తెలంగాణపై రాజ్యసభలో చర్చ

వి.ప్రకాశ్‌

తెలంగాణపై రాజ్యసభలో మే 13న స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభించిన వి.బి. రాజు ‘మేఘాలయ’ పద్ధతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించడంతో ఈ అంశంపై మే 14న కూడా చర్చ కొనసాగింది.వి.బి. రాజు చేసిన సూచనను సీపీఐ నేత భూపేష్‌గుప్త, ఎస్‌.ఎస్‌.పి. నేత గౌరి మురహరి బలపర్చగా సీపీయం (బెంగాల్‌) సభ్యుడు వి.పి. చటర్జీ, ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సభ్యులు యశోదారెడ్డి, కోట పున్నయ్య వ్యతిరేకించారు. ఆంధ్ర-తెలంగాణ నాయకుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరగాలని అక్బర్‌ అలీఖాన్‌ సూచించారు. ఈ సూచనను పలువురు సభ్యులు బలపరిచారు.

జనాభిప్రాయ సేకరణ ప్రమాదకరం: యశోదారెడ్డి

‘తెలంగాణలో అభిప్రాయ సేకరణ గూర్చి మాట్లాడడం, దాన్ని కోరడం చాలా ప్రమాదకరమైన విషయమ”ని రాజ్యసభలో యశోదారెడ్డి అన్నారు. ”అలా అయితే ఇటువంటి అభిప్రాయ సేకరణ జరగాలని ప్రతి జిల్లా కోరే ప్రమాదం ఉన్నది. గోవాలో అభిప్రాయ సేకరణ నిర్వహణకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రాంతం పొరుగు రాష్ట్రాల్లో ఏదో ఒక దానిలో చేరడానికి అక్కడ అభిప్రాయ సేకరణ జరిగింది. తెలంగాణను వేఘాలయతో పోల్చడం సరికాదు. కొండజాతి సమస్యలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. చిన్నచిన్న రాష్ట్రాలుగా పునర్విభజన చేయడానికి పార్లమెంట్‌ నిర్ణయిస్తే తమకేమీ అభ్యంతరం లేద”ని ఆమె అన్నారు. తెలంగాణ విషయంలో ప్రత్యేకంగా చర్య తీసుకోవడం తగదని అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏ చర్య సక్రమమో నిర్ణయించే హక్కు పార్లమెంట్‌కే ఉన్నదని యశోదారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కోర్కెలు సక్రమమైనవేనని ఆవిడ అంగీకరిస్తూ, తెలంగాణ ప్రజల హక్కుల రక్షణకై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను అమలుచేసి చూడాలని ఆవిడ అన్నారు. తెలంగాణ ఉద్యమంపేరుతో వ్యక్తిగత స్థాయికి దిగజారి హైదరాబాద్‌లో గోడలపై నీచపు రాతలురాసిన వారిని యశోదారెడ్డి తీవ్రంగా నిరసించారు. ఆవిడ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. వి.బి.రాజు చేసిన ‘మేఘాలయ’ సూచన సబబే అయితే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారన్న వాదనను తాము అంగీకరించ జాలమన్నారు.

ఆంధ్రప్రాంత కాంగ్రెస్‌ ఎంపీ కోట పున్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సమస్య అంటూ ఏదీలేదని, అక్కడ ఉన్నది ఆర్థికంగా వెనుకబాటు తత్సబంధిత సమస్యలు మాత్రమేనన్నారు. వెనుకబాటుతనం దేశమంతా ఉన్నది. తెలంగాణలో మరికొంచెం ఉన్నదన్నారు.

స్వతంత్రపార్టీ సభ్యుడు పాండా మాట్లాడుతూ ”చాలా కాలం మౌనంగా ఉండి తెలంగాణా ప్రజలకు తృప్తికరంగా ఈ సమస్యను పరిష్కరించకలేక పరిస్థితిని విషమస్థాయికి కేంద్ర ప్రభుత్వం తీసికెళ్ళింది. తెలంగాణలో ఏర్పడిన పరిస్థితిలాంటిదే యూపీ, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో నెలకొని ఉన్నద”ని అన్నారు.

