గాంధారి కోట

gandari-kotaనాగబాల సురేష్‌ కుమార్‌

గత వైభవాలకు తార్కాణంగా భారతదేశ చరిత్రకు సాక్షీభూతంగా నేటికీ ఎన్నెన్నో కోటలు దేశమంతా మనకు కానవస్తాయి. ప్రపంచ చరిత్రలో జాతి నిర్మాణం కోసం నిరంతరం తపించిన వారిలో చంఘీజ్‌ఖాన్‌, అలెగ్జాండర్‌ లాంటివాళ్ళు కొందరే వున్నారు. అలా చివరి వరకూ ‘గోండు’, ‘గిరిజన’ జాతి కోసం పోరాటం చేసిన రాజులలో ‘రాజ్‌గోండ్‌’లు కూడా ముందు వరుసలో నిలుస్తారు. అలా వారు నిర్మించుకున్న కోటలలో ఆదిలాబాద్‌ జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని ‘గాంధారి ఖిల్లా’ ఒక్కటి. మంచిర్యాల నుండి ఆసిఫాబాద్‌కి వెళ్ళే దారిలో బొక్కలగుట్ట నుండి 5 కి.మీ. దూరంలో కనిపించే ఈ కోట బొక్కలగుట్టకు దగ్గరలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 3 కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప ఈ ఖిల్లాను చేరుకోలేం. కోటకు వెళ్ళే మార్గం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల బృందంగా వెళ్తేనే మంచిది. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడిన కోట అని తెలుస్తోంది. గోండు రాజులు ఈ గాంధారి ఖిల్లాను కేంద్రంగా చేసుకొని చుట్టుప్రక్కల ప్రాంతాలను చాలా సంవత్సరాలపాటు పాలించారు. కొంత కాలం పాటు వడ్డెరాజులు, రెడ్డిరాజులు కూడా ఈ ఖిల్లా కేంద్రంగా తమ పరిపాలనను కొనసాగించిన వారిలో నిలుస్తారు. ముస్లిం రాజులు, కాకతీయ రాజుల దాడుల ప్రభావంతో ఆ రాజులు ఈ కోటలోనే తలదాచుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం ఇది గిరిజనుల కోటగా నిర్థారించబడింది. విస్తీర్ణంలో ఈ ఖిల్లా చాలా పెద్దది. కొండ చుట్టూ దట్టమైన అడవి వుండడం మూలంగా కోట విస్తీర్ణానికి సంబంధించి సరైన అంచనాలు లేవు. మహాభారతంలోని పాండవులు, కౌరవులు కథల ఆధారంగా ఈ కోటకు ‘గాంధారి కోట’ అని పేరు రావడం జరిగిందని చెబుతారు. గాంధారి మైసమ్మ కోటకు మూల దేవతగా పూజలందుకుంటున్నందున ‘గాంధారి ఖిల్లా’గా నామకరణం జరిగిందని మరికొందరి వాదన. గాంధర్వులు కోటలోని సరస్సులో స్నానాలు చేయటం వల్ల ‘గాంధారి కోట’గా పిలువబడుతోందని మరో కథ ప్రచారంలో ఉంది. కోటలో ఎన్నో అపురూప రాతి నిర్మాణాలు, ఆలయాలు వున్నాయి. కోటలోకి వెళ్ళడానికి నిర్మించిన పెద్ద ద్వారం రాతి కొండను తొలిచి నిర్మించిన అత్యంత పటిష్టమైన ద్వారం. ద్వారానికి కుడివైపున రాతిగోడపై గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మతో పాటు, కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుని విగ్రహాలు కొలువై వున్నాయి. వివిధ దేవాలయాలతోపాటు శతృవుల రాకను పసిగట్టేవిధంగా ప్రత్యేకమైన ప్రహరీగోడ నిర్మాణం నేటికీ శిథిలావస్థలో మనకు కనిపిస్తుంది. కోటపై రక్షణకోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలలో 8 మీటర్ల పొడవైన నగరా గుండుకూడా ఉంది. అప్పటి నిర్మాణ కౌశలానికి, వారి చాతుర్యానికి ఇదొక ఉదాహరణ. కోటకు 3 వైపులా రాతి ద్వారాలు ఎత్తయిన కొండను తొలిచి ఏర్పాటు చేయబడ్డాయి. ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతితో అలరారే జిల్లానేకాక చారిత్రక కట్టడాలకు నిలయంగా నిలిచిన ఆదివాసుల జిల్లా కూడా. అలా ఆదివాసులు నిర్మించుకున్న కోటల్లో సిర్పూర్‌, తాండూర్‌, నేడు ఆసిఫాబాద్‌గా పిలువబడుతున్న నాటి జనగామ, మంచిర్యాల సమీపంలోని గాంధారి, ఉట్నూరు ఖిల్లాలు కూడా నిలుస్తాయి. అలాంటి గొప్ప నిర్మాణాల్లో ఈ గాంధారి ఖిల్లా కూడా నిలుస్తుంది. గోండు రాజుల చారిత్రక వైభవానికి ఈ కోట సాక్షీభూతంగా నిలుస్తుంది. కోటలో ఎన్నో అపురూప రాతి నిర్మాణాలు, ఆలయాలు ఉన్నాయి. కొండపైకి నాటి ప్రజలు, సైనికులు వెళ్ళడానికి కొండను తొలిచి నిర్మించిన రాతి మెట్లు, అలాగే ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి నిర్మించిన ప్రత్యేక మార్గాలు నేటికీ చెక్కు చెదరలేదు. స్థానికులు నిర్మించుకున్న భోగం గుండ్లు కూడా కోటలో ఉన్నాయి. వీటికి ఉండే మార్గాలను పెద్ద బండరాయిని తొలచి నిర్మించారు. ఇవి శిల్పకళలో వరంగల్‌ కాకతీయ ఖిల్లాకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఉంటాయి. ఆనాటి శిల్పుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి వారి ప్రతిభకి నిదర్శంగా ఈ కోట నేటికీ నిలిచి ఉంది. ‘గాంధారి ఖిల్లా’ పేరులోనే ఒక వైభవం తొణికిసలాడుతోంది. కోట పైకి వెళ్ళిన తర్వాత 3 గుహలు మనకు కానవస్తాయి. ఒక గుహలో ఒకేసారి వేయిమంది సమావేశం అయినా సరిపోయేటంత విశాలమైన మందిరం కనిపిస్తుంది. సహజ సిద్ధంగా అందులోకి సూర్యకాంతి వస్తుంది. ఆ కాంతి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందులో గోడలపై ఎన్నెన్నో చిత్ర విచిత్ర చిహ్నాలు మనకు కనిపిస్తాయి.

కోటలోని ప్రజల అవసరాల నిమిత్తం గుట్టపై రెండెకరాల విస్తీర్ణంలో విశాలమైన చెరువును నిర్మించారు. ఇప్పటికీ ఆ చెరువు నిర్మాణాన్ని చూస్తే ఏ విధమైన సాంకేతిక పరికరాలు లేని ఆ కాలంలో ఇలాంటి నిర్మాణాలు ఎలా నిర్మించారో తలచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడి రాతి విగ్రహాలను చూస్తే కొండలను త్రవ్వి, ఆ శిల్పాలు చెక్కినట్లు మనకర్థమవుతుంది. అలాగే ఈ కోట ప్రాంతం ఎన్నో దివ్యమైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది. ఎర్రగురివింద గింజల చెట్లు కూడా ఇక్కడ సమృద్దిగా ఉన్నాయి. కార్తీక వనభోజనాల సమయంలో ఇక్కడ ప్రజల తాకిడి కాస్త ఎక్కువగా వుంటుంది. కోటపై మరో ప్రధానాకర్షణ కొండను తొలచి నిర్మించిన నాగశేషుడి ఆలయం. సుమారు 8 అడుగుల ఎత్తులో 12 అడుగుల నాగశేషుని విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా, నయన మనోహరంగా ఉంటుంది. గిరిజనులు నాగశేషుడికి కూడా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం పక్కనే మూడు బావులుంటాయి. స్థానికులు వీటిని ‘సవతుల బావుల’ని పిలుస్తారు. చాలా పురాతన బావులైనప్పటికీ అవి కొంచెం కూడా చెక్కుచెదరలేదు. వేసవిలో కూడా వీటిలో నీరు నిలువ వుంటుంది. ఇందులోనే గాంధర్వులు స్నానం చేసేవారని ఒక కథ ప్రచారంలో ఉంది. కోటగోడలపై అక్కడక్కడా కనిపించే నాటి కాలం నాటి ‘శిలా శాసనం’ వంటి రాతల్ని పురావస్తు శాఖ వారి ద్వారా పరిశోధిస్తే మరిన్ని విశేషాలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోనే అందమైన అడవుల్లో కొలువై వున్న ఈ ‘గాంధారి ఖిల్లా’ విభిన్న గిరిజన సంస్కృతులకు నిలయంగా వుంది. వందల ఏళ్ళ నుండి ఏర్పడిన బంధాన్ని ఇప్పటికీ స్థానిక గిరిజనులు కొనసాగిస్తున్నారు. కోటలో వున్న గాంధారి మైసమ్మ గిరిజనుల ఆరాధ్య దైవం. ఆది, గురువారాల్లో గోండులు, మన్నెలు, నాయక్‌ పోడులు, కోయ జాతులవారు ఇక్కడి అమ్మవారిని మనసారా పూజిస్తారు. గాంధారి మైసమ్మ తమ కోరికలు నెరవేరుస్తుందని వారు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడి గిరిజన జాతులవారు. తమ తమ స్థాయిలో వారు మొక్కులు కూడా చెల్లిస్తారు. వర్షాలు కురవాలని కోరుతూ ప్రతి యేటా భీమన్న దేవునికి నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంటలు పండిన తరువాత ఇక్కడ నైవేద్యంగా ఆ పంటలు సమర్పించిన తరువాతే వాటిని తమ అవసరాలకు వారు వినియోగిస్తారు. ఇంతటి అద్భుతమైన కోటని నిర్మించిన రాజులు గోండురాజులే అయినా ఏ రాజు ఈ కోటను నిర్మించాడో ఏయే రాజులు ఈ గాంధారి ఖిల్లాను ఎన్నాళ్ళపాటు పరిపాలించారో స్పష్టమైన దాఖలాలు అందుబాటులో లేవు. గాంధారి ఖిల్లాను పాలించిన గోండు రాజులు ‘జనుగాం’ ప్రాంతాన్ని పాలించిన అంకమరాజుకు సామంతులుగా కొంతకాలం ఉన్నారని ఆ సమయంలోనే వారు తమ ప్రాబల్యాన్ని తిర్యాని మండలం వైపు విస్తరించుకోవడానికి ప్రయత్నించారని గిరిజన పెద్దలు చెబుతారు. చుట్టుప్రక్కల ప్రాంతాలవారికి గాంధారి ఖిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రెండేళ్ళకోసారి కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద గాంధారి జాతర కూడా జరుగుతుంది. ఆ సమయంలో కోట దగ్గర పండగ వాతావరణం వుంటుది. పూజల నిర్వహణలో భాగంగా భక్తులు రాత్రంతా ఇక్కడే వుండి జంతుబలిని ఇస్తారు. మిగతా కోటలలో లాగా ఈ కోటలో కూడా గుప్తనిధుల కోసం స్వార్థపరులు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు సాగించడంతో విలువైన శిల్ప సంపదతో పాటు కోట కూడా అందాన్ని కోల్పోయి కళావిహీనమైంది. సరైన రోడ్డు మార్గాలు నిర్మించి తగిన సదుపాయాలు కల్పించి ఈ ‘గాంధారి ఖిల్లా’ గురించి తగిన ప్రచారం చేస్తే తప్పకుండా ఈ కోట పూర్వ వైభవం సంతరించు కుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ పర్యాటక శాఖ ఇలాంటి ఎన్నెన్నో కోటల గురించి, చారిత్రక ప్రదేశాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ‘గాంధారి ఖిల్లా’ను కూడా పర్యాటక ప్రదేశంగా గుర్తించి సరైన సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్తులో ఇది మంచి పర్యాటక ప్రదేశంగా మారుతుంది. గిరిజన జాతుల సంక్షేమమే ధ్యేయంగా వారి సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వారి ఆత్మరక్షణే ధ్యేయంగా గిరిజన జాతి అభ్యున్నతే ప్రధాన ఆశయంగా నిరంతరం తపించిన గిరిజన గోండు రాజులు నిర్మించిన ఈ గాంధారి ఖిల్లాను కాపాడుకోవాల్సిన, పరిరక్షించా ల్సిన బాధ్యత మనందరిపైన వుంది.