సుముఖశ్చైక దంతశ్చ…

By: డా. భిన్నూరి మనోహరి

‘‘వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా’’

అంటూ అన్ని కార్యాల్లో, అన్నివేళలా విఘ్నాలు లేకుండా చేయు తండ్రి అని అందరం ప్రార్థించే ఆది దైవం విఘ్నేశ్వరుడు.  సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, గణాధిపుడు, ధూమ్రకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండుడు, శూర్పకర్ణుడు, హేరంబుడు, స్కంధపూర్వజుడు అంటూ పదహారు నామాలతో గణేశుడు పిలువబడుతున్నాడు. ఈ నామాలు  అతని రూపాన్ని, అతడి ఆంతరిక లక్షణాన్ని, చేసే కార్యాలను మనకు తెలియజేస్తున్నాయి.

భారతీయమైన మన హిందూ ధర్మంలో ఉన్న ముక్కోటి దేవతల్లో ఆదిపూజలందుకునేది గణపతియే. గణపతి ఆరాధన చేయడం అంటే మనం నివసించే భూమిని, ఆ భూమిపై వెలసిన అనేకానేక వృక్ష సంపదను, ప్రకృతిని ఆరాధించడమే. ఆదిదంపతుల ప్రథమ పుత్రుడుగా పరిగణింపబడే వినాయకుడు సర్వ గణాలకు అధిపతిjైు ప్రథమ పూజలు అందుకుంటున్నాడు.

16 నామాలతో పిలువబడే వినాయకుడు

32 రూపాలలో దర్శనమిస్తున్నాడు. 1. బాల గణపతి,

2. తరుణ గణపతి, 3. భక్తి గణపతి, 4. వీర గణపతి, 5. శక్తి గణపతి, 6. ద్విజ గణపతి, 7. సిద్ధి గణపతి,

8. ఉచ్ఛిష్ట గణపతి, 9. విఘ్న గణపతి,

10. క్షిప్ర గణపతి, 11. హేరంబ గణపతి,

12. లక్ష్మీ గణపతి, 13. మహా గణపతి,

14. విజయ గణపతి, 15. నృత్య గణపతి,

16. ఊర్ధ్వ గణపతి, 17. ఏకాక్షర గణపతి,

18. వర గణపతి, 19. త్య్రక్షర గణపతి,

20. క్షిప్ర ప్రసాద గణపతి, 21. హరిద్రా గణపతి,

22. ఏకదంత గణపతి, 23. సృష్టి గణపతి,

24. ఉద్ధండ గణపతి, 25. ఋణమోచన గణపతి,

26. ఢుంఢ గణపతి, 27. ద్విముఖ గణపతి,

28. త్రిముఖ గణపతి, 29. సింహ గణపతి,

30. యోగ గణపతి, 31. దుర్గా గణపతి,

32. సంకటహర గణపతి.

భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు వినాయకచవితిని జరుపుకుంటున్నాము. ఆరోజు వినాయక వ్రతం చేస్తాము. వ్రతం అంటే నియమనిష్టలతో చేసేది. పండుగ అంటే ఆనందోత్సాహాలతో చేసుకునేది.

గణపతికి సంబంధించి అతని రూపం, ఆకారం, అతడు ధరించే ఆయుధాలు అన్నీ ప్రతీకలుగానే చెప్తారు. మూలరూపంగా వినాయకుని ఆకారం ప్రణవం ‘ఓం’కార రూపాన్ని(దేవనాగరి) పోలి ఉంటుంది. ఈ ఆకారంలో అనేక రకాల బొమ్మలు చిత్రించబడినవి మనం చూస్తూనే ఉన్నాము. వినాయకుని తొండం ఓంకారానికి సంకేతంగా, ఏనుగు తల – జ్ఞానానికి, యోగానికి; శరీరం – మాయకూ, ప్రకృతికి, చేతిలో పరశువు – అజ్ఞానాన్ని ఖండించేదిగా; చేతిలో పాశం – విఘ్నాలను నిలుపుచేసే సాధనంగా; విరిగిన దంతం – త్యాగానికి ప్రతీకగా; మాల – జ్ఞానం పొందడానికి; పెద్ద చెవులు – మ్రొక్కులు వినే కరుణామయుడుగా; పొట్టమీద నాగబంధం – షట్చక్రాలలో కుండలినీ శక్తికి ప్రతీకగా చెప్పబడుతుంది. కావున భక్తిభావంతో గణపతిని పూజిస్తే అన్నిరకాల ఆటంకాలు తొలగి సర్వవేళలా మనకు రక్షణ కల్పిస్తాడు.

