|

లక్ష కోట్లు దాటిన తొలి బడ్జెట్‌

తెలంగాణ రాష్ట్రంలో తొలిబడ్జెట్‌ను నవంబరు 5న ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు.  2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 మాసాల కాలానికి ఈ బడ్జెట్‌ రూపొందించారు. మొత్తం 1,00,637.96 కోట్ల రూపాయల బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేసే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేయడం విశేషం. బడ్జెట్‌ రూపకల్పన గతంలో కన్నా భిన్నంగా జరిగింది. హైదరాబాద్‌లో కూర్చొని బడ్జెట్‌ను రూపొందించే ఆనవాయితీకి భిన్నంగా మన ఊరు`మన ప్రణాళిక పేరుతో గ్రామీణ ప్రజల అవసరాలను ప్రభుత్వం వారిచెంతకే వెళ్ళి తెలుసుకొంది. అలాగే, ఒక్క రోజులో సమగ్ర సర్వే నిర్వహించింది. వీటి ఆధారంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పూర్తి తెలంగాణ దృక్పథంతో బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ఎన్నికల ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని, సబ్బండ వర్గాలకు బంగారు తెలంగాణపై భరోసా కల్పిస్తూ రాష్ట్ర తొలి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. దామాషా నిష్పత్తిలో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో గతంలో జరిగిన కేటాయింపులకంటే అదనంగా నిధులు సమకూర్చడం విశేషం.

kcr2

గౌరవనీయ అధ్యక్షా!
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తొలి వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నందుకు నేనెంతగానో గర్విస్తున్నాను. ఇదొక చరిత్రాత్మక ఘట్టం. ఇటువంటి ప్రతిష్ఠాత్మక అవకాశం లభించినందుకు ఆనందంగా ఉన్నది. ఇంత గొప్ప అవకాశం కలిగించిన తెలంగాణ ప్రజలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.

తెలంగాణ సమాజం స్వరాష్ట్రం కోసం, స్వాభిమానంకోసం ఆరు దశాబ్దాలు అలుపెరుగని పోరాటం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు అందించిన సమర్థవంతమైన నాయకత్వంలో ఈ పోరాటం దరిచేరింది. గమ్యాన్ని ముద్దాడిరది. అమరుల త్యాగాలు ఫలించినయి. ప్రజల ఆశయం జయించింది. 2014 జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

సుదీర్ఘకాలంగా దారుణమైన వివక్షకు తెలంగాణ సమాజం గురైంది. ఆకాంక్షలు అణగారిపోయినయి. పోరాట సందర్భంలో ప్రజలు వ్యక్తంచేసిన డిమాండ్లు అరణ్య రోదనగానే మిగిలిపోయినయి. ఇవాళ ఆ ఆకాంక్షలను నెరవేర్చడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని పరిరక్షించే విధంగా, తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించేవిధంగా పూర్తిగా తెలంగాణ దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించాం. ప్రజాధనాన్ని న్యాయబద్ధంగా వినియోగించాలనే స్పృహతో పూర్తి అంత:కరణ శుద్ధితో నిజాయితీగా బడ్జెట్‌కు రూపకల్పన చేసినం.

మా ముందు ఇప్పుడు చాలా సవాళ్ళున్నాయి. విచ్ఛిన్నమైపోయిన, విధ్వసంమైపోయిన సమాజాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆషామాషీ విషయంకాదు. ఇది చాలా గంభీరమైన లక్ష్యం. అన్ని రంగాలలో తెలంగాణ క్రుంగి కృశించిపోయింది. పూర్తిగా చీకటి అలుముకున్న సమయంలో స్వరాష్ట్రం ఏర్పడడంతో ఇప్పుడిప్పుడే వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా, వలసవాదుల నీడలు, పీడలులేని అచ్చమైన తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. స్వీయపాలన చవిచూస్తున్నారు.

ప్రత్యక్షంగా వలసవాద పీడన అంతమైనప్పటికీ, యాభైఏండ్ల చరిత్ర మిగిల్చిన పరోక్ష పెత్తనం ఏదో రూపంలో తెలంగాణను వేధిస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకుంటూ ఉంటే భరించలేని శక్తులు అభివృద్ధికి అనేక అవరోధాలు కల్పిస్తున్నాయి. మాకు సంకల్పం ఉన్నది. ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ ధైర్యంతో మేం ముందడుగు వేస్తున్నాం. దుష్టశక్తుల ఆటలు కట్టించే నేర్పు, ఓర్పు మాకు ఉన్నాయి. ఏ గుండె ధైర్యంతో ఉద్యమాన్ని సాగించి విజయం సాధించామో అదే స్ఫూర్తితో ఇప్పుడు బంగారు తెలంగాణ సాధించడానికి నడుం బిగించాం.

