13 ఎత్తిపోతల పథకాలకు సీ.ఎం శంకుస్థాపన

నల్లగొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతోసహా 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. నాగార్జున సాగర్‌ వరకూ హెలికాఫ్టర్‌ లో వచ్చిన ముఖ్యమంత్రి నెల్లికల్లు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన ప్రాంతమైన ఎర్రచెర్వు తండా వరకూ బస్సులో చేరుకున్నారు. వేదపండితుల పూజాకార్యక్రమాల మధ్య ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపనచేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొత్తం 13 ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.వీటికి సంబంధించిన మ్యాపులను, చిత్రపటాలను పరిశీలించి, అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి శంకుస్థాపనచేసిన ఎత్తిపోతల పథకాలలో దేవరకొండ నియోజకవర్గం పరిథిలోని పొగిల్ల ఎత్తిపోతల, కంబాలపల్లి ఎత్తిపోతల, సంబాపురం పెద్దగట్టు ఎత్తిపోతల, పెద్దమునగాల ఎత్తిపోతల, ఎకెబిఆర్‌ ఎత్తిపోతల, మిర్యాలగుడ నియోజకవర్గం పరిధిలోని దున్నపోతులగండి, బాల్లేపల్లి చాప్లాతండా ఎత్తిపోతలు, కేశవాపురం కొండ్రాపోల్‌, బొత్తలపాలెం వాడపల్లి ఎత్తిపోతలు ఉన్నాయి.

నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో  సాగర్‌ ఎడమకాల్వ 1.8 కిలోమీటరు నుంచి 70.52 కిలోమీటరు వరకూ సీసీ లైనింగ్‌, హుజూర్‌ నగర్‌, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ముక్య్తాల బ్రాంచ్‌కు ఎత్తిపోతలు, జాన్‌ పహాడ్‌ బ్రాంచ్‌ కు ఎత్తిపోతలు, జాన్‌ పహాడ్‌ బ్రాంచ్‌ డిస్ట్రిబ్యూటరీ సీసీ లైనింగ్‌, ముక్త్యాల బ్రాంచి కెనాల్‌, ఇతర ట్యాంకులకు సీసీ లైనింగ్‌, ఆధునీకరణ, సూర్యాపేట, హుజూర్‌ నగర్‌, కోదాడ పరిథిలోని సాగర్‌ ఎడమ కాల్వ 70.52 కిమీ నుంచి 115.4 కిమీ వరకు సీసీ లైనింగ్‌ అభివృద్ధిపనులకు, ఎల్‌.ఎల్‌.సి పంప్‌ హౌజ్‌ నుంచి హెచ్‌.ఎల్‌.సి డిస్ట్రిబ్యూటరీ ద్వారా నెల్లికల్లు లిఫ్టు వరకూ నీటి సరఫరాకు మరమ్మతుపనులకు సంబంధించి నెల్లికల్లులో ఒకేచోట ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, రైతుబంధుసమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర రెడ్డిఎం.పి బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ జీవన్‌ పాటిల్‌, ఇరిగేషన్‌ శాఖ నల్లగొండ సీఈ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.