| |

ఏడుపాయల నడుమ సంరంభం!

adupayalasసూరి

మన తెలంగాణ సంస్కృతిలో జాతరలకు ఒక పవిత్రమైన విశిష్ట స్థానం ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచి తరతరాలుగా నదీ ప్రాశస్త్యాన్ని, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాలను, జన జీవన సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చుకుంటూ జాతరలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఘనమైన చారిత్రిక, సాంస్కృతిక నేపధ్యం ఉన్న మెదక్ జిల్లాలోని ఆలయాల వద్ద  జాతరలు జరుగుతుండగా అన్నింటిలోకి ఏడుపాయల జాతర ప్రత్యేక మైంది. సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి… మెతుకు సీమ వరప్రదాయనిగా వెలుగొందుతున్న పవిత్ర మంజీరా నదీమ తల్లి ఒడిలో వెలసి చారిత్రక మణిదీపంగా, కొలిచే భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్న వనదుర్గా భవానీ మాత ఆలయం కొలువైన ప్రాంతంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జాతర జరుగుతుండటం విశేషం. మూడు రోజుల పాటు సంప్రదాయబద్దంగా జరిగే జాతర తెలంగాణ సంస్కృతిక వైశిష్ట్యాన్ని చాటిచెబుతుంది. బండ్లు, బోనాలు, శివసత్తుల సిగాలు, పోతరాజుల విన్యాసాలు, కళారూపాల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగే  ఏడుపాయల జాతర వేడుకలు ప్రతి ఒక్కరికి మరచిపోలేని మధురానుభూతులను మిగిల్చే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.

అరుదైన ప్రదేశంలో అంగరంగ వైభవంగా

గోదావరికి ఉప నది అయిన మంజీరా నది మెదక్‌ జిల్లాలో 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుండగా కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్‌ ఆనకట్ట దిగువన, పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి గ్రామ శివార్లలో ఏడుపాయలుగా చీలిప్రవహించి కొద్ది దూరం తరువాత మళ్లీ పాయలన్నీ ఏకమై ముందుకు సాగిపోతుంది. ఇలా ఓ నది ఏడు పాయలుగా చీలి మళ్లీ ఒక చోట కలిసి ప్రవహించడం దేశంలో ఇక్కడ తప్ప మరెక్కడా లేదు. మహాభారత కాలంలో జనమేజయ మహారాజు ఇక్కడ సర్పయాగం చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇలాంటి అరుదైన ప్రదేశంలోనే మంజీరానదీ పాయ ఒడ్డున రాతిగుహలో వనదుర్గామాత కొలువైంది. అనేక దశాబ్ధాల క్రితం నుంచే చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన ఏడుపాయల్లో ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా జాతర నిర్వహించడం జరుగుతోంది. జాతరలో రెండో రోజు జరిగ బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల చీరలు, మామిడి తోరణాలతో సంప్రదాయ బద్దంగా అలంకరించిన దాదాపు 100 ఎడ్ల బండ్లతో ఈ ఊరేగింపు ఎంతో వేడుకగా జరుగుతుంది. చివరిరోజు నిర్వహించే రథోత్సవం సైతం ఎంతో వైభవోపేతంగా సాగుతుంది.

ఎల్లలు దాటిన కీర్తి :

ప్రసిద్ద పుణ్యక్షేత్రంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో  ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచే కాక పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు, పర్యాటకులు ఇక్కడికి పెద్దఎత్తున తరలివస్తారు. ఏడాది పొడుగునా భక్తులు, సందర్శకుల రాకతో ఏడుపాయల సందడిగా ఉంటుండగా జాతర సందర్భంగా కొండలు, గుట్టలు, నదీపాయలతో కూడి ఉండే ఈ ప్రాంగణం జనారణ్యంగా మారుతుంది.

జాతరకు విస్తృత ఏర్పాట్లు :

మార్చి ఎనమిదవ తేదీ నుంచి జరిగే ఏడుపాయల జాతర నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జాతర నిర్వహణకోసం ప్రభుత్వం గతేడాది కోటి రూపాయలు మంజూరు చేయగా… ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి వినతి మేరకు ముఖ్యమంత్రి ఈ సారి జాతర నిర్వహణకు రూ.1.50కోట్లు మంజూరు చేశారు. లక్షలాదిగా జనం తరలివస్తారు కాబట్టి తదనుగుణంగా సంబందిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా మంజీరా నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో జారతకు వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. తాగునీటి వసతి కల్పన, వైద్య సేవలు, ప్రమాదాల నివారణకు, రవాణా సదుపాయల కల్పన, ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తులకు వినోదాన్ని పంచేందుకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.