తెలంగాణ ఏయేరంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్ళా చక్కదిద్ది సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించడానికి ఈ బడ్జెట్‌ను రూపొందించాము. అయితే, వలసవాద విలయం సృష్టించిన సమస్యలను పరిష్కరించడానికి సులభోపాయాలు పనికిరావు. నిజమైన అభివృద్ధి సాధించడానికి అడ్డదారులు, దగ్గరి దారులు ఉండవు. దీర్ఘకాలిక ప్రణాళికలతో శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులు వేయాలె. అందుకు చాలా పరిణతి అవసరం. గత ప్రభుత్వాలు అనుసరించిన తప్పుడు విధానాలకు విరుగుడుగా తెలంగాణకు అనుగుణమైన, సరి అయిన విధానాలను నిర్వచిస్తూ ప్రజల సాంఘిక, ఆర్థిక వికాసానికి దారులు వేస్తున్నాం. విచ్ఛిన్నమైన తెలంగాణ తిరిగి తన కాళ్ళమీద తాను నిలబడడానికి అవసరమైన శాశ్వత ప్రాతిపదికలను నిర్మిస్తున్నాం.

ఇది కేవలం పది నెలల బడ్జెట్‌. ప్రభుత్వం తనకున్న తక్కువ వ్యవధిలో అత్యవసరంగా నెరవేర్చవలసిన ప్రజల ఆకాంక్షలమీద మొదట దృష్టి సారించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31, 2015 వరకుగల కాలాన్ని ఉద్దేశించి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేశాము.

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అసువులు బాసిన అమరులు చిరస్మరణీయులు. వారి అత్యున్నత త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వారి త్యాగం అమూల్యమైంది. ఏమి చేసినా తీరని రుణం వారిది. వారు సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి. వారు ప్రజల గుండెల్లో సదా నిలిచి ఉంటారు. వారిపట్ల కృతజ్ఞతగా వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మా పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించాము. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ 459 మంది అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో వందకోట్ల రూపాయలను కేటాయించాం.

సామాజిక ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రతిపాదించిన నిధుల కేటాయింపులు వివరించబోయే ముందు తెలంగాణ సామాజిక ` ఆర్థిక పరిస్థితిని గమనిద్దాం. తెలంగాణ రాష్ట్ర జనాభాల ఎక్కువశాతం బలహీనవర్గాల ప్రజలే ఉన్నారు. వారిని అభివృద్ధిచెందిన వర్గాలతో సరిసమానంగా అభివృద్ధిచేయటం మా బాధ్యతగా భావిస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటిన తరువాత కూడా వారి వెనుకబాటుతనం కొనసాగుతున్నది. దీనికి కారణం చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు, రాష్ట్ర ఆర్థిక స్థితి, వృద్ధిరేటు 2005-10లో సగటున 10.5 శాతం నమోదుకాగా, 2012-13 నాటికి అది 4.5 శాతానికి దారుణంగా పడిపోయింది. దీనికి కారణం పారిశ్రామిక రంగంలో కనిపించిన ప్రతికూల వృద్ధిరేటు అనవచ్చు. అందరికీ ఉపాధి, అందరికీ అభివృద్ధి కలిగిన బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే తిరోగమన స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థికగతిని తక్షణమే పురోగమన దిశలోకి మార్చవలసి ఉన్నది. దీనికోసం వ్యవసాయం, పారిశ్రామిక మరియు మౌలిక వసతుల రంగాలలో భారీ పెట్టుబడుల ఆవశ్యకత వుంది.

రాష్ట్ర జి.ఎస్‌.డి.పి.లో ఎక్కువ శాతం సేవా, పారిశ్రామిక రంగాలనుండే వస్తున్నది. జి.ఎస్‌.డి.పి.లో సేవా రంగం వాటా 58 శాతం, పారిశ్రామికరంగం వాటా 28 శాతం. ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామికరంగంలో అనుకున్నస్థాయిలో అభివృద్ధి జరగలేదు. అందువల్ల ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర అవరోధంగా మారింది. జి.ఎస్‌.డి.పి.లో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగమే రాష్ట్రంలోని దాదాపు సగంమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అండగా నిలుస్తున్నది. అంటే నేటికీ రైతులే అందరికీ అన్నం పెడుతున్నారు.

తలసరి ఆదాయం విషయంలో అంకెలుచూస్తే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగున్నట్టే కనిపిస్తుంది.2013-14లో జాతీయ తలసరి ఆదాయం 74వేల 920 రూపాయలు కాగా, తెలంగాణలో 93వేల 151 రూపాయలు. ఇది వాస్తవ విరుద్ధం అని అనడానికి జిల్లాలవారిగా తలసరి ఆదాయంలో అగుపించే తీవ్ర వ్యత్యాసాలే నిదర్శనం. మూడు జిల్లాల్లో మాత్రం తలసరి ఆదాయం జాతీయ సగటుకంటే ఎక్కువ వుంది. ఏడు జిల్లాల్లో జాతీయ సగటుకంటే తక్కువ ఉన్నది. ఇది మేము చెబుతున్న విషయం కాదు అధ్యక్షా! స్వయంగా భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పాయి. బ్యాక్‌వర్డ్‌ రీజియన్స్‌ గ్రాంట్‌ఫండ్‌ (బి.ఆర్‌.జి.ఎఫ్‌) క్రింద తెలంగాణలోని 9 జిల్లాలను చేర్చారంటే, ఇక్కడి పేదరికాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక అసమానతలు, వెనకబాటుతనం ఇప్పుడు మాముందున్న సవాళ్ళు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం నిజాయితీగా మేము అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాము. సమాజంలోని అన్నివర్గాల పురోభివృద్ధికి పాటుపడటమే మా లక్ష్యం. అయితే అభివృద్ధి కేవలం గణాంకాలలో, ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే కనిపిసే సరిపోదు. సమాజంలో అణగారిన వర్గాలు, బడుగు బలహీనవర్గాల జీవితాలలో కనిపించాలి. వారిని విస్మరించి సాధించే అభివృద్ధికి విలువలేదు. ఈ బడ్జెట్‌ పత్రాల్లోని ప్రతి కాగితం, ప్రతి అక్షరం ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది.

ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చే దిశగా..
తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రజలు వ్యక్తంచేసిన ఆకాంక్షలపట్ల మా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా మేము వివిధ రంగాలలో తెలంగాణపట్ల అమలౌతున్న వివక్షను ప్రశ్నించాం. బాధితులతో కలసి ఉద్యమించాం. ఉద్యమకారుల, మేధావుల భాగస్వామ్యంతో ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించాం. మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సమగ్రంగా ప్రతిబింబించింది. ప్రజల ఆమోదం పొందింది. ప్రస్తుతం మ్యానిఫెస్టో వెలుగులోనే ప్రభుత్వ పథకాలను రూపొందించాం. అందుకనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారుచేశాం. రాబోయే కాలంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తాం అనే విశ్వాసాన్ని ఈ బడ్జెట్‌ ద్వారా కలుగజేస్తున్నాం.

సాధారణంగా బడ్జెట్‌ అంటే అంకెల కసరత్తులాగానే ఉంటుంది. జమ, ఖర్చుల పద్దులాగే కనిపిస్తుంది. కాని ఇప్పుడు మేము ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ అలాకాదు. ఇది తెలంగాణ ప్రజల కలలు సాకారంచేసే సజీవ ఆర్థిక ప్రణాళిక. తెలంగాణ ప్రజల మేలుకోసం ప్రజలే రూపొందించిన కరదీపిక. భావితరాల బంగారు భవితకోసం నిర్దేశించుకున్న మార్గాలను ఇక్కడ మేము ఆవిష్కరిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల నమ్మకాన్ని పెంచింది. వారి భవిష్యత్తుకు భరోసా కలిగించింది. బంగారు తెలంగాణ అనే స్వప్నం సాకారం అయ్యేందుకు చేసే సుదీర్ఘ ప్రయాణంలో ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాము. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో గమ్యాన్ని చేరుకుంటామనే అచంచల విశ్వాసం మాకు ఉన్నది. లక్ష్యం సాధించేవరకు మేము వెనక్కి తిరిగిచూసే ప్రశ్నేలేదు. నేను ఈ బడ్జెట్‌ను ఈ సభ ఆమోదంకోసం ప్రవేశపెడుతున్నాను.

జై తెలంగాణ నీళ్ళు, నిధులు, నియామకాలకోసం జరిగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ రూపొందిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము రూపొందించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్‌ తయారుచేసిన రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటెల రాజేందర్‌ని, ఆర్థికశాఖ అధికారులందరినీ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

దేశంలో ఇతర రాష్ట్రాలు ఏవీ అమలు చేయనటువంటి కార్యక్రమాలు చెఱువుల పునరుద్ధరణ, డ్రింకింగ్ వాటర్‌ గ్రిడ్‌, కల్యాణలక్ష్మి, రహదారుల నిర్మాణం, దళితులకు భూ పంపిణీవంటి పథకాలెన్నింటికో ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ బడ్జెట్‌లో అన్నివర్గాల ప్రజలకు వివిధ శాఖలకు అవసరమయ్యేమేర సముచితంగా నిధులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన