|

మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం

By:- పి. జగదీష్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల (SERP) ఆధ్వర్యంలో అఖిలభారత ఎగ్జిబిషన్‌ను 14 రోజులపాటు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా నిర్వహించారు. ఈ సరస్‌ మేళాలో 25 రాష్ట్రాల నుండి వచ్చిన స్వయం సహాయక మహిళలు తమ ఉత్పత్తుల ప్రదర్శన- విక్రయం కోసం ప్రభుత్వం 300 స్టాల్స్‌ ఏర్పాటు చేసింది. గ్రామీణ మహిళల చేతివృత్తుల వస్తువులు, గృహోపకరణాలు, స్త్రీల అలంకరణ సామగ్రి, లెదర్‌ వస్తువులు, గాజులు, చేనేత దుస్తులు, వెదురు బొమ్మలు, నిర్మల్‌ కొయ్య బొమ్మలు, సిరిసిల్ల, గద్వాల, పోచంపల్లి చేనేత చీరలు, కొండపల్లి బొమ్మలు, అదిలాబాద్‌ అగర్బత్తీలు, మెదక్‌ సిరి ధాన్యాలు, హెర్బల్‌ మసాలా దినుసులు, గాజు చెక్క వస్తువులు, నోరూరించే తినుబండారాలు, పలురకాల పచ్చళ్ళు, మరెన్నో మనసులను దోచే అలంకార ఉపయుక్తమైన వస్తువులను ఈ మేళాలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించారు.

హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తి ప్రదర్శన మేళాను రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, సెర్ప్‌ సీఈవో సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహిళలను సాంఘికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యాపార పారిశ్రామిక రంగాలలో మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జీవనోపాధుల పెంపుదలకై నేడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగి సమాజంలో ఉన్నత స్థితిలో మహిళా సాధికారత సాధించాలని ఆయన అన్నారు.

సందీప్‌ కుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ, మహిళల ఉత్పత్తులను ఒకే వేదిక పైకి తెచ్చి పరస్పర అనుభవాలను పంచుకుంటూ, మరింత ఆర్థిక అభివృద్ధికై ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది మహిళలు 4 లక్షల 30 వేల సంఘాలలో సభ్యులుగా ఉండగా, వారి అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా, స్త్రీ నిధి ద్వారా ఈ ఏడాది 18 వేల కోట్ల మేరకు రుణాలు అందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సరస్‌- 2022 ఎగ్జిబిషన్‌ సందర్శకులతో 14 రోజులపాటు కిటకిటలాడింది. పలు వర్గాల ప్రజలు దాదాపు 4 లక్షలకు పైగా ఈ ఎగ్జిబిషన్‌ సందర్శించి వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల ఆచార, సాంప్రదాయ పద్ధతులతో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతిరోజు సాయంత్రం సందర్శకులను అలరించాయి.

ప్రారంభ కార్యక్రమంలో నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుశీల చింతల తో పాటు అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు, సెర్ఫ్‌ అధికారులు పాల్గొన్నారు.