భగవంతుడు త్రికాల స్వరూపుడు – వద్ధిరాజు జనార్ధన రావు

శ్లో|| ఉదయే బ్రహ్మరూపశ్చః మధ్యాహ్నేతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః

త్రికాల స్వరూపుడు, ఋతుకర్త అయిన భగవంతుడు ఆదిత్యునిగా కాలస్వరూపునిగా వున్నాడని మన ఋషులు పరమాత్మ తత్వాన్ని గురించి అనేక విధాలుగా తెలియజేశారు. ఆతని కాల స్వరూపాన్ని గుణ గణాలను అనేక రీతులు కొనియాడారు. వారు తమ తపోదృష్టితో చూసిన అనేక విషయాలు మనకు అందించారు. వారందించిన అపార విజ్ఞానం ఓ తరగని గనిగా చెప్పవచ్చు.

కాలాన్ని సూర్య చంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకుని 12 భాగాలుగా విబజించారు. ఈ భాగాల్లో వున్న నక్షత్రాలను, రాశులుగా పేర్కొన్నారు. ఆ రాశులను కాలపురుషుని అంగాలుగా తెలిపారు. 12 భాగాలుగా విభజించారు. ఈ భాగాల్లో వున్న నక్షత్రాలను, రాశులుగా పేర్కొన్నారు. ఆ రాశులను కాలపురుషుని అంగాలుగా తెలిపారు. 12 రాశులకు, 12 పేర్లు పెట్టారు. అవి మేష – శిరసు, వృషభ – మెడ, మిధునం – భుజాలు, కర్కాటక రాశి – ఛాతి, సింహ రాశి – గుండె, కన్యారాశి – ఉదరం, తులారాశి – నాభి, వృశ్చిక రాశి – మర్మాంగాలు, ధనుస్సు – కటి, మకరం – మోకాళ్ళు, కుంభం – పిక్కలు, విూనరాశి – పాదాలు.

కాల గణన:

 • 60 తత్పరలు 1పర
 • 60 పరలు 1 విలిప్త
 • 60 విలిప్తలు 1 లిప్త (3/5 సెకను)
 • 60 లిప్తలు 1 విఘడియ (24 సెకన్లు)
 • 60 విఘడియలు 1 ఘడియ (24 నిమిషాలు)
 • 60 ఘడియలు 1 రోజు (24 గంటలు)
 • 48 నిమిషాలు 1 ముహూర్తం
 • 30 ముహూర్తాలు 1 రోజు
 • 3 గంటలు 1 ఝాము
 • 8 ఝాములు 1 రోజు
 • 7 రోజులు 1 వారం
 • 15 రోజులు 1 పక్షం
 • 2 పక్షాలు 1 మాసం
 • 2 మాసాలు 1 ఋతువు
 • 3 ఋతువులు 1 ఆయనం
 • 2 ఆయనాలు 1 సంవత్సరం
 • 12 సం||రాలు 1 పుష్కరం
 • 10 సం||రాలు 1 దశాబ్దం
 • 100 సం||రాలు 1 శతాబ్దం
 • 1000 సం||రాలు 1 సహస్రాబ్ది
 • 4 యుగాలు 1 మహాయుగం
 • 71 మహాయుగాలు 1 మన్వంతరం
 • 14 మన్వంతరాలు 1 కల్పం
 • 2 కల్పాలు బ్రహ్మదేవునికి 1 రోజు
 • 360 బ్రహ్మరోజులు బ్రహ్మకు 1 సంవత్సరం

ఇప్పుడు బ్రహ్మ ద్వితీయ పదార్థమందు అనగా 51 సంవత్సరాల వయసులో ప్రథమ పాదంలో వున్నాడనీ మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.

ద్వితీయ పదార్దే, శ్వేత వరాహ కల్పే, వైవస్వంత
మన్వంతరే, కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే
భరత వర్షే, భరత ఖండే, మేదో దక్షణ దిగ్బాగే

అని ప్రతి రోజు సంకల్పంలో మన చిరునామాను భగవంతుడైన కాల పురుషునికి తెలుపుకుంటాం.

వరాహ మీరుని నిర్ణయాన్ని బట్టి మనం చంద్ర మానం రీత్యా చైత్ర మాసాన్నే సంవత్సరారంభంగా భావించి ఆచరిస్తాం. చైత్ర శుద్ధ ప్రతిపత్తి (పాఢ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ఆరంభించాడని, ఆ కారణంగా (యుగాది) ఉగాది పండుగను ఆచరిస్తున్నారన్నది పెద్దల ఉవాచ.

అనంత కాలాన్ని మన సౌలభ్యం కోసం గణన కోసం లెక్కించి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను, ఆదాయ, కందాయాలను, ఖగోళ, భౌగోళిక విషయాలను, పండగలు, శుభాశుభాలను తెలిపే విధంగా పంచాగాన్ని సిద్ధాంతులు తయారు చేశారు. సకల దేవతా స్వరూపంగా కాల స్వరూపుణ్ణి భావించి ఉగాది రోజు పంచాంగ శ్రవణం గావించి భవిష్యత్‌ దర్శనం చేసుకుంటారు.

సకల శుభదాయకమైన పంచాంగ శ్రవణం తమ తమ రాశులు, నక్షత్రాలకు అనుగుణంగా పంచాంగంలోని విషయాలను అన్వయించుకుని భవిష్యత్తును సుఖమయం చేసుకుంటారు.

ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనంతరం ఆరు ఋతువులకు సంకేతంగా షడ్రుచులతో కూడిన పచ్చడిని తీసుకుంటారు. ఆరు ఋతువుల్లో వచ్చే రుగ్మతలను దూరం చేసే దివ్యమైన ఔషధంగా ఈ పచ్చడిని స్వీకరిస్తారు. ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి సేవించాలని పెద్దలు తెలిపారు.

శ్లో|| శతాయ వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ |
సర్వారిష్ట వినాశాయ నంబకం దళ బక్షణం ||