ఆ కాలేజీలో చదివితే ఎంత బాగుండేది !
By:-డాక్టర్ కోయి కోటేశ్వరరావు
శతవసంతాల సిటీ కళాశాల

నయాపూల్ రోడ్డులో కారులో వెళుతున్నప్పుడు మా వారు, దివంగత ప్రజానేత ఇంద్రారెడ్డి ఎంతో ఆనందంతో సిటీ కళాశాల గొప్పతనాన్నిగురించి పదే పదే చెప్పేవారు. ‘‘మా సిటీ కళాశాల” అని గర్వంగా పొంగిపోయేవారు. కళాశాలలో తాను చదువుకున్నప్పటి ముచ్చట్లను యాది చేసుకొని ఆసక్తిదాయకంగా నాకు వివరించేవారు. కళాశాల ఘన చరిత్రను, పాఠాలు బోధించిన గురువుల ఔన్నత్యాన్ని, విద్యార్ధి ఉద్యమ విశేషాలను, దోస్తులతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను ఉత్తేజ భరితంగా నాకు చెప్పే వారు. ‘‘మీ సిటీ కళాశాల గురించి ఎన్ని సార్లు చెబుతారు?” అని నేను నవ్వుతూ ప్రశ్నించినా వినకుండా, సందర్భం దొరికితే చాలు ఉత్సాహంతో కాలేజీ కబుర్లుచెప్పేవారు. ఆ జ్ఞాపకాలతో నిరంతరం పరవశించి పోయేవారు. సిటీ కాలేజీ ఘనత గురించి ఇంద్రా రెడ్డి చెప్పేమాటలు వింటున్నప్పుడు, ఇంత ఉన్నతమైన కళాశాలలో నేను కూడా చదువుకుంటే ఎంతబాగుండేది అనిపించేది” తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాటల్లో శతవసంతాల సిటీకళాశాల విశిష్టత అర్ధమవుతుంది.
ఈనాడు వివిధరంగాల్లో దేశానికి బహుముఖీనమైన సేవలందిస్తున్న ప్రముఖుల్లో ఎక్కువ శాతం మంది ఒకప్పుడు సిటీ కళాశాలలో విద్యనభ్యసించిన వారే కావడం విశేషం. విద్యా, వైద్యం, రాజకీయ, సాహిత్య, కళా రంగాలతోపాటు, క్రీడారంగంలో కూడా సిటీ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచి అసాధారణ రికార్డులను సాధించారు. ‘గిన్నిస్’ వీరులుగా మన్ననలందుకున్నారు. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, కబాడి, క్రికెట్ పోటీల్లో కళాశాల విద్యార్థులు విశ్వవిఖ్యాత క్రీడాకారులుగా రాణించారు.
మహమ్మద్ యూసిఫ్ (1966), మహమ్మద్ హబీబ్(1981) అర్జున్ అవార్డులు అందుకున్నారు. పి.సంతోష్ కుమార్ బాస్కెట్ బాల్ పోటీల్లో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఎ.లతీఫ్ మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలంపిక్స్(1956)లోను, యూసుఫ్ ఖాన్, రోమ్‌లో జరిగిన ఒలంపిక్స్ (1960)లోను పాల్గొన్నారు. అహమ్మద్ హుస్సేన్ లాంటివారు ఆసియా క్రీడల్లో తమ సత్తాచాటారు. క్రికెట్ క్రీడా దిగ్గజం అర్షద్ అయ్యుబ్ కూడా సిటీ కళాశాల మైదానంలోనే తన ప్రతిభకు పుఠం పెట్టుకున్నాడు. సిటీ కాలేజ్ ఓల్డ్ బాయిస్ అసోసియేషన్, స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్‌ల ద్వారా కళాశాల విద్యార్థులు అనేక పర్యాయాలు వివిధ క్రీడాపోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీకి, భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి విజయఢంకా మోగించారు. సిటీ కళాశాల ముద్దుబిడ్డ మంగికిశోర్ కుమార్ కేవలం తన చెవుల సహాయంతోనే లారీని 10 మీటర్ల దూరం ముందుకు లాగి, ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ రికార్డ్(2011)లో తన పేరు నమోదు చేసుకున్నాడు కె.నరసింహ తనబృందంతో గంటకు 54,127 కిక్స్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకొని సిటీకళాశాలకు చిరకీర్తిని సంపాదించి పెట్టాడు.
ఛాంపియన్ బేబీరెడ్డి
ఇలాంటి అరుదైన చరిత్రకు ఆనాటినుండి ఈ నాటివరకు సిటీకళాశాల క్రీడాకారులు తార్కాణంగా నిలుస్తున్నారు. ఇటీవల లండన్ లో జరిగిన 2022 కామన్ వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో సిటీకళాశాల విద్యార్థిని యం.బేబీరెడ్డి కాంస్య పథకం సాధించి ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఫెన్సింగ్‌లో గ్రూప్ ఛాంపియన్ షిప్ పోటీలో బేబీరెడ్డి ఈ మెడల్ కైవసం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విశ్వమంతా చాటిచెప్పింది. సిటీకళాశాల శతవసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో బేబీరెడ్డి సాధించిన విజయం కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు అమితోత్సాహాన్ని అందించింది. పాటియాలలోని నేతాజీ సుభాస్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో రెండు సంవత్సరాలు సమర్ధవంతంగా శిక్షణపొంది, తదనుగుణమైన అభినివేశంతో ఫెన్సింగ్ క్రీడలో బేబీరెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా దూసుకుపోతోంది.
2017లో కటక్‌లో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలో రజిత పతకంతో పాటు, 2018లో మణిపూర్ లో జరిగిన పోటీల్లోకూడా బ్రాంజ్ మెడల్ పొందింది. రెండు పదుల వయస్సు నిండకుండానే బేబీరెడ్డి యుద్ధ క్రీడ లాంటి ఫెన్సింగ్‌లో తనసత్తా చాటుతూ అసాధారణమైన ఖడ్గ చాలనంతో ప్రత్యర్ధులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అండర్ 17, 18, 19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలలో కూడా బేబీరెడ్డి విజకేతనం ఎగురవేసి స్వర్ణ పతకాలను గెలుచుకుంది. ప్రాథమిక పాఠశాల స్థాయినుండే బేబీరెడ్డి క్రీడల్లో అపారమైన ప్రతిభ కనబరుస్తుండడం గమనించిన ఉపాధ్యాయులు రామచంద్ర, సుధాకర్‌లు ఆమెను ప్రోత్సహించారు. నాల్గవ తరగతి నుండి ఇంటర్ వరకు హకీంపేట లోని తెలంగాణస్పొర్ట్స్ అథారిటీ సంస్థలో విద్య నభ్యసించిన బేబీరెడ్డి, దుర్గాప్రసాద్ తుకారామ్ వంటి కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఫెన్సింగ్ క్రీడలో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తోంది. పది సంవత్సరాల క్రితం ఒక బంగారు కలను గుండెల్లో దాచుకొని కడపనుండి భాగ్యనగరానికి వచ్చిన బేబీరెడ్డి ఆ కలను సాకారం చేసుకోవడానికి కఠోరమైన కృషి చేస్తోంది. బేబీరెడ్డి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, రామకృష్ణారెడ్డి, అందరిలాగా తమ ఇష్టాలను కూతురు మీద బలవంతంగా రుద్దకుండా బేబీరెడ్డి క్రీడాభిరుచిని అర్థం చేసుకొని ముందుకు నడిపించారు. క్రీడా ప్రపంచలో సమున్నతంగా ఎదగడానికి సముచితమైన విద్యాసంస్థ ప్రభుత్వ సిటీకళాశాల మాత్రమేనని బేబీరెడ్డి భావించింది. దోస్త్ ద్వారా సిటీ కళాశాలలో ప్రవేశం పొందింది. ప్రస్తుతం హైదారాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో బి.ఎ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఫెన్సింగ్ క్రీడలో ఎప్పటికైనా ఒలంపిక్ స్టార్‌గా ఎదగాలనే సంకల్పంతో పరిశ్రమిస్తున్న బేబీరెడ్డికి కళాశాల ప్రిన్సిపాల్ డా.బాలభాస్కర్ ఫిజికల్ డైరెక్టర్ వరప్రసాద్ అన్నివిధాల సహకారమందిస్తున్నారు.’ ధ్యేయమును బట్టి ప్రతి పనీ దివ్యమగును’ అని గాలిబ్ అన్నట్లుగా బేబీరెడ్డి క్రీడారంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశిద్దాం.
చిత్రకళలో మెరుగైన ప్రతిభ ప్రదర్శిస్తున్న సిటీకళాశాల విద్యార్థినులు
‘ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్’ అన్నట్లుగా కళాశాల విద్యార్థినులు విద్యతోపాటు చిత్రకళలో కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తునారు. వూరకొండ లావణ్య, యం.పావని, హర్పాడ్ శ్వేత, చిత్రకళలో నిష్ణాతులుగా ప్రశంసలందు కుంటున్నారు. ఈ తరం విద్యార్థులు చాలామంది ఇంటర్‌నెట్ వలయంలో చిక్కి, సామాజిక మాధ్యమాల ప్రభంజనంలో పడిపోతూ ఉక్కిరి బిక్కిర వుతుంటే ఈ విద్యార్థినులు మాత్రం అధ్యాపకుల పర్యవేక్షణలో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ నైపుణ్యాలకు నేర్పుగా పుఠం పెట్టుకుంటూ పదిమందిలో ఒక్కరుగా గుర్తింపు పొందుతున్నారు. సిటీ కళాశాల శతవసంతాల ఉత్సవాల సందర్భంగా ఈ విద్యార్థినులు ఏర్పాటుచేసిన చిత్రకళా ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధునిక తెలుగుకవులు (లావణ్య), స్వాతంత్ర సమరయోధులు (పావని), చారిత్రక కట్టడాలు (శ్వేత) వంటి ప్రత్యేక థీమ్‌లతో ఏర్పాటుచేసిన వీరి చిత్రకళా ప్రదర్శనను తిలకించిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు వివిధ కళాశాలల అధ్యాపకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ యువతుల కళానైపుణ్యానికి ఫిదా అవుతున్నారు. ఎంతో శ్రద్ధ తీసుకొని వ్యయ, ప్రయాసలకోర్చి ప్రత్యేకంగా విద్యార్థుల చిత్రకళాప్రదర్శన ఏర్పాటుచేసిన ప్రిన్సిపాల్ డా. బాలభాస్కర్‌ను, అందుకు సహకరించిన అధ్యాపకులను అందరూ అభినందిస్తున్నారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అభినందనలు అందుకున్న చిత్రకారిణి లావణ్య

బిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న వూరగొండ లావణ్య వివిధ రంగాల ప్రముఖుల బొమ్మలను గీస్తూ యువ చిత్రకాకారిణిగా పేరు సంపాదించుకుంటుంది. బ్లాక్ & వైట్ ప్రొఫైల్ పిక్చర్స్ వేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం పెన్సిల్ గీతలతోనే ఆయా వ్యక్తుల రూపురేఖా విలాసాన్ని లావణ్య రమణీయంగా చిత్రిస్తుంది. సుప్రీం కోర్టు పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, ప్రముఖ చలనచిత్ర రచయిత, దర్శకులు జె.కె. భారవి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, కవి యాకూబ్, ప్రముఖ చిత్రకారుడు కూరెళ్ళ శ్రీనివాస్ తదితరుల బొమ్మలు వేసి లావణ్య వారి అభినందనలందుకుంది. ఇన్ స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు లావణ్య తన చిత్రాలను పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ లోనే ఆర్డర్స్ తీసుకొని బొమ్మలు వేస్తూ తద్వారా తన ఖర్చులకు అవసమైన డబ్బును సమకూర్చుకుంటోంది. తమ స్వస్థలం సిరిసిల్ల లో కిరాణా షాపు నడుపుకుంటు జీవిస్తున్న తల్లిదండ్రులు రమ్య సత్యనారాయణల పై ఆధారపడకుండా తన కళాప్రతిభ ద్వారా లావణ్య స్వతంత్రంగా జీవిస్తూ తోటివిద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
వర్ణ చిత్రాలను వేయడంలో మేటి పావని

బియస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యం.పావని మహనీయుల వర్ణచిత్రాలను మనోహరంగా వేస్తుంది. పావని చిత్రించిన వాటర్ కలర్ పెయింటింగ్స్‌ను తిలకిస్తే సమయాన్ని మరిచిపోయి అలాగే చూస్తూ అక్కడే నిలబడిపోతాం. పావని చిత్రాలు చూపరులను మంత్ర ముగ్ధులను గావిస్తాయి. అజాదీకా అమృతోత్సవాల నేపథ్యంలో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ద్విసప్తాహ కార్యక్రమ ప్రేరణతో జాతిస్ఫూర్తి ప్రదాతలైన స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు వేసి తన కుంచెతోనే అచంచలమైన దేశభక్తిని చాటిచెప్పింది పావని. తల్లిదండ్రులు కుమారి, ధనంజయల ప్రోత్సాహంతో చిత్రకారిణిగా ముందడుగు వేస్తోంది. కరోనా కష్ట కాలంలో చుట్టూ చీకట్లు ఆవరించినపుడు తన చిత్రకళా కాంతులతో ఇంట్లో కొత్త వెలుగులను ప్రసరించింది. పావని వేసిన జాతీయోద్యమ నాయకుల బొమ్మలను చూసి కళాశాల విద్యా కమీషనర్ నవీన్ మిట్టల్ ఆమెను అభినందించారు.
చారిత్రక కట్టడాల చిత్రాలను వేయడంలో ప్రతిభాశీలి శ్వేత

బియస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్వేత జగద్విఖ్యాత మైన, అపురూప నిర్మాణ కౌశలంతో విలసిల్లే తెలంగాణ చారిత్రక కట్టడాలను, తదనుగుణమైన విశిష్ట శోభను తన బొమ్మల్లో చిత్రిసూ పురా వారసత్వ వైభవ ప్రభావాలను తేటతెల్లం చేస్తోంది. సంక్లిష్ట భరితమైన మధుబని ఆర్ట్‌లో కూడా తన విలక్షణ కళాప్రతిభను ప్రదర్శిస్తూ అనేక చిత్రాలను వేస్తూ మన్ననలందు కుంటోంది.
వ్యర్థాలతోనే పరమాద్భుత కళాకృతులను రూపొందిస్తున్న సౌమ్య

బియస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న కోడూరి సౌమ్య అందరూ పనికి రావని పారవేసిన వస్తువులతో విలువైనపరికరాలను రూపొందిస్తూ అందరినీ అబ్బుర పరుస్తోంది. ఇంటిచుట్టూ ఆవరించిన చెత్తాచెదారాన్ని. సారవంతమైన ఎరువుగా మార్చి రైతు బంగారు పంటలు పండించినటు వ్యర్థపదార్థాలను సేకరించి, పరమాద్భుత కళాగరిమతో సౌందర్య శోభితమైన కళాకృతులను వస్తువులను రూపొందిస్తుంది. పాత వార్తాపత్రికలను, వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తూ గృహాలంకరణ వస్తువులను, అందమైన ఫోటో ఫ్రేమ్స్‌ను తయారుచేస్తూ వాటిని ఖరీదుకు విక్రయిస్తోంది. జనగామ జిల్లా బచ్చన్న పేట గ్రామానికి చెందిన సౌమ్య, వడ్రంగి వృత్తితో జీవిస్తున్న తండ్రి వెంకటాచారి అందించిన కళా వారసత్వంతో తల్లి మమత ప్రోత్సాహంతో గొప్ప కళాకృతులను రూపొందిస్తూ గ్రామానికి, కళాశాలకు కీర్తిప్రతిష్ఠలను చేకూర్చుతోంది. అందమైన, ఆకర్షణీయమైన తన కళాకృతుల తయారీ విధానాన్ని వీడియోగా మలచి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసి తద్వారా వీక్షకులను పెంచుకుంటోంది. ఈ విధమైన విభిన్న ప్రతిభా పాటవాలను చాటుతూ, సిటీ కళాశాల విద్యార్థినులు చదువులో విశ్వవిద్యాలయస్థాయిలో అగ్రశ్రేణి లో నిలుస్తూనే క్రీడా, కళా సాహిత్య, పరిశోధన రంగాల్లో కూడా మెరుగైన ప్రభావాన్ని చూపుతూ ‘పావన నవజీవన బృందావన నిర్మాతలు’గా ప్రగతిపథంలో పయనిస్తున్నారు.