ఎలుక వాహనంగా ఎందుకు? :

వినాయకుడికి ఎలుక వాహనమని మనందరికీ తెలిసిన అంశమే. ఆ విషయంలో అనేక సందేహాలు, కూడా వెలుబుచ్చుతుంటాము. ఎలుక తామస ప్రవృత్తికి ప్రతీకగా చెప్తారు. పంటలకు హాని కలిగించే ఎలుకను ఎక్కి అదుపు చేయడం అనేది మన జీవనంలో ఎదురయ్యే విఘ్నాలను నివారించడం, మనలోని కామక్రోధాదులను అణగద్రొక్కడంగా పెద్దలు చెప్తారు. ఈ వాహనాన్ని ఎక్కి వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని అందుచేతనే అతడు సర్వాంతర్యామి అనే భావం కూడ మనకు గోచరిస్తుంది.

మన హిందూ సంప్రదాయంలో దేవతా సంబంధంగా 4 రకాల నవరాత్రులను నిర్వహించుకుంటాము. మొదటిది వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢమాసంలో నిర్వహించుకునే గుప్త నవరాత్రులు, భాద్రపదమాసంలో గణపతి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో నిర్వహించే అమ్మవారి నవరాత్రులు. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన నవరాత్రులుగానే మనం జరుపుకుంటాం. ఆయా నవరాత్రులు అప్పటి వాతావరణానికి అనుకూలంగా ఉండే పూజద్రవ్యాలు, పూలు, పండ్లు, పత్రములు వంటివి సమర్పిస్తాము. దైవానికి సమర్పించే నైవేద్యం కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగించేవి మాత్రమే పెడ్తాము. ఈ విధివిధానాలు సంప్రదాయంగా మారినాయని చెప్పవచ్చు.

వినాయక నవరాత్రుల్లో ప్రత్యేకించి వినాయక చవితినాడు స్వామికి ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నైవేద్యం సమర్పించినప్పటికి 21రకాల పత్రాలతో పూజించడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఏకవింశతి పత్రాలతో పూజ అంటే ఏ పత్రాలు దొరికితే అవి  సమర్పించడం కాదు. వాటికి కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని ఉపయోగించడం వల్ల మనలో ఉండే చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయి. అంతేకాదు చివరిరోజు గణపతిని నిమజ్జనం చేసేరోజు మట్టివిగ్రహంతో పాటు ఈ పత్రాలను కూడా నీటిలో పడవేయాలి. తద్వారా నీరు ఔషధీవంతమవుతుంది. ఔషధగుణాలున్న ఈ 21 పత్రాలను ఓం ఉమాపుత్రాయ నమః మాచీపత్రం సమర్పయామి, ఓం హేరంబాయ నమః బృహతీపత్రం సమర్పయామి అంటూ సమర్పిస్తాము.

1. మాచీపత్రం (మాచిపత్రం), 2. బృహతీపత్రం (ములక), 3. బిల్వపత్రం (మారేడు ఆకులు),

4. దూర్వాపత్రం (గరిక), 5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త ఆకులు), 6. బదరీపత్రం (రేగుచెట్టు ఆకులు),

7. అపామార్గ (ఉత్తరేణి), 8. తులసీపత్రం,

9. చూతపత్రం (మామిడి ఆకులు), 10. కరవీరపత్రం  (గన్నేరు), 11. విష్ణుక్రాంతపత్రం (నీలం, తెలుపు రంగులో పువ్వులుండే చిన్ని మొక్క), 12. దాడిమీ పత్రం (దానిమ్మ ఆకులు), 13. దేవదారు పత్రం (దేవతలకు ఇష్టమైన చెట్టు ` దాని ఆకులు),

