ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతుల ఆసక్తి

By: శ్రీ కె. శ్రీనివాస రావు

మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటవేసి రైతులు లాభాలు పొందాలి. వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్‌ సాగు చేయడంతో రైతుకు అధికంగా లాభం చేకూరుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే ఆయిల్‌ పామ్‌ సాగుతో అన్ని ఖర్చులూ పోను ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయం మిగిలే అవకాశం
ఉంది. మొక్కల మధ్య అంతరపంటలు కూడా సాగు చేసుకోవడం వల్ల మరింత లాభం వస్తుంది. పామాయిల్‌ దిగుబడి కంటే ముందే అంతరపంటలతో పెట్టుబడి వెళ్లిపోతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్ల పాటు రాబడి వస్తుంది. ఈ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నది. సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా బలోపేతం కావొచ్చు.

సాంప్రదాయ పంటలు వేసి రైతులు నష్టపోకుండా వాణిజ్య పంటలు వేసి లాభాలు గండిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పనిచేసినా పంట చేతికి వచ్చాక గిట్టుబాటు రాక రైతు నష్టాలు చవిచూస్తూ, అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతును రాజును చేయాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంకల్పంతో లాభాలు వచ్చే ఆయిల్‌ పామ్‌ పంట సాగుచేసేలా వివిధ ప్రభుత్వ శాఖలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

మహబూబాబాద్‌ జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా ఉండటంతో వరి, మిర్చి, పత్తి సాగు తగ్గించాలని, ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్ధికంగా రైతులను బలోపేతం చేయాలన్న ఉద్యాన శాఖ కలలు నెరవేరబోతున్నాయి. ప్రభుత్వ సహకారం లభించడం, రైతులు ఆసక్తి చూపటంతో ఉద్యానశాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. 2018-19లో జిల్లాలో పర్యటించిన అధ్యయన బృందం వాతావరణ పరిస్థితులు, తేమ, వర్షపాతం, భూగర్భ జలాలు ఇక్కడ ఆయిల్‌ పామ్‌ పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక్కడి నేలలు, వాతావరణం ఆయిల్‌ పామ్‌ పంటకు అనుకూలంగా ఉండడంతో 2020-21 సంవత్సరంలో పైలెట్‌ ప్రాజెక్టుగా 305 ఎకరాలలో పంట సాగు చేస్తున్నారు. ఈ పంటపై ఆసక్తి గల వంద మంది రైతులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావు పేటలో స్టడీ టూర్‌ నిర్వహించి అవగాహన కల్పించారు.
జిల్లాలో తొలిసారిగా కురవి మండలంలోని సి కొత్తూరుకు చెందిన డాక్టర్‌ ఇంద్రసేనారెడ్డి తనకున్న 20 ఎకరాలలో ఆయిల్‌ పామ్‌ పంటను చేపట్టారు. ఈయనను ఆదర్శంగా తీసుకున్న మరికొంత మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేయడంతో మండలంలో 95 ఎకరాలకు పంట విస్తరించింది. 2021-22 సంవత్సరంలో ఆయిల్‌ పామ్‌ పంటను మరింత విస్తరింప చేయాలనే సదుద్దేశంతో 2000 ఎకరాలకు లక్ష్యాలు నిర్దేశించుకోగా పద్దెనిమిది వందల ఎకరాలకు సంబంధించిన రైతులను గుర్తించడం జరిగింది. 700 ఎకరాలలో సాగు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్న కారు రైతులను ప్రోత్సహించేందుకు 400 ఎకరాలలో మొక్కలు పంపిణీ చేశారు. సంవత్సరంలో ఎప్రిల్‌, మే, జూన్‌ మూడు మాసాలు తప్ప మిగతా తొమ్మిది నెలలకు పంట దిగుబడి వస్తుందని, ఎకరానికి టన్ను చొప్పున తొమ్మిది నెలలకు 10 నుండి 14 టన్నులు పంటతో రైతులు నికర ఆదాయం పొందవచ్చునని ఉద్యాన శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

2020-21 సంవత్సరంలో వేసిన ఆయిల్‌ పామ్‌ పంట కొనుగోలు చేస్తామని దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్‌ ప్రాజెక్టు యాజమాన్యం రైతులకు హామీ ఇచ్చింది. దాంతో ఆధిక సంఖ్యలో రైతులు ఆయిల్‌ పామ్‌ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయిల్‌ పామ్‌ పంట 2023 -24 సంవత్సరానికి కాపుకు రానునందున ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ కొనుగోలుకు తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు పడినా ఆయిల్‌ పాం పంటకు నష్టం రాదని, కోతులు నష్టపరిచే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఈ పంట మూడు సంవత్సరాలకు చేతికొస్తుందని, ఈ సమయంలో అంతర పంటలు సాగుచేసుకొని ఆదాయం పొందే అవకాశం కూడా ఉందని, ప్రతి ఏడాది ఆదాయం రావడంలేదనే చింత ఉండదని ఉద్యాన శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు. అంతర్‌ పంటగా వేరుశెనగ, మినుములు, కంది, జనుము వంటి పంటలు వేసుకుని ఆదాయం గడిరచవచ్చని, మూడు సంవత్సరాలకు ఆయిల్‌ పామ్‌ పంట దిగుబడి రావడం మొదలయ్యి 4, 5 సంవత్సరాలకు పెరుగుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తోందని వివరిస్తున్నారు. పంట చేతికొచ్చాక ప్రతి సంవత్సరం ఎకరానికి లక్ష రూపాయలు రైతులకు నికర ఆదాయం చేతికందుతుందన్నారు. ఆయిల్‌ పామ్‌ మొక్క ఎదిగిన తర్వాత అంతర్‌ పంటగా కొకోవా మాత్రమే అనుకూలంగా ఉంటుందని, ఈ పంటను క్యాడ్బరీ చాక్లెట్‌ తయారీకి వినియోగిస్తున్నందున ఎకరానికి 20వేల నికర ఆదాయంతో ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి చెందడంతో రైతులు ఆయిల్‌ పామ్‌ పంట చేపట్టేందుకు ముందుకు రావడంలో ఎటువంటి సందేహం లేదని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగు శుభపరిణామం: మంత్రి దయాకర్‌ రావు
ఆయిల్‌ పామ్‌ సాగు కు రైతులు ముందుకు రావడం శుభపరిణామ మని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి తొర్రూరు మండలం హరిపిరాలలో సుమారు నలభై ఐదు ఎకరాలు కేటాయిస్తూ ఆయిల్‌ పామ్‌ మొక్కల పెంపకానికి ప్రతిపాదనలు పంపించారు. అదేవిధంగా గోపాలగిరి గ్రామంలో సుమారు 70 ఎకరాలలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

స్టడీ టూర్‌ల ఏర్పాటు: కలెక్టర్‌ శశాంక
జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాలతో ఆయిల్‌ పామ్‌ పంట పై ఆసక్తి చూపుతున్న 200 మంది రైతులను స్టడీ టూర్‌ ఏర్పాటుచేసి అశ్వారావుపేట మండలంలో, తొర్రూర్‌లో ప్రదర్శనశాల ఏర్పాటు చేసి రైతులను ఉత్సాహపరుస్తున్నారు. సిరులు కురిపించే నికర ఆదాయం ఇచ్చే అద్భుతమైన పంటగా వర్ణిస్తూ రైతులను ఈ పంటవేసే విధంగా అవగాహన కల్పిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు.