ఉచితంగా వ్యాధి నిర్ధారణ 

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో మరో ముందడుగు.. ఈపాటికే దాదాపుగా అన్ని బస్తీలలో బస్తీ  దావాఖానాలతో వైద్యాన్ని బస్తీ వాసుల ముంగిటికి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రక్రియలో భాగంగా నగరవ్యాప్తంగా, 319 బస్తీ దవాఖానలు దశల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు, పెద్దాసుపత్రులకే పరిమితం అయిన  వైద్య పరీక్షలను ఇపుడు నగరవాసుల ముంగిటికే  తీసుకొచ్చింది. సాధారణంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా  వైద్యులు ముందుగా మెడికల్‌ టెస్టులు రాస్తారు. వైద్య ఖర్చుల్లో సింహభాగం పరీక్షలకే పోతుంది. టెస్టులు చేస్తేగాని రోగమేంటో తెలియదు. అందుకని పరీక్షలు తప్పనిసరి. ఈ పరీక్షలు ప్రైవేటులో చేయించుకోవాలంటే పేదలకు మోయలేని భారం. దీనిని దృష్టిలో పెట్టుకుని సర్కారు డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ మినీ హబ్‌ల ద్వారా 108రకాల వైద్యపరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం 8 డయాగ్నస్టిక్‌ మిని హబ్‌ లను హైదరాబాద్‌ నగరంలో ప్రారంభించింది. ఇప్పుడు 10 నుంచి 15 ఆరోగ్య కేంద్రాలకు ఒకటి చొప్పున నగర వ్యాప్తంగా ఎనిమిది డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి.అతి త్వరలో మరో ఎనిమిది హబ్‌ లను సిద్ధం చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. లాలా పేటలోని  అర్బన్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో డయాగ్నస్టిక్‌ హబ్‌ను మంత్రి ఈటల, ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బస్తీ దవాఖానలకు వెళ్లిన వారికి ఏవైనా టెస్ట్‌లు అవసరం అయితే, వెంటనే టెస్ట్‌లు చేయడం కోసం ఈ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాము. పేదలు, వైద్య పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే అవసరం లేకుండా చేసేందుకే ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇక్కడ ఎక్స్‌ రే, ఈసిజి, అల్ట్రా సౌండ్‌ పరీక్షలు చేస్తాము, వాటి రిపోర్టులను ఆన్లైన్‌లో అందజేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సేవలు పూర్తి ఉచితంగా పేదలకు అందించడమే మా లక్ష్యం. హైదరాబాద్‌లో ఈ డయాగ్నొస్టిక్‌ లాబ్‌లు విజయవంతం అయితే… జిల్లాల్లోనూ అవసరం అయిన చోట ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే 8 అధునాతన ఆపరేషన్‌ థియేటర్‌లతో గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి సౌకర్యం, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు అందించేందుకు సన్నాహాలు. ఖరీదైన శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నాము అని అన్నారు.  

జూబ్లీహిల్స్‌ శ్రీరాంనగర్‌లోని హెల్త్‌ సెంటర్‌లో డయాగ్నోస్టిక్‌ మినీహబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌కు హైదరాబాద్‌ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా సమయంలో విశేష సేవలందించిన వైద్య సిబ్బంది రుణం తీర్చలేనిదని చెప్పారు. నగర పేదలకు వైద్యసేవలను మరింత చేరువచేసే క్రమంలో పురానాపూల్‌, బార్కాస్‌, పానీపుర, జంగమ్మెట్‌, లాలాపేట, అంబర్‌పేట, సీతాఫల్‌ మండిల్లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రారంభించారు. 

బార్‌కోడ్‌ ద్వారా..

యూపీహెచ్‌సీలు, బస్తీదవాఖానలు, ఇతర ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానలల్లో రోగులకు అవసరమైన వైద్యపరీక్షలను అక్కడి వైద్యులు దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు రిఫర్‌ చేస్తే.. ఆ ప్రిస్కిప్షప్‌పై బార్‌కోడ్‌ వేస్తారు. ఆ ప్రిస్కిప్షన్‌ తీసుకుని రోగులు సంబంధిత డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళ్లగానే అక్కడి సెంటర్‌ మేనేజర్‌ ఆ బార్‌కోడ్‌ను స్కాన్‌ చేయగానే.. వెంటనే వారికి రోగికి సంబంధించిన వివరాలు కంప్యూటర్‌లోకి కనిపిస్తాయి. దీంతో వారికి వైద్యులు సూచించిన పరీక్షలు నిర్వహించి రిపోర్టులను ఆన్‌లైన్‌ ద్వారా రిఫర్‌ చేసిన ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. దీనివల్ల రోగులు రిపోర్టుల కోసం తిరగాల్సిన పనివుండదు.