సీపీఐ నేత భూపేష్‌గుప్తా, వి.బి.రాజు సూచనను సమర్ధిస్తూనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కొత్త, పాత కాంగ్రెస్‌లు ఈ సమస్యను మరింత కల్లోలం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో జనాభిప్రాయ సేకరణ ఆత్మహత్యా సదృశమని ఆంధ్రప్రాంత కాంగ్రెస్‌ సభ్యుడు ఆనందం అన్నారు.

ఎస్‌.ఎస్‌.పి. నాయకుడు గౌరి మురహరి మాట్లాడుతూ మేఘాలయ తరహా పరిష్కారాన్ని సమర్ధించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తమ పార్టీ నేతల్లో తెలంగాణ విషయమై భిన్నా భిప్రాయాలు వున్నప్పటికీ ”తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడంవలన సమస్య పరిష్కారం కాదని తాము వ్యక్తిగతంగా భావిస్తున్నామ’ని అన్నారు.
tsmagazine

మేఘాలయ పద్ధతిలో సమస్య పరిష్కారం కాదు: మోహన్‌ధారియా

కొత్త కాంగ్రెస్‌ సభ్యుడు మోహన్‌ధారియా మాట్లాడుతూ మేఘాలయ పద్ధతిలో తెలంగాణను ఏర్పాటు చేయడంవలన సమస్య పరిష్కారం కాదని అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఇంకా కొన్ని కొత్త రాష్ట్రాల ఏర్పాటు పనికిరాదు. అయితే 1972 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఓటువేస్తే అప్పుడు వారి కోర్కె పరిశీలించవలసి వుంటుందన్నారు.

ఎన్నికల్లో 80 శాతం ఓట్లు తెలంగాణకే: అక్బర్‌ అలీఖాన్‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొత్తకాంగ్రెస్‌ సభ్యులు అక్బర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ 1972 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 80 శాతం మంది ఓటు చేయగలరనీ, అందుచేత ఇప్పుడే ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనకపోతే తరువాత విచారించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆంధ్ర-తెలంగాణ నాయకుల రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న తమ సూచనను వెంటనే అమలు పర్చాలని, ఈ సమావేశం ప్రధాని అధ్యక్షతన లేదా దేశీయాంగమంత్రి అధ్యక్షతనగానీ జరగాలని, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి అయినా సరే ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వాలని కోరారు. తమ సూచనలు అమలు జరిగితే ప్రజాప్రతినిధులు ప్రజల ముందుకు వెళ్ళగలుగుతారనీ, ప్రస్తుతం మంత్రులుకూడా సభలలో మాట్లాడలేకపోతున్నారనీ ఖాన్‌ అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం విషయంలో తాము చాలా ఉత్సాహంగా పాల్గొన్నట్లు ఆయన చెబుతూ ఆ ఒప్పందం సక్రమంగా అమలు జరుగలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము ఆంధ్రప్రాంతం వారినే నిందించడంలేదని, తెలంగాణవారు కూడా అప్రమత్తంగా లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు.

రాజ్యసభలో సుమారు 5 గంటలపాటు తెలంగాణ అంశంపై జరిగిన చర్చకు దేశీయాంగశాఖ సహాయమంత్రి విద్యాచరణ్‌ శుక్లా సమాధానమిచ్చారు.

ఉద్రేకంలో రాష్ట్ర విచ్ఛిత్తి తగదు: వి.సి. శుక్లా

”దీర్ఘకాల పోరాటాలద్వారా సాధించిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని క్షణికోద్రేకంలో విచ్ఛిన్నం చేయడం తగద”ని హోంశాఖ సహాయమంత్రి వి.సి. శుక్లా అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను జాప్యం లేకుండా అమలు చేస్తామన్నారు. వి.బి.రాజు ప్రతిపాదించిన ‘మేఘాలయ’ పద్ధతి పరిష్కారం లేదా అక్బర్‌ అలీఖాన్‌ సూచించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం వంటి అంశాలను శుక్లా తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.