14. మరువకపత్రం (మరువం), 15. సింధువార పత్రం (వావిలి ఆకులు), 16. జాజిపత్రం (సన్నజాజి మల్లెజాతి మొక్క ఆకులు), 17. గండలీ పత్రం (లతా దూర్వాపత్రం), 18. శమీపత్రం (జమ్మిచెట్టు ఆకులు), 19. అశ్వత్థ పత్రం (రావి ఆకులు), 20. అర్జునపత్రం (మద్ది ఆకులు), 21. అర్కపత్రం (జిల్లెడు ఆకులు).

అదేవిధంగా ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను, మల్లెలు, మొల్లలు, మంచి చేమంతులున్‌ తెల్ల గన్నేరులన్‌, మంకెలన్‌, పొన్నలన్‌ పువ్వులున్‌ మంచి దూర్వంబులందెచ్చి’’ అంటూ పున్నాగ, మందార, దాడిమీ, వకుళ(పొగడ), అమృణాల (తామర), పాటలీపుష్పం(నల్లగినియ చెట్టు), ద్రోణపుష్పం (తుమ్మిపూలు), దుర్ధూర, చంపక, రసాలపుష్పం, కేతకీ, మాధవీ పుష్పం, శమ్యాక పుష్పం అర్కపుష్కం, కల్హార పుష్పం సేవంతికా, బిల్వపుష్పం, కరవీరపుష్పం, కుంద పుష్పం, పారిజాత, జాతీపుష్పం సమర్పిస్తారు.

స్వామికి ప్రత్యేకంగా ‘‘టెంకాయలున్‌, పొన్నంటి పండున్‌ మరిన్మంచివై ఇక్షు ఖండంబులు, రేగు బండ్లప్పడాల్‌, వడల్‌, నేతి గారెల్‌ మరిన్‌ గోధుమప్పంబులు న్వడల్‌ పున్గులున్‌ గారెలున్‌ చొక్కమౌ చల్మిడిన్‌, బెల్లమున్‌ తేయియుం, జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు…’’ నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తాము.

స్వామికి ప్రత్యేమైన పత్రములు, పూలు, నైవేద్యములు సమర్పించి వాటిని మనం భక్తితో ప్రసాదంగా తీసుకోవడం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

షోడశోపచార పూజ చేసిన తర్వాత వినాయకుడికి సంబంధించిన వ్రత కథలను చదువుకోవడం అనేది ఆరోజు చేయవలసిన ప్రత్యేక విధి. వినాయకుని జన్మ వృత్తాంతానికి సంబంధించిన గాథలు ఒక్కో పురాణంలో ఒక్కోవిధంగా చెప్పబడింది. సాధారణంగా మనందరం చదువుకునే వినాయక చవితి వ్రతంలో ఉన్నది ప్రసిద్ధమైనది. గజాసురుడనే రాక్షసుడు శివుని వరం వల్ల శివుడిని తన కడుపులో దాచుకొన్నాడు. పార్వతీదేవి భర్త జాడ తెలియక విచారింపగా గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించింది.  పార్వతీదేవి మొరను ఆలకించి విష్ణుమూర్తి శివుని వాహనం నందిని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలందరూ విచిత్ర వాద్యాలను స్వీకరించి గజాసురుని వద్దకు వెళ్ళి గంగిరెద్దును ఆడించినాడు. వారి ఆటపాటలను చూచి గజాసురుడు సంతోషించి ఏమి కావాలని అడగగా ‘‘శివుని వాహనమైన నంది శివుని జాడ కనుక్కోడానికి వచ్చింది కాబట్టి నందికి శివుడిని ఇచ్చివేయమని’’ చెప్పినాడు. విష్ణుమూర్తి కోరికను మన్నించి తన కడుపులోనుండి శివుడిని ఇచ్చివేసినాడు. కానీ తన శిరస్సును త్రిలోకాల వారు పూజించాలని కోరినాడు.

