారీ చేస్తే మళ్లీ గడ్డి మొలకెత్తే పరిస్థితి ఉండదన్నారు. కలుపు మొక్కలు లేకపోతే పంట దిగుబడి ఎక్కువగా వస్తోందన్నారు. తెలంగాణలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంటే.. అందులో 1.65 కోట్ల ఎకరాల భూమి రైతుల చేతిలో ఉందన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఓ రైతు వేదిక ఏర్పాటు చేశామని,.వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనలతో సంస్కరణలు చేపట్టామన్నారు. రైతు వేదికల్లో వెంటనే సమావేశాలు ప్రారంభించాలన్నారు.

గుజరాత్‌, తమిళనాడులో పత్తి బాగా పండుతున్నప్పటికీ.. అక్కడి పరిశ్రమలు తెలంగాణ పత్తి కొనేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ప్రపంచంలో పండే నాలుగైదు రకాల మేలైన పత్తిలో తెలంగాణలో పండేది ఒకటని, రైతులు పత్తి సాగు మీద కూడా దృష్టి సారించాలన్నారు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 50 జిన్నింగ్‌ మిల్లులు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 400కు పెరిగిందన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని,  రైతు మీద ఆధారపడి అనేక వర్గాలు జీవిస్తున్నాయన్నారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తారనే ఉద్దేశంతోనే రైతుబంధు ప్రారంభించామని, అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లో నేరుగా రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నమని చెప్పారు.

నకిలీ విత్తనాలపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపినట్లు వివరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే రైతుబంధు జమచేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు 95 శాతం సద్వినియోగం అవుతోందని సీఎం వెల్లడిరచారు.

మూడేళ్ళ కష్టం ధరణి..

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. భూసమస్యల పరిష్కారానికే ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పోర్టల్‌ తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించామని, అది మూడేళ్ల కష్టంగా పేర్కొన్నారు. ధరణితో రైతుల భూ సమస్యలు తీరిపోతున్నాయని సీఎం అన్నారు. ఒక్క ధరణి పోర్టల్‌ కోసం మూడేళ్లు కష్టపడ్డట్లు తెలిపారు. ఇప్పుడు ధరణి ద్వారా 6 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో 93.5 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని చెప్పారు. ధరణిలో నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ‘‘గతంలో రైతులను ఏడిపించి భద్రత లేకుండా చేశారు. ధరణిలో భూమిని నమోదు చేసుకున్న అన్నదాతలు నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ లేదు’’ ముఖ్యమంత్రి కి కూడా అని సీఎం పేర్కొన్నారు. ఏ ఊరిలో సర్పంచ్‌ ఆ ఊరిలో పనులు చేసుకుంటరు. సర్పంచ్‌లకే డబ్బులు అందజేయండని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 56 శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్‌ తెచ్చిన రూ.2 కిలో బియ్యం తనకు బాగా నచ్చిన పథకం అన్నారు. రూ.2 కిలో బియ్యంతో ఆకలి చావులు తగ్గాయన్నారు.

ప్రగతిని వివారిస్తూనే…

ఒకవైపు తమ ప్రభుత్వ ప్రగతి ఫలాలు వివరిస్తూనే ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు. కాళేశ్వరం కడితే కూడా కొన్ని కుక్కలు మొరిగినయని, ఏ కుక్క మొరిగినా, అరిచినా వంద శాతం బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని, ప్రజలకు మేలు చేస్తే ఓట్లు అడిగినా వేస్తారు… అడగకున్న వేస్తారన్నారు.

మల్లన్నసాగర్‌ పూర్తి అయితే నెత్తి మీద కుండలాగా ఉంటదని, ఈ సీజన్‌ లోనే గౌరవెళ్లి నిండాలి.. పంటలు పండాలన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక అన్ని ప్రాజెక్టులకు ఆ ప్రాంత ఆలయాల దేవుళ్ళ పేర్లు పెట్టానన్న విషయాన్ని గుర్తుకు చేశారు. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని, పాలనా సంస్కరణల్లో భాగంగానే రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంచి ఉద్దేశంతోనే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు అందాలనే సదుద్దేశంతోనే సంస్కరణలు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలన్నారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే తొలి ప్రాధాన్యతగా విద్యుత్‌ సమస్యను పరిష్కరించామన్నారు. పట్టుదల, లక్ష్యంతో సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.

రాష్ట్రంలో మంచినీళ్ల సమస్య లేకుండా మిషన్‌ భగీరథను ప్రారంభించామన్నారు. మంచి ఆలోచనతో తీసుకొచ్చిన ఈ కార్య క్రమాన్ని సైతం కొంత మంది విమర్శిస్తు న్నారని సీఎం మండిపడ్డారు. సిద్ధిపేటకు వెటర్నరీ కళాశాల మంజూరు చేస్తున్న మంటూనే,  సిద్ధిపేటతో పాటు వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాలకు కూడా వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. చివరగా సిద్ధిపేట వర్ధిల్లుగాక, తెలంగాణ వర్థిల్లు గాక.. రాష్ట్రంలో అన్ని మంచి పనులు జరగాలన్నారు. లక్ష్యం చేరుకోవాలంటే వాక్‌ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్య సిద్ధి కావాలని ఆ లక్షణాలతోనే ఎవరేమనుకున్నా ముందుకు సాగు తున్నట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పి వెంకట్రామ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి,  ఎమ్మెల్యేలు సతీశ్‌ కుమార్‌, రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.