‘తెలంగాణ సమస్య ప్రాథమికంగా ఆర్థికాభివృద్ధి సమస్య’ అని శుక్లా అన్నారు. ‘ప్రస్తుత రాజకీయాలనుంచి ఈ ఆర్థికాభివృద్ధి సమస్యను వేరుగాచేసి చూస్తేనే పరిస్థితి బాగా అవగాహన కాగలద’ని అన్నారు. ”తెలంగాణ ప్రాంతానికి కొంత అన్యాయం జరిగిందన్న పలువురు సభ్యుల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాన”న్నారు.

ఉప రాష్ట్ర ప్రతిపత్తికి సీఎం కాసు వ్యతిరేకత

తెలంగాణకు మేఘాలయ పద్ధతిలో ఉపరాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలన్న వి.బి.రాజు సూచనను ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకించారు. గతంలో ఇదే డిమాండ్‌ను కొండా లక్ష్మణ్‌ బాపూజీ ముందుకు తెచ్చిన సందర్భంగా తాను వ్యతిరేకించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడున్న పద్ధతిలోనే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఆయన విలేకర్ల ప్రశ్నలకు జవాబిస్తూ తెలిపారు. ఉదక మండలం (ఊటీ)లో రెండువారాలపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో విలేకరులు ఆయన్ని ప్రశ్నించారు. మేఘాలయ ప్రతి పాదనను తెలంగాణ ప్రజాసమితినాయకులే వ్యతిరేకి స్తున్న సంగతి విలేకరులు సీఎం దృష్టికి తేగా ఆ విషయం నాకెందుకు? పోనివ్వండి. ఒకరు పెళ్ళి చేసుకుంటానని, మరొకరు వద్దని అంటే అది వాళ్ళు తేల్చుకోవలసిన విషయం అని నవ్వుతూ అన్నారు సీఎం.

తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి అటువంటి ఏర్పాటు మంచిది. అందువల్ల ముందుముందు ఎటువంటి అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఉండదు. అందువల్ల ప్రజలకు కూడా ఆర్థిక వ్యవహారాలను గురించి ఒక సమగ్ర స్వరూపం స్పష్టంగా తెలుస్తూ వుంటుంది అని అన్నారు.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న దీక్షలు

ఒక ప్రక్కన అత్యున్నత చట్ట సభల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చలు సాగుతుండగా మరో ప్రక్కన డా|| మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్‌ల సారధ్యంలో తెలంగాణలో ఉద్యమ ఉధృతి పెంచడానికి రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు నిర్వహించబడినవి. ప్రతిరోజూ ఈ దీక్షల వార్తలను, పత్రికలు ప్రచురిస్తూనే వున్నాయి. మే 19 ఆంధ్రపత్రికలోని వార్త. ప్రత్యేక తెలంగాణ కోర్కెకు మద్దతు గా బోయిగూడ, ఉందాబజార్‌, అమీర్‌పేట, బజార్‌ఘాట్‌, ముషీరాబాద్‌, అలియాబాద్‌లలో, మరికొన్ని చోట్ల రిలే నిరా హారదీక్షా శిబిరాలను కొత్తగా ప్రారంభించారు. బి.యాదగిరి, గులాబ్‌సింగ్‌ నిరాహారదీక్ష చేశారు. రెడ్డిహాస్టల్‌వద్ద తెలంగాణ ప్రజా సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ మహిళా విభాగ్‌ కన్వీనర్‌ రాణి, యాజశ్రీ, దానమ్మ, నిరాహారదీక్ష చేశారు. రెడ్డి హాస్టల్‌పై దాడి చేసిన విద్యార్థులపై జరిగిన పోలీస్‌ దౌర్జన్యాలకు నిరసనగా, న్యాయ విచారణ జరిపించాలని దీక్ష చేశారు.