నగరాల సమస్యలపై నజర్‌

kcr
మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఉద్దేశించిన పదకొండవ మెట్రోపాలిస్‌ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. అక్టోబర్‌ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సమావేశాలు హైటెక్స్‌ ప్రాంగణంలోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సుకావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసింది. ఈ సదస్సును అక్టోబర్‌ 7వ తేదీన ఉదయం 10 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు లాంఛనంగా ప్రారంభించారు. 9వ తేదీ ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాలకు చెందిన 1700 మంది ప్రతినిధులతో పాటు 50దేశాలకు చెందిన సుమారు 300 మంది మేయర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. మెట్రోనగరాలు ఎదుర్కొంటున్న సమస్యలే ఎజెండాగా, ”సిటీస్‌ ఫర్‌ ఆల్‌” అనే థీమ్‌ తో మెట్రోపాలిస్‌ సదస్సు జరిగింది. పెరుగుతున్న నగరీకరణ ఎదురవుతున్న సవాళ్లపై ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరై చర్చించారు. ప్రపంచంలోని అభివృద్ది చెందిన నగరాల విధానాలను హైదరాబాద్‌ లో కూడా అమలు చేసేందుకు ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

ఈ సదస్సులో ముఖ్యంగా నగరాల్లో పారిశుధ్యం, మురికివాడల నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, అందరికీ ఇండ్లు, విద్య, వైద్యం, విపత్తు నిర్వహణ, మహిళ, చిన్నారుల భద్రత, ట్రాఫిక్‌, పార్కింగ్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ సేఫ్టీ, గ్రీవియన్స్‌, ఈ గవర్నెన్స్‌, అభివృద్దిలో టెక్నాలజీ వినియోగం, సరఫరా, ప్రజారవాణా వ్యవస్థ, పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ పెంచడం, శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, చెత్తను సద్వినియోగం చేసుకోవడం, ఇంకుడు గుంతలు, గ్లోబల్‌ వాటర్‌ లీడర్‌షిప్‌, గ్రీన్‌ హౌజ్‌, బిగ్‌ డాటా, బిగ్‌ చాలెంజెస్‌, బిగ్‌ ఐడియాస్‌, థింక్‌ గ్లోబల్‌ అండ్‌ యాక్ట్‌ లోకల్‌, లాండ్‌ అండ్‌ ఎనర్జీ, డ్రైనేజీ సిస్టమ్‌, నగరాల్లో పెట్టుబడులు, భూమి వినియోగం, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం అనే అంశాలపైన వివిధ దేశాల మేయర్లు, నిపుణులు ప్రజంటేషన్లు ఇచ్చారు.

పారిస్‌, బెర్లిన్‌, జొహెన్నస్‌ బర్గ్‌, ముషాద్‌, సావోపాలో, బార్సిలోనా, టెహ్రాన్‌ తదితర అభివృద్ది చెందిన నగరాల మేయర్లతో మన దేశ, రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. విదేశీ ప్రతినిధులకు రక్షణగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీసులను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పోలిసింగ్‌ ను తలపించేలా డ్రెస్‌ కోడ్‌తో 150 మందితో స్పెషల్‌ టీంను ఏర్పాటు చేశారు. వీరు విదేశీ ప్రతినిధులకు రక్షణగా ఉండడంతోపాటు వారు పర్యటించే ప్రాంతాలకు ఎస్కార్ట్‌లుగా ఉన్నారు.

నగరంలో చరిత్రాత్మక కట్టడాలైన గోల్కొండ, తారామతి బారామతి, ఫలక్‌నుమా ప్యాలెస్‌, చార్మినార్‌ లను సందర్శించిన విదేశీ ప్రతినిధులు వాటిని చూసి మంత్రముగ్దులయ్యారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సదస్సులో మురికి వాడల విద్యార్థులు పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్‌, భువనేశ్వర్‌, ముంబాయి, ఢిల్లీ ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను మెట్రోపాలిస్‌ సదస్సులో వివరించారు. మురికి వాడల్లోని సమస్యలను వివరించారు. మురికి వాడల్లో నివసించే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాలని విద్యార్థులు ఈ సదస్సులో సూచించారు.

