| |

దళితబంధు ఫలం…! డ్రైవర్‌ ఓనరయ్యాడు…

  •  అబ్దుల్‌ కలీమ్‌

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హుజూరాబాద్‌ నియోజకవర్గం లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించిన దళిత బంధు పథకం ఫలాలను లబ్ధిదారులు అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు. ఈ 15 మంది లబ్ధిదారులలో జమ్మికుంట మండలం, శాయంపేట గ్రామానికి చెందిన రాచపల్లి శంకర్‌ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 లక్షల చెక్కును అందుకున్నారు.

రాచపల్లి శంకర్‌, తండ్రి రాజయ్య,  వయసు 37 సంవత్సరాలు. వృత్తిరీత్యా డ్రైవర్‌. దళిత బంధు డబ్బులతో అతను ఎంపిక చేసుకున్న ఎర్టిగా కార్‌ను జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌లు వాహనాన్ని లబ్ధిదారునికి అందజేశారు. కారు రాకతో దళిత బంధు పథకం ఫలాలను అందుకుంటున్న రాచపల్లి శంకర్‌ ఆదాయం పెరిగి వారి కుటుంబం సంతోషంగా జీవిస్తోంది.

రాచపల్లి శంకర్‌  మాటల్లో ……

నేను పేద దళిత కుటుంబానికి చెందిన వాడను. డ్రైవింగ్‌ నేర్చుకొని ప్రైవేటుగా డ్రైవర్‌ గా పనిచేస్తూ నెలకు ఎనిమిది వేల రూపాయలు సంపాదించే వాడను. నాకు ఒక పాప 10వతరగతి, బాబు 8వ తరగతి, భార్య,  తల్లిదండ్రులు ఉన్నారు. వృత్తి రీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ, నేను సంపాదించే జీతం డబ్బులు సరిపోక మా కుటుంబం ఎంతో కష్టంగా పేదరికంలో జీవనం కొనసాగించే వారము. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సమాజంలో నిరుపేదలైన దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత బంధు పథకం ద్వారా నాకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 10 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. 10 లక్షలతో ఎర్టిగా కారును జిల్లా కలెక్టర్‌  కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు పథకం ద్వారానే, నాడు డ్రైవర్‌గా ఉన్న నేను నేడు ఓనర్‌ను అయినాను. నా చేతికి కారు వచ్చిన నాటి నుండి నాలుగైదు రోజులు కారును కిరాయిలకు తిప్పాను. తర్వాత, నాకున్న పరిచయాలతో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం నాకు ఇచ్చిన కారును జమ్మికుంట మండలం జెడ్పిటిసి డాక్టర్‌. శ్రీ రామ్‌ శ్యామ్‌ ఎంగేజ్‌కు తీసుకున్నారు. పెట్రోల్‌ ఖర్చులు వారే భరిస్తూ నాకు నెలకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు. దీంతో మా జీవితాల్లో కష్టాలు పారిపోయి, వెలుగులు నిండాయి. నేను కలలో కూడా అనుకోలేదు ఒక కారుకు యజమానిని అవుతానని. నాకు దళిత బంధు పథకం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి 10 లక్షలు మంజూరు చేసి కారు కొనుగోలు చేసి ఇచ్చినందుకు వారికి జీవితాంతం నేను, నా కుటుంబ సభ్యులందరూ ఎంతో రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి  ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ, అందరినీ అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాను.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 21,000 దళిత కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి వారందరికీ పది లక్షల చొప్పున దళిత బంధు నిధులు వారి అకౌంట్‌లో జమ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ పథకం కింద లబ్ధిదారులు వారికి ఇష్టమైన స్వయం ఉపాధి పథకాలు ఎంచుకుంటే వాటిని గ్రౌండిరగ్‌ చేయుటకు ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్‌ 25 తేదీ వరకూ హుజూరాబాద్‌ నియోజక వర్గంలో 14,371 మంది లబ్ధిదారుల ఖాతాలో దళిత బంధు నిధులు జమ చేశారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు ప్రతిరోజు జమ చేస్తున్నారు.