|

పంచాయతీలకు ఉదారంగా నిధులు దుర్వినియోగం సహించం : సీఎం

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తామన్న సీఎం.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రజలను కలుపుకొని గ్రామవికాసానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మంచినీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్మాణంలాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నదని.. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల (శ్మశానవాటికలు) నిర్మాణంపై పంచాయతీలు ఎక్కువ దృష్టి సారించాలని చెప్పారు. కొత్త గ్రామీణ తెలంగాణను తయారుచేసే చేంజ్‌ ఏజెంట్లుగా, మెంటార్లుగా రిసోర్స్‌పర్సన్లు వ్యవహరించాలని అన్నారు. ఆరునెలలకోసారి వారితో తాను స్వయంగా సమావేశమవుతానని వెల్లడించారు. గ్రామపంచాయతీలకు అధికారాల బదిలీ, నిధుల కేటాయింపుపై అత్యంత ఉదారంగా ఉంటామని తెలిపారు. అదేసమయంలో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సస్పెండ్‌ చేసేవిధంగా కఠినచట్టాన్ని రూపొందించినట్టు వెల్లడించారు.

ఉపాధ్యాయుడిగా మారిన ముఖ్యమంత్రి:
రిసోర్స్‌పర్సన్లకు శిక్షణ ఇచ్చే సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. ప్రతి విషయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సమావేశంలో మధ్యాహ్నం రెండుగంటల వరకు నిల్చునే మాట్లాడారు. భోజన విరామం తర్వాత 3 నుంచి 5 గంటల వరకు మళ్లీ నిల్చున్నారు. పంచాయతీరాజ్‌ కొత్త చట్టం, పంచాయతీల బాధ్యతలు- విధులు, నిధులు సమకూరే మార్గాలు, ఖర్చుపెట్టే పద్ధతులు, ప్రజాప్రతినిధులకు నైతిక నియమాలు, రిసోర్స్‌ పర్సన్ల బాధ్యతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. అనేకమార్లు సీఎం కేసీఆర్‌ హాస్యం పండించడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి. 5 నుంచి 6 గంటల వరకు ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించారు. రిసోర్స్‌పర్సన్ల సందేహాలకు సీఎం ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌పర్సన్స్‌తో ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రతి పంచాయతీ తన పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుంటూ.. ఐదేండ్ల ప్రణాళిక తయారుచేసుకోవాలని, అందుకు అనుగుణంగా పనులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామం ఇప్పుడు ఎక్కడుంది? ఐదేండ్ల తర్వాత ఎక్కడికి పోవాలి? ఐదేండ్లలో ఎన్ని నిధులు వస్తాయి? వాటితో ఎలాంటి పనులు చేయాలి? అనే విషయాలను నిర్ధారించుకుని రంగంలోకి దిగాలని సూచించారు. చీకట్లో బాణం విసిరినట్లు కాకుండా, లక్ష్యసిద్ధితో గురిచూసి కొట్టాలన్నారు. గ్రీన్‌ విలేజ్‌- క్లీన్‌ విలేజ్‌ నినాదంతో గ్రామంలో పచ్చదనం పెంచడానికి, పారిశుద్ధ్య పరిరక్షణకు, శ్మశానవాటికల నిర్మాణానికి, పన్నుల వసూలుకు మొదటి దఫాలో ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక తయారుకావాలని చెప్పారు. ప్రణాళిక తయారీలో సర్పంచ్‌లు, కార్యదర్శులకు రిసోర్సుపర్సన్లు తగిన సలహాలు, సూచనలు, ఇవ్వాలని కోరారు. సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని, గ్రామ వికాసానికి పాటుపడేలా వారిలో స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలించాలని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే విషయం చెప్పి, అప్రమత్తం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశం ఆయన మాటల్లోనే..

ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమనే విషయాన్ని మరువొద్దు. చట్టసభల్లో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ అనే పదాలు పోవాలి. గ్రామాల్లో కూడా అధికారం అనేమాట రావొద్దు. ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమే తప్ప, అధికారం చలాయించే వాళ్లంకాదు అనే భావన కలిగి ఉండాలి. సర్పంచ్‌గా ఎన్నిక కాగానే కొందరి వేషభాషల్లో మార్పు వస్తుంది. అదితప్పు. సహజత్వాన్ని కోల్పోవద్దు. తాము పెత్తనం చేయడానికి ఉన్నామనే భావన మనసులోకి రానీయవద్దు. దురదృష్టవశాత్తూ ప్రజాస్వామ్యం (డెమోక్రసీ).. నిరంకుశత్వం (అటోక్రసీ)గా మారుతున్నది. ఇది మంచిది కాదు. ప్రజలందరినీ సంఘటిత పరిచి, గ్రామసమస్యలను పరిష్కరించుకోవాలి. ప్రజల సంఘటితశక్తిలోని బలమెంతో గుర్తెరగాలి.

పల్లెలు పచ్చగా కళకళలాడాలి

గ్రామంలో పచ్చదనం పెంచడం పంచాయతీల ప్రధాన బాధ్యతల్లో ఒకటి. పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి. గ్రామానికో నర్సరీ కచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంటికి ఆరు మొక్కలకు తక్కువ కాకుండా.. అడిగిన రకాల మొక్కలను సరఫరాచేయాలి. గ్రామంలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. మొక్కల పెంపకానికి నరేగా నిధులు వాడుకోవాలి. ప్రతి ఇంటి నుంచి ఇండెంట్‌ సేకరించాలి. వీధుల వెంట, ఖాళీ ప్రదేశాల్లో నీడను, ఆక్సిజన్‌ను ఇచ్చే వేప, రావిలాంటి చెట్లు నాటాలి. పొలాల గట్ల మీద కావాల్సిన మొక్కలను రైతులకు అందించాలి.

రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్‌ వేయండి

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కట్టుదిట్టంగా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తాచెదారం రోడ్లపై కనిపించకూడదు. ప్రజలు తమ ఇండ్లను ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో ఊరిని కూడా అలాగే ఉంచుకోవాలి. రోడ్డుపై చెత్త వేసేవారికి రూ.500 జరిమానా విధించాలి. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడానికి ట్రై సైకిళ్లను ఏర్పాటుచేయాలి. డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేయాలి. పాడుపడిన, వాడని బావులను, బోర్లను వెంటనే పూడ్చివేయాలి. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి.

అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు

సొంత స్థలం లేనివారు తమ కుటుంబసభ్యులు చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియదు. ఆ బాధ వర్ణనాతీతం. కాబట్టి ప్రతి గ్రామంలో కచ్చితంగా వైకుంఠధామం నిర్మించాలి. దీనికోసం పంచాయతీ స్థలం ఇవ్వాలి. అదిలేకుంటే ప్రభుత్వభూమి వాడుకోవాలి. రెండూ లేకుంటే పంచాయతీ నిధులతో కొనాలి. దాతలు ముందుకొస్తే వారి భూమిని తీసుకోవాలి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే వైకుంఠధామం నిర్మించాలి. అన్ని గ్రామాల్లో ఆర్నెల్లలో వైకుంఠధామాలు నిర్మించాలి.

నూరుశాతం పన్నులు వసూలు చేయాలి

గ్రామంలో నూటికి నూరుశాతం పన్నులు వసూలుచేయాలి. వసూలుచేయని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుంటాం. సర్పంచ్‌లు గ్రామంలోనే నివాసం ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. నెలకోసారి విధిగా గ్రామపంచాయతీ సమావేశం, రెండునెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. వివాహ రిజిస్ట్రేషన్‌, జనన, మరణ రికార్డుల నిర్వహణ పంచాయతీ ఆధ్వర్యంలోనే ఉండాలి. గ్రామంలో వ్యక్తిగత ఆస్తుల మ్యుటేషన్‌ (పేరుమార్పిడి)పై కూడా కొత్త పంచాయతీలు నిర్ణయం తీసుకోవాలి. కరెంట్‌ సమస్యల పరిష్కారానికి పవర్‌డే నిర్వహించాలి. ప్రతి గ్రామంలో దోబీఘాట్లు నిర్మించాలి.

25 ఆకస్మిక తనిఖీ బృందాలు

పంచాయతీలకు కావాల్సిన నిధులిస్తాం.. విధులిస్తాం.. బాధ్యతలూ అప్పగిస్తాం. అన్నీ ఇచ్చినా పనిచేయని పంచాయతీల విషయంలో సీరియస్‌గా ఉంటాం. ప్రభుత్వ నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి 25 ఆకస్మిక తనిఖీ బృందాలు ఏర్పాటుచేస్తాం. ఒక బృందంలో నేనే ఉంటా. దూరప్రాంతాలు పర్యటించడానికి హెలికాప్టర్లు కూడా సమకూరుస్తాం. ఎవరు ఎప్పుడు ఎక్కడికి పోతున్నారో తెలియకుండా తనిఖీలుంటాయి. ప్రతిరోజూ ఏదో ఓచోట ఈ తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. ఇంటెలిజెన్స్‌ ద్వారా కూడా సమాచారం తెప్పించుకుంటాం. పచ్చదనం పెంచడానికి, పరిశుభ్రత కాపాడటానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తాం. ఎక్కడ తేడా వచ్చినా సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేస్తాం. దీనికోసం చట్టంలో కూడా నిబంధనలు పొందుపరిచాం.

వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం వాడే కరంటుకు స్థానిక సంస్థలు బిల్లులు సరిగా చెల్లించడం లేదు. పంచాయతీలు విద్యుత్‌ సంస్థలకు రూ.2,570 కోట్ల బకాయిలు చెల్లించాలి. మున్సిపాలిటీలు రూ.455 కోట్లివ్వాలి. మొత్తం రూ.3,025 కోట్ల బకాయిలున్నాయి. ఇట్లయితే విద్యుత్‌ సంస్థలు ఎలా నడవాలి. ఇకపై ఎప్పటికప్పుడు కరంటు బిల్లులు చెల్లించాలి. జాప్యంచేసిన వారిని సస్పెండ్‌ చేస్తాం.

నిధులు వచ్చే మార్గాలివీ..
తెలంగాణ గ్రామాల్లో 2.2 కోట్ల జనాభా ఉన్నది. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామాల అభివృద్ధికి రాష్ట్రానికి ఏడాదికి రూ.1,628 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి. మన రాష్ట్రం దానికి మరో రూ.1,628 కోట్లు జోడిస్తుంది. ఏటా మొత్తం రూ. 3,256 కోట్లు సమకూరుతాయి. దీని ప్రకారం ఒక్కో మనిషికి రూ.1,611 చొప్పున 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా ఏటా రూ.8 లక్షలు వస్తాయి. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు ఎక్కువ నిధులు వస్తాయి. ఇవికాకుండా ఏటా రూ.3,500 కోట్ల నరేగా నిధులు వస్తాయి. ఈ నిధులను సమర్ధంగా వాడుకోవాలి. లేబర్‌ కాంపోనెంట్‌కు నరేగా నిధులు వాడి, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కోసం గ్రామపంచాయతీ నిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా ఈసారి గ్రామాల అభివృద్ధికే వినియోగిస్తాం. వీటిద్వారా రూ.480 కోట్లు వస్తాయి. ఇలా మూడు మార్గాల ద్వారా గ్రామాల అభివృద్ధికి ఏడాదికి రూ.7,236 కోట్లు సమకూరుతాయి. ఇవే కాకుండా రాష్ట్రబడ్జెట్‌లోనూ నిధులు కేటాయిస్తాం. మొత్తంగా ఐదేండ్లలో రూ.40 వేల కోట్లు గ్రామాలకు సమకూరుతాయి. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి అద్భుతాలు చేయవచ్చు.

గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌కు అరుదైన గౌరవం

కూసం రాజమౌళి అనే మాజీ సర్పంచ్‌ కృషి కారణంగా వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి ప్రపంచానికే ఆదర్శ గ్రామంగా ఎలా తయారైందో సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగానే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన మాజీ సర్పంచ్‌ గురించి మాట్లాడారు. అయితే ఆశ్చర్యకరంగా పంచాయతీరాజ్‌శాఖ ఎంపిక చేసిన రిసోర్స్‌ పర్సన్లలో రాజమౌళి కూడా ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి ఆయనను సభకు పరిచయం చేసి.. ఆదర్శనాయకుడని కొనియాడారు. వేదికమీదకు పిలిపించి, సీనియర్‌ అధికారులు, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టి గౌరవించారు.

రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుని గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించానని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. గ్రామస్థులు, ముఖ్యంగా మహిళల సాధికారితకు నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం ఓ ఉదాహరణగా చెప్పిన సీఎం, గ్రామాల స్వయం సమృద్ధికి, లాభదాయక వ్యవసాయానికి ఆ ఊరు రోల్‌మోడల్‌ అని వివరించారు. ఒక్క దోమ కూడా లేకుండా పరిసరాలను ఎలా కాపాడుకోవచ్చో హైదరాబాద్‌ నగర శివారు ప్రగతిరిసార్ట్స్‌ చేసి చూపించిందని చెప్పారు. రిసోర్స్‌ పర్సన్లంతా తమ శిక్షణాకాలంలో గంగదేవిపల్లి, అంకాపూర్‌, ప్రగతిరిసార్ట్స్‌ను సందర్శించాలని కోరారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభోపన్యాసం చేశారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత చెప్పి, కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, కొత్తగా నియామకమయ్యే గ్రామ కార్యదర్శులకు సరైన అవగాహన కల్పించి, గ్రామ వికాసానికి చేంజ్‌ ఏజెంట్లుగా మార్చాలని చెప్పారు.

పద్యాలు పాడుతూ.. తాత్పర్యం వివరిస్తూ..

అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశంలో పలుమార్లు సందర్భోచితంగా పద్యాలు చదివి, దాని అర్థం చెప్పారు. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు అనే వేమన పద్యం పాడి వినిపించి.. తినగా తినగా వేపాకు తియ్యగా మారినట్టే గ్రామాల్లో సంస్కరణల అమలు నిరంతర ప్రక్రియగా సాగితే.. కొంతకాలానికి ప్రజలకు, ప్రతినిధులకు అది అలవాటుగా మారుతుందన్నారు. నయమున బ్రాలున్‌ ద్రావరు, భయము నను విషమ్మునైనా భక్షింతురుగా అనే సుమతి శతకంలోని పద్యాన్ని ఉదహరించి.. పంచాయతీల విధి నిర్వహణలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠినంగా శిక్షించాలని చెప్పారు.

భయముంటేనే బాగా పనిచేస్తారని, పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. జాతస్యహి మరణం ధృవం అంటూ భగవద్గీత శ్లోకం చదివి.. చనిపోయిన తర్వాత కూడా మర్యాదగా, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానవాటికలు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బతికినంతకాలం కులం, మతం పేరిట కొట్టుకు చచ్చినం. చనిపోయిన తర్వాతనైనా ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రుస్తులై అనే ఏనుగు లక్ష్మణకవి సుభాషితం చదివి, గ్రామాల వికాసానికి మంచి సంకల్పంతో నడుం బిగించి, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన స్ఫూర్తితో పనిచేయాలని ఉద్బోధించారు.

స్ఫూర్తిప్రదాతల గాథలను వివరించిన సీఎం

గ్రామాల అభివృద్ధిలో ఎంతో కృషిచేసిన వ్యక్తులు, సంస్థలు, గ్రామాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల భాగస్వామ్యంతో వారు సాధించిన విజయాలను, దేశానికి ఉపయోగపడిన విధానాన్ని విడమరిచి చెప్పారు. కేంద్ర మాజీమంత్రి ఎస్కే డే దేశంలో పంచాయతీరాజ్‌ ఉద్యమానికి పురుడు పోసిన విధానాన్ని, ఆయన సలహాలు, సూచనల మేరకే మొదటి ప్రధాని నెహ్రూ నీటిపారుదల నిర్మాణానికి, వ్యవసాయ రంగాభివృద్ధికి చర్యలు తీసుకున్న వైనాన్ని వివరించారు. గ్రామాల వికాసం కోసం ఎస్కే డే హైదరాబాద్‌లో నెలకొల్పిన ఎన్‌ఐఆర్డీ గురించి చెప్పారు. కొంకణ్‌ ప్రాంతంలో ప్రజలను చైతన్యపరిచి, ఎత్తుపల్లాలుండే భూభాగంలో వ్యవసాయం ఎలా చేయాలో చేసి చూపించిన బండార్కర్‌ సేవలు, మహారాష్ట్రలోని వన్రాయ్‌ సొసైటీ గ్రామాల్లో స్వచ్ఛందంగా వైకుంఠ ధామాలు నిర్మించడాన్ని ప్రస్తావించారు.

నిష్ణాతులతో రిసోర్స్‌పర్సన్ల బృందం

స్థానిక సంస్థలను పనిచేసే పరిపాలనా విభాగాలుగా తీర్చిదిద్దడం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ప్రతినిధులకు తగిన శిక్షణ ఇవ్వడం, ఎప్పటికప్పుడు వారి పనితీరును మదింపుచేసేందుకు నిష్ణాతులైన రిసోర్స్‌ పర్సన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రామ వికాస ప్రణాళికలపై అవగాహన కలిగి, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన 320 మందితో రాష్ట్రస్థాయి బృందాన్ని తయారుచేసింది. పంచాయతీరాజ్‌ అధికారులతోపాటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు. ప్రస్తుతం వీరికి తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు జిల్లాల వారీగా సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణా తరగతులు ఆరునెలలకోసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎమ్మెల్యేలు డీఎస్‌ రెడ్యానాయక్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, ఎండీసీ ఛైర్మన్‌ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, కమిషనర్‌ నీతూప్రసాద్‌, సెర్ప్‌ సీఈవో పౌసమి బసు, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.