అటు తర్వాత కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను విని అభ్యంగన స్నానం చేయడానికి నలుగుపిండితో ఒక బాలుడిని చేసి, ప్రాణం పోసి వాకిలి వద్ద కావలి ఉంచింది. అలంకరించుకొనే సమయంలో పరమేశ్వరుడు వచ్చి లోనికి పోవాలని ప్రయత్నించగా బాలుడు అడ్డగించినాడు. కోపోద్రిక్తుడైన శివుడు ఆ బాలుణ్ణి తన త్రిశూలంతో సంహరించాడు. మరణించిన బాలుడిని చూచి  పార్వతి పుత్ర ప్రేమతో శివుడిని నిందించగా తాను తీసుకువచ్చిన గజాసురుని తలను ఆ బాలుడికి అతికించినాడు. ఆనాటినుండి ఆ బాలుడు గజాననుడిగా ప్రసిద్ధి చెందినాడు. ఆ తరువాత కుమారస్వామి జననం, గణాధిపత్యం వినాయకుడికి రావడం, భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం రావడం, అనేక పిండి పదార్థాలు తిని తల్లిదండ్రులకు ప్రణామం చేయడానికి ఇబ్బంది పడుతుండగా శివుని తలపై ఉన్న చంద్రుడు చూసి పక్కున నవ్వడం, పార్వతీదేవి చంద్రుని శపించడం, దానివల్ల లోకంలో వినాయక చవితి నాడు చంద్రుని చూసినంతన నీలాపనిందలు కలుగుతాయనే నమ్మకం స్థిరపడిపోయింది.

కాబట్టి వినాయకచవితి నాడు వ్రతసమాప్తిలో శమంతకోపాఖ్యానం కథను చదవుకోవడం కాని, వినడం కాని చేయాలని వ్రతకల్పంలో చెప్పబడింది.  చంద్రదోష పరిహారార్థం

‘‘సింహః ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతః

సుకుమారకమారోదీః తపహ్యేష శమంతకః’’

అనే శ్లోకాన్ని చెప్పుకొని అక్షతలు శిరస్సుమీద వేసుకోవాలి.

ఇది వినాయక చవితికి సంబంధించిన కథ.  అయితే ఇది వ్యక్తిగతంగా ఎవరి ఇండ్లలో వారు జరుపుకునేవారు భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో ప్రజలందరూ కలిసి ఉండే పరిస్థితి లేకుండెను. ప్రజలందరిలోను స్వాతంత్య్ర చైతన్యం తీసుకురావాలనే ఆకాంక్షతో బాలగంగాధర్‌ తిలక్‌ 1893లో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలు ప్రారంభం చేసినారు. ఆ స్ఫూర్తి నేటికి కొనసాగుతూ భారతదేశంలోని ప్రతిరాష్ట్రంలో ప్రతి నగరంలో ప్రతి గల్లీలోను మండపాల్లో గణపతి ప్రతిష్ఠాపనలు జరిగి 9రోజులు విశేషంగా పూజలు జరుపబడుతూ 10రోజు నిమజ్జనం చేయబడుతున్నాయి.

ఆధునిక కాలంలో చాలా ఎత్తులో ఉండే గణపతులు, కృత్రిమ రంగులతో తయారు చేయబడిన గణపతులు నిర్మిస్తున్నారు. కానీ మట్టితో చేసిన గణపతి విగ్రహాలు నిమజ్జనం తర్వాత ఎటువంటి పర్యావరణ హాని కాకుండా కాపాడుతాయి. మనం చేసే పత్ర పూజ కూడా నీటిలో కలిసి వాటి ఔషధ గుణాలతో నీరు కూడా శుద్ధి అవుతుంది. నీరు కలుషితం కాదు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న, పెద్ద గణపతులన్నీ మట్టితో చేసినవైతే మనల్ని మనం కాపాడుకున్నవాళ్ళం అవుతాము.