21వ శతాబ్దం నగరాల దేనని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మెట్రోపాలిస్‌ 11వ అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ఆయన హాజరై సదస్సులో ప్రసంగించారు. ఉత్తమ నగరపాలక వ్యవస్థలను రూపొందించడం ద్వారానే పౌరు లకు మెరుగైన సేవలు, సౌక ర్యాలు కల్పించగలమని రాష్ట్రపతి అన్నారు. వివిధ నగరాల అనుభవాలు పరస్పరం పంచుకోవడం ద్వారా మెట్రోపాలిస్‌ వంటి సదస్సులు మెరుగైన నగర పాలనలను అందించడానికి ఉపయోగపడతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రపతి. నగర జీవనంలో సమయం ఎంతో విలువైనదని, ఆ సమయాన్ని ఆదా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాలకు సూచించారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఇది సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ను ఒక ఉదాహరణగా సూచించారు. నగరాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో నగర పౌరులకు కనీస సదుపాయాలు కల్పించడం ఒక సవాలని ఆయన అన్నారు. నగరాల్లో ప్రజలు ప్రధానంగా నీటి కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు నగర పాలక వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇదే సమయంలో పర్యావరణ మార్పులు, కర్బన ఉద్గారాల నివారణ, పర్యావరణ హిత భవన నిర్మాణాల వంటివి కూడా ప్రాధాన్యంతో కూడుకున్నవని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. స్వచ్చ భారత్‌ గురించి మాట్లాడుతూ నగరాల్లో చెత్తను డంప్‌ చేయడానికంటే కూడా దానిని ఏవిధంగా వినియోగించుకోవలనే విషయాలపైన, చెత్తను ఇంధన వనరులుగా మలుచుకునే పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రపతి సూచించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస గృహాలను కల్పించడం ఒకసవాల్‌ అని, ఈ సమస్యను అధిగమించాలంటే శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం ద్వారా దీన్ని అధిగమించవచ్చని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. నగరాలు భద్రతా పరంగా సురక్షితంగా మారాలంటే నగర పాలక సంస్థలు, పోలీసుల బాధ్యత అన్నారు. ఇందుకు ప్రజలు కూడా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

గ్రామాల నుంచి పట్టణా లకు, నగరాలకు వలసలు పెరు గుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయలు కల్పించడం ప్రభు త్వాలకు పెద్ద సవాల్‌ అని గవ ర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. నగర ప్రజల ఆకాంక్షలు, ఆశలను ప్రభు త్వాలు గుర్తించాలని మెట్రోపాలిస్‌ ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయన ప్రసంగించారు. నగరాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైందన్నారు. వలసలతో నగరంపై ఒత్తిడి పెరుగుతుండడంతో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజావసరాలైన ఆరోగ్యం, భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ రక్షిత మంచినీరు ప్రజలకు అందే విధంగా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సమాచార వ్యవస్థ ఉంటేనే త్వరగా అభివృద్ది సాధ్యమౌతుందన్నారు గవర్నర్‌ నరసింహన్‌. వైద్య వసతులు ప్రజలకు చేరువలో ఉండడమే కాకుండా వారికి అనుకూలమైన ధరలుండాలని అభిప్రాయ పడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పత్తుల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నగరాల్లో కాలుష్యం విజృంబిస్తోందని దీన్ని అరికట్టాలంటే పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ సిస్టమ్‌ పెరగాల్సిన అవసరం ఉందన్నారు గవర్నర్‌. పోలీసులపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టేలా చర్యలు తీసుకుని ప్రజలకు సన్నిహితంగా ఉండాలన్నారు.

ఇస్తాంబుల్‌ తరహాలో హైదరాబాద్‌ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. అభివృద్దిలో మానవీయ కోణంతో పాటు పర్యావరణహితాన్ని దృష్టిలో పెట్టుకుంటామని కెసిఆర్‌ అన్నారు. పట్టణాల్లో భూములను సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. పట్టణ జనాభా 50శాతానికి చేరుకుంటున్న తరుణంలో మెరుగైన జీవన పరిస్థితులను నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, పట్టణాలకు సంబంధించి వివిధ అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. మురికి వాడలు లేని ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. మురికివాడలు లేని నగరాలుగా తీర్చిదిద్దాలంటే శాటిలైట్‌ టౌన్‌ షిప్‌లను ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి. కొత్త రాష్ట్రంలో తెలంగాణాలో జరిగిన మొట్ట మొదటి అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసిన మెట్రోపాలిస్‌ నిర్వాహకులను అభిందించారు. పరస్పర అభిప్రాయాలు, అనుభవాలు పంచు కోవడం ద్వారా ఈ సదస్సు అందరికి ఉపయోగపడిందన్నారు.

ప్రపంచంలోనే హైదరాబాద్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చడానికి తెలంగాణా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహాకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. విజన్‌ 2022తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, భారత దేశంలో అందరికి ఇళ్లు ఇవ్వడమే లక్ష్యంగా నిరంతర విద్యుత్‌, నీటి సరఫరాలను అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రోజురోజుకు నగరాలకు వలసలు పెరగడం, వసతులు తగ్గడం వల్లే మురికి వాడలు పుట్టుకొస్తున్నాయని, అయితే సౌకర్యాలు కల్పించడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. నగరాలు, పట్టణాల్లో పేదరిక నిర్మూలనతో పాటు 2019నాటికి స్వచ్ఛభారత్